నాసిక్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నారాయణ్ మోతీరాం జాని శ్రీసాయి భక్తులలో ముఖ్యుడు. అన్నాసాహెబ్ దాభోల్కర్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్రలోని 33 వ అధ్యాయంలో ఈ భక్తునికి సంబంధించిన ఒక కధ వుంది. అయితే ఇతని ఇంటిపేరు జాని కాదని రానడే అని ఇతర పుస్తకాలలో వివరణ వుంది.
నారాయణ్ కు చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువ. తరచుగా దేవాలయలకు వెళ్ళడం, సద్గ్రంధ పఠన, భజనలు చేస్తుండేవాడు. శ్రీ గాడ్గీబాబా, శ్రీవల్లీ బాబా ( ఇండోర్ కు చెందిన శ్రీ మాధవనాధ్ మహరాజ్ యొక్క ప్రధమ శిష్యులు) లను తరచుగా దర్శించి వారి ఆశీర్వాదాలను అందుకునేవాడు. ఈ సిద్ధ పురుషులు నారాయణ్ ఇంటికి విచ్చేసి అతని ఆతిధ్యం కూడా స్వీకరించారు. అయినా శ్రీ సాయి తొలి దర్శనంలోనే ఆయనకు మహా భక్తుడై పోయాడు. శ్రీసాయిని నిత్యం ఉదయమే ఆభిషేకాది ఆరాధనలను గావించనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు.
ఇతను రామచంద్ర వామన్ మోదక్ వద్ద గుమాస్తాగా పని చేస్తుండేవాడు. మోదక్ తో కలిసి శ్రీసాయిని దర్శించుకున్నప్పుడు శ్రీసాయి నారాయణ్ తో “ఇతరుల వద్ద పని చెయ్యడ మెందుకు?" అని అన్నారు. వెంటనేనారాయణ్ నాసిక్ లో స్వంతంగా ఆనందాశ్రమం అనే హోటలును ప్రారంభించాడు. బాబా దయ వలన ఆ హోటల్ దినదినాభివృద్ధి చెందింది. బాబా చూపిన ప్రేమనురాగాలకు కృతజ్ఞతగా అతను తమ హోటల్ లో పేదవారికి ఉచితంగా భోజనం కూడా పెట్టసాగాడు.
పనుల వత్తిడి కారణంగా శ్రీ సాయి సశరీరులై వుండగా కేవలం రెండుసార్లు మాత్రమే దర్శించుకోగలిగాడు. విధివశాత్తూ నారాయణ రావు హఠాత్మరణం చెందాడు. అతని పిల్లలు బాగా చిన్నవారు కావడంచేత హోటల్ బాధ్యతను చేపట్టలేక పోయారు. కుటుంబ పోషణ, రక్షణ బాధ్యతంతా శ్రీమతినారాయణ్ మీదనే పడింది. వారి కష్టాలు ఎక్కువయ్యాయి. రోజూ వేలాదిమందికి అన్నదానం చేసిన ఆ కుటుంబం రోడ్డున పడి గుప్పెడు మెతుకుల కోసం యాచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సంపదతో పాటు హితులు, సన్నిహితులందరూ మాయమైపోయారు. శ్రీమతి నారాయణ్ తన కుటుంబాన్ని తీసుకు వచ్చి ఖండ్వా సమీపంలో సద్గురువు శ్రీ ధునీవాలా దాదా ఆశ్రమానికి చేరింది. ఆయనను దర్శించి తమ దీనగాధను తెలియ జేయగా ఆయన ప్రేమతో వారి కుటుంబాన్ని అక్కున చేర్చుకొని తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ధర్మశాలలో ఒక చిన్న ఉద్యోగం కూడా ఇచ్చారు. అట్లా బాబా ప్రేరణతో శ్రీ ధునీవాలా దాదా పంచన నారాయణ్ కుటుంబానికి ఒక నీడ దొరికినట్లయ్యింది.
ఏనాటికైనా తన సద్గురువు శ్రీ సాయినాధుని ఆశ్శీస్సుల ఫలితంగా తమ కుటుంబానికి మంచి రోజులు వస్తాయన్న ఆశతో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. శ్రీమతి నారాయణ్ అన్నగారు చాలిస్ గావ్ అనే ఊరులో ఒక ప్రసిద్ధ మిల్లులో ఉద్యోగం చేస్తుండేవాడు. చెల్లెలి కుటుంబం వీధినపడినా ఒక్క రోజయినా వారి వంక కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఒక సందర్భంలో తన భార్యతో కలిసి శ్రీ ధునీవాలా దాదా గారి దర్శనానికి వచ్చాడు. అన్నగారిని చూడగానే శ్రీమతి నారాయణ్ ముఖం చాటేసింది.
కాని శ్రీ దాదా తనకు దక్షిణ ఇవ్వబోయిన ఆమె అన్నగారికి చీవాట్లు పెట్టారు. “నాకు ఏవిధమైన దక్షిణ ఇవ్వనవసరం లేదు. ఈ మూల ఒక దీనురాలు తన పిల్లలతో కూర్చోని వుంది. ఆమెకు నీ వంతు సహాయ సహకారాలను అందించు, వారి కుటుంబానికి ఒక ఆధారం కల్పించు. వారు నా అన్నగారైన శ్రీసాయి నాధుని శిష్యులు. వారికి ఆ సాయి అండదండలు పుష్కలంగా వున్నాయి” అని ఆమెను పిలిచి “నీ గురుదేవులైన శ్రీసాయిబాబా ఆశ్శీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడూ వుంటాయి. తిరిగి మీ వూరు వెళ్ళి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి” అని ఆశీర్వదించారు.
అన్నగారిని చూడగానే శ్రీమతి నారాయణ్ ముఖం చాటేసింది. కాని దాదా మాటలకు సిగ్గుపడిన ఆమె అన్నగారు శ్రీమతి నారాయణ్ కుటుంబాన్ని తిరిగి నాసిక్ కు తీసుకువెళ్ళి తిరిగి స్వయంగా మూతబడిన హోటల్ ను తెరిపించాడు. కొంతకాలం ఆ హోటల్ పుంజుకునే వరకూ తాను దగ్గరుండి అన్నీ చూసు కున్నాడు. కొద్దికాలంలోనే ఆ హోటల్ సాయి ఆశ్శీస్సుల వలన మంచి స్థాయికి వచ్చింది.
అంతకంటే ముఖ్యం శ్రీసాయి తమతో పాటు వుండి తమను రక్షిస్తున్నారన్న భావన శ్రీమతి నారాయణ్ లో అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు జీవితంలో ఏ కష్టం వచ్చినా శ్రీ సాయి ఆశ్శీస్సుల వలన ధైర్యంగా ఎదుర్కొని సమస్యలను పరిష్కరించు కోగలమన్న ఆత్మధైర్యం ఆమెలో నిండుగా వచ్చింది. తమ భావి జీవిత పర్యంతరం వారి కుటుంబం శ్రీ సాయినాధుని సేవలోనే గడిపారు.
Source :- శ్రీ షిరిడి సాయి జ్ఞానామృతం

No comments:
Post a Comment