ఇచ్చిన మాట తప్పని సాయి
బాబా వారి ప్రత్యేకత ఏమనగా తన భక్తుల మనస్సులలో ఎవైనా మంచి ఆలోచనలు కలిగినప్పుడు, తన కరుణా కటాక్షములతో ఆ ఆలోచనలు కార్య రూపము దాల్చునట్లు చేసేవారు. ఈ విధముగా భక్తుల సత్సంకల్పములు నెరవేరునట్లు చేసి వారిని సన్మార్గము వైపు నడుచునట్లు చేసేవారు.
సాయిబాబా సచ్చరిత్ర గ్రంధకర్త అయిన హేమాడ్పంత్ కు ఎల్లప్పుడూ బాబా తన ఇంటికి వచ్చి తన ఆతిధ్యము స్వీకరిస్తే బావుండుననిపించేది. ఏన్నొ సార్లు ఈ కోరికను బాబా ముందు వెల్లడి చేసాడు కాని ప్రతీ సారీ అతనికి బాబా నుండి ఒక చిరునవ్వే ఎదురయ్యేది.
🏵️ *1917 వ సంలో హోళీ పండుగ వేకువజాము నాడు* హేమడ్పంత్ కొక కల వచ్చింది. అందులో చక్కని దుస్తులను ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి ఈ రోజున నేను నీ ఇంటికి భోజనానికి వస్తున్నానని తెలిపారు. ఆనందాశ్చర్యములతో నిద్ర నుండి లేచి చూసేసరికి హేమడ్పంత్ కు బాబా గాని, ఆ సన్యాసి గాని కనిపించలేదు. వచ్చిన కలను బాగా జ్ఞపకము తెచ్చుకొని , బాబా ఇచ్చిన వాగ్దానమునకు సంతోషించి, వెంతనే తన భార్య వద్దకు పోయి ఈ రోజున బాబా మన ఇంటికి భోజనమునకు వస్తున్నారని కావున ఎక్కువ పిండి వంటలు చేయమని చెప్పాడు. అయితే భర్త మాటలను ఆ ఇల్లాలు నమ్మలేదు. శిరిడీ లో కొలువుండే దైవం శ్రీ సాయినాధులు ఎన్నడూ కూడా శిరిడీని విడిచి వెళ్ళలేదు.
కానీ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూవుండేవి. అటువంటి శ్రీ సాయి అసంఖ్యాకమైన తన భక్తులను విడిచి బాంద్రా లోని తమ ఇంటికి వచ్చునా అని ఆమెకు సంశయము కలిగింది.అందుకు హేమడ్పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చును కానీ తన ప్రతినిధిగా ఇంకెవరినైనా పంపవచ్చు కదా అందుకని కొంచెం ఎక్కువ వంటలు చేయడంలో తప్పేమీ లేదని ఆమెకు తెలియజేసాడు.
🌿 *మధ్యాహ్నం
భోజనమునకు అన్ని ప్రయత్నాలు జరిగాయి*.హోళీ పూజ ముగిసింది. విస్తళ్ళను వేసారు, ముగ్గులు పెట్టారు, భోజనమునకు రెండు పంక్తులు తీరాయి. రెండింటి మధ్య బాబా గారి కోసం ఒక ఆసనమును ఏర్పాటు చేసారు. హేమడ్పంత్ యొక్క కుటుంబ సభ్యులందరూ వచ్చి వారి వారి స్థానములలో కూర్చున్నారు. అందరిలోనూ ఒకటే అతృత. బాబా ఎప్పుడు వస్తారు ? తమ విందును స్వీకరించి తమలను ఆశీర్వదిస్తారు ?
🌻మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నశుద్ధి అయ్యింది. నెయ్యను వడ్డించిరి. శ్రీ కృష్ణునకు నైవేద్యం సమర్పించి భోజనం ప్రారంభించేంతలో మేడ మెట్లపై చప్పుడు వినిపించింది. అంతలోనే తలుపు చప్పుడు అయ్యింది. హేమడ్పంత్ వెళ్ళి తలుపు తీయగా గుమ్మంలో ఇద్దరు మనుష్యులు కనిపించారు. వారిరువురూ తమను ఆలీ మహ్మద్ మరియు మౌలానా ఇస్ము ముజావర్ గా పరిచయం చేసుకొని తమతో తెచ్చిన ఒక ఫొటోను హేమాడ్పంత్ కు అందించారు. అందులో చిరునవ్వులొలికిస్తూ ఆభయ హస్తం అందిస్తున్న శ్రీ సాయినాదుని ఫొటొ వుంది. దానిని చూడగానే హేమాడ్పంత్ కు ఆనందంతో కళ్ళు వర్షించాయి. గొంతుకు పూడిపోయినట్లనిపించింది.
తన మాటను నిలబెట్టుకొని, సరిగ్గా భోజన సమయంలో తన ఆతిధ్యం స్వీకరించేందుకు తన వద్దకు వచ్చిన బాబా వారి భక్త పరాయణతత్వానికి మైమరిచిపోయాడు.
🌺 *హేమాడ్పంత్ యొక్క అలౌకిక ఆనంద స్థితిని చూసి ఆశ్చర్యపోయిన వారు* ఇరువురూ “ అయ్యా ! భోజనం మధ్యలో మిమ్మల్ని లేపినందుకు క్షంతవ్యులం. ఈ వస్తువు నీకు సంభందించినది కావున నీకు ఇచ్చేందుకు మేము వచ్చాము. తరువాత తీరుబడిగా ఈ పటమును యొక్క వృత్తాంతమును తమకు తెలియబరెచదము” అని ఆ ఫొటోను హేమాడ్పంత్ కు అందించి వారు వెళ్ళిపోయారు. ఆ పటమును బాబా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై వుంచి, హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి , ఆ తరువాత తన కుటుంబ సభులతో కలిసి హేమాడ్పంత్ ఎంతో సంతృప్తిగా భోజనం చేసాడు.
*బాబా వారు ఎన్నటికీ తన భక్తుల కిచ్చిన వాగ్దానం తప్పరని, భక్తులకోసం తమ ప్రాణాలనైనా ఇచ్చుటకు సందేహించరని అందరూ ఈ అద్భుతమైన లీల వలన తెలుసుకున్నారు*.
🌹 *మనం కూడా అపురూపమైన ఈ జన్మలో* ఈ విశ్వానికే గురువు అయిన శ్రీ సాయినాధుని భక్తులం అయ్యినందుకు ఎంతో సంతోషించి , మనకు కలిగిన ఈ అపురూపమైన భాగ్యానికి ఆ భగవంతునికి సహస్ర కోటి కృతజ్ఞతాభివందనములను అర్పించి ఎల్లవేళలా మన గురుదేవులను సేవిస్తూ ఆయన యొక్క అపూర్వమైన, అత్యద్భుతమైన కరుణా కటాక్షములకు పాత్రులమౌదాము.
*ఓం శ్రీ సాయి నాథాయ చరణం శరణం*

No comments:
Post a Comment