Wednesday, March 31, 2021

సాయినాథుని దినచర్య

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

 సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

 హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు..!: సాయిబాబా...!

Saturday, March 13, 2021

*శ్రీ శిరిడీ సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో చెప్పిన ఏకాదశ సూత్రాలు......* శ్రీ సాయినాధ్ మహరాజ్ వారి ఏకాదశ సూత్రాలు సాయి ఆరతులలో ’అనంతా తులాతే కసేరే స్తవావే’ అన్ననమస్కారాష్టకాన్ని వ్రాసిన *శ్రీ మోహినీ రాజ్ పండిట్* అభంగ రూపంలో వ్రాసారు. ఆరతి తర్వాత షిరిడీ సంస్థానంలో ఆ అభంగాన్ని వినిపిస్తూంటువుంటారు. అయితే సాయి ఏకాదశ సూత్రాల పేరిట ప్రాచుర్యంలో వున్న సూత్రాలకివి భిన్నంగా వుంటాయి. సాయి భక్తుల సౌకర్యార్దం శ్రీ మోహినీ రాజ్ పండిత్ వ్రాసిన మరాఠీ అభంగాన్ని దానికి శ్రీ స్వామి అచలానంద సరస్వతి చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను,

*సాయి ఏకాదశ సూత్రాలు మరాఠీ మూలం: శ్రీ మోహినీ రాజ్ పండిత్* 
తెలుగు సేత: *స్వామి అచలానంద సరస్వతి* 

*శిరిడీస్ జ్యాచే లాగతీళ్ పాయ్!* *టకతీ అపాయ్ సర్వ త్యాంచే!! 1* 

1.శిరిడీలో అడుగు పెట్టిన తక్షణమే! తొలగిపోవును భక్తుల సర్వ అపాయాలు!! 

*మాఝ్యా సమాధీచీ పాయరీ చఢేల్!* *దుఃఖ్ హేఁ – హఠేల్ నర్వ త్యాంచే 2* 

2.నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే! హరియించును భక్తుల సర్వ దుఖాలు!! 

*జరీ హేఁ శరీర్ గేలోఁ మీ టాకూన్!* *తరీ మీ దాఁవేన్ భక్తాం సాఠీం!! 3* 

3.ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోయినా! వస్తాను పరుగు పరుగున భక్తుల హితం కోసం!! 

*నవసాన్ మాఝీ పావేల్ సమాధీ!* *ధరా ధృఢ్ బుద్ధీ మాఝ్యాఠాయాం!! 4* 

4.ప్రాప్తిస్తాయి నా సమాధిలో మీ కోరికలన్నీ కూడా! ఉంచండి నా యందు మీ ధృఢ విశ్వాసం!! 

*నిత్య మీ జీవంత, జాణా హేఁచి సత్య!* *నిత్య గ్యా ప్రచీత అనుభవే!! 5* 

5.నిత్యం జీవించే వుంటాను నేను ఇది పరమ సత్యం! స్వానుభవంతో తెలుసుకోండి ఇదే సత్యమని నిత్యం!! 

*శరణ్ మజ్ ఆలా, ఆణి వాయాం గేలా!* *దాఖ్ వా దాఖ్ వా ఐసా కోణీ!! 6* 

6.నన్ను శరణ కోరి నిరాశులై మరలిన వారిని! ఒక్కరిని ఒక్కరినైనా ఎవరైనా నాకు చూపండి!! 

*జోజో, మజ్ భజే, జైశా జైశా భావేఁ!* *తైసా తైసా పావేఁ, మీహీ త్యాసీ!! 7* 

7.ఎవరెవరు నన్ను ఏలా ఏలా భావించి భజిస్తారో! వారి వారికి నేను అలా అలానే ప్రాప్తిస్తాను!! 

*తుమ్ చా మీ భార్ వాహీన్ సర్వధా!* *నన్హే హేఁ అన్యధా వచన్ మాఝే!! 8* 

8.మీ భారాన్ని నేను వహిస్తాను సర్వధా! ఈ నామాట కానే కాదు ఎప్పుడూ అన్యధా!! 

*జాణా ఏథేఁ ఆగ్/ఎ సాహాయ్య సర్వాంస!* *మాగే జేజే త్యాస తేఁ తేఁ లాభే!! 9* 

9.అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం! ఎవరెవరికి ఏమేమి కావాలోఅవన్నీ దొరుకుతాయి!! 

*మాఝా జో జాహ్ లా కాయావాచామనీఁ!* *తయాచా మీ ఋణీ సర్వకాళ్!! 10* 

10.కాయా వాచా మనసుతో నాకంకితమైన వారికి! ఎల్లప్పటికీనేను ఋణపడి వుంటాను!! 

*సాయీఁ మ్హణే తోచి తోచి ఝాలా ధన్య్!* *ఝాలా జో అనన్య మాఝ్యా పాయీఁ!! 11* 

11.నా చరణాల్లో అనన్య భక్తితో అంకితమైన వారు! వారే సుమా ధన్యులు ఇదే నా వచనం!! షిరిడీ సాయిబాబా़्

Sunday, March 7, 2021

"ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో 
సాయబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు 
అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ 
సమర్థ .తన దేహము చాలించిన తరువాత తన 
భక్తులు ,ఆశ్రీతులు అయిన కొందరిని షిర్డీ సాయబాబా వద్దకు వెళ్లమని సలహ యిచ్చారు .
షెగాం మహారాజుగా ప్రసిద్దులైన గజానన మహరాజ్ ,గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే కుటుంబాన్ని ,
సాయిబాబాను ఆశ్రయించమని అదేశించారు .
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ,రాజాధిరాజా ,
యోగిరాజా ,పరబ్రహ్మ ,సమర్థ సచ్చిదానంద సద్గురువుగా ,సాయిబాబాను కీర్తించటం మామూలు అయినది భక్తులకు .అందరికీ సాయినాధునిలో సుగుణాలు ఆకట్టుకొన్నాయి .
ఆలా ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరిగేదీ .
ఒకసారి సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాన్ 
సంభవించింది .గాలి ఎక్కువ అవుతున్నది .నేల 
అంతా నీటిమయమవుతుంది .షిర్డి గ్రామ వాసులు అందరూ ద్వారకామాయికి వచ్చారు .
వారు విపత్తును తొలగించమని బాబాను ప్రార్ధించారు .బాబా గొప్ప ధ్వనితో మశీదు అంచున నిలబడి " ఆగు ! ఆగు ! నీ కోపమును 
తగ్గించుము .నెమ్మదించుము ! " అని తుఫాన్ ని 
గద్దించారు .కొన్ని నిముషాలలో తుఫాను ఉధృతి 
తగ్గింది .చంద్రుడు కనిపించాడు .ఎవరి ఇళ్లకు 
వారు వెళ్ళిపోయారు .అలాంటి దైవిక శక్తులతో 
ప్రజలను కాపాడతారు మహనీయులు .

Saturday, March 6, 2021

రుసో మమ ప్రియాంబికా ,మజ వరి పితాహి రుసో 
రుసో మమ ప్రియం గానా ,ప్రియసుతాత్మజాహీ రుసో భగిని బంధుహి .........
ఈ హరతి గీతం సాయంకాలము హరతిలో,
 భక్తులు భక్తిపూర్వకంగా పాడుకొనే గీతం .
దీనికి రచించినవారు బాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ 
విశ్వనాధ్ దేవ్ .ఈయన ప్రస్తావన సాయిసచ్చరిత్ర 
5 ,41 వ అధ్యాయములో కనిపిస్తుంది .శ్రీ బి వి.దేవ్ రచించిన ఈ హారతి గీతం బాబా మహాసమాధి చెందిన 22 సంవత్సారలకు అనగా 
1940 సం.లో షిర్డి హరతులలో చేర్చబడినది .
దీనిని శ్రీ బి.వి.దేవ్ 7 -3 -1940 గురువారము నాడు సంకలనం చేసారు .నేటికి 81 సంవత్సరాలు ముగిసాయి .శ్రీ బి.వి.దేవ్ బాబా మహాసమాది అనంతరం ,ఆయన 1946 సం.లో దేహన్ని విడిచారు .ఆయన జీవితకాలం షిర్డి సాయిసంస్థాన్ సభ్యుడిగా పనిచేసి ,సంస్థాన్ వారి 
సాయిలీలామాసిక్ పత్రిక లో " బాబాంచె బాల్ "
అను కలంపేరుతో అనేక వ్యాసాలు వ్రాశారు .సాయిసచ్చరిత్ర గ్రంథ రచయిత శ్రీ హేమాడ్ పంత్ 1929 సం .లో దేహాన్నివిడిచి సాయిలో ఐక్యమైన పిదప ,సాయిసచ్చరిత్ర 53 వ 
అధ్యాయమును సంకలనం చేసి గ్రంథం పూర్తి 
చేసారు .ఈ హరతి గీతం సాయబాబా అనుగ్రహ 
ప్రసాదయాచన జరుగుతుంది .తల్లితండ్రులు ,
తోడబుట్టినవారు  ,బంధువులు  ,సృష్టిలో గల సర్వ భూతములు మున్నగువారు  ,అలిగిన తనను విడవవద్దని ,తనపై అలుగవద్దని అతివినయంగా  
ఎంతో శరణాగతితో వ్రాసి బాబాను వేడుకున్న 
"ప్రసాద యాచనా దశకం "శ్రీ బి.వి.దేవ్ గారి అనన్యభక్తిని స్మరణచేసి ,సాయికృపకు పాత్రులగుదాం .

Thursday, March 4, 2021

🌹ఓం శ్రీ సాయిరాం... శుభోదయం 🌹బాబాకు మనం రోజు పూజ చేసుకుంటాము. ఆయన భక్తిలో చాలామంది పరవశం పొందుతారు. అలాంటి పరవశమే ఇప్పుడు మన అందరమూ పొంద ప్రయత్నిద్దాము.

బాబా ఆరతి అయిన తరువాత ద్వారకామాయి అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదిటిన ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారు. ఒక్కసారి మనం కూడా ఆ అనుభూతిని పొందుదాము. 

ఇప్పుడే ఆరతి అయిపొయింది. మనమందరము ఒక వరుసలో బాబా ఆశీర్వదంకోసం తపిస్తూ ముందుకు నడుస్తున్నాము. బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది.

 ఆయన పొడవాటి తెల్లని కఫ్ని  ధరించి ఉన్నారు. తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలె మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవుమీదగా వెనుకకు వేలాడుతూ ఉంది. బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న ధుని మంట కనపడుతుంది.

ఆ ధుని వెలుతురు బాబా తల వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది. వెనుక గోడ దగ్గర ఉన్న గూడు, పూల మాలలతో ఉన్న నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తుచేస్తుంది. 

ఇంతలోనే బాబా ఎదురుగా చేరుకున్నాము. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎదో తెలియని అనుభూతి. అలానే మనసులో నా తండ్రిని చూస్తున్నాను,

ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతున్నాను అనే ఉత్కంఠ. అంతలో బాబా కుడిచెయ్యి పైకి లేచింది. నా కళ్ళు మూతలు పడ్డాయి.

ఊది నుదిటిపై పెట్టి బాబా తన చేతిని నా తలపై ఉంచారు. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కండ్లనిండా ప్రేమ పొంగిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. నా గురువు నా హృదయంలోనే ఉన్నారు అన్న భావన అధికం అయింది. 

నేను, నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది. సాయియే సర్వం అనిపించింది. అంతా సాయి మయం, ఎప్పుడు లేని అనుభూతి. సాయే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమ శివుడు. సాయే సర్వదేవతా స్వరూపము. సాయే నిర్గుణము. ఈ అనుభూతి ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం. 

హేమద్పంత్ గారు గురు కర స్పర్శ  ప్రభావం గురించి మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి అందులో ఉన్న పరమార్ధాన్ని తెలిపారు. ఈ అనుభవం బ్రహ్మైక్య భావనతో సమానమైనదిగా చెప్పారు. 

🌹ఓం శ్రీ సాయి రామ్🌹