"సాయి భక్తాగ్రేసరుడు శ్రీ ధుమాల్*"
సాయి భక్తులలో ముఖ్యుడైన నాసిక్ వాసి శ్రీ సఖారాం బల్వంత్ ధుమాల్ వృత్తిరీత్యా న్యాయవాది. మహ రాష్ట్రలో ప్రభుత్వ శాఖలలో అతనికి మంచి పలుకు బడి వుండేది. బూజు పట్టిన దురాచారాలను ఖండిస్తూ ఒక కొత్తసమాజాన్ని అభ్యుదయ వాదు లందరం కలిసి నిర్మించాలని పిలుపు నిస్తుండేవాడు.1917వ సంవత్స రం నుండి 1925 వరకు నాసిక్ జిల్లా ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు చైర్మన్ గా పనిచేసిన తొలి ప్రభుత్వే తర ఉద్యోగి ఆయన.
ఈ పదవి వలన లాయర్ గా తన స్వంత ప్రాక్టీసుకు తగినంత సమయం కేటాయించలేక పోయేవాడు ధుమాల్. అబివృద్ధి బోర్డు చైర్మన్ గా రాత్రింబవళ్లూ కృషి చేసి ప్రభుత్వంతో పోరాడి, నిధులను తీసుకు వచ్చి నాసిక్ జిల్లా అభివృద్ధికి ముఖ్య కారకుడయ్యా డు. ప్రభుత్వం అతని సల్పిన కృషికి గుర్తింపుగా రావు బహద్దూర్ అనే బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది. 1925వ సంవత్సరం తర్వాత తన పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి తిరిగి తన ప్రైవేట్ ప్రాక్టీస్ ను పున: ప్రారంభించాడు ధుమాల్.
బాబా దయవలన అతని ప్రాక్టీస్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లి సిరి సంపదలతో పాటు ఎనలేని ఖ్యాతిని ధుమాల్ ఆర్జించాడు. ధుమాల్ మిక్కిలి ఆచారవంతుడు, చిన్నప్పటి నుండి అతని కుటుంబం యావత్తూ షేగాం లోని యోగిశ్రేష్టుడు శ్రీ గజానన్ మహారాజుకు భక్తులు. 1907 వ సంవత్సరంలో మిత్రుల ప్రోధ్భలం మీద శిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాడు. తొలి దర్శనంతోనే శ్రీ బాబా అంటే తీవ్రమైన అభిమానం పెంచుకున్నాడు.
శ్రీసాయికి తొలిసారిగా సాష్టాంగనమస్కారం చేయగా రెండు రూపాయలు దక్షిణ అడిగారు. ధుమాల్ వెంటనే ఇవ్వగా శ్రీసాయి వాటిని ఆశీర్వదించి ధుమాల్ కు తిరిగి ఇచ్చేసి “వీటిని భద్రపరచుకో. నీకు జీవితంలో ఏలోటు వుండదు” అని అన్నారు. ధుమాల్ నాగ్ పూర్ లో నివసించే బాపుసాహెబ్ బూటీకి అత్యంత సన్నిహితుడు. ఒకసారి ధుమాల్ బూటీని సాయి దర్శనానికి తీసుకు వెళ్ళాడు. ధుమాల్ వలె బూటీ కూడా సాయి పట్ల ఆకర్షితుడై జీవితాంతం ఆయనకు మహా భక్తుడైనాడు.
ఒక సందర్భంలో ధుమాల్ శ్రీసాయిని దర్శించుకోగానే, శ్రీసాయి “భావూ ! నేను నిన్ను ప్రతిక్షణం కనిపెట్టుకొని వుంటాను. నేనలా చేయకపోతే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?” అని అన్నారు. మరొక సారి "భావూ ! నిన్న రాత్రంతా నాకు నిద్రలేదు, నీ గురించే ఆలోచిస్తూ గడిపాను. నీ సర్వ బాధ్యతలు నావే" అని అన్నారు. ఆమాటలకు ధుమాల్ చలించి పోయి కన్నీళ్ళతో శ్రీ సాయి పాదాలకు అభిషేకం చేసాడు. కన్నతల్లి కంటె మిన్నగా తన భక్తులను ప్రతీక్షణం కాపాడే శ్రీ సాయి యొక్క అపూర్వమైన ప్రేమ, అనురాగం, వాత్సల్యాలకు ముదమొందాడు.
బాబాకు సర్వశ్య శరణాగతి ఒనరిస్తే చాలు, ఇక జీవితంలో దేనికీ ఆలోచించనవసరం లేదు. కూడు గుడ్డల దగ్గర నుండి రక్షణ వరకు అంతా శ్రీ సాయియే చూసుకుంటారు.1909వ సంవత్సరంలో ధుమాల్ భార్య ఒకవిచిత్రమైన వ్యాధి బారినపడి హఠాత్తుగా మరణించింది. అప్పటికి ధుమాల్ వయసు కేవలం 36 సంవత్సరాలు. అతనిని తిరిగి వివాహం చేసుకోమని అతని స్నేహితులు బలవంత పెట్టగా ధుమాల్ సాయి అనుమతిస్తేనే జరుగుతుందన్నాడు.
ధుమాల్ మిత్రుడైన సాయిభక్తుడు బాపూ సాహెబ్ కింకేఢే ధుమాల్ ను తీసుకొని శిరిడీ వెళ్ళి ధుమాల్ రెండవ వివాహ విషయమై అడగగా బాబా అనుమతి ఇవ్వలేదు. సమర్ధ సద్గురువైన శ్రీ సాయి మాటలపై కొండంత విశ్వాసముంచి ధుమాల్ చివరి వరకు వివాహం చేసుకోలేదు. భార్య మరణం నుండి తేరుకున్నాక ధుమాల్ బారిస్టర్ పట్టా కోసం ఇంగ్లండు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బూటీ కూడా అతని ఉన్నత చదువులకు చేతనైనంత సహాయం చేస్తానన్నాడు. బాబా అనుమతి అడుగగా నీ గమ్యం ఇక్కడేనని ధుమాల్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నివ్వలేదు.
బాబా ఆజ్ఞను మరొకసారి ధుమాల్ శిరసా వహించాడు. ఒకసారి శ్రీసాయి దర్శనం తర్వాత వెళ్ళిపోతున్న ధుమాల్ ను రాధా కృష్ణ ఆయి పిలిచి శ్రీసాయి యొక్క అధ్భుతమైన తైలవర్ణ పటాన్ని కానుకగా ఇచ్చింది. దానిని తీసుకు వెళ్ళి శ్రీసాయి ఆశీర్వాదం కోసం ఆయన పాదాల వద్ద వుంచగా శ్రీ సాయి దానిని నఖశిఖ పర్యంతరం గమనించి ఆశీర్వదించి ధుమాల్ కు తిరిగి ఇచ్చేసారు. శ్రీసాయి చేతుల మీదుగా ఆయన యొక్క చిత్రపటాన్ని పొందాలన్న ధుమాల్ యొక్క చిరకాలపు ఆకాంక్ష ఆవిధంగా తీరింది.
దానిని చూసినప్పుడల్లా ధుమాల్ కు శ్రీ సాయి తనతో “నేను రేయింబవళ్ళూ నీ గురించే ఆలోచిస్తాను, నీ సర్వ బాధ్యతలూ నావే ” అన్న మాటలు గుర్తొచ్చి ఆనంద బాష్పాలు రాలేవి. శ్రీసాయి కృపవలన ధుమాల్ యొక్క న్యాయవాది ప్రాక్టీస్ చాలా బాగా సాగింది. అపజయమే లేని న్యాయవాదిగా ధుమాల్ గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు. 1930 నుండి 1932వరకు దేవాస్ సంస్థానానికి ట్రస్టీగా వ్యవహరించాడు. ఆ సమయంలో దేవస్ నుండి నాసిక్ కు తరచుగా ప్రయణం చేసేవాడు.
ప్రయాణంలో తనతో పాటు పైన లభించిన శ్రీ సాయి చిత్రపటాన్ని విధిగా తీసుకెళ్ళేవాడు. అతని మేనల్లుడు, వంటవాళ్ళకు ముస్లిం ఫకీరైన సాయి చిత్రపటం తీసుకెళ్ళడం ఇష్టం వుండేది కాదు. ఒకసారి బాబా చిత్రపటం ముందు చీట్లువెయ్యగా ఆ చిత్ర పటాన్ని నీతోనే వుంచుకో అన్న సందేశం వచ్చింది. అడపాదడపా సారి ఇచ్చిన దక్షిణ అరవై ఏడు రూపాయలు అయ్యింది.1918వ సంవత్సరంలో ధుమాల్ శిరిడీ వెళ్ళినప్పుడు వెంటనే శ్రీసాయి ఆ డబ్బు తిరిగి తీసేసుకొని ఇంకొక ఏడు రూపాయలను అడిగారు.
“నా వద్ద ఇంక డబ్బు లేదు బాబా" అని ధుమాల్ మొర పెట్టుకోగా “ఎవరి వద్ద నుండైనా అప్పు తీసుకొని రా” అని శ్రీసాయి సలహా ఇచ్చారు. డబ్బుపై మమకారం కూడదని శ్రీ సాయి ఈ విధంగా తెలియ జేసారు. శ్రీసాయి సమాధికి ముందు ధుమాల్ కు పూణేలో వున్న అతని వదినగారికి తీవ్రంగా జబ్బు చేసినట్లు టెలిగ్రాం వచ్చింది. వెంటనే ఎనభై రూపాయలు తీసుకొని హుటాహుటిగా బయలుదేరి మధ్యమార్గం లో శిరిడీలో దిగి తన వదిన గారికి స్వస్థత చేకూరాలని ప్రార్ధించాడు. బాబా ధుమాల్ దగ్గర వున్న డబ్బంతా తీసేసుకొని అతననిని పూణే వెళ్ల నివ్వలేదు.
రెండు రోజులలోనే అతని వదినగారు మరణించినట్లు అతనికి టెలిగ్రాం వచ్చింది.ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే శ్రీసాయి నాధులు మహాసమాధి చెందారు. ధుమాల్ వదినగారు మరణిస్తారన్న సంగతి శ్రీసాయికి ముందుగానే తెలుసు. అయినా తాను శరీరంతో వున్న ఆ ఆఖరు రోజులలో తనకు ప్రియ భక్తుడైన ధుమాల్ తన వద్దే వుండాలన్న ఆకాంక్షతో అతనిని పూణే వెళ్ళనివ్వలేదు.
శ్రీ సాయి మహా నిర్యాణం అనంతరం శ్రీ శిరిడీ సాయి సంస్థాననికి ట్రస్టీగా ధుమాల్ నియమించ బడ్డాడు. తన అనుభవం, న్యాయశాస్త్రంలో ప్రావీణ్యతలతో శిరిడీ సంస్థానం ఒక గాడిలో పడడానికి విశేషమైన కృషి సలిపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు శ్రీ సఖరాం బల్వంత్ ధుమాల్. తన ఆఖరుశ్వాస వరకు సాయి సేవలోనే గడపాలన్న ఆకాంక్షతో జీవితం గడిపిన శ్రీ ధుమాల్ జూన్ 20, 1940 (శనివారం) నాడు పరమ పదించారు.

No comments:
Post a Comment