వామనరావు యొక్క అనుభవాలు
షిర్ది సాయి ట్రస్ట్.ఆర్గ్ నుండి గ్రహింపబడింది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు.
సాయిబాబా తన భక్తులకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. ఆయనతో పోల్చదగినవారు మరెవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో సాయిభక్తిని కొలవడానికి ఎటువంటి కొలమానం లేదు. ఏ సాయి భక్తుని హృదయంలోనయితే సాయిబాబా నివసిస్తూ ఉంటారో ఆభక్తుడిని ఎటువంటి మాయ భాధించదు.
ఎవరిమీదనయితే సాయిబాబా తమ అనుగ్రహాన్ని ప్రసరింప చేస్తారో వారు మాత్రమే సాయిబాబా వారి అంతరంగాన్ని అర్ధం చేసుకోగలరు. సాయిబాబాను చేరుకొనే మార్గం చాలా సులభమయినదే, కాని దురదృష్టవంతులు ఆ మార్గాన్ని అనుసరించడానికి అంగీకరించరు.
ఒకసారి వామనరావు షిరిడీలో ఉన్నపుడు వివేకానందుడు వ్రాసిన మాయావతి సాహిత్యాన్ని చదువుతున్నాడు. జ్ఞానుల యొక్క కఠినమయిన మార్గాలు అనే అంశం
ఆ సాహిత్యం మధ్యలో వచ్చింది. ఆ విషయాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అది అర్ధం కాకపోవడం వల్ల అతనికి చాలా విసుగు కలిగింది.
చదువుతున్న పుస్తకాన్ని మధ్యలోనే వదిలేసి ద్వారకామాయికి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ద్వారకా మాయిలో సాయిబాబా ఉన్నారా లేదా అనే విషయం కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ద్వారకామాయి నుంచి తిరిగి వచ్చిన తరువాత మరలా పుస్తకం చదవడం ప్రారంభించాడు. ఆ తరువాత అంతకు ముందు అర్ధంకాని అంశాన్ని చాలా సులభంగా అర్ధం చేసుకోగలిగాడు.
ఒకరోజున సాయిబాబా అతనితో ఈ విధంగా అన్నారు. “ఈ పంట పొలాన్ని చూడు. ఈ పొలాన్ని పట్టించుకునే వాడు ఎవడూ లేడు. రక్షణ లేకపోవడం వల్ల పశువులు వచ్చి పంటనంతా తినేస్తాయి.” దీనియొక్క అర్ధం ఏమిటంటే నువ్వు ఏపుణ్యాన్ని సంపాదించు కున్నా దానికి వ్రతములు (ఉపవాసం) నియమం, సహనం వీటితో కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే సంపాదించుకున్న పుణ్యఫలమంతా కొట్టుకునిపోతుంది.”
ఒకరోజు రాత్రి వామనరావు ద్వారకామాయిలో సాయిబాబా దగ్గర కూర్చున్నాడు. అపుడు సాయిబాబా తన ప్రేమామృత హస్తాన్ని వామనరావు శిరసుమీద పెట్టి అతనికి శక్తిపాతాన్ని ప్రసాదించారు. మధురమయిన వాక్కులతో “ఆ పరమేశ్వరుని అనుగ్రహం నీకు లభించింది” అన్నారు. ఈ విధంగా సాయిబాబా అతనికి కొన్ని దైవిక శక్తులను ప్రసాదించారు.
అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటి ద్వారా సాయిబాబాకు వామనరావుకు మధ్యగల సంబంధం మనకు అర్ధమవుతుంది.
ఒకరోజున వామనరావు సాయిబాబాను పూజిస్తూ ఉన్నాడు. ఆవిధంగా పూజిస్తూ ఉన్న సమయంలో ఈ విధంగా ఆలోచించాడు.
‘ఈ రోజు సాయిబాబా మనతోనే ఉన్నారు. ఆయనను చందనంతోను, పూలతోను, సువాసనలు వెదజల్లే అగరువత్తులతోను, ఆయన శరీరాన్ని మర్ధనా చేస్తూ ఆయనకు సేవలు చేస్తూ పూజిస్తూ ఉన్నాము. ఆ తరువాత ఆయన లేకపోతే మేమెవరికి పూజ చేయాలి?” సాయిబాబా సర్వాంతర్యామి.
ఆయనకు తన భక్తుల మనోగతాలన్నీ తెలుసు. వామనరావు మదిలో చెలరేగుతున్న భావాలన్నీ ఆయనకు వెంటనే తెలిసి పోయాయి. వామనరావు ఆలోచనలకి సమాధనంగా సాయిబాబా “ఈ కనిపించే శరీరమే సాయిబాబా అనుకుంటున్నావా? నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాను. నేను ఈ భూమిపై లేననే చింత పెట్టుకోకండి. ఎందుకని నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావు?” అన్నారు.
🌷సర్వం సాయినాధర్పణమస్థు🌷

No comments:
Post a Comment