అత్యధ్భుతమైన సాయి లీలను గురించి, ఆయన వాక్కుకు, ఊదీకి ఎంతటి శక్తి ఉందో తెలియచేసె లీల.ఇది షిర్డీ సాయిసేవా ట్రస్ట్.ఆర్గ్ నుండి సంగ్రహింప బడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు.
సాయిబాబా వాక్కుకు అనంతమయిన శక్తి.
సాయిబాబా యొక్క స్వబావాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్న వారెవరూ ఆయన మీద తమకు ఉన్న భక్తిని అంత సులభంగా వదులుకోలేరు. వారి హృదయంలోను, నాలుక మీద ఆయన నామం తరచూ జపించబడుతూనే ఉంటుంది. ఆవిధంగా చేయడం వల్ల వారికి ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కోగలిగే శక్తి లభిస్తుంది. పైన యివ్వ బడిన శీర్షికకు సంబంధించి సాయిబాబా వారి వాక్కులోను ఆయన ఉదీలోను ఎంతటి శక్తి దాగి ఉందో తెలియ చేసే సంఘటనలను గురించి ఇపుడు తెలుసుకుందాము.
ద్వారకామాయి మసీదులో నిరంతరం మండుతూ ఉండే బాబా వెలిగించిన ధుని నుంచి లభిస్తున్నదే పవిత్రమయిన ఊదీ.
భక్తులందరూ ఆయనను దర్శించుకుని ఆయన పవిత్ర పాదాలకు ప్రణమిల్లేవారు. బాబా, వారందరికీ తన ప్రసాదంగా ఊదీని పంచుతూ ఉండేవారు. ఆయన షిరిడీ గ్రామంలో నివసించిన మొదటి రోజులలో గొప్ప వైద్యునిగా పేరు పొందారు.
ఆయన మహాసమాధి చెంది ఇన్ని సంవత్సరాలు గడిచినా గాని. ఆయన పవిత్రమయిన ఊదీ నిరంతరం ఎన్నో నయం కాని రోగాలను నయం చేస్తూనే ఉంది.ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు నేను బాబావారి ఊదీ యొక్క ప్రాముఖ్యతను, బాబాకు తన భక్తుల యెడల ఎంతటి ప్రేమ ఉందో తెలియచేసే అధ్భుత లీలని మీ ముందుంచుతున్నాను.
శ్రీ బోర్కర్ గారు రైల్వే శాఖలో పని చేస్తూ ఉండేవారు. ఆయనకి పండరీపూర్ నుంచి నాసిక్, మన్మాడ్ ల మధ్య ఉన్న ఆశావలీ గ్రామానికి బదిలీ అయింది. బోర్కర్ గారి కుటుంబమంతా రైల్వే స్టేషన్ ప్రక్కనే రైల్వేవారి క్వార్టర్స్ లో ఉండేవారు. ఒకరోజు సాయంత్రం బోర్కర్ గారు ఆఫీసునుంచి యింటికి తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు తీవ్రమయిన జ్వరం వచ్చింది. ఆయన కళ్ళు ఎఱ్ఱగా అయి పోయాయి. విపరీతమయిన చలి కూడా తోడవడంతో 3 – 4 దుప్పటీలను కప్పుకుని పడుకున్నారు.
ఆశావలి చాలా చిన్న గ్రామం. వెంటనే వైద్యం చేయించడానికి కూడా ఆ గ్రామంలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. ఆయన భార్య చంద్రాబాయి బోర్కర్ గృహవైద్యం (చిట్కా వైద్యం) చేసింది. ఆవిడ యిచ్చిన మందుల ప్రభావంతో బోర్కర్ గారికి రాత్రి గాఢనిద్ర పట్టింది. కాని జ్వరం మాత్రం తగ్గలేదు.భర్తకి గాఢమయిన నిద్రపట్టడంతో చంద్రాబాయి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఆమెకు కూడా బాగా నిద్ర ముంచుకుని వస్తుండటంవల్ల భర్త పాదాల వద్ద తల ఆనించి పడుకుంది.
ఆ సమయంలో ఆమెకు స్వప్నంలో బాబా దర్శనమిచ్ఛి, “ సోదరీ, కంగారు పడకు. నీ భర్త శరీరానికి ఊదీని రాయి. ఆయనకు నయమవుతుంది. కాని రేపు ఉదయం 11 గంటలవరకు నీభర్తని బయటకు వెళ్ళ నివ్వకు.” అని చెప్పారు. చంద్రాబాయి వెంటనే లేచి భర్త శరీరాని కంతా ఊదీని రాసింది. వెంటనే ఆయనకు చెమటలు పట్టి జ్వరం తగ్గిపోయింది. ఉదయానికి జ్వరం తగ్గిపోయి హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారు.
ఈ రోజంతా బయటకి ఎక్కడికీ వెళ్ళకుండా యింటిలోనే విశ్రాంతితీసుకోమని చంద్రాబాయి భర్తతో చెప్పింది. కాని బోర్కర్ గారు భార్య చెప్పిన మాటలని లెక్కచేయకుండా ఉదయాన్నే ఫలహారం చేసి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు. బోర్కర్ గారు రైల్వే పట్టాల వెంబడే నడుస్తూ వెడుతూ ఉండటం డ్రాయింగురూములో కూర్చున్న చంద్రాబాయికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆవిడ దృష్టంతా తన భర్త మీదనే ఉంది.
తన భర్తని కాపాడమని సాయిబాబాను మనసులోనే ప్రార్ధించుకుంది. బోర్కర్ గారు రైలుపట్టాల వెంబడే నడుస్తూ ఉండగా మధ్యలో ఆయనకి రైల్వే ఉద్యోగి ఒకతను కలిసాడు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పు కుంటూ పట్టాల వెంబడే నడుస్తూ ఉన్నారు. ఇంతలో స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు వస్తూ ఉంది. బోర్కర్ గారు దానిని గమనించలేదు. ఆ రైలు వస్తున్న వేగానికి బోర్కర్ ప్రక్కన ఉన్న రైలు పట్టాల మీద విసురుగా పడ్డారు. ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది.
ఈ దృశ్యమంతా స్పష్టంగా చంద్రాబాయి బోర్కర్ కి కన్పించింది. ఆవిడ వెంటనే ‘సాయిబాబా’ అంటూ తెలివి తప్పి పడిపోయింది. బోర్కర్ గారిని స్పృహలేని స్థితిలో స్ట్రెచర్ మీద యింటికి తీసుకుని వచ్చారు. గ్రామంలో వైద్యుడెవరూ లేరు. చంద్రాబాయి యింటిలో ఉన్న మందులు, కొన్ని ఆయుర్వేద మూలికలలో ఊదీని కలిపి ముద్దగా చేసింది. ఆవిధంగా తను స్వయంగా చేసిన లేహ్యాన్ని భర్త కాలుకు పట్టించి కట్టు కట్టింది. ఆ తరువాత బోర్కర్ గారికి స్పృహ వచ్చింది.
స్పృహలోకి రాగానే, మన యింటిలో ఎవరయినా ఫకీరు ఉన్నారా అని అడిగారు. మీరు ఆయనను చూడగలుగుతూ ఉంటే కనక ఆయనే నేను భక్తితో కొలిచే సాయిబాబా. కాని ఆయన నాకు కనిపించటం లేదు అని చెప్పింది. మన్మాడ్ నుంచి ఒక వైద్యుడు వచ్చాడు. ఆ వైద్యుడు ముందురోజు రాత్రి చంద్రాబాయి కట్టిన కట్టును తీసేసి, బోర్కర్ గారి కాలుకు ప్లాస్టర్ వేసి కట్టు కట్టారు. వైద్యుడు కట్టిన కట్టువల్ల బోర్కర్ గారికి కాలు నెప్పి బాగా ఎక్కువయింది. రాత్రయేసరికి ఆనెప్పి రెండింతలయింది. విపరీతంగా కాలు సలపు పెట్టసాగింది.
రాత్రి సాయిబాబా ప్రత్యక్షమయ్యారు. చంద్రాబాయి వెంటనే లేచి సాయిబాబా పాదాలకు నమస్కారం చేసుకుంది. అపుడు సాయిబాబా “కాలుని తీసివేయిద్దామను కున్నావా ? వైద్యుడు వేసిన కట్టుని తీసేయి. గోధుమపిండి, కొబ్బరి, ఊదీ మూడింటిని కలిపి మిశ్రమం చేయి. ఆ మిశ్రమాన్ని నీ భర్త కాలుకు పూతగా పూయ్యి.” అన్నారు. చంద్రాబాయి బాబా చెప్పిన విధంగానే చేసింది. సాయిబాబావారి మాటలలోని అమోఘమయిన శక్తికి, ఊదీ ప్రభావానికి బోర్కర్ గారు కొద్దిరోజులలోనే ఆరోగ్యవంతు లయ్యారు. ఆయన అంత త్వరగా కోలుకోవడం వైద్యులనే ఆశ్చర్యపరిచింది.

No comments:
Post a Comment