1. *"గురుదేవుని పూర్వజీవితం*"
*జననము-బాల్యము*
తమిళనాడు రాష్ట్రంలోని ఎరోడ్ జిల్లాలోని *భవాని* ఎన్నో శతాబ్దాలుగా గొప్ప పుణ్య క్షేత్రంగా పేరుగాంచింది. దక్షిణ భారత దేశంలోని వేలాదిమంది యాత్రికులు సంవత్సరం పొడవునా భవాని దర్శించి అక్కడ కొలువై ఉన్న సంగమేశ్వర - భవాని మాతల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఈ పట్టణం కావేరి, భవాని మరియు గుప్తగామిని అనే 3 నదుల సంగమం వద్ద నెలకొని ఉండడంతో దీనిని తమిళనాడు యొక్క త్రివేణి సంగమం అని పిలుస్తుంటారు.
శ్రీవత్స గోత్రీకులైన వెంకటగిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ అనే పుణ్య బ్రాహ్మణ దంపతులు పుత్ర సంతనం పొందాలనే కోరికతో ప్రతీ రోజూ ఈ సంగమేశ్వర - భవానీ మాతలను అర్చిస్తూ ఉండేవారు. అంగాచి అమ్మాళ్ కు సంగమేశ్వరుని యందు గల అనన్య భక్తివిశ్వాసాల ఫలితంగా ఒకసారి ఒక సాధువు ఆమె ఇంటికి వేంచేసారు. ఆమె కోరికను గ్రహించిన ఆ సాధువు ఆమెను షోలింగర్లో కొలువై ఉన్న నరసింహ స్వామిని దర్శించమని సూచించారు. ఆ నరసింహస్వామి ఆమెకు తప్పక కొడుకును ప్రసాదిస్తారని ఆశీర్వదించి ఆ సాధువు వెళ్ళిపోయారు.
షోలింగర్లోని నరసింహ స్వామిని దర్శించి వచ్చిన వెంటనే ఆ పుణ్య స్త్రీ కోరిక నెరవేరింది. అంగాచి అమ్మాళ్ గర్భం ధరించి పుత్రోదయానికై ఆ దంపతులు ఆసక్తిగా ఎదురు చూడసాగారు. 1874వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన శ్రావణ పంచమి శుభ దినాన సూర్యాస్తమయ సమయంలో గోధూళి వేళ 6.15 నిమిషాలకు ఆ పతివ్రత మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ జననం కూడా ఎంతో చిత్రమైన పరిస్థితుల మధ్య జరిగింది. అంగాచి అమ్మాళ్ తన ఇంట్లో పెరట్లోని గొడ్లపాక వైపు నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా ఏ ముందస్తు సూచన లేనట్లుగా ఎవరి సహాయం లేకుండానే అక్కడికక్కడే ప్రసవం అయి పోయింది. తదనంతర కాలంలో నరసింహ స్వామీజీగా వేనోళ్ళ కొనియాడబడిన శిశువు జన్మించాడు.
ఆయన జననం జరిగిన అరుదైన, అద్భుతమైన తీరు బహుశా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంది. అది ఆయన దృఢమైన, పటిష్ఠమైన మనోవైఖరిని శక్తిని తెలియ చేస్తుంది. ఆయన ఈ విశాల ప్రపంచంలో అవిశ్రాంతంగా పర్యటించ నున్నారనడానికి సంకేతమా అన్నట్లుగా ఆరుబయట జన్మించారు. ధరణీమాత ఒడిలో జన్మించారు. బంధరహితుడైన ఆయన ఆత్మను వినీలాకాశం చిరునవ్వుతో పలకరించింది. అస్తమించే సూర్యుని కిరణాలు చెట్ల మధ్య నుంచి విస్తరించి వింతైన, సుందరమైన రీతిలో పచ్చని పచ్చికను ప్రకాశవంతం చేసాయి. పొడవాటి కొబ్బరి చెట్లు తమ ఆకులను మృదువుగా ఊపుతూ నాట్యం చేస్తుండగా ఆ ప్రక్కనే ప్రవహించే భవాని నది మంద్ర స్థాయిలో తన ప్రవాహంతో గానం చేసింది. ఆ చెట్ల ఆకులు ఆ గానానికి పరవశించి నర్తిస్తున్నాయా అన్నట్లుంది.
ఆ శిశువు భగవంతుడు ప్రసాదించిన వరంగా ఆ దంపతులు భావించారు. ఆయనను తులాభారం వేసి ఆ బరువు వెండి, బంగారాలను షోలింగర్ నరసింహ స్వామికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించారు. తండ్రి ఆయనకు రామనాథన్ అని పేరు పెట్టాలనుకున్నారు. కారణం ఆ శిశువు శ్రీ రామచంద్రుడు జన్మించిన నక్షత్రంలోనే జన్మించాడు. కానీ అంగాచి అమ్మాళ్ కోరిక మేరకు *నరసింహస్వామి* అని నామకరణం చేసారు. శ్రీరామచంద్రుని వలే ఆయన కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదంలో జన్మించారు. ఆది శంకరాచార్య, భగవాన్ రమణ మహర్షి కూడా ఇదే నక్షత్రంలో జన్మించడం విశేషం. నరసింహ స్వామి జన్మించిన శుభఘడియ లలో 3 ఉచ్ఛ గ్రహాలు లగ్నంలో ఉండడంతో ఆ శిశువుకు ఉజ్వల భవిష్యత్తు ఉండ బోతోందని ఆ కుటుంబ జ్యోతిష పండితులు తెలియ చేసారు. ఆయనొక గొప్ప వ్యక్తి అవుతారని జోస్యం చెప్పారు.
రచయిత :- డా.జి.ఆర్. విజయకుమార్.
*"పూజ్య శ్రీ బి.వి.నరసింహస్వామి జీవిత చరిత్ర*"..
*2*. నరసింహస్వామి ఒక పవిత్రమైన ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి 2వ గ్రేడ్ ప్లీడరు. ఆయనకు ఎన్నో స్థిరాస్తులు కూడా ఉన్నాయి. భవాని నది ఒడ్డున అందమైన, ప్రశాంతమైన పరిసరాలలో వారికి ఒక పెద్ద ఇల్లు ఉంది. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆ ఇంటిని ఒక నందనవనంగా అగుపించేలా చేసేవి.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నరసింహ స్వామి ఒక అందమైన, తెలివైన, ధృడమైన యువకునిగా ఎదిగారు. ఆయన కళ్ళు ఎంతో లోతైన దృష్టితో ఉండి అందరినీ ఆకర్షించేవి. చిన్నతనం నుంచీ కూడా ఆయన సంతోషంగా, సృజనాత్మకంగా, తెలివిగా, తుంటరిగా వుండేవారు. ఇతర పిల్లల నుంచి ప్రత్యేకంగా ఉండేవారు. ఒక టీచరు ఆయన ఇంటికి వచ్చి ఆయనకు అక్షరాలు నేర్పించేవారు. నరసింహ తన తోటి పిల్లలందరినీ తన చుట్టూ ప్రోగు చేసి వారితో కలిసి హాస్యమాడుతూ అల్లరి చేస్తూ ఉండేవారు. ఒకరి అధికారానికి లోబడి ఉండడాన్ని ఆయన ఇష్టపడేవారు కాదు. ఒక వేళ గొడవే వస్తే ఆయన చాలా కఠినంగా పోరాడేవారు. ఏమాత్రం అన్యాయాని సహించేవారు కాదు. తన గంభీర ప్రవృత్తితో దానిని ఎదిరించే వారు.
ఎవ్వరూ తనని పరిహాసం చేయడానికి ఆయన అవకాశం ఇచ్చేవారు కాదు. ఎంతో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండేవారు. చిత్రంగా ఆయనకు సన్నిహితులని చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవ్వరూ ఉండేవారు కాదు. దాని కారణంగా కుటుంబంలోను, బయట ఎవ్వరితోను ఆయనకు గాఢమైన అనుబంధం ఉండేది కాదు. తల్లి ఆయనను ఎంతో గారాబం చేసినప్పటికీ అది ఆయనను చెడగొట్టే విధంగా ఉండేది కాదు.
ఆయన అల్లరిని, ఆటలను అందరూ ఎంతో ఇష్టపడి ప్రేమించేవారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తన వయసుకు మించిన పరిణతి ప్రదర్శించేవారు. నరసింహ జన్మించిన 3 సంవత్సరాల తరువాత 1877లో అంగాచి అమ్మాళ్ మరొక పుత్రునికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి లక్ష్మణ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు అతను అతి కొద్దికాలం జీవించి ఉన్నాడు. అతను 3 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా 1880లో ఎవరో దుండగులు అతనిని అపహరించి, దోచుకుని చంపి వేసారు. ఈ సంఘటన ఆ తల్లితండ్రులను ఎంతగానో కృంగదీసింది.
లక్ష్మణ మరణించడానికి ఒక సంవత్సరం ముందు అనగా 1879లో ఆ తల్లిదండ్రు లకు మరొక విషాదం ఎదురైంది. ఈ దంపతులు తమ బంధువులు, గ్రామంలోని రైతులు, ఇతర పనివాళ్ళందరితో కలిసి సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేక పూజ కోసం భవాని నది ఒడ్డున సమావేశమై ఉండగా 5 సం!!ల పిల్లవాడైన నరసింహ తోటి పిల్లలతో ఆడుకుంటూ భవాని నదిలో పడిపోయాడు. ఒక రైతు సరైన సమయానికి నదిలో దూకి ఆ ఘోర జల ప్రమాదం నుంచి ఆ పిల్లవాడి ప్రాణాలను కాపాడగలిగాడు.
దీనితో బెదిరిపోయిన వెంకట గిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ కొంతకాలం తరువాత తమ కుటుంబ జ్యోతిష్కుని సంప్రదించారు. ఆయన నరసింహ అకాల మృత్యువు నుంచి తప్పించుకోగలిగాడు కనుక ఇక 80 సం!!ల పైన జీవిస్తాడని తెలిపారు. ఆ దంపతులను ఆ స్థలం వదిలి వేరొక చోటుకు మకాం మార్చమని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాక నరసింహ భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తియై వేలాది మందికి మార్గ దర్శకుడౌతాడని తెలిపారు. దీనితో పాటు ఆయన మరొక పిడుగు లాంటి విషయం చెప్పారు. నరసింహ తన కుటుంబ జీవితాన్ని వదిలి సన్యసించి సాధువు లాగ మారే అవకాశం ఉందని తెలియ చేసారు. ఇది ఆ దంపతులను ఎంతో కలవరపరిచింది.
అప్పటికే వారి చిన్న కొడుకు మరణించడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు సాధువై పోతే తమ వంశం అంతరించి పోతుందని భయపడ్డారు. ఆ భయం వారినెంతో కలచి వేసింది.. ఇక ఈ విషయమై ఆ దంపతులు భగవంతుని ఆశ్రయించారు. అప్పటికి అంగాచి అమ్మాళ్ వయసు 36 సం!!లు. ఆ దంపతులు సంగమేశ్వర - భవానిల సన్నిధిలో ఇక తమ జీవిత పర్యంతం బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తామని ప్రమాణం చేసారు. నరసింహ పెరిగి పెద్దవాడై గృహస్తు కావాలనే సంకల్పంతో వారి ప్రతిజ్ఞ చేశారు.
కుటుంబ జ్యోతిష్కుని సలహా ననుసరించి వెంకటగిరి అయ్యర్ భవానిలో ఉన్న తన ఇల్లు, స్థలాలు అన్నీ అమ్మి వేసారు. కేవలం కొద్ది పంట పొలాలు, కొబ్బరి తోట మాత్రం ఉంచుకుని భవానికి 40 కి.మీ. దూరంలో ఉన్న సేలంకు మకాం మార్చారు. వెంకటగిరి అయ్యర్ సేలం పట్టణానికి సమీపంలోని హస్తినంపట్టిలో కుటుంబాన్ని స్థిరపరిచారు. సేలంలో 2వ గ్రేడ్ ప్లీడర్ గా తన వృత్తిని కొనసాగించారు.
రచయిత :- డా.జి.ఆర్.విజయకుమార్
*"పూజ్య శ్రీ బి.వి.నరసింహస్వామి జీవిత చరిత్ర*"..
*3*. *సేలంలో బాల్యం*..
తమ కుమారుడైన నరసింహను సేలం లోని పాఠశాలలో చేర్పించారు. అప్పటికే ఆయన భవానిలో తమ ఇంటికి వచ్చిన గురువు వద్ద అక్షరాలు, ఇతర ప్రాథమిక అంశాలు నేర్చుకుని ఉన్నారు. నరసింహ మనోవైఖరి, ఆత్మస్థైర్యం ఆ వయసులోని ఇతర పిల్లలకంటే చాలా ఉన్నతంగా ఉండేవి. ఆయన చదువులో అమితకుశలునిగా ఉండేవారు. సైద్ధాంతిక విషయాల కన్నా ఆయన ఆచరణాత్మక, పరిశీలనాత్మక విషయాల పట్ల ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు.
క్రొత్త విషయాలను పరిశోధించ డం పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. సుదూర ప్రాంతాలు, దేశాల గురించిన వివరణలు ఆయనను ఎంతగానో ఆకట్టుకునేవి. లక్ష్యశుద్ధితో సాహసోపేతమైన మనస్తత్వం కలిగి ఉండేవారు. నాయకునిగా ఉండాలని కోరుకునేవారు. తన వయస్సు లోనే ఉన్న ఇతర పిల్లల కంటే శారీరకంగాను, మేథాపరంగాను ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయనకు తన తోటివారు ఎంతో మందకొడిగా అనిపించే వారు.
ఏమాత్రం నిస్తేజాన్ని, బద్ధకాన్ని, నిసత్తువను ఆయన భరించలేక పోయేవారు. అటువంటి వారితో సహవాసం చేస్తే తానూ వారిలాగే మారిపోతానని భయపడేవారు. మందకొడిగా, నిరుత్సాహంగా ఉండడాన్ని ఆయన మరణ సదృశంగా భావించేవారు. తల్లిదండ్రులైన వెంకటగిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ నరసింహను వైదిక వాతావరణంలో పెంచి పెద్ద చేసి ఆయనలో సామాజిక బాధ్యతను పెంపొందింప చేసారు. వారెంతో విశాల హృదయులుగా, ఉదారులుగా పేరు గడించారు. భవాని వద్ద ఉన్నప్పుడు కూడా అంగాచి అమ్మాళ్ తమ తోటలో సంవత్సరంలో మొదట పండిన మామిడిపండ్లు,కొబ్బరికాయలు ఇతర పండ్లు, ధాన్యం ఇవన్నీ పొరుగు వారికి, స్నేహితులకు, తమ బంగ్లాలో పనిచేసే వారికి పంచి పెట్టి వారికి సరిపడే కొద్ది భాగం మాత్రమే తమ వద్ద ఉంచేది.
నరసింహ స్వామి తరువాతి కాలంలో ఈ విషయాన్నే స్మరిస్తూ *స్వచ్చందంగా సమాజసేవ చేయడం నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను* అన్నారు.
నరసింహ తండ్రి అయిన వెంకటగిరి అయ్యర్ ఎంతో పండితుడు, మేథావి. రాత్రి వేళలలో ఆయన కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను సమావేశ పరిచి రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలను చదివి వినిపించేవారు. పండుగ సమయాలలో ఆయన సాధువులు, పండితులను ఇంటికి ఆహ్వానించి వారి ప్రసంగాలను ఏర్పాటు చేసేవారు.
భారత రామాయణాలను చిత్రీకరించిన పటాలు కూడా ఆయన వద్ద ఉండేవి. ఈ ఐతిహాసిక నాటకాలను, ఘట్టాలను తిలకించే భాగ్యం నరసింహకు అనేక సార్లు దక్కింది. వాటిలోని పవిత్ర ఋషులు, యోగుల జీవితాలు ఆయననెంతో ఆకర్షిం చేవి. వారి శక్తులు, దివ్యదృష్టి, మేథస్సు, రాజులు, చక్రవర్తులను సైతం ఆజ్ఞాపించ గల వారి హోదా అతనినెంతో ముగ్ధుని చేసేవి. సాధువు అంటే అర్థం తెలియక పోయినా ఆ లక్షణాలు చూచి తాను కూడా వారిలా సాధువు కావాలని కోరుకునే వాడు.
వెంకటగిరి అయ్యర్ మూఢ విశ్వాసాలను ఏ మాత్రం ప్రోత్సహించే వారు కాదు. ఆయన తన ఇంట్లో జరిగే దైవ సంబంధ వైదిక కార్యక్రమాలలో ముస్లింలు పాటలు పాడడాన్ని ఏ మాత్రం అడ్డుకునే వారు కాదు. ఒకసారి నరసింహస్వామి తన శిష్యులతో *నాలో ఏమాత్రం శుద్ధత ఉన్నా అది నాకు నా తండ్రి నుంచి అలవడినదే* అన్నారు. నరసింహపై ఆయన తల్లి ప్రభావం ఎంతగానో ఉండేది. అతనిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి ఆమె ఎల్లప్పుడూ అతని వద్ద భక్తిగీతాలు పాడుతూ ఉండేది.
ఎవరైనా మహాత్ముడు లేక సాధువు సేలం వచ్చారని తెలిస్తే ఆ దంపతులు అందరి కన్నా ముందు ఆ మహాత్ముని తమ ఇంటికి ఆహ్వానించేవారు. శృంగేరి జగద్గురు శంకరాచార్యులు శ్రీ నరసింహ భారతీ స్వామీజీ, కాళహస్తి సమీపంలో నివసించిన శ్రీ సొరకాయ స్వామీజీ నరసింహను బాల్యంలో ఎంతగానో ప్రభావితం చేసారు. శృంగేరి పీఠాధిపతులైన నరసింహ భారతీ స్వామిని ఆది శంకరాచార్యుల అపర అవతారంగా భక్తులు భావిస్తారు.
ఆయనకు ఎంతోమంది భక్తులు ఉండేవారు. నరసింహ ఆయనను మొట్టమొదటి సారి దర్శించినప్పుడే ఆయన ఆ పసివాడిని ఆశీర్వదించి అతని బుగ్గలపై సున్నితంగా తట్టారు. ఇలా చేసి వెంటనే ఆయన ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోసాగారు. ఆయన వైపే చూస్తున్న పిల్లవాడు నరసింహ ఆ స్వామీజీ ఎంతో వేగంగా వెళ్ళిపోతుంటే వారి పాదాలు భూమిని తాకక పోవడం గమనించాడు. ముఖ్యంగా ఆయన శక్తివంతమైన కళ్ళు ఆ పిల్లవాడిని చిత్రమైన రీతిలో ఆకర్షించాయి. ఆ ప్రభావం అతనిపై ఎంతో తీవ్రంగా పడింది. తరువాతి కాలంలో నరసింహ స్వామీజీ *ఈ సంఘటన నేనెప్పటికీ మరచిపోలేను. అది ఒక నిధి వలే ఎప్పటికీ నాతో నిలిచి ఉంటుంది* అన్నారు.
1882లో నరసింహ 8 సం!!ల వయస్సులో ఉండగా అతనికి *బ్రహ్మోపదేశం* జరిగింది. వారి పొరుగునే ఉండే నటరాజ వడయర్ ఆ పిల్లవానికి సంధ్యావందన క్రతువును నేర్పించారు. తండ్రి ద్వారా గాయత్రీ మంత్రో పదేశం పొందిన నరసింహ అప్పటి నుంచీ త్రికాల సంధ్యావందనం ఆచరిస్తూ గాయత్రీ జపం నియమనిష్ఠలతో చేయసాగారు. తరువాత రుద్రం, నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం నేర్చు కొనడానికి ఆ పిల్లవాడిని వేద పాఠశాలలో చేర్పించారు.
పొరుగునే ఉన్న స్నేహితురాలైన అలమేలమ్మ పిల్లవానికి విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం, ఇతర స్తోత్రాలు నేర్పించింది. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు అలమేలమ్మ తమిళంలో *కన్నా! శ్లోక సొల్లువా* అనగానే ఆ పిల్లవాడు పరిగెత్తు కుంటూ ఆమె ఇంటికి వెళ్ళి ఆ స్తోత్రాలు నేర్చుకునేవాడు. ప్రతీ రోజూ భోజనం చేసే ముందు తులసి మొక్కకు నీరు పోసి, ఆవుకు మేత పెట్టాలని అంగాచి అమ్మాళ్ నరసింహకు బోధించింది. నరసింహ దానికి కారణం అడుగగా *ఇతరులకు పెట్ట కుండా మనం తినడం సరికాదు* అని చెప్పింది.
రచయిత :- డా.జి.ఆర్.విజయకుమార్

No comments:
Post a Comment