Tuesday, June 16, 2020

వినాయక్ సీతారాం ముల్కెర్కర్

వినాయక్ సీతారాం ముల్కెర్కర్ 

సాయిభక్తులకు ఈరోజు బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన బాబా లీలను అందిస్తున్నాను. ఈ లీల 'సాయిలీల' పత్రిక నవంబరు - డిసెంబరు 2007వ సంవత్సరములో ప్రచురితమయినది. వినాయక్ సీతారాం ముల్కెర్కర్ గారు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.

బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకు నేను ప్యాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెళ్తుంటాను. బాంద్రాలోని నా స్నేహితులలో చాలామంది శిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. శిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ ప్రసాదం', ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నా నుదిటి మీద ఊదీ రాస్తూ ఉండేవారు. నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నా ఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని. బాబా నుంచి పిలుపు వస్తే తప్ప నేను శిరిడీ వెళ్లదలచుకోలేదు. ఈవిధంగా చాలారోజులు గడిచాయి. అనేకమంది భక్తులు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని వర్ణించ శక్యంకాని ఆయన లీలలను చెప్పసాగారు. తత్ఫలితంగా ముంబై, బాంద్రా, వాషీ, విరార్, ఆగాషి, దహను, ఉంబర్గావ్ నుంచి కూడా ప్రజలు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడం ప్రారంభించారు. కాని నేను మాత్రం బాబా ప్రేరణ ఇస్తే తప్ప శిరిడీ వెళ్ళకూడదనే నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.

ఇలా కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు నా పనులన్నీ పూర్తయిన తరువాత నిద్రకు ఉపక్రమించాను. మరుసటిరోజు గురువారం. ఆరోజు వేకువఝామున నాకొక చెప్పనలవికాని దివ్యదర్శనం కలిగింది. బాబాను దర్శించుకోవాలనే భావం కలిగి నిద్ర నుండి మేలుకొన్నాను. ఉదయాన్నే టీ త్రాగి 8గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాల మీద బాస్ సంతకాలు తీసుకొన్నాను. తరువాత నేనాయనని, శిరిడీ వెడుతున్నాననీ, సెలవు కావాలని అడిగాను. వెంటనే ఆయన అందుకు ఒప్పుకొని, "సరే! శిరిడీ వెళ్ళడానికి కాబట్టి నీకు 3,4 రోజులు సెలవు ఇస్తాను. నేను కూడా నాసిక్ లో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. మనిద్దరం ఒకే రైలులో వెళదాము" అన్నారు.

నేను 11 గంటలకల్లా ఇంటికి వచ్చి నా భార్యతో, "ఈరోజు బాబా నుంచి శిరిడీకి రమ్మనమని పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం రైలుకు బయలుదేరుతున్నాన"ని చెప్పాను. ఆమె వెంటనే ఒప్పుకొంది, కానీ కాస్త భయపడింది. కారణం శిరిడీ చాలా దూరం, పైగా అది కొత్త ప్రదేశం, తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. అందుచేత ఎవరినైనా తోడు తీసుకొని వెళితే మంచిదని, పైగా చలికాలమని చెప్పింది. తను చెప్పిన కారణాలన్నీ సరైనవే. అయినప్పటికీ శిరిడీ వెళ్ళాలనే నా కోరికముందు ఈ విషయాలేమీ నేను పెద్దగా పట్టించుకోలేదు. గురువారం ఉపవాసం ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, స్టేషనుకి బయలుదేరాను. ఉదయానికల్లా కోపర్గాఁవ్ చేరుకొన్నాను. రైలు దిగగానే శిరిడీ వెళ్ళడానికి టాంగా కోసం చూస్తూ ఉండగా నా చిన్ననాటి మిత్రుడు డా.ఆర్.ఆర్.చౌబాల్ కనిపించారు. ఆయన కూడా అదే రైలులో వచ్చారు. నాలాగే ఆయన కూడా బాబాని దర్శించుకుందామని శిరిడీ వస్తున్నారు. మా యిద్దరి కోరికలు ఒకటే అవడంతో మా యిద్దరికీ ఎంతో సంతోషం కలిగింది. మేమెక్కిన టాంగా గోదావరి ఒడ్డుకు చేరగానే, నా బాల్యమిత్రుడు శ్రీగజానన్ కనేకర్ కి మా రాక తెలిసి, మమ్మల్ని అతిథులుగా తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపించాడు. టాంగా ఇంటికి చేరగానే ఎంతో సంతోషించి మా సామానంతా దింపించి తన యింటిలో ఉండమని మాకు ఆతిథ్యం ఇచ్చాడు. కాస్త ఫలహారాలు కానిచ్చి, టీ త్రాగి, ఇక ఎక్కువసేపు ఉండలేమనీ, హారతి సమయానికి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరాము.

మేమిద్దరమూ కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో బస చేసి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకొన్నాము. ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. తరువాత మేము హారతికి వెళ్ళాము. బాబా దర్శనమవ్వగానే నాకెంతో బ్రహ్మానందం కలిగింది. వర్ణించనలవికాని ఉద్వేగభరితమైన ఆనందమది. అటువంటి ఆనందం అంతకుముందెప్పుడూ నాకనుభవం కాలేదు. బాబా పాదాలను స్పృశించడానికి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాను. "నువ్వు శిరిడీ రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా?" అని బాబా అనగానే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా మనసులో అదే ఆలోచన తిరుగుతూ ఉంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తిమత్వాన్ని తెలుసుకొని మరొకసారి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా తన కన్నులతోనే నన్ను దీవించి దగ్గరకు తీసుకొని లాలనగా బుజ్జగించి నన్ను పైకి లెమ్మన్నారు. డా.చౌబాల్ కూడా అప్పుడే బాబా దర్శనం చేసుకొన్నారు.

తరువాత మేమిద్దరమూ ఇక పూనా వెళ్ళబోయే ముందు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన దర్శనానికి వెళ్ళాము. బాబా, "నా భక్తుడొకడు బాంద్రాలో నీ దగ్గర వైద్యం చేయించుకొంటున్నాడు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా?" అని డాక్టర్ ని అడిగారు. బాబాకు చౌబాల్ గురించి తెలియదు. ఆయన డాక్టర్ అని గాని, ఆయన బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని ఎవరూ పరిచయం చేయలేదు. అయినా గాని బాబా తన భక్తుడికెలా ఉందని ఆయనను అడిగారు. డా.చౌబాల్ చాలా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో బాబా భగవంతుని అవతారమేనని మా నమ్మకం ఇంకా బలపడింది.

బాబాతో మాకదే మొదటి పరిచయం. ఇది కేవలం బాబా తన భక్తుల క్షేమం కోసం ఎంతగా కనిపెట్టుకొని ఉంటారన్నదానికి ఋజువు. బాబా ఎదుటివారి మనసులలోని భావాలను చదువగలరు. వారి మనసులో ఉన్నది తాను గ్రహించగలననే సూచనలు కూడా చేసేవారు. నా శిరిడీ యాత్రకు నా భార్య వెలిబుచ్చిన సందేహాలు సహేతుకమే అయినప్పటికీ, బాబా దర్శనానికి నా యాత్రలో ఎటువంటి చిక్కులూ ఏర్పడలేదు.



సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment