Thursday, June 18, 2020

భీమాజీ పాటీలు



            🌻 భీమాజీ పాటీలు 🌹
పూనా జిల్లా, జున్నరు తాలుకా, నారాయణగాం గ్రామమందు భీమాజీపాటీలు 1909వ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల యౌషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది "ఓ భగవంతుడా! నారాయణా! నాకిప్పుడు సహాయము చేయము." అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనల నావరించునపుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే భీమాజి కూడ భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానా సాహెబు చాందోర్కరుతో సలహా చేయవలె ననుకొనెను. కావున వారికి తన జబ్బుయొక్క వివరములన్నియు దెలుపుచు నొక లేఖ వ్రాసి యతని యభిప్రాయ మడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీ పోపుట కేర్పాటు లన్నియు చేసెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర బెట్టిరి. నానాసాహెబు శ్యామగూడ నచ్చట ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి, దానిలో జోక్యము కలుగ జేసికొనుటకు బాబా యిష్టపడకుండెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి. "ఆగుము, నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధ లున్న వారైనను ఎప్పుడయితే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరిని ప్రేమతోను దయతోను కాపాడెదరు." 

ప్రతి యయిదు నిముషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్కసారియైన రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో గాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి యింటిలో బసచేయుమని బాబా చెప్పెను. అది సదుపాయమైనదిగాని, యారోగ్యమయినదిగాని కాదు. కాని బాబా యాజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండునపుడు బాబా రెండు స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్దబండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాల బాధ కలుగుచున్నట్లు జూచెను. స్వప్నములో పడిన ఈ బాధలతో చాల జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అతడప్పుడప్పుడు షిరిడీ వచ్చుచుండెను. బాబా వానికి జేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగనమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తులవద్దనుంచి యేమియు కాంక్షించెడువారు కారు. వారికి కావలసినదేమన, భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొనుటయు, మార్పులేని గట్టినమ్మకమును; భక్తియును. మహారాష్ట్రదేశములో నెలకొకసారిగాని పక్షమునకొసారిగాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట యలవాటు. కాని భీమాజీపాటీలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయిసత్యవ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను.
🌹💐🌼🌺🌷🌸🌹💐🌼🌺🌷🌺🌻

Tuesday, June 16, 2020

బాబా విగ్రహం వెనుక దాగివున్న లీల

బాబా విగ్రహం వెనుక దాగివున్న లీల 

1954వ సంవత్సరంలో సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని చెక్కుతున్న బాలాజీ తాలిమ్ తన పనివాళ్ళతో చివరిదశ పనులు చేయిస్తున్నారు. అయితే ఆ చివరి సమయంలో సాయిబాబా విగ్రహం యొక్క ఎడమ మోకాలి క్రింది భాగంలో కొంచెం గాలి చేరినట్లు (ఒక చిన్న గాలిబుడగ ఉన్నట్లు) గుర్తించారు. అది తొలగించాల్సిన అవసరం వచ్చింది. కానీ పూర్తవుతున్న స్థితిలో విగ్రహంనుండి గాలి ఉన్న రాతి భాగాన్ని తొలగించాలంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లే. ఎందుకంటే, ఆ భాగంతో పాటు దాని చుట్టూ ఉన్న భాగం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. పోనీ అలా ఉంచేద్దామంటే, విగ్రహం పగిలిపోయి ఇక పూజించడానికి పనికిరాకుండా పోతుంది. అందువలన బాలాజీ తాలిమ్ గాలి చేరుకున్న భాగాన్ని తీసివేయడానికి భయపడి ఏమి చేయాలో అర్థంకాక పని ఆపివేశాడు. కానీ తన శ్రమ, సమయం అంతా వృధా ఐపోతుందని చాలా ఆందోళనలో పడ్డాడు. ఆ స్థితిలో, "బాబా! నా మీద కరుణ చూపండి. మీ మూర్తి మొత్తం తయారుగా ఉంది. దయచేసి కరుణ చూపండి బాబా!" అని ప్రార్థించాడు. మరుక్షణంలో, "బాలాజీ! కొనసాగించు" అని ఒక కంఠధ్వని వినిపించింది.

వెంటనే తాలిమ్, "పని కొనసాగించండి. గాలి చేరుకున్న రాతిభాగాన్ని చెక్కి తొలగించండి" అని పనివాళ్లను ఆదేశించాడు. కానీ పనివాళ్ళు మోకాలి భాగమంతా పడిపోతుందన్న భయంతో పని చేయడానికి నిరాకరించారు. ఇక తప్పనిసరై, స్వయంగా బాలాజీ భయపడుతూనే ఉలిని, సుత్తిని చేతిలోకి తీసుకుని, "బాబా! సహాయం చెయ్యండి" అని ప్రార్థిస్తూ మోకాలి క్రింద ఉన్న అదనపు భాగంపై ఒక చిన్న దెబ్బ వేసాడు. ఆశ్చర్యం! అద్భుతం! ఆ అదనపుభాగం మాత్రమే క్రింద పడింది, మిగతా బాబా విగ్రహం చెక్కు చెదరకుండా వుంది. అది చూసిన అతను కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలుతుండగా  బాబా ముందర సాష్టాంగపడ్డాడు. తరువాత పట్టలేని ఆనందంతో నృత్యం చేస్తూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. అంతటి అద్భుతమైన సాయి లీలను బాలాజీ పొందాడు.

పూర్తైన 5.5 అడుగుల సాయిబాబా విగ్రహాన్ని ఉత్సాహంతో గ్రామంలో ఉరేగిస్తూ వేడుక చేసారు. సజీవకళ ఉట్టిపడుతున్న బాబా విగ్రహాన్ని చూసి, బాబాను సజీవంగా ఉన్నప్పుడు దర్శించుకున్న స్వామి శ్రీసాయిశరణానంద, లక్ష్మీబాయి వంటి భక్తులు బాబా విగ్రహరూపంలో తిరిగి వచ్చారని ఎంతగానో ఆనందించారు.

1954 అక్టోబర్ 7, విజయదశమి రోజున పాలరాతితో తయారుచేయబడిన సాయిబాబా సజీవ మూర్తిని సమాధి వెనుక పశ్చిమభాగంలో ప్రతిష్ఠించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వామి సాయిశరణానంద చేతులమీదుగా నిర్వహించారు.

బాబా విగ్రహాన్ని తయారుచేస్తున్న సమయంలో ఒకసారి శ్రీ బాలాజీ తాలిమ్‌కు బాబా దర్శనమిచ్చి, "పనిని పూర్తి చెయ్యి, భవిష్యత్తులో నువ్వు ఏ విగ్రహాన్నీ చేయవు" అని చెప్పారు. అందువలన తాలిమ్ బాబా విగ్రహం చేసిన తరువాత మరే విగ్రహం చెయ్యలేదు. చివరిగా తాలిమ్ తన 82 సం౹౹ వయస్సులో 1970, డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.  *బాబా విగ్రహము వెనుక దాగి ఉన్న లీల - మొదటి భాగం*

బాబా విగ్రహము తయారి వెనుక దాగి ఉన్న లీల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఈ విషయాలు శ్రీ ఇమ్మిడి ప్రభాకర రావు గారు రచించిన "శిరిడీలో సిరులు" అనే పుస్తకము నుండి గ్రహింపబడినవి.

పిలిచినంతనే పలికే దైవం, కోరిన వరాలు కురిపించే దేవుడు శిరిడీ సాయిబాబా. ఈ కరుణామూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అసలు సాయిబాబా ఎవరు..? దేవుడా..? యోగీశ్వరుడా..? అవతార పురుషుడా..? ఎవరు ఎలా పిలిచినా ఆయన మాత్రం భక్తులను ఆదుకునేందుకు భూవిపై వెలిసిన ప్రత్యక్షదైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధ, సబూరి అనే సన్మార్గాలను బోధించిన సద్గురు అవతారం. 1838 నుండి 1918 మధ్య కాలంలో ఎంతోమంది భక్తులను కరుణించి, ఎన్నో మహిమలను చూపిన సాయిబాబా 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున  మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి చెందారు.

సాయిబాబా సమాధి చెందిన తరువాత నాటి భక్తులంతా కేవలం బాబా సమాధికి మాత్రమే నిత్యపూజలు చేస్తూ హారతులు ఇచ్చేవారు. ఆ తరువాత కొద్ది కాలానికి బాబా ఫొటోను వెండిపీఠంపై వుంచి నిత్యపూజలు చేయడం మొదలుపెట్టారు. భక్తులు సమాధితోపాటు, ఈ ఫొటోను కూడా దర్శించుకుని సాయికి ప్రత్యక్షంగా సేవ చేసిన అనుభూతిని పొందేవారు. సాయి సమాధి చెందిన 36 ఏళ్ళకు అంటే 1954వ సంవత్సరంలో సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన వెనుక జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, సాయి మహిమ ఎంతటి మహత్తరమైనదో ఇట్టే అవగతమవుతుంది.

1954వ సంవత్సరంలో ముంబాయి ఓడరేవుకు ఇటలీ నుంచి ఓ నౌక వచ్చింది. ఆ నౌకలో నిలువెత్తు పాలరాతి ముడిపదార్థం వున్నట్టు సిబ్బంది గుర్తించారు. అది ఎవరి పేరు మీద వచ్చిందో, దాన్ని నౌకలోకి ఎవరు చేర్చారో వంటి వివరాలు ఎవ్వరికీ తెలియరాలేదు. దానిని తీసుకువెళ్ళడానికి యెవరూ రాకపోయేసరికి, రేవు అధికారులు దానిని వేలం వేశారు. వేలంలో ఒక పూణే వర్తకుడు దానిని సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్ళ తరవాత అతనికి ఏ ప్రేరణ కలిగిందో తెలియదుగాని, ఆ పాలరాతిని శిరిడీ సంస్థానానికి సమర్పించాడు. ఆరాతి నాణ్యతను గుర్తించిన సంస్థాన్ కార్యవర్గ సభ్యుల మదిలో 'దీనితో బాబా ప్రతిమను చెక్కిస్తే ఎలా ఉంటుంది' అనే ఆలోచన  మెదిలింది. అందరూ శిల్పం చెక్కించాలని నిర్ణయించి, బొంబాయికి చెందిన బాలాజీ వసంత్ తాలీమ్ అనే ప్రఖ్యాత శిల్పిని పిలిపించి, ఆ బాధ్యతను అతనికి అప్పగించారు.

అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫొటోలు కూడా చాలా కొద్ది మాత్రమే. అవి కూడా వేరు వేరు వయస్సులకు చెందినవి కావడం వలన విగ్రహాన్ని ఎలా మలచాలో బాబా ముఖకవలికలు, రూపు రేఖలు ఎలా తీర్చిదిద్దాలో తాలీమ్ కు ఓ పట్టాన అర్థం కాలేదు. అందువలన ఎంత శ్రమించినా నమూనా మూర్తి సంతృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయినే ప్రార్థించి వాటి గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, "నన్ను మళ్ళీ మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు. జాగ్రత్తగా చూడు" అని తన ముఖాన్ని వివిధ కోణాలలో చూపించారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ (కలలోనే) ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి పరికించాడు. ఆ స్వప్న సాక్షాత్కార బలంతో తెల్లవారగానే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చక్కని నమూనా మూర్తిని తయారుచేసి, దానినిబట్టి ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తైన పాలరాతి విగ్రహం అపురూపంగా మలిచాడు. అంటే సాయి తనంతట తానుగా తన ప్రతిరూపాన్ని తయారు చేయించుకున్నారు. 1954లో అక్టోబర్ 7 విజయదశమి రోజున శిరిడీ సాయినాథుడి విగ్రహ ప్రతిష్ట జరిగింది. నాటి నుండి శిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడికి బాబా ఆ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు. జీవకళతో తొణికిసలాడుతూ వుండే ఆ సజీవ ప్రతిమ భక్తులకు సాయి ప్రతిరూపం కాదు, సాక్షాత్తు శ్రీ సాయియే! ఈనాడు అంబరాన్ని చుంబించే భవంతులతో, లెక్కకు మించిన వాణిజ్య సముదాయాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న శిరిడీలో రాజ భవనం వంటి సమాధి మందిరం లో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ వుంటుంది. సాయిని సజీవంగా చూడలేకపోయిన భక్తులు, ఈ మూర్తిని చూసి, బాబాను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుతున్నారు.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

సాయిభక్తుడు శ్రీబదావే

సాయిభక్తుడు శ్రీబదావే

సాయిబాబా భక్తుడు శ్రీ బదావే బ్రాహ్మణ కులస్థుడు. అతను 1906వ సంవత్సరంలో నెవాసాలోని మోహినీరాజ్ మందిరంలో పూజారిగా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ పుట్టకముందు, పుట్టిన తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు, కానీ చిన్నవయస్సులోనే వాళ్ళంతా మరణించారు. నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితుడు, బదావేకు మామగారైన వబాలే అహ్మద్ నగర్ లో వకీల్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతను బాబాకు గొప్ప భక్తుడు. అతని ప్రోత్సాహంతో ఒకసారి బదావే భార్యాబిడ్డలతో శిరిడీ వెళ్లాడు. బాబా దర్శనం చేసుకొని మశీదులో కూర్చున్నారు. అతను గాని, అతని భార్య గాని వారి మనోవేదనలను బాబాకు విన్నవించుకోలేదు. కానీ అతని భార్య, ఇకపై తమకు పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులై ఉండాలని మనసులోనే బాబాను ప్రార్థించింది. మరుక్షణం సర్వజ్ఞుడైన సాయిబాబా ఆమె తలపై తన చేతిని ఉంచి, ఆమెతో "ఆందోళన చెందకండి" అని చెప్పారు. ఆ తరువాత బాబా అశీస్సులతో ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. వాళ్లలో ఒక అబ్బాయి 17 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు, కానీ, మిగిలిన అందరూ క్షేమంగా ఉన్నారు.

ఆ మొదటి సందర్శనలో బాబా బదావేని దక్షిణ అడిగారు. అతను కొంత మొత్తాన్ని చెల్లించాడు. తరువాత కూడా అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయేంతవరకు బాబా అతనిని మళ్ళీ మళ్ళీ దక్షిణ అడిగి తీసుకున్నారు. ఆ తరువాత కూడా బాబాకు ఇంకో రూపాయి దక్షిణ సమర్పించాలని అతను ఆశపడ్డాడు కానీ తన వద్ద ధనం లేకపోవడంతో ఇవ్వలేకపోయాడు. శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత అతడు ఆ విషయం గురించి తన భార్యకు చెప్పాడు. కొన్ని సంవత్సరాల తరువాత అంటే సుమారు 1916వ సంవత్సరంలో అతనిని ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎంత కష్టపడినా చాలా కొంచెం డబ్బే సంపాదించగలిగేవాడు. ఆ సమయంలో అతని భార్య సాయిబాబాకు అతను ఇవ్వాలనుకున్న ఒక రూపాయి గురించి గుర్తుచేసింది. వెంటనే అతడు సాయిబాబాకు M.O. ద్వారా ఆ రూపాయి పంపాడు. అప్పటినుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. 1914లో అతడు పూనా వెళ్లి ఎస్టేట్ బ్రోకర్ గా వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతని పిల్లలు కూడా వ్యాపారం చేసుకుంటూ మంచి స్థితిలో ఉన్నారు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

సాయిభక్తుడు భాగ్ చంద్ మార్వాడీ

సాయిభక్తుడు భాగ్ చంద్ మార్వాడీ


భక్తుల వద్ద ఉన్న ధనమంతా అయిపోయేవరకు బాబా భక్తులను దక్షిణ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాలలో భక్తులను భాగ్ చంద్ మార్వాడీని అడిగి దక్షిణ తీసుకొని రమ్మని బాబా తరచుగా చెప్పేవారు. భాగ్ చంద్ మార్వాడీ శిరిడీలో ఒక కిరాణా దుకాణాదారుడు. 

ఒకసారి ఒక వ్యక్తి బాబా దగ్గరకు వచ్చి, "బ్రహ్మము యొక్క స్వభావం ఏమిటి?" అని అడిగాడు. అందుకు సమాధానంగా భాగ్ చంద్ మర్వాడీని అడిగి 100 రూపాయలు దక్షిణగా సమర్పించమన్నారు బాబా. భాగ్ చంద్ మార్వాడీ డబ్బు ఇవ్వడానికి బదులు తన నమస్కారాలే బాబాకు సమర్పించమని చెప్పాడు. అదే విషయం ఆ వ్యక్తి బాబాకు చెప్పగా బాబా ఆ వ్యక్తిని దక్షిణ తీసుకురావటానికి వేరొక స్థలానికి పంపించారు. వాళ్ళు కూడా అలానే బదులుచెప్పారు. అందువలన అక్కడనుండి కూడా ఆ వ్యక్తి ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చాడు. చివరిగా బాబా నానాసాహెబ్ చాందోర్కర్ ను భాగ్ చంద్ మార్వాడీ వద్ద నుండి 100 రూపాయలు తెమ్మని చెప్పారు. నానాసాహెబ్ స్వయంగా వెళ్ళకుండా భాగ్ చంద్ మార్వాడీకి ఒక చీటీ వ్రాసి పంపాడు. అది అందిన వెంటనే 100 రూపాయలు పంపించాడు భాగ్ చంద్ మార్వాడీ. అప్పడు బాబా, "ఈ ప్రపంచంలో అంతా ఇలానే ఉంటుంది" అన్నారు.

జరిగినదంతా గమనిస్తున్న ఆ వ్యక్తికి అందులోని అంతరార్థం ఏమిటో తెలియక దాసగణు మహరాజ్ ని వివరం అడిగాడు. అప్పుడు దాసగణు, "చూసావా? ఇతరులు డబ్బు అడిగినప్పుడు వారు దాన్ని పొందలేకపోయారు. కానీ నానాసాహెబ్ చీటీ పంపిన వెంటనే డబ్బు లభించింది. దేనినైనా అడిగే ముందు ఆ వ్యక్తి అందుకు అర్హుడై ఉండాలి. బ్రహ్మమంటే ఏమిటో తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తి కూడా అందుకు తగిన ఉత్సుకత కలిగి ఉండాలి. అప్పుడే అతడు దానిని పొందగలడు - ఉద్యోగి, సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు" అని వివరించారు.

పంచేద్రియాలు మహాత్ముల నియంత్రణలో ఉంటాయి. బాబా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని నిరూపించారు. ఒకసారి భాగ్ చంద్ మార్వాడీతో బాబా, "వెళ్ళు! పరుగున వెళ్ళు! నీ గడ్డివాముకి నిప్పు అంటుకుంది" అన్నారు. వెంటనే భాగ్ చాంద్ మార్వాడీ వెళ్లి చూస్తే నిజంగానే తన గడ్డివాముకి నిప్పు అంటుకొని ఉంది. ఇంతలో బాబా కూడా స్వయంగా అచ్చటికి చేరుకొని, తమ చేతులతో కొన్ని సైగలు చేసారు. దానితో నిప్పు ఆరిపోయింది.

ఆరోజు సాయంత్రం నానాసాహెబ్ చందోర్కర్, మరికొంతమంది భక్తులు బాబా దర్శనార్ధం మశీదుకు వచ్చారు. నానా వెళ్లి బాబాకు నమస్కరించుకున్నాడు. అప్పుడు బాబా, "నానా! కొంతమంది ఎంత స్వార్థపూరితమైనవారో చూసావా? నేను అతనిని అప్రమత్తం చేయడమే కాకుండా, స్వయంగా వెళ్లి అతని గడ్డివాముకి అంటుకున్న నిప్పును ఆర్పివేశాను. కానీ, అతడు ఇంకనూ, "నాదొక గడ్డివాము ధ్వంసం అయిపోయింది, నేను నష్టానికి గురయ్యాను" అని నన్ను నిందిస్తున్నాడు. లాభనష్టాలు, చావుపుట్టుకలు దైవాధీనాలు. ఈ విషయాన్ని ప్రజలు ఎలా మరచిపోతారు? 'ఇది నాది - అది నాది' అని చెప్పడంలో ఏమిటి అర్ధం? ఆ గడ్డివాము మర్వాడీదని ఎలా చెప్పవచ్చు? అది గడ్డేకాని అతని శరీరం కూడా కాదు కదా! వాస్తవానికి అది ఎండిన గడ్డికి చెందినది. అది విత్తనాల నుండి సృష్టించబడింది. విత్తనాలు నేలలో నాటుకుంటాయి, మేఘాల నుండి నీరు వచ్చింది, సూర్యరశ్మి వలన పెరిగి పెద్దవయ్యాయి(భూమి, వర్షం, ఎండల వలన ఆ విత్తనాలు నేలలో నాటుకొని ఎదిగాయి). ఈ మూడు ఆ ఎండుగడ్డి యొక్క నిజమైన యజమానులు. మరి ఈ వ్యక్తి తానే యజమానినని చెప్పుకుంటున్నాడు. నానా! కనీసం నువ్వైనా అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించు. ఇంతకుముందెప్పుడూ తనది కాని దానిని తనదిగా భావించి అనవసరంగా నష్టం గురించి శోకిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు. అందుకే, మనం ఆనందం, బాధలను అనుభవిస్తున్నాము. కానీ, అతను ఇది గ్రహించటం లేదు. ఇది అతని అజ్ఞానం కాదా?" అని అన్నారు. తరువాత బాబా మార్వాడీ వైపు తిరిగి, "శేట్, వెళ్ళు! ఊదీ తీసుకొని ఇంటికి వెళ్లి ప్రశాంతంగా కూర్చో! కొన్ని ఇతర వాణిజ్య లావాదేవీలలో నీవు డబ్బు సంపాదిస్తావు. దానితో నీ నష్టం పూడుకుంటుంది. చింతించకు" అన్నారు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

వినాయక్ సీతారాం ముల్కెర్కర్

వినాయక్ సీతారాం ముల్కెర్కర్ 

సాయిభక్తులకు ఈరోజు బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన బాబా లీలను అందిస్తున్నాను. ఈ లీల 'సాయిలీల' పత్రిక నవంబరు - డిసెంబరు 2007వ సంవత్సరములో ప్రచురితమయినది. వినాయక్ సీతారాం ముల్కెర్కర్ గారు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.

బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకు నేను ప్యాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెళ్తుంటాను. బాంద్రాలోని నా స్నేహితులలో చాలామంది శిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. శిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ ప్రసాదం', ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నా నుదిటి మీద ఊదీ రాస్తూ ఉండేవారు. నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నా ఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని. బాబా నుంచి పిలుపు వస్తే తప్ప నేను శిరిడీ వెళ్లదలచుకోలేదు. ఈవిధంగా చాలారోజులు గడిచాయి. అనేకమంది భక్తులు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని వర్ణించ శక్యంకాని ఆయన లీలలను చెప్పసాగారు. తత్ఫలితంగా ముంబై, బాంద్రా, వాషీ, విరార్, ఆగాషి, దహను, ఉంబర్గావ్ నుంచి కూడా ప్రజలు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడం ప్రారంభించారు. కాని నేను మాత్రం బాబా ప్రేరణ ఇస్తే తప్ప శిరిడీ వెళ్ళకూడదనే నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.

ఇలా కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు నా పనులన్నీ పూర్తయిన తరువాత నిద్రకు ఉపక్రమించాను. మరుసటిరోజు గురువారం. ఆరోజు వేకువఝామున నాకొక చెప్పనలవికాని దివ్యదర్శనం కలిగింది. బాబాను దర్శించుకోవాలనే భావం కలిగి నిద్ర నుండి మేలుకొన్నాను. ఉదయాన్నే టీ త్రాగి 8గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాల మీద బాస్ సంతకాలు తీసుకొన్నాను. తరువాత నేనాయనని, శిరిడీ వెడుతున్నాననీ, సెలవు కావాలని అడిగాను. వెంటనే ఆయన అందుకు ఒప్పుకొని, "సరే! శిరిడీ వెళ్ళడానికి కాబట్టి నీకు 3,4 రోజులు సెలవు ఇస్తాను. నేను కూడా నాసిక్ లో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. మనిద్దరం ఒకే రైలులో వెళదాము" అన్నారు.

నేను 11 గంటలకల్లా ఇంటికి వచ్చి నా భార్యతో, "ఈరోజు బాబా నుంచి శిరిడీకి రమ్మనమని పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం రైలుకు బయలుదేరుతున్నాన"ని చెప్పాను. ఆమె వెంటనే ఒప్పుకొంది, కానీ కాస్త భయపడింది. కారణం శిరిడీ చాలా దూరం, పైగా అది కొత్త ప్రదేశం, తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. అందుచేత ఎవరినైనా తోడు తీసుకొని వెళితే మంచిదని, పైగా చలికాలమని చెప్పింది. తను చెప్పిన కారణాలన్నీ సరైనవే. అయినప్పటికీ శిరిడీ వెళ్ళాలనే నా కోరికముందు ఈ విషయాలేమీ నేను పెద్దగా పట్టించుకోలేదు. గురువారం ఉపవాసం ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, స్టేషనుకి బయలుదేరాను. ఉదయానికల్లా కోపర్గాఁవ్ చేరుకొన్నాను. రైలు దిగగానే శిరిడీ వెళ్ళడానికి టాంగా కోసం చూస్తూ ఉండగా నా చిన్ననాటి మిత్రుడు డా.ఆర్.ఆర్.చౌబాల్ కనిపించారు. ఆయన కూడా అదే రైలులో వచ్చారు. నాలాగే ఆయన కూడా బాబాని దర్శించుకుందామని శిరిడీ వస్తున్నారు. మా యిద్దరి కోరికలు ఒకటే అవడంతో మా యిద్దరికీ ఎంతో సంతోషం కలిగింది. మేమెక్కిన టాంగా గోదావరి ఒడ్డుకు చేరగానే, నా బాల్యమిత్రుడు శ్రీగజానన్ కనేకర్ కి మా రాక తెలిసి, మమ్మల్ని అతిథులుగా తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపించాడు. టాంగా ఇంటికి చేరగానే ఎంతో సంతోషించి మా సామానంతా దింపించి తన యింటిలో ఉండమని మాకు ఆతిథ్యం ఇచ్చాడు. కాస్త ఫలహారాలు కానిచ్చి, టీ త్రాగి, ఇక ఎక్కువసేపు ఉండలేమనీ, హారతి సమయానికి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరాము.

మేమిద్దరమూ కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో బస చేసి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకొన్నాము. ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. తరువాత మేము హారతికి వెళ్ళాము. బాబా దర్శనమవ్వగానే నాకెంతో బ్రహ్మానందం కలిగింది. వర్ణించనలవికాని ఉద్వేగభరితమైన ఆనందమది. అటువంటి ఆనందం అంతకుముందెప్పుడూ నాకనుభవం కాలేదు. బాబా పాదాలను స్పృశించడానికి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాను. "నువ్వు శిరిడీ రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా?" అని బాబా అనగానే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా మనసులో అదే ఆలోచన తిరుగుతూ ఉంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తిమత్వాన్ని తెలుసుకొని మరొకసారి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా తన కన్నులతోనే నన్ను దీవించి దగ్గరకు తీసుకొని లాలనగా బుజ్జగించి నన్ను పైకి లెమ్మన్నారు. డా.చౌబాల్ కూడా అప్పుడే బాబా దర్శనం చేసుకొన్నారు.

తరువాత మేమిద్దరమూ ఇక పూనా వెళ్ళబోయే ముందు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన దర్శనానికి వెళ్ళాము. బాబా, "నా భక్తుడొకడు బాంద్రాలో నీ దగ్గర వైద్యం చేయించుకొంటున్నాడు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా?" అని డాక్టర్ ని అడిగారు. బాబాకు చౌబాల్ గురించి తెలియదు. ఆయన డాక్టర్ అని గాని, ఆయన బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని ఎవరూ పరిచయం చేయలేదు. అయినా గాని బాబా తన భక్తుడికెలా ఉందని ఆయనను అడిగారు. డా.చౌబాల్ చాలా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో బాబా భగవంతుని అవతారమేనని మా నమ్మకం ఇంకా బలపడింది.

బాబాతో మాకదే మొదటి పరిచయం. ఇది కేవలం బాబా తన భక్తుల క్షేమం కోసం ఎంతగా కనిపెట్టుకొని ఉంటారన్నదానికి ఋజువు. బాబా ఎదుటివారి మనసులలోని భావాలను చదువగలరు. వారి మనసులో ఉన్నది తాను గ్రహించగలననే సూచనలు కూడా చేసేవారు. నా శిరిడీ యాత్రకు నా భార్య వెలిబుచ్చిన సందేహాలు సహేతుకమే అయినప్పటికీ, బాబా దర్శనానికి నా యాత్రలో ఎటువంటి చిక్కులూ ఏర్పడలేదు.



సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

సాయిభక్తుడు కుశాల్‌చంద్

*సాయిభక్తుడు కుశాల్‌చంద్*


ప్రేమాభిమానాలు ఉండేవి. శిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిల్‌ని ఎంత అభిమానంగా చూసుకునేవారో, రహతాకు చెందిన 'చంద్రభాన్ శేట్  మార్వాడి' పై కూడా అంతే అభిమానాన్ని కనబరిచేవారు. శేట్ మరణించాక, అతని అన్న కొడుకైన కుశాల్‌ను బాబా ఎంతో ప్రేమించేవారు. అహర్నిశలూ అతని యోగక్షేమాల గురించి తెలుసుకునేవారు. బాబా షిరిడీ విడిచి ఎక్కడికీ  వెళ్లేవారు కాదు. అప్పుడప్పుడు రహతా  లేదా నీంగాఁవ్ వైపు వెళ్తుండేవారు. కుశల్‌చందును చూడాలనిపిస్తే వెంటనే రహతాకు బయల్దేరి వెళ్లేవారు. ఒకవేళ వెళ్ళటానికి వీలుకాకపోతే కుశల్‌చందును బాబా తన చెంతకే రప్పించుకునేవారు. ఒక్కోసారి టాంగాలోనూ, ఒక్కోసారి ఎద్దులబండిపై తన సన్నిహితులతో కలిసి బాబా రహతాకు వెళ్లేవారు. రహతా ప్రజలు గ్రామ పొలిమేరలో బాజాభజంత్రీలతో బాబాకు ఘనస్వాగతం పలికేవారు. బాబాకు సాష్టాంగనమస్కారాలు చేసి గ్రామంలోకి ఆహ్వానించేవారు. తరువాత మహావైభవంగా బాబాను ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు. కుశాల్‌చంద్ బాబాను తన ఇంటికి ఆహ్వానించి, బాబాను ఉచితాసనంపై కూర్చుండబెట్టి పూజించేవాడు. అనంతరం బాబాకు భోజనం పెట్టేవాడు. భోజనాలయ్యాక ఇద్దరూ ప్రేమోల్లాసాలతో కబుర్లు చెప్పుకునేవారు. అనంతరం వారిని బాబా ఆశీర్వదించి శిరిడీకి బయలుదేరేవారు. అప్పుడు కూడా రహతావాసులు బాబాను గ్రామ పొలిమేరవరకు గౌరవాభిమానాలతో సాగనంపేవారు.

ఒక్కోసారి బాబాకు రహతా వెళ్లడం వీలయ్యేది కాదు. అటువంటప్పుడు కుశాల్‌చందునే మసీదుకు రప్పించేవారు. లేదా, కల ద్వారా కుశాల్‌చందుకు అనుభవం కలిగించి తన వద్దకు బాబా రప్పించుకునేవారు. సాధారణంగా తెల్లవారుఝామున వచ్చే కలలు నిజం అవుతాయని అంటారు. అది నిజమే కావచ్చు కానీ, బాబా స్వప్నాలకు కాలనియమం లేదు. ఒకనాటి సాయంకాలం బాబా కాకాసాహెబు దీక్షిత్‌ను పిలిచారు. రహతా వెళ్లి చాలారోజులైందనీ, కుశాల్‌ను చూడాలని ఉందనీ, కాబట్టి అతనిని తీసుకురమ్మని దీక్షిత్‌తో చెప్పారు. కాకాసాహెబు టాంగాను తీసుకుని రహతాకు బయలుదేరాడు. కుశాల్‌చందును కలుసుకుని బాబా రమ్మంటున్నారని చెప్పాడు. అది విని కుశాల్‌చంద్  ఆశ్చర్యపోయాడు. తాను మధ్యాహ్న భోజనం చేసి నిద్రపోతుండగా తనకు కలలో బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని ఆదేశించారని, కాబట్టి శిరిడీ వచ్చే హడావిడిలో ఉన్నానని కుశాల్ చెప్పాడు. సరిగ్గా తనకు కుశాల్‌ను తీసుకురమ్మని చెప్పినట్లే, బాబా కుశాల్‌కు కూడా కలలో కనిపించి చెప్పారన్నమాట అనుకున్నాడు కాకాసాహెబ్. తన గుర్రం సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఆ సంగతి చెప్పడానికి బాబా వద్దకు తన కుమారుడిని పంపానని, అంతలో మీరు వచ్చారని కుశాల్ కాకాతో అన్నారు. ఇద్దరూ కలిసి బాబా వద్దకు వెళ్లారు. కుశాల్‌చంద్ బాబాను దర్శించుకుని ఎంతో ఆనందించాడు.

    

పారమార్థిక జీవితంలో మనిషి కర్తవ్యం ఏమిటో, మానవ వికాసానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో  ఆచరించి చూపారు బాబా. వాటిని ఇతరులను ఆచరించమన్నారు. ఒకసారి కుశాల్‌చందుకు కూడా బాబా అలాంటి అనుభవాన్ని స్వయంగా కలిగించారు. బాబా సహించని వాటిలో సోమరితనం ఒకటి. మనిషికి రాయిలా ఒకచోట పడివుండే గుణం అచ్చిరాదని బాబా చెప్పేవారు. 84 లక్షల జన్మల తరువాత లభించిన మానవజన్మను ఫలప్రదం చేసుకోవాలంటే బ్రతికున్నంతకాలం ఏదో పని చేస్తూనే ఉండాలని బోధించేవారు.

కుశాల్‌చంద్ చాలాసార్లు బాబాను దర్శించుకునే వంకతో వచ్చి మసీదులోనే ఉండిపోయేవాడు. రోజుల తరబడి అలాగే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలంపాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్‌ను బాబా దగ్గరకు పిలిచారు.

"కుశాల్‌చంద్! నీకు కొంత పొలం ఉంది కదా? అందులో ఏ పంటలూ పండించడం లేదా?" అని బాబా అడిగారు.

"లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు" అని కుశాల్‌చంద్ చెప్పాడు.

"భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా బాబూ! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను" అని బాబా అతనికి చెప్పారు.

కుశాల్‌చంద్ పొలం మొత్తం దున్ని, లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ, "దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్?" అని అడిగారు. కుశాల్‌చంద్ తాను నిలువుగా దున్నానని చెప్పగానే, "ఈసారి అడ్డంగా దున్ని చూడు, తప్పకుండా దొరుకుతాయి!" అని బాబా చెప్పారు. కుశాల్‌చంద్ అలా కూడా చేసి, లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. "సరే! దొరక్కపోతే ఏం చేస్తాం? ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి,  అందులో మిరపవిత్తనాలు చల్లు!" అని బాబా సూచించారు. కుశాల్‌చంద్ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరపపంట అన్నదే లేదు. కుశాల్‌చంద్ ఒక్కడే పండించాడు. దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. కుశాల్‌చంద్  తనకు వచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు.

"లంకె బిందెలు ఎదురుగా పెట్టి దొరకలేదని అబద్ధం చెబుతావేమయ్యా? ఇవే లంకెబిందెలు. సుఖం, కోరికలు, సంపద, కీర్తి, ప్రతిష్ట ఏదైనా సరే అయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిది సంపద దక్కదు. సాధన చేయనిది ఏదీ సాధ్యం కాదు. మనిషిగా  పుట్టినందుకు ఏదో పని చేయాలి. భక్తి మంచిదే. కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డగుణం. పనీపాటా చేసుకుంటూ, "ఓం సాయి శ్రీ సాయి" నిత్యం స్మరించుకో! ఇక నువ్వు చేసే పనికి ఆటంకం ఉండదు. నా భక్తులు నిత్య చైతన్యంతోనే ఉండాలి. అర్థమైందా?" అన్నారు బాబా. బాబా విపులంగా బోధించేసరికి కుశాల్‌చందులోని బద్ధకం, సోమరితనం, ఎగిరిపోయాయి. ఆ తర్వాతకాలంలో సాయిభక్తుల్లో కుశాల్‌చంద్  అగ్రగణ్యునిగా వినుతికెక్కారు.

కుశాల్‌చంద్ పైన బాబా చూపిన ప్రేమ అపారం. వీరి కుటుంబానికి బాబా ప్రసాదించిన అనుభవాలు అనిర్వచనీయం. బాబా ప్రేమామృతాన్ని తనివి తీరా రుచి చూసిన కుశాల్‌చంద్, బాబా లేని లోకంలో తాను ఎందుకనుకున్నాడో ఏమో గాని, సరిగ్గా బాబా సమాధి చెందిన నెల రోజులకు, అంటే 15-11-1918వ తేదీన సాయిలో ఐక్యమైనాడు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు *కుశాల్‌చంద్ పార్ట్ 2.*

సాయితో పెనవేసుకున్న అనురాగబంధం - ఏ జన్మదో ఈ ఋణానుబంధం.

శ్రీసాయి దేహధారిగా ఉన్నప్పుడు ఆయన దర్బారులోని భక్తమండలిని నిశితంగా అవలోకిస్తే అనేక విధాలుగా వారు బాబాతో ప్రేమ అనే బంధంతో ముడిపడిన విధానం అద్భుతంగా గోచరిస్తుంది.

సమర్థ సద్గురునాథుడైన శ్రీసాయి సన్నిధానం కోసం ప్రాపంచిక సుఖాలను తృణప్రాయంగా త్యజించి  తమ జీవితాలను సాయి సాన్నిహిత్యంలో పునీతం చేసుకున్న భక్తులు కొందరైతే, రకరకాల కోరికలు ఇష్టాలను తీర్చుకోవడానికి మొదటగా బాబా వద్దకు వచ్చినా,  ఆయన సన్నిధిలో కుండపోతగా వర్షించే ఆనందానుభూతిలో తడిసి జ్ఞానసూర్యుని ప్రేమకక్ష్యలో చిక్కుకుపోయిన భక్తులు ఇంకొందరు. పై రెండువిధాలుగా కాక తమ ప్రాపంచిక జీవితంలో తలమునకలవుతూనే ఎటువంటి ఐహిక ఆధ్యాత్మిక ఆశలు లేనప్పటికీ సాయిని తమ జీవితంలో అత్యంత ప్రీతిపాత్రునిగా భావించి, ఆరాధించి తరించిన భక్తులు మరికొందరు! అందరిపై శ్రీసాయినాథుడు సమదృష్టి సారించినప్పటికీ లౌకికంగా కొందరిపై శ్రీసాయి చూపించిన ప్రత్యేక ప్రేమాభిమానాలు కించిత్తు ఆశ్చర్యం కలిగించక మానవు. అటువంటి అపార ప్రేమాభిమానాలు పొందిన భక్తులలో రహతాకు చెందిన శ్రీచంద్రభాన్‌శేఠ్, శ్రీకుశాల్‌చంద్‌లను ప్రముఖంగా పేర్కొనవచ్చు.

ముఖ్యంగా శ్రీకుశాల్‌చంద్‌పై బాబా చూపించిన అభిమానం - కుశాల్‌చంద్ తమ దర్శనానికి రావడం కొద్దిరోజులు ఆలస్యం చేస్తే అతనిని చూడడానికి బాబా చూపే ఆరాటం, స్వయంగా తానే పరామర్శించడానికి  వెళ్లడం చూస్తే సర్వాంతర్యామి, సకల జీవస్వరూపుడు అయిన శ్రీసాయిలో కనిపించే మాతృప్రేమకు నిదర్శనంగా అనిపించక మానదు.

సాయి మమతను చూరగొన్న భాగ్యశాలి - భక్తి ప్రేమలు సమ్మిళితమైన సుగుణశీలి

అంతటి అదృష్టాన్ని స్వంతం చేసుకున్న శ్రీ కుశాల్‌చంద్, శ్రీచంద్రభాన్‌శేఠ్‌ల జీవిత విశేషాలను, బాబాతో వారి అనుబంధాన్ని పరిశీలిద్దాం. 

శ్రీచంద్రభాన్‌సేఠ్, శ్రీకుశాల్‌చంద్‌సేఠ్ రహతాకి చెందిన ప్రఖ్యాత సాండ్ కుటుంబానికి చెందినవారు. వీరి ఆధీనంలో నడిచే వివిధ వ్యాపారసంస్థలు మహారాష్ట్రలో విఖ్యాతమైనవి. ఆ రోజుల్లో వీరికి రెండువేల ఎకరాల భూమి, అహ్మద్‌నగర్, తంబూరి ప్రదేశాలలో కాటన్ మిల్లులు ఉండేవి. అంతేగాక అహ్మద్‌నగర్, ఔరంగాబాదు, సేలు, జాల్నా, నిజాం రాష్ట్రాలలో వీరికి చెందిన వివిధ వ్యాపారసంస్థలు ఉండేవి. అంతటి ధనిక కుటుంబానికి శ్రీశివరాం రామచంద్రసేఠ్ కుటుంబ పెద్ద. ఆయన రెండవ కుమారుడే శ్రీచంద్రభాన్‌శేఠ్. చంద్రభాన్‌శేఠ్ అన్నగారి కుమారుడు శ్రీకుశాల్‌చంద్. మొదట శ్రీచంద్రభాన్‌సాండ్‌తో మొదలైన శ్రీసాయి అనుబంధం కుశాల్‌చంద్‌ తో బాగా బలపడింది. ఈ కుటుంబసభ్యులపై శ్రీసాయి ప్రేమాభిమానాలు అపారం. వీరి కుటుంబానికి శ్రీసాయి ప్రసాదించిన అనుభవాలను సాండ్ కుటుంబసభ్యులతో 'సాయిపథం' సత్సంగసభ్యులు జరిపిన ఇంటర్వ్యూను కూడా తరువాత భాగంలో మీ ముందు ఉంచుతున్నాము.

శ్రీసాయి కుశాల్‌చంద్ ఇంటికి తరచుగా వచ్చేవారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. శ్రీచంద్రభానుశేఠ్ 1911లో దివంగతులైనప్పటికీ శ్రీకుశాల్‌చంద్ కోసం బాబా రహతా వెళ్లేవారు. కుశాల్‌చంద్ బాబా దర్శనానికి ఒక వారం పది రోజులు పని ఒత్తిడి వలన రాలేకపోయినట్లయితే స్వయంగా బాబానే ఆయనను చూడటానికి వెళ్లేవారు, లేదా ఎవరైనా  భక్తులను కుశాల్‌చంద్‌ని తీసుకురమ్మని పంపేవారు. అలాంటి కొన్ని సంఘటనలు ఇక్కడ చూద్దాం. ఒకసారి మధ్యాహ్న ఆరతి తర్వాత బాపూసాహెబు జోగ్, వామనరావు పటేల్ (సాయి శరణానంద) వద్దకు వచ్చి బాబా రహతాలో కుశాల్‌చంద్ ఇంటికి వెళ్లారని, తను తన భార్య అక్కడికే బయలుదేరామని, వామనరావు కూడా రావాలనుకుంటే రావొచ్చని చెప్పాడు. అప్పుడు బాపూసాహెబు జోగ్,  శ్రీమతి జోగ్, వామనరావు పటేల్ ముగ్గురూ బండిలో రహతాలోని కుశాల్‌చంద్ ఇంటికి వెళ్లారు. కుశాల్‌చంద్ బాబాను అత్యంత భక్తిశ్రద్ధలతో లోపలికి ఆహ్వానించి, పూజించాడు. కుశాల్ ఒక ప్లేటునిండా పండ్లు తీసుకువచ్చి బాబా ముందు పెట్టగా,  వామనరావు ఒక అరటిపండును ఒలిచి బాబా చేతిలో ఉంచాడు. బాబా సగం పండు తిని, మిగిలిన దానిని ప్రసాదంగా వామనరావుకి ఇచ్చారు. కొంతసమయం అక్కడ గడిపాక బాబా బండిలో శిరిడీకి వచ్చేశారు.

అలాగే ఒక మధ్యాహ్నం బాబా కాకాసాహెబ్ దీక్షిత్‌ను పిలిచి, "రహతాకు టాంగాలో వెళ్లి  కుశాల్‌భావుని తీసుకునిరా, తను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయ్యింది. బాబా నిన్ను చూడాలంటున్నారని, తొందరగా రమ్మంటున్నారని  చెప్పు" అని అన్నారు. బాబా ఆజ్ఞను సవినయంగా స్వీకరించి టాంగాలో రహతాకు వెళ్లి కుశాల్‌చంద్‌ను కలిసి తను వచ్చిన పనిని, బాబా చెప్పమన్న మాటలను చెప్పాడు శ్రీదీక్షిత్. ఆ మాటలను వినగానే  శ్రీకుశాల్‌చంద్  సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోతూ, "నేను ఇందాక నిద్రపోతుంటే నిద్రలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా కనిపించి ఇవే మాటలు చెప్పారు. వెంటనే బాబాను చూడాలని శిరిడీ బయలుదేరాను. కానీ గుర్రం లేకపోవడం వలన రాలేకపోయాను. ఈ విషయం బాబాకు తెలియజేయమని ఇంతకుమునుపే నా కుమారుడిని శిరిడీకి పంపించాను" అన్నాడు. ఇప్పుడు బాబా మీకోసం టాంగాను పంపించారని, కావాలంటే అందులో రావచ్చని కాకాసాహెబ్ చెప్పగా కుశాల్‌చంద్ కాకాసాహెబుతో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.

పై రెండు ఉదాహరణలు బాబాకు, కుశాల్‌చంద్ కుటుంబానికీ మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధానికి తార్కాణాలు. బాబా సమాధి చెందే కొద్దిరోజుల ముందు కూడా రహతా వెళ్లి కుశాల్‌చంద్ కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారని తెలుస్తున్నది. శ్రీసాయి అక్టోబర్ 15, 1918 సంవత్సరంలో దేహత్యాగం చేసినప్పుడు ముస్లిం భక్తులతో పాటుగా బాబాను కబరిస్థాన్‌లో సమాధి చేయాలని పట్టుపట్టిన వారిలో కుశాల్‌చంద్ ఒకరు. బాబా ప్రేమామృతాన్ని తనివితీరా గ్రోలిన కుశాల్‌చంద్ బాబా లేని లోకంలో తనెందుకు అనుకున్నాడో ఏమో, బాబా సమాధి చెందిన సరిగ్గా నెల రోజులకు అంటే 15-11-1918వ తేదీన సాయిలో ఐక్యమయ్యారు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

*పరమపావనుని దంత - ఉదంతం* (శ్రీ సద్గురు సాయినాథ్ మందిరం, శివాజీనగర్, పూనా.)

*పరమపావనుని దంత - ఉదంతం* (శ్రీ సద్గురు సాయినాథ్ మందిరం, శివాజీనగర్, పూనా.)



శ్రీసాయిబాబా మహాసమాధి చెంది ఎంతోకాలం కాకుండానే భారతీయ ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ఒక భాగమయ్యారు. ఈనాడు దేశం మొత్తం మీద పెద్ద నగరాలలోనూ, పట్టణాలలోనే కాకుండా పల్లెపల్లెలా, వాడవాడలా సాయిమందిరాలు వెలిసాయి. ఇంకా ఎన్నో వెలుస్తున్నాయి. వాటి గురించిన వివరాలను, వాటి ప్రాముఖ్యతను పాఠకులకు అందించాలనే సంకల్పంతో 'మందిర పథం' శీర్షికన 'సాయిపథం' పబ్లికేషన్స్‌లో ప్రచురించారు. అందులోనుండి పూనాలోని 'శివాజీనగర్ మందిరా'నికి సంబంధించిన ఈ అద్భుతమైన సమాచారాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాము. ఈ సమాచారాన్ని 'సాయిపథం' ప్రథమ సంపుటం నుండి సేకరించడమైనది. బాబా, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఆ సాయిమందిర వివరాల్లోకి వెళదాము...

ప్రస్తుతం పూనాలో ఉన్న ఎన్నో సాయిబాబా మందిరాలలో ఒక ప్రత్యేక చరిత్ర ఉన్న "శివాజీనగర్ మందిరం" గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ మందిరం శివాజీనగర్ చివరనున్న 'ముతానది' ఒడ్డున 'రస్నేచాల్' సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది నీరు మందిరం వరకు వస్తూ ఉండటంతో, అడ్డుగా గోడనొకదాన్ని కట్టి రోడ్డు నిర్మించారు. ఈ మందిరానికి వచ్చే భక్తులు బాబా దర్శనంతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నారు.

శ్రీ దామోదర్‌పంత్ రస్నే బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందిన ధన్యజీవి. 1945లో దామోదర్‌పంత్ కుమారుడు నానాసాహెబ్ రస్నే తన గృహ సముదాయం (రస్నేచాల్)లోని రెండు గదులను బాబా మందిరంగా రూపొందించి నిత్య నైవేద్యాలతో పూజలు క్రమం తప్పకుండా జరిపించేవాడు. ఉదయం ఆరతి, సాయంత్రం ఆరతి నిర్వహించడం మొదలైన తరువాత అధికసంఖ్యలో భక్తులు వచ్చి బాబా దర్శనం చేసుకోవడం ప్రారంభించారు.

ఖేడ్ కు చెందిన శ్రీనికమ్ పోలీసు శాఖలో జమేదారుగా పని చేసేవాడు. ఇతను ఆధ్యాత్మిక చింతన గలవాడు. శ్రీ నానాసాహెబ్ రస్నే పిలుపునందుకొని తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి తన జీవితాన్ని మందిరసేవకే అంకితం చేశాడు. ఇతను మందిర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడమేకాక, అతని దగ్గరున్న 'బాబా పవిత్రదంతాన్ని' మందిరానికి బహుకరించాడు. దీనితో ఈ మందిరం యొక్క చరిత్రే మారిపోయింది. దేశం నలుమూలల నుండి అసంఖ్యాకంగా భక్తులు రాసాగారు. ఈ పవిత్రదంతం నికమ్‌కు ఎలా లభ్యమైందో తెలిపే ఉదంతం అత్యంత ఆసక్తికరమైనది.

*పరమపావనుని  దంత-ఉదంతం*

*ఆద్యంతం ఆసక్తిదాయకం*

శిరిడీకి చెందిన కాశీబాయికి నీఫాడ్ గ్రామానికి చెందిన యువకునితో వివాహమయ్యింది. దురదృష్టవశాత్తు వివాహమైన కొద్దిమాసాలకే ఆమె భర్త మరణించాడు. భర్త మరణించేనాటికి ఆమె గర్భవతిగా ఉండటంతో ఆ తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడికి 'మాధవ్' అని పేరు పెట్టింది. మాధవ్‌కు సంవత్సరం వయసు ఉన్నప్పుడు నీఫాడ్ నుండి శిరిడీ వచ్చి తన తండ్రి వద్ద నివసించసాగింది. వ్యవసాయకూలీగా తన జీవనం సాగించేది. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాలలో పని చేయవలసి రావడంతో మాధవ్ ఆలన పాలన పెద్ద సమస్యగా తయారైంది. చివరికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఉదయమే మాధవ్‌ని తీసుకెళ్లి బాబా మసీదు (ద్వారకామాయి)లో వదిలి పొలానికి వెళ్ళిపోయేది. తిరిగి సాయంత్రం పని అయిన తరువాత మసీదుకు వెళ్ళి పిల్లవాడిని తీసుకొని ఇంటికి వెళ్లేది. ప్రతిదినం ఇంటికి వెళ్లే ముందు బాబాకు నమస్కరించడం మాత్రం మరిచిపోయేది కాదు. ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్‌కు ఐదు సంవత్సరాల వయస్సు నుండి, బాబా వాడికి ప్రతిదినం ఒక రూపాయి ఇస్తుండేవారు. మాధవ్ బాబాకు ఏవో చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు.

ఇలా గడుస్తుండగా ఒకరోజు కాశీబాయి మసీదుకొచ్చి బాబాతో, "బాబా! మీరు అందరికీ రోజూ రూ. 50, 30, 15 వంతున డబ్బు ఇస్తుంటారు. మీకు చిన్న చిన్న పనులు చేసే మాధవ్‌కు మాత్రం ఒక్క రూపాయే ఇస్తారెందుకని?" అడిగింది. బాబా, "కాశీబాయీ, నీ కొడుక్కి తక్కువ ఇస్తున్నానని నాకు తెలుసు. కానీ కొంతకాలం తరువాత తక్కిన వారికి మానివేసినా, నీ కొడుక్కి మాత్రం ఇవ్వడం మానను. నీలాంటి ఆధారంలేని వారందరికీ నేనే దిక్కు, నేనే యజమానిని!" అన్నారు. కాశీబాయికి బాబా మాటలు అర్థం కాలేదు. "నా యజమాని నా భర్త కదా? ఆయనెప్పుడో చనిపోయాడు!" అని అంది. దీనితో బాబా కోపించి పెద్దగా అరవడం ప్రారంభించారు. కాశీబాయి భయపడి మసీదు నుండి పారిపోయింది. ఆ తర్వాత మసీదుకి రావడం మానుకుంది. రెండు మూడు రోజుల తర్వాత కాశీబాయిని బాబా పిలవనంపారు. ఆమె మాధవ్‌ను తీసుకొని మసీదుకు వచ్చింది. బాబాతో మాట్లాడటానికి భయపడి మౌనంగా నిలబడింది. బాబా ఆమెను ప్రేమగా పలకరించారు. బాబాకు కొంతకాలంగా పన్ను ఒకటి కదులుతూ ఉండేది. బాబా ఆ పంటిని తీసి ఒక గుడ్డముక్కలో ఉంచి దానిపై ఊదీ వేసి మూటకట్టి కాశీబాయికిచ్చి, "ఈ తాయెత్తు నీదగ్గర ఉంచుకో, నీకు మంచి జరుగుతుంది!" అని చెప్పారు. కాశీబాయి సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది.

మాధవ్ పెరిగి పెద్దవాడయ్యాడు. బాబా తాయెత్తు వారింటికి వచ్చినప్పటి నుండి బాగా కలిసివచ్చి వారికి ఏలోటూ లేకుండా పోయింది. మాధవ్‌ను అందరూ మాధవరావ్ అని పిలవసాగారు. మాధవరావు తాయెత్తు తన చేతికి కట్టుకొని పవిత్రంగా చూసుకునేవాడు. కాశీబాయి చనిపోయిన తర్వాత నీఫాడ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఒకసారి మాధవరావు తీవ్ర అనారోగ్యానికి గురయినప్పుడు బాబా కలలో కనిపించి, "ఈరోజు మీ ఇంటికి వచ్చే నికమ్ అనువానికి నీ చేతికి కట్టుకున్న తాయెత్తును ఇవ్వు!" అని ఆదేశించారు. నికమ్‌కు కూడా బాబా కలలో కనిపించి, "మాధవరావు దగ్గరనున్న తాయెత్తు తీసుకో"మని చెప్పారు. నికమ్ మాధవరావు ఇంటికొచ్చి తాయెత్తు తీసుకున్నాడు. ఆ తాయెత్తు అతని దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత అది శివాజీనగర్ మందిరానికి చేరింది. ఈ విధంగా బాబా పవిత్ర దంతం కాశీబాయి నుండి ఆమె కొడుకు మాధవరావుకు, మాధవరావు నుండి నికమ్‌కు, నికమ్ నుండి శివాజీనగర్ మందిరానికి వచ్చింది. అంటే తిరిగి తిరిగి అది బాబా చెంతకే వచ్చిందన్నమాట. మందిర నిర్వాహకులు ఆ పవిత్రదంతాన్ని బాబా విగ్రహం ముందున్న పాదుకల క్రింద భద్రపరిచారు. బాబా శరీరంలోని ఒక భాగమైన ఆ దంతం ఈ మందిరంలో ఉండటం వలన సాయిభక్తులకిది బాబా ప్రత్యక్ష సన్నిధితో సమానం.

ఈ మందిరాన్ని సందర్శించే వారిలో, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వారి ఆశీర్వాదాలు పొందిన  భక్తుడు 'శ్రీ నానాసాహెబ్ అవస్థే' ఒకరు. 1950లో ఈ మందిర అభివృద్ధి కోసం 'శ్రీ సాయిదాస మండలి' అను సంస్థ స్థాపించబడింది. మండలి సభ్యులు మందిరానికి మరమ్మతులు చేసి, మందిరం ముందు ఒక  800 చదరపు అడుగుల విశాలమైన హాలు నిర్మించారు. ఇక్కడ గురుపూర్ణిమ, శ్రీరామనవమి, బాబా పుణ్యతిథి(విజయదశమి) పండుగలు వైభవంగా జరుగుతాయి.

*వరదాయి సాయిని, వరదనీరంటునా?*

ఇక్కడ ఈ మందిరానికి సంబంధించిన అద్భుతమైన లీల ఒకటి అవశ్యం చెప్పి తీరాలి. తేదీ12.07.1961న పాన్షర్ డాము క్రుంగి దానిలోని నీరు వెలుపలకు ప్రవహించి పూనా నగరాన్ని ముంచివేసింది. అక్కడున్న ఇళ్ళు చాలావరకు కూలిపోయి అపార నష్టం సంభవించింది. శ్రీ సాయి మందిరమున్న శివాజీనగర్ లోతట్టు ప్రాంతమైనందున మందిర గోపురం పైన 20, 25 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచింది. తరువాత కొన్నిరోజులకు వరద వెనకకు తీసిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. సాయిమందిరం మొత్తం మట్టిలో కూరుకొని పోయింది. ఈ మట్టిని తొలగించి మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చే కార్యక్రమం అతి వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అయినా మండలి సభ్యులు, సాయిభక్తులు అమితోత్సాహంతో పనిచేసి నాలుగైదు రోజులలో పని పూర్తిచేశారు. అప్పుడు వారికి అగుపడిన దృశ్యం అద్భుతం!! "నిత్య పూజలందుకుంటున్న బాబా రంగుల చిత్రపటం చెక్కుచెదరక, పూర్వంవలే జీవకళ ఉట్టిపడుతోంది". ఈ పటం ఎన్నోరోజులు వరద నీటిలో మునిగి ఉన్నదంటే ఎవరూ నమ్మలేరు. మందిరం ప్రక్కనున్న ఔదుంబర వృక్షం కూడా కళకళలాడుతూ కనిపించింది. అది కనీసం ప్రక్కకు కూడా ఒరగలేదు. ఈ అద్భుతలీలతో బాబా సంపూర్ణ అనుగ్రహం ఈ మందిరంపై ఉన్నదని అందరూ విశ్వసించారు. తర్వాత మండలి సభ్యులు అందమైన బాబా పాలరాతి విగ్రహాన్ని తయారుచేయించి మందిరంలో ప్రతిష్ఠింపచేశారు. వరదకు తట్టుకొని నిలిచిన బాబా రంగులపటం కూడా నిత్యపూజలు అందుకుంటున్నది.

Source: సాయిపథం మ్యాగజైన్

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

రఖుమా బాయి ఈమె హేమద్‌పాంత్ గారి భార్యా....., సాంప్రదాయ బ్రాహ్మణ మహిళ

*హేమాడ్ పంత్ గారు మన అందరికి తెలుసు వారి భార్యా  అయిన శ్రీమతి రఖుమా బాయి గారిని కూడా ఒక్క సారి చూడండి*,

 రఖుమా బాయి ఈమె హేమద్‌పాంత్ గారి భార్యా....., సాంప్రదాయ బ్రాహ్మణ మహిళ, శ్రీ సాయి సచ్చారితలో 40వ అధ్యాయంలో ఈమె హేమద్‌పాంత్ గారిచే ప్రస్తావించబడింది.  పరిచయ భాగంలో కూడా ఆమె గురించి క్లుప్తంగా ప్రస్తావన ఉంటుంది.
 ఈమెకు 5 కుమార్తెలు, ఒక కుమారుడు డాక్టర్ గజనన్ ను పిల్లలను ఈవిడి చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమతో చూసుకునేవారు.ఆమె మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు హేమద్ పంత్ తో కలిసి ప్రయాణించారు.ప్రతి సాయి భక్తుడు హేమద్‌పంత్ ఇంటిని సందర్శించమని ఒక్కసారి అయిన సందర్శించాలని భక్తలను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. నిజానికి అది ఇల్లు కాదు, ప్రతి సాయి భక్తకు ఒక గొప్ప మ్యూజియం.  హేమద్‌పంత్ యొక్క ప్రస్తుత వారసులు సందర్శకులను దయతో ఆహ్వానిస్తున్నారు. హేమద్‌పాంత్ గారికి సంబంధించిన వారు వాడినా కొన్ని వస్తువులు కళ్ళజోళ్ళు, తలపాగా (టోపీ),  శ్రీ సాయి సత్చరిత్ర  40 & 41వ అధ్యయలలో చదువుకున్న మెట్ల, శ్రీ సాయిబాబా వారి నిజమైన  అసలు ఫోటోలు మరియు, హేమాడ్ పంత్ గారు  స్వయంగా వ్రాసిన శ్రీ సాయి సత్చరిత్ర పోతి (పుస్తకం లేదా పవిత్ర గ్రంథం), అష్టవినాయకుల ఫోటోను అక్కడ మనం దర్శించ వచ్చు.

వినాయక అప్పాజీ వైద్య

వినాయక అప్పాజీ వైద్య

సాయి మహాభక్తుడు. వినాయక అప్పాజీ వైద్య కాయస్థ ప్రభు కులమునకు చెందినవాడు. అతను బొంబాయి, అంధేరీ, వర్సోవ రోడ్డులో ఉన్న పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసులో గుమస్తాగా పని చేసేవాడు.

దాసగాణు మహారాజ్ సంకీర్తనలు వినడం ద్వారా వినాయక్ కి శిరిడి వెళ్లి బాబాని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. అతను 1912వ సంవత్సరం ఈస్టర్ పండుగ సమయంలో మొదటిసారిగా శిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆతరువాత అతను బాబా మహాసమాధి అనంతరం 1923వ సంవత్సరం నుండి తరుచు శిరిడీ వెళ్తూ ఉండేవాడు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలకు తప్పకుండా శిరిడీ వెళ్తుండేవాడు.

1923వ సంవత్సరంలో బాబా అతని భార్యకు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ  భర్తకి వ్యతిరేకంగా ఒక కోర్టు కేసు రాబోతుంది, ఆ విషయంలో ఆందోళన పడకుండా దైర్యంగా ఉండమని వినాయక్ కి చెప్పు” అని చెప్పారు. బాబా చెప్పినట్టుగానే కొద్ది రోజుల్లోనే వినాయక్ కి వ్యతిరేకంగా ఒక కేసు పెట్టబడింది. కానీ బాబా దయతో వినాయక్ కి అనుకూలంగానే తీర్పు వెల్లడయ్యంది.

1926వ సంవత్సరంలో వినాయక్ తమ్ముడి 3 సంవత్సరాల కూతురు తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధ పడుతున్నది. వైద్యులు చేసే చికిత్సకు ఏమాత్రం జ్వరం తగ్గడం లేదు. జ్వరం సుమారు 105 డీగ్రీలుకు తగ్గకుండా వుంటూ ఉండింది. అందువలన అందరూ ఆ అమ్మాయి బ్రతకడం కష్టమని అనుకున్నారు. వినాయక్ ఆ అమ్మాయికి బాబా ఊదీ ఇచ్చాడు. దాని ప్రభావంతో 3-4 రోజులలోనే తను పూర్తిగా కోలుకుంది.

1927వ సంవత్సరంలో వినాయక్ భార్య క్షయ వ్యాధితో బాధపడింది. 8 నెలలుగా చికిత్స చేస్తున్నా తన ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలేమి కనపడలేదు. క్షయవ్యాధి తోపాటు జ్వరం కూడా ఆమెని బాధపెడుతూ ఉండేది. వినాయక్ తన భార్యని శిరిడీకి తీసుకొని వెళ్ళగా ఆమె జ్వరం 4 రోజులలోనే  పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే వారు అంధేరీలో వారి ఇంటికి తిరిగి వచ్చేసారు. కాని 10 రోజుల తరువాత వినాయక్ భార్యకి మళ్ళీ వ్యాధి తిరగబెట్టింది. వినాయక్ తన భార్య ఆరోగ్య విషయంలో ఇంక ఆశ వదులుకొని ఆమెని వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్ళాలని అనుకున్నాడు. ఇంతలో బాబా అతని భార్యకి స్వప్న దర్శనమిచ్చి “త్వరలోనే కోలుకుంటావ”ని చెప్పారు. ఇది జరిగిన 15 రోజుల్లోనే ఆమెకు జ్వరం తగ్గి, నిదానంగా  ఆరోగ్యం మెరుగుపడుతూ కొద్దిరోజులలోనే పూర్తిగా కోలుకుంది. తరువాత ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.

జూన్ నెలలో ఒక గురువారం రోజున బాబా వినాయక్ భార్య ముందు ప్రత్యక్షమై తనకి ఒక పట్క(తలకి చుట్టుకునే వస్త్రం) కావాలని అడిగారు. అది తన దగ్గర లేనందున ఆమె బాబాకి కొద్దిగా బియ్యం, పప్పు దినుసులు సమర్పించుకుంది. బాబా ఆమె ఇచ్చిన భిక్ష స్వీకరించి అదృశ్యమైపోయారు. నిజానికి ఆమె బాబాని ఎప్పుడూ చూడలేదు. ఆమె తన భర్తకి ఆ వివరాలు చెప్పగా, ఆమె చెప్పిన పోలికలను బట్టి బాబాయే స్వయంగా వచ్చారని నిర్ధారణకి వచ్చాడు వినాయక్.

బాబా ఎల్లప్పుడూ తన వెనకాలే వుంటూ తనని అన్ని విధాలుగా రక్షిస్తున్నారని వినాయక్ గట్టిగా నమ్మేవాడు. ఎప్పుడే కష్టం వచ్చినా బాబా సహకారంతో అతను వాటినుండి బయటపడేవాడు.

1933వ సంవత్సరంలో వినాయక్ శిరిడీలో 20 రోజులు వునాడు. అప్పడు తరచూ స్వప్నంలో బాబా అతనికి దర్శనమిస్తూ వుండేవారు. అతను ఉదీ మహిమల అనుభవం కూడా పొందాడు. అదే సంవత్సరంలో ఒకసారి బాబా వినాయక్ కి స్వప్నంలో కనిపించారు. ఆ స్వప్నంలో బాబాకి ఒక రూపాయి దక్షిణగా వినాయక్ సమర్పించుకున్నాడు. బాబా దానిని వినాయక్ కి తిరిగి ఇచ్చేస్తూ “ఎంత కావాలి అంటే అంత తీసుకో” అని అన్నారు. మరుసటి నెలలోనే వినాయక్ అనుకోకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందాడు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

స్వామి సాయిచరణ్ ఆనంద్

*"దేవుడు వున్నాడు..లేడు అని అనకు*''

గుజరాత్ లో 1889వ సంవత్సరంలో జన్మించిన స్వామి సాయిచరణ్ మొట్ట
మొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి 1911లో బాబాను దర్శించు కున్నారు. ఒక కుండ చేత్తో పట్టుకుని కుష్ఠురోగులకు సపర్యలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్య పోయిన ఆనంద్ తండ్రి ఆజ్ఞతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా ఆనంద్ తో ఇలా అన్నారు ...

"దేవుడు వున్నాడు ... లేడు అని అనకు''. అటు తరువాత 1912 జులై గురు పూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి *నువ్వంటే నాకు చాలా ఇష్టం* అని చెప్పారు. అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా భక్తుల దగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలా సార్లు గమనించాడు. 

ఆ పరిశీలన, బాబా సాహచర్యంలో ఆనంద్, బాబా జీవితంలో అద్భుతాలు, ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని, తాను బాబాకు సన్నిహితంగా వుంటూ పరిశీలించినప్పటి విషయాలను పేర్కొంటూ మరొకపుస్తకాన్ని రచించాడు. బాబా మహాసమాధి అయిన తరువాత సాయి సంస్థానంలోని కార్యకలాపాల్లో ఆనంద్ చురుగ్గా పాల్గొనేవారు. 

1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ ఆనంద్ చేతుల మీదనే జరిగింది. ఆనంద్ 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయిచరణ్ ఆనంద్ జీగా మారి అందరి మన్ననలు పొందారు.

Source :- Shirdi Sai Blessings.

బాబా వాక్కూ భగవంతుని వాక్కే.

ఇమాంభాయి చోటేఖాస్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్షా అను ఫకీరును ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి, ఆయన గొప్ప 'ఔలియా' (సిదుడు) అని తెల్పే మార్గం చెప్పాడు.


చాటుగా బాబా వెనుకకు జరిగి, మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దనీ చెప్పాడు. ఇమాంభాయి శిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిలోని ఒక భక్తురాలి మొర వింటున్నారు. అతడు దర్వేష్షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, "ఎవరు నీవు? నా తండ్రివైనటు ఏదో అడగడానికి వచ్చావే" అని అరచి, అతనిని తిడుతూనే మసీదు చేరారు. రెండు రోజులవరకు అతనిని మసీదులోనికి రానీయలేదు. ‘బాబా, అతడూ మీ బిడ్డడే కదా కోపమెందుకు?' అన్నాడు కాకాసాహెబ్ "వాడు నా బిడ్డంటావా? వాడు ఒక టీచరును కొట్టాడు!" అన్నారు బాబా, నిజమే! అతడు పోలీసు, ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్ళంతా రక్తంకారి, స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంభాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదలి పారిపోవాలని సాటివారు చెబితే, అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, "భయపడకు, భగవంతుడే యజమాని!" అని ఆశీర్వదించారు అతడికెట్టి శిక్షా పడలేదు.

తర్వాత ఒకసారి అతడు యింటికి వెళ్ళడానికి సాయి సెలవు యివ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన, "వెళ్ళవద్దు. వెళితే గాలివాన, పిడుగులు, నిప్పుకణాలు ఎదురవుతాయి" అన్నారు. అయినా అతడు బయల్దేరి సాయంత్రానికి సురళానది ఒడ్డుకు చేర్రి, కొద్దిదూరం వెళ్ళేసరికి బాగా మబ్బుపట్టి, గాలివాన ప్రారంభమైంది.

దారిలో ఒకచోట మట్టిచెట్టుమీద పిడుగు పడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపునుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు ఆ దైర్యం తో అతడు నది దాటాడు ఆవతలి వడ్డు చేరే దాకా నీళ్ళు మోకళ్ళ లోతు ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గట్లనిండుగా ప్రవహిస్తున్నది బాబా వాక్కూ భగవంతుని వాక్కే.

"సాయి భక్తాగ్రేసరుడు శ్రీ ధుమాల్*"

"సాయి భక్తాగ్రేసరుడు శ్రీ ధుమాల్*"

సాయి భక్తులలో ముఖ్యుడైన నాసిక్ వాసి శ్రీ సఖారాం బల్వంత్ ధుమాల్ వృత్తిరీత్యా న్యాయవాది. మహ రాష్ట్రలో ప్రభుత్వ శాఖలలో అతనికి మంచి పలుకు బడి వుండేది. బూజు పట్టిన దురాచారాలను ఖండిస్తూ ఒక కొత్తసమాజాన్ని అభ్యుదయ వాదు లందరం కలిసి నిర్మించాలని పిలుపు నిస్తుండేవాడు.1917వ సంవత్స రం నుండి 1925 వరకు నాసిక్ జిల్లా ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు చైర్మన్ గా పనిచేసిన తొలి ప్రభుత్వే తర ఉద్యోగి ఆయన. 

ఈ పదవి వలన లాయర్ గా తన స్వంత ప్రాక్టీసుకు తగినంత సమయం కేటాయించలేక పోయేవాడు ధుమాల్. అబివృద్ధి బోర్డు చైర్మన్ గా రాత్రింబవళ్లూ కృషి చేసి ప్రభుత్వంతో పోరాడి, నిధులను తీసుకు వచ్చి నాసిక్ జిల్లా అభివృద్ధికి ముఖ్య కారకుడయ్యా డు. ప్రభుత్వం అతని సల్పిన కృషికి  గుర్తింపుగా రావు బహద్దూర్ అనే బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది. 1925వ సంవత్సరం తర్వాత తన పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి తిరిగి తన ప్రైవేట్ ప్రాక్టీస్ ను పున: ప్రారంభించాడు ధుమాల్. 

బాబా దయవలన అతని ప్రాక్టీస్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లి సిరి సంపదలతో పాటు ఎనలేని ఖ్యాతిని ధుమాల్ ఆర్జించాడు. ధుమాల్ మిక్కిలి ఆచారవంతుడు, చిన్నప్పటి నుండి అతని కుటుంబం యావత్తూ షేగాం లోని యోగిశ్రేష్టుడు శ్రీ గజానన్ మహారాజుకు భక్తులు. 1907 వ సంవత్సరంలో మిత్రుల ప్రోధ్భలం మీద శిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాడు. తొలి దర్శనంతోనే శ్రీ బాబా అంటే తీవ్రమైన అభిమానం పెంచుకున్నాడు.  

శ్రీసాయికి తొలిసారిగా సాష్టాంగనమస్కారం చేయగా రెండు రూపాయలు దక్షిణ అడిగారు. ధుమాల్ వెంటనే ఇవ్వగా శ్రీసాయి వాటిని ఆశీర్వదించి ధుమాల్ కు తిరిగి ఇచ్చేసి “వీటిని భద్రపరచుకో. నీకు జీవితంలో ఏలోటు వుండదు” అని అన్నారు. ధుమాల్ నాగ్ పూర్ లో నివసించే బాపుసాహెబ్ బూటీకి అత్యంత సన్నిహితుడు. ఒకసారి ధుమాల్ బూటీని సాయి దర్శనానికి  తీసుకు వెళ్ళాడు. ధుమాల్ వలె బూటీ కూడా సాయి పట్ల ఆకర్షితుడై జీవితాంతం ఆయనకు మహా భక్తుడైనాడు.

ఒక సందర్భంలో ధుమాల్ శ్రీసాయిని దర్శించుకోగానే, శ్రీసాయి “భావూ ! నేను నిన్ను ప్రతిక్షణం కనిపెట్టుకొని వుంటాను. నేనలా చేయకపోతే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?” అని అన్నారు. మరొక సారి "భావూ ! నిన్న రాత్రంతా నాకు నిద్రలేదు, నీ గురించే ఆలోచిస్తూ గడిపాను. నీ సర్వ బాధ్యతలు నావే" అని అన్నారు. ఆమాటలకు ధుమాల్ చలించి పోయి కన్నీళ్ళతో శ్రీ సాయి పాదాలకు అభిషేకం చేసాడు. కన్నతల్లి కంటె మిన్నగా తన భక్తులను ప్రతీక్షణం కాపాడే శ్రీ సాయి యొక్క అపూర్వమైన ప్రేమ, అనురాగం, వాత్సల్యాలకు ముదమొందాడు. 

బాబాకు సర్వశ్య శరణాగతి ఒనరిస్తే చాలు, ఇక జీవితంలో దేనికీ ఆలోచించనవసరం లేదు. కూడు గుడ్డల దగ్గర నుండి  రక్షణ వరకు అంతా శ్రీ సాయియే చూసుకుంటారు.1909వ సంవత్సరంలో ధుమాల్ భార్య ఒకవిచిత్రమైన వ్యాధి బారినపడి హఠాత్తుగా మరణించింది. అప్పటికి ధుమాల్ వయసు కేవలం 36 సంవత్సరాలు. అతనిని తిరిగి వివాహం చేసుకోమని అతని స్నేహితులు బలవంత పెట్టగా ధుమాల్ సాయి అనుమతిస్తేనే జరుగుతుందన్నాడు. 

ధుమాల్ మిత్రుడైన సాయిభక్తుడు బాపూ సాహెబ్ కింకేఢే ధుమాల్ ను తీసుకొని శిరిడీ వెళ్ళి ధుమాల్ రెండవ వివాహ విషయమై అడగగా బాబా అనుమతి ఇవ్వలేదు. సమర్ధ సద్గురువైన శ్రీ సాయి మాటలపై కొండంత విశ్వాసముంచి ధుమాల్ చివరి వరకు వివాహం చేసుకోలేదు. భార్య మరణం నుండి తేరుకున్నాక ధుమాల్ బారిస్టర్ పట్టా కోసం ఇంగ్లండు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బూటీ కూడా అతని ఉన్నత చదువులకు చేతనైనంత సహాయం చేస్తానన్నాడు. బాబా అనుమతి అడుగగా నీ గమ్యం ఇక్కడేనని ధుమాల్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నివ్వలేదు. 

బాబా ఆజ్ఞను మరొకసారి ధుమాల్ శిరసా వహించాడు. ఒకసారి శ్రీసాయి  దర్శనం తర్వాత వెళ్ళిపోతున్న ధుమాల్ ను రాధా కృష్ణ ఆయి పిలిచి శ్రీసాయి యొక్క అధ్భుతమైన తైలవర్ణ పటాన్ని కానుకగా ఇచ్చింది. దానిని తీసుకు వెళ్ళి శ్రీసాయి ఆశీర్వాదం కోసం ఆయన పాదాల వద్ద వుంచగా శ్రీ సాయి దానిని నఖశిఖ పర్యంతరం గమనించి ఆశీర్వదించి ధుమాల్ కు తిరిగి ఇచ్చేసారు. శ్రీసాయి  చేతుల మీదుగా ఆయన యొక్క చిత్రపటాన్ని పొందాలన్న ధుమాల్ యొక్క చిరకాలపు ఆకాంక్ష ఆవిధంగా తీరింది. 

దానిని చూసినప్పుడల్లా ధుమాల్ కు శ్రీ సాయి తనతో “నేను రేయింబవళ్ళూ నీ గురించే ఆలోచిస్తాను, నీ సర్వ బాధ్యతలూ నావే ” అన్న మాటలు గుర్తొచ్చి ఆనంద బాష్పాలు రాలేవి. శ్రీసాయి కృపవలన ధుమాల్ యొక్క న్యాయవాది ప్రాక్టీస్ చాలా బాగా సాగింది. అపజయమే లేని న్యాయవాదిగా ధుమాల్ గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు. 1930 నుండి 1932వరకు దేవాస్ సంస్థానానికి ట్రస్టీగా వ్యవహరించాడు. ఆ సమయంలో దేవస్ నుండి నాసిక్ కు తరచుగా ప్రయణం చేసేవాడు. 

ప్రయాణంలో తనతో పాటు పైన లభించిన శ్రీ సాయి చిత్రపటాన్ని విధిగా తీసుకెళ్ళేవాడు. అతని మేనల్లుడు, వంటవాళ్ళకు ముస్లిం ఫకీరైన సాయి చిత్రపటం తీసుకెళ్ళడం ఇష్టం వుండేది కాదు. ఒకసారి బాబా చిత్రపటం ముందు చీట్లువెయ్యగా ఆ చిత్ర పటాన్ని నీతోనే వుంచుకో అన్న సందేశం వచ్చింది. అడపాదడపా సారి ఇచ్చిన దక్షిణ అరవై ఏడు రూపాయలు అయ్యింది.1918వ సంవత్సరంలో ధుమాల్ శిరిడీ వెళ్ళినప్పుడు  వెంటనే శ్రీసాయి ఆ డబ్బు తిరిగి తీసేసుకొని ఇంకొక ఏడు రూపాయలను అడిగారు. 

“నా వద్ద ఇంక డబ్బు లేదు బాబా" అని ధుమాల్ మొర పెట్టుకోగా “ఎవరి వద్ద నుండైనా అప్పు తీసుకొని రా” అని శ్రీసాయి సలహా ఇచ్చారు. డబ్బుపై మమకారం కూడదని శ్రీ సాయి ఈ విధంగా తెలియ జేసారు. శ్రీసాయి సమాధికి ముందు ధుమాల్ కు పూణేలో వున్న అతని వదినగారికి తీవ్రంగా జబ్బు చేసినట్లు టెలిగ్రాం వచ్చింది. వెంటనే ఎనభై రూపాయలు తీసుకొని హుటాహుటిగా బయలుదేరి మధ్యమార్గం లో శిరిడీలో దిగి తన వదిన గారికి స్వస్థత చేకూరాలని ప్రార్ధించాడు. బాబా ధుమాల్ దగ్గర వున్న డబ్బంతా తీసేసుకొని అతననిని పూణే వెళ్ల నివ్వలేదు.

రెండు రోజులలోనే అతని వదినగారు మరణించినట్లు అతనికి టెలిగ్రాం వచ్చింది.ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే శ్రీసాయి నాధులు మహాసమాధి చెందారు. ధుమాల్ వదినగారు మరణిస్తారన్న సంగతి శ్రీసాయికి ముందుగానే తెలుసు. అయినా తాను శరీరంతో వున్న ఆ ఆఖరు రోజులలో తనకు ప్రియ భక్తుడైన ధుమాల్ తన వద్దే వుండాలన్న ఆకాంక్షతో అతనిని పూణే వెళ్ళనివ్వలేదు.

శ్రీ సాయి మహా నిర్యాణం అనంతరం శ్రీ శిరిడీ సాయి సంస్థాననికి ట్రస్టీగా ధుమాల్ నియమించ బడ్డాడు. తన అనుభవం, న్యాయశాస్త్రంలో ప్రావీణ్యతలతో శిరిడీ సంస్థానం ఒక గాడిలో పడడానికి విశేషమైన కృషి సలిపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు శ్రీ సఖరాం బల్వంత్ ధుమాల్. తన ఆఖరుశ్వాస వరకు సాయి సేవలోనే గడపాలన్న ఆకాంక్షతో జీవితం గడిపిన శ్రీ ధుమాల్ జూన్ 20, 1940 (శనివారం) నాడు పరమ పదించారు.