నారాయణ్ మోతీ రాంజనే పెద్ద కొడుకు శ్రీ ధ్యాననాథ్ నారాయణ్ జాని. చిన్న తనం నుండే తల్లిదండ్రులతో పాటు ఇతనికి కూడా దైవ భక్తి అబ్బింది. దాసగణు మహారాజ్, సొనొపంత్ దండేకర్, ధుండా మహరాజ్, రంగనాథ్ స్వామి ప్రభానికర్ వంటి సుప్రసిద్ధ సాధు సత్పురుషులను దర్శించి వారి ఆశీర్వచనాలను పొందాడు.వారి ప్రవచనాలను విన్నప్పుడు నేనూ వీరి వలె ఆ పరమాత్మను దర్శించగలనా ? ప్రహ్లాదుని వలె అనన్య భక్తిని సాధించగలనా ? భగవంతుని ప్రతిరూపమైన సద్గురువును కనీసం కలుసుకొని సేవించగలనా ? అని వివిధ రకాలైన ప్రశ్నలు అతనిని వేధిస్తుండేవి. దానితో పాటుగా చిన్నతనం నుండే ఒంటరిగా వుండడం అలవాటు చేసుకున్నాడతను. ప్రతీరోజూ స్కూలు నుండి వచ్చేటప్పుడు తమ స్కూలుకు దగ్గరలో వున్న పార్వతి కొండపై వున్న అమ్మవారిని దర్శించుకుంటుండేవాడు.
పూణే లోని కసబాపేటలో శ్రీ భైరవనాధుల గుడి వుండేది.హరనాధ్ బాబా అనే ఒక సాధు పుంగవుడు అక్కడ నివసిస్తుండేవారు. ఒకరోజు ధ్యాననాథ్ జాని పార్వతి కొండపై ఒంటరిగా కూర్చోని వుండగా శ్రీ హరనాధ్ బాబా అక్కడికి వచ్చి తనకు కలలో శ్రీ సాయినాధులు కనిపించి తన దర్శనం కోసం ఒక బాలుడు తపిస్తున్నాడని, వెంటనే వెళ్ళి అతనిని శిష్యుడుగా స్వీకరించి ఆధ్యాత్మిక సాధనలో శిక్షన ఇవ్వమని చెప్పారని” అన్నారు. అందుకు ధ్యాననాథ్ జాని కు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే హరినాధ్ బాబాకు సాష్టాంగ ప్రణామం చేసాడు. గురువు గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో శశ్రూషలు చేసి వారి నుండి యోగము, భక్తి, ధ్యానము, వైరాగ్యము లకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు ధ్యాననాథ్ జాని.
తన గురు సేవ గురించి ధ్యాననాథ్ జాని ఇలా రాసాడు.” నా గురువుగారైన హరినాధ్ బాబా గారు నాకు అతి నిఘూఢమైనట్టి అధ్యాత్మిక సాధనలను నార్పించారు. అందుకు వారికి వారి పరాత్పర గురువైన శ్రీ సాయినాధులకు వేల వేల వందనాలను అర్పించుకుంటున్నాను. ఒక సందర్భం లో అయితే ఒక గుహలో శ్రీ గోరక్ నాధ్ ప్రతిమ ఎదుట నన్ను ధ్యానం ధారణలో గంటలకొద్దీ కూర్చోబెట్టారు. అన్నపానీయాదుల సంగతే మరిచిపోయాము.శ్రీ సాయినాధులు, శ్రీ హరినాధ్ బాబల దయ వలన నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది. నాకు కుండలినీ జాగృతి సిద్ధించిన తర్వాత నా సద్గురువు నాకు నాథ సాంప్రదాయానికి సంబంధించి ఎన్నో రహస్యాలను నేర్పించారు”
తన సర్వ శక్తులను శిష్యునికి ధారపోసిన తర్వాత శ్రీ హరనాథ్ బాబా 28-04-1950 లో శ్రీ రామ నవమి పర్వ దినమున దేహ త్యాగం చేసారు. తన గురువు అభీష్టం మేరకు రాయగడ జిల్లా కర్జత్ తాలూకా పలస్దరీ అనే మఠం వద్ద ఆయనను సమాధి చేసి అన్ని లాంచనలను పూర్తి చేసాడు ధ్యాననాథ్ జాని. శ్రీ సాయినాధుని ఆశ్శీసులతో, సద్గురువు శ్రీ హరనాధ్ బాబా పర్యవేక్షణలో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తగా రూపొందిన ధ్యాననాథ్ జాని జీవితం ధన్యం.
ధ్యాననాధ్ జానీ తాను మహరాష్ట్రలో నలుమూలలకు పర్యటించి శ్రీ సాయినాధుని లీలా వైభవం గురించి విశేషంగా ప్రచారం చేసాడు. ఎంతో మంది సాధకులకు ఆయన ఆదర్శప్రాయుడయ్యాడు.ఆ విధంగా ఆధ్యాత్మిక పంధాలో తన జీవితమంతా నడిచి తండ్రికి మించిన తనయుడిగా పేరు గాంచాడు.

No comments:
Post a Comment