భగవంతునికి ఎట్టిరూపము, గుణము లేవు గనుక, ఆయన మన యింద్రియాలకూ మనస్సుకూ గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయన యే మానవాకారంతో భూమిపై సద్గురువు గా అవతరిస్తుంటాడు.
చూడడానికి సద్గురువుగూడ సామాన్య మానవునిలాగే వున్నా, ఆయన యొక్క శక్తిసామర్థ్యాలు మాత్రం అపారము. హేమాద్పంతు చెప్పినటు "సద్గురువు" అన్నపదం గుర్తుకు రాగానే సాయియే మనస్సుకు వస్తారు. వారి లీలలను చింతనచేస్తే భగవంతుని తత్త్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కాని యిది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరమూ అనుకొంటాము కాని భగవద్గీతలో.
శ్రీకృష్ణుడు "మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడేయైన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు" (7: 20) అని చెప్పాడు. కాని పరమాత్మయైన తనకు జ్ఞానికీ భేదమే లేదని కూడా చెప్పాడు దేవతలందరూ భగవంతునికి అధీనులైనటు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సదురువుకు కూడ అధీనులే.
అంతేకాదు "శ్రీ గురుచరిత్ర" లోని దీపకుని వంటి సద్గురువుని భక్తునికికూడా దేవతలందరూ అధీనులే కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము. ఈ విషయము సాయి భక్తులకెందరికో అనుభవమైంది.
వీండరి విఠల్ గౌలీ బూవా అనే 95 ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామానూ ఒక గాడిదమీద పెట్టుకొని, ప్రతి సంవత్సరము కాలినడకన పండరిపురం వెళ్తుండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోను, 4 మాసాలు గంగాతీరంలోనూ గడిపేవాడు. ప్రతిసారీ అతడు శిరిడీ దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనందభాష్పాలు రాలుస్తూ, "ఈయన సాక్షాత్తు విఠలుడే! దీనజన రక్షకుడు ఆపద్భాంధవుడు" అనేవాడు.
రఘువీరపురందరే తన తల్లిని తీసుకొని 1913లో శిరిడీ వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు గనుక త్వరగా పండరి వెళ్ళాలని అతనిని వత్తిడి చేయసాగింది. అప్పటినుండి సాయి ఆమెతో, 'నీవు పండరి ఎప్పుడు వెళతావు? అని పదేపదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరి తీసుకెళ్ళడానికి బాబా అనుమతి కోరదలచాడు పురందరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మాసమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసమేర్పడి, శిరిడీయే తనకు పండరి అని బాబాకు సమాధానమివ్వసాగింది.



No comments:
Post a Comment