Tuesday, February 20, 2024

*దత్తాత్రేయ వృక్షాలు*

దత్తాత్రేయుడు తరచుగా కనిపించు స్థానాలలో మొదటి స్థానం ఆక్రమించేవి ‘దత్తవృక్షాలు’. ఈ దత్తవృక్షాలు దత్తత్రేయునికి మరియు భక్తునికి మధ్య వారధులు. ఔదుంబర వృక్షం లాంటి వృక్షాలు కొన్ని ప్రాణశక్తిని సైతం నిలిపే అద్భుత కల్పవృక్షాలు. ఇక పనస వంటి వృక్షాలలో అయితే దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతం గా అష్టసిద్దులతో కూడి కొలువైఉంటాడు. దత్తవృక్షాల స్పర్శ , పూజ, స్థాపనలు మనకు వెలకట్ట లేని పుణ్యఫలాన్ని తరతరాలకు ఇస్తాయి.  

ఔదుంబర వృక్షం (మేడి చెట్టు)

అశ్వత్ధ వృక్షం (రావి చెట్టు)

కృష్ణామలకము (నల్ల ఉసిరి వృక్షం)

పనస వృక్షం (చక్కి చెట్టు)

మందార వృక్షం

రాత్రిపూట మహిమ గల మేడి, రావి, పనస వంటి వృక్షాలకు ప్రదక్షణ చేయవచ్చా?

మన ఇంట్లో ఉండే దత్తవృక్షాలకు (మేడి, రావి, పనస) రాత్రిపూట ప్రదక్షణ, పూజ చేయరాదు. కాని గుడిలో లేదా గుడి ప్రాంగణం లో ఉండే దత్తవృక్షాలకు రాత్రిపూట కుడా ప్రదక్షణ, పూజలు చేయవచ్చు..

Sunday, February 18, 2024

సాయివ్యాసుడుగా బిరుదు పొందిన శ్రీ బాపట్ల హనుమంతరావుగారు బాబాకు అంకిత భక్తుడు.

*సాయివ్యాసుడుగా బిరుదు పొందిన శ్రీ బాపట్ల హనుమంతరావుగారు బాబాకు అంకిత భక్తుడు.*

*ఆయన తరచూ ఆర్ధికంగా ఇబ్బందులు పడేవాడు ఒకరోజు హనుమంతరావు గారి ఇంటికి బంధువులు వచ్చారు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ( లేని పరిస్థితి ).*
*అయనకు నిత్యమూ అరువు యిచ్చే బియ్యపు వ్యాపారి వద్దకు వెళ్లి, బియ్యము అరువు ఇమ్మని అడుగగా, ఆ వ్యాపారి గతంలో తీసుకున్న బియ్యానికి డబ్బు చెల్లించనందున, మరొకసారి అరువుకు బియ్యం ఇవ్వలేదు.*
 *కనీసము బియ్యం కొందామని పదిరూపాయలు అప్పుకొరకు ప్రయత్నించగా, అప్పు దొరకలేదు.*
*తన దురదృష్టానికి చింతిస్తూ, చేసేదీ ఏమీలేక తన ఇంటికి వచ్చి, తన దైవమైన సాయిబాబాకి తన కష్టాన్ని విన్నవించుకున్నాడు.*
*కొంతసేపటికి ఆ రోజు మొదట హనుమంతరావుగారికి బియ్యం అరువుగా ఇవ్వడానికి తిరస్కరించిన బియ్యం వ్యాపారి హఠాత్తుగా హనుమంతరావుగారి ఇంటికి వచ్చి " పంతులుగారూ ! మీరు బియ్యం ఆడిగినప్పుడు ఇవ్వలేకపోయాను. ఎందుకో మరల మీకు బియ్యం ఇవ్వాలని అనిపించింది. మీరు బియ్యం అరువు అడిగి వెళ్లిపోయిన తరువాత ఇవ్వలేనందుకు బాధపడ్డాను.*

*మీరు వెళ్ళగానే మంచిరకం బియ్యం షాపులోకి వచ్చాయి. అవే బియ్యం ఒక బస్తా పట్టుకు వచ్చాను. ఇంద. తీసుకోండి ! డబ్బులు తీరికగా ఇవ్వండి " అని చెప్పి, ఒక బియ్యం బస్తా వారింటిలో పెట్టి వెళ్లిపోయాడు.*
 *బాబా తన ఎడల చూపిన అపార కరుణకు ఎంతో అనందించాడు.*

*బాబా అభయప్రదానం " నా భక్తుల ఇంట అన్నవస్త్రములకు లోటు లేదు " అన్న అభయ సందేశం భక్తులపాలిట వరం కదా  !*

Saturday, February 17, 2024

సాయినాధ్ -ఖండోబా మందిర పూజారి అయిన మహల్సాపతి సాయిబాబాకు " సాయి "అని నామకరణం చేశాడు

సాయినాధ్ -ఖండోబా మందిర పూజారి అయిన 
మహల్సాపతి సాయిబాబాకు " సాయి "అని నామకరణం చేశాడు .సాయి అన్న పదం మహల్సాపతి నోటంట అప్రయత్నంగా వచ్చిందే తప్ప ,ఉద్దేశపూర్వకంగా కాదు ." సాయి " అన్న 
నామమే ఈనాడు కోట్లాదిమందికి నిరంతర స్మరణగా మారింది ." సాయి " అనగా అది రెండు 
పదాల కలయిక .సా + ఆ యి = సాయి ." సా " అనగా సగుణ ." ఆయి " అనగా తల్లి .
అనుకోకుండా ఈ నామములో మాతృత్వం కనిపిస్తుంది .ఇది సాయబాబా మాతృస్వరూపం 
సూచిస్తుంది .తల్లికి తన బిడ్డల యెడలగల వాత్సల్యం .సాయిబాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అపారము .బాబా తల్లికి మించిన తల్లి .
సాయిసచ్చరిత్ర పారాయణం చేసినవారికి 
బాబా మాతృ ప్రేమ కన్పిస్తుంది ."నాధ "అను పదమునకు భరించువాడని అర్థం ." మీ భారములు నాపై పడవేయుడు .నేను మోసెదను "అని బాబా చెప్పినట్లుగా, ఆయనను శరణువేడిన భక్తుల భారములను ఈనాటికి మోస్తున్నారు .ఆందుకే సాయినాధునిగా కీర్తిస్తూన్నారు .
మహరాజ్ -మహరాష్ట్రలో సాధు సత్పురుషులను 
మహరాజ్ అనిపిలుస్తారు .సాధారణంగా మహరాజ్ అనే పదానికి ఒక రాజ్యానికి రాజు ని 
మహరాజ్ అని పిలుస్తారు .మనం కీర్తిస్తున్న "సాయిమహరాజ్ " అన్న పదానికి అర్థం చెప్పటానికి మాటలు చాలవు .బాబా ఎప్పుడూ 
" నా ధనాగారం నిండిపోయి విపరీతంగా పొంగి 
పొర్లుతుంది .నేను అడిగినవారందరికీ ఇస్తూనేవున్నాను .కానీ నేనిచ్చేది తీసుకొనుటకు 
ఎవరూ ముందుకి రావటం లేదు "అని చెప్పేవారు 
బాబా ఇహిక సుఖాలేగాక పరలోక సుఖాలు ఇవ్వగల సమర్థుడు .మెహర్ బాబా చెప్పినట్లు 
" సాయబాబా గూర్చి నాకు తెలిసిన జ్ఞానం  ,
మీకు కూడా కలిగితే ఆయన ఈ విశ్వానికి పరిపూర్ణుడైన ,పరిశుద్ధమైన ప్రభువుగా మీరు 
అంగీకరిస్తారు ."అని అన్న సత్యం గుర్తించాలి .
అందుకే అయనను " సాయిమహరాజ్ "గా కీర్తిస్తుంటారు .
ఇంతవరకు మనం వివరించిన ," అనంతకోటి 
బ్రహ్మాండనాయకా ,రాజాధిరాజా ,యోగిరాజా ,
పరబ్రహ్మ  ,శ్రీ సచ్చిదానంద ,సద్గురు ,సాయినాధ్ 
మహరాజ్ కి జై " అన్న స్తొత్రంలో సాయబాబా 
విశ్వరూపం కనిపిస్తుంది .
(ఇంగ్లీష్ వాఖ్యకు తెలుఁగు అనువాదము )

Friday, February 16, 2024

నామామృతం

*నామామృతం.*

*భగవంతుని మహిమ అపారమైనది.*
 *ఆ పరమాత్మను అనునిత్యం స్మరిస్తూ ఉండటం మానవాళి కర్తవ్యం.*
*ఏ ఆపద వచ్చినా, ఏ కార్యం సానుకూలం కావాలన్నా, శుభం జరగాలన్నా పరమాత్మ అనుగ్రహం కావాలి.*
*మనిషి ఏదైనా కార్యం సాధిస్తే అంతా తన గొప్పే అనుకొంటాడు.*
*మనం ఎన్ని విజయాలు సాధించినా అవి ఆ పరంధాముని కటాక్షం అని గ్రహించాలి.*
*ఆ కటాక్షం సాధించడం కోసం ఆయనను ఆరాధించాలి.*

*ఆ ఆరాధన అనేక రకాలు.*

*వాటిలో సులభముగా చేయగలిగేది 'నామస్మరణ'.*
*సర్వకాల సర్వ అవస్థలలోను, ఏ పని చేస్తున్నా భగవన్నామం స్మరిస్తూ ఉండాలి.*
*అది మన నైతిక బాధ్యత.*

*కలి యుగంలో  నామజపం ప్రముఖమైనది. భగవంతుడు ఇంద్రియాలకు గానీ మనసుకు గానీ కనిపించడు. ఆయన అసంఖ్యాకమైన నామరూప భేదాలతో ఈ విశాల విశ్వమంతా విస్తరించి వికసించి విరాజిల్లుతున్నాడు.*
*బంగారం లాంటి లోహాలను అగ్ని దగ్ధం చేసిన విధంగా భక్తితో చేసిన భగవన్నామ సంకీర్తన సకల పాపాలను దగ్ధం చేస్తుంది.*

*అన్ని సమయాలలోను నిరంతరం నీవు నన్ను స్మరిస్తూనే నిత్య దైనందిన కార్యాలు నిర్వహించాలని గీతాశాస్త్రం ప్రభోధిస్తుంది.*

*నామ జప మహాత్యం వల్లనే ప్రహ్లాదుడు భక్త శిఖామణియై శ్రీహరి కృపకు పాత్రుడైయ్యాడు.*
*ప్రేమ పావని హనుమంతుడు నిరంతరం శ్రీరాముని నామ స్మరణ మహిమచేత ఆయన రూపాన్ని గుండెలలో నిలుపోకోగలిగేడు.*

*అజామిళుడు, గజేంద్రుడు లాంటి ఎందరో నామ స్మరణ చేసి ముక్తిని పొందారు.* *నిష్కామ భావంతో విధి విధానంగా భగవన్నామం జపించాలి. పరమాత్మునికి అనేక నామాలున్నాయి.*
*వాటిలో సాధకునికి ఇష్టమైన, శ్రద్ధ, నమ్మకం గల నామాన్ని స్వీకరించాలి. ఎవరి అభిరుచి, అనుభవం అభిమతానికి తగినట్లుగా వారు భగవంతుడి నామాన్ని స్మరిస్తునే ఉండాలి.*
*అలా స్మరిస్తూ ఆయన స్వరూపాన్ని చింతన చేయాలి.*

*ఓం శ్రీ సాయినాథాయ , ఓం శ్రీ సాయి రాం, ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త అని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ ఇలాగ ఏదో ఒక నామస్మరణ చేయాలి.*

*భగవంతుడి కంటే భగవన్నామమే సకల  ఫలదాయకమని భావం స్ఫురించేలా భద్రాద్రి రామదాసు 'రామా ! నీ రూపం కంటే నీ నామమే సర్వ శ్రేష్టమైనది ' అని అన్నారు.*

*త్యాగయ్య తొంభై ఆరు కోట్ల రామనామాన్ని జపించి, రామ సాక్షాత్కారాన్ని పొంది రామనామ కీర్తనలలోని విశిష్టతను తన కృతులలో తెలియచేసాడు.*

*ఆ పరంధాముడి ప్రభావాన్ని ఎరిగిన మానవుడు ఎంతో అదృష్టవంతుడు, అతడే భగవంతుడికి ప్రీతిపాత్రమైనవాడు.*
*అటువంటివారు రాత్రీ పగలు తమకు ప్రియమైన దైవ నామాన్నే జపిస్తూ ఉంటారు.*
*తన్మయత్వం పొందుతారు.*
*నామాన్ని జపించేటప్పుడు మనసు దృష్టి ఆ పరమాత్మ యందే లగ్నం చేసి భక్తి పారవశ్యం పొందాలి.*

*భగవంతుణ్ణి భజించడం మహా కల్పవృక్షం లాంటిది. సాయి భక్తులకు 'ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ' అత్యంత ప్రియమై నిత్య స్మరణీయమై ఉన్నది.* 

*అందువల్ల భక్తులందరూ భగవన్నామ మాధుర్యాన్ని అమృత పానంలా ఆస్వాదించి చిరంజీవులు కావాలని ఆకాంక్షిద్దాం.*