ప్రేమాభిమానాలు ఉండేవి. శిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిల్‌ని ఎంత అభిమానంగా చూసుకునేవారో, రహతాకు చెందిన 'చంద్రభాన్ శేట్ మార్వాడి' పై కూడా అంతే అభిమానాన్ని కనబరిచేవారు. శేట్ మరణించాక, అతని అన్న కొడుకైన కుశాల్‌ను బాబా ఎంతో ప్రేమించేవారు. అహర్నిశలూ అతని యోగక్షేమాల గురించి తెలుసుకునేవారు. బాబా షిరిడీ విడిచి ఎక్కడికీ వెళ్లేవారు కాదు. అప్పుడప్పుడు రహతా లేదా నీంగాఁవ్ వైపు వెళ్తుండేవారు. కుశల్‌చందును చూడాలనిపిస్తే వెంటనే రహతాకు బయల్దేరి వెళ్లేవారు. ఒకవేళ వెళ్ళటానికి వీలుకాకపోతే కుశల్‌చందును బాబా తన చెంతకే రప్పించుకునేవారు. ఒక్కోసారి టాంగాలోనూ, ఒక్కోసారి ఎద్దులబండిపై తన సన్నిహితులతో కలిసి బాబా రహతాకు వెళ్లేవారు. రహతా ప్రజలు గ్రామ పొలిమేరలో బాజాభజంత్రీలతో బాబాకు ఘనస్వాగతం పలికేవారు. బాబాకు సాష్టాంగనమస్కారాలు చేసి గ్రామంలోకి ఆహ్వానించేవారు. తరువాత మహావైభవంగా బాబాను ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు. కుశాల్‌చంద్ బాబాను తన ఇంటికి ఆహ్వానించి, బాబాను ఉచితాసనంపై కూర్చుండబెట్టి పూజించేవాడు. అనంతరం బాబాకు భోజనం పెట్టేవాడు. భోజనాలయ్యాక ఇద్దరూ ప్రేమోల్లాసాలతో కబుర్లు చెప్పుకునేవారు. అనంతరం వారిని బాబా ఆశీర్వదించి శిరిడీకి బయలుదేరేవారు. అప్పుడు కూడా రహతావాసులు బాబాను గ్రామ పొలిమేరవరకు గౌరవాభిమానాలతో సాగనంపేవారు.
ఒక్కోసారి బాబాకు రహతా వెళ్లడం వీలయ్యేది కాదు. అటువంటప్పుడు కుశాల్‌చందునే మసీదుకు రప్పించేవారు. లేదా, కల ద్వారా కుశాల్‌చందుకు అనుభవం కలిగించి తన వద్దకు బాబా రప్పించుకునేవారు. సాధారణంగా తెల్లవారుఝామున వచ్చే కలలు నిజం అవుతాయని అంటారు. అది నిజమే కావచ్చు కానీ, బాబా స్వప్నాలకు కాలనియమం లేదు. ఒకనాటి సాయంకాలం బాబా కాకాసాహెబు దీక్షిత్‌ను పిలిచారు. రహతా వెళ్లి చాలారోజులైందనీ, కుశాల్‌ను చూడాలని ఉందనీ, కాబట్టి అతనిని తీసుకురమ్మని దీక్షిత్‌తో చెప్పారు. కాకాసాహెబు టాంగాను తీసుకుని రహతాకు బయలుదేరాడు. కుశాల్‌చందును కలుసుకుని బాబా రమ్మంటున్నారని చెప్పాడు. అది విని కుశాల్‌చంద్ ఆశ్చర్యపోయాడు. తాను మధ్యాహ్న భోజనం చేసి నిద్రపోతుండగా తనకు కలలో బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని ఆదేశించారని, కాబట్టి శిరిడీ వచ్చే హడావిడిలో ఉన్నానని కుశాల్ చెప్పాడు. సరిగ్గా తనకు కుశాల్‌ను తీసుకురమ్మని చెప్పినట్లే, బాబా కుశాల్‌కు కూడా కలలో కనిపించి చెప్పారన్నమాట అనుకున్నాడు కాకాసాహెబ్. తన గుర్రం సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఆ సంగతి చెప్పడానికి బాబా వద్దకు తన కుమారుడిని పంపానని, అంతలో మీరు వచ్చారని కుశాల్ కాకాతో అన్నారు. ఇద్దరూ కలిసి బాబా వద్దకు వెళ్లారు. కుశాల్‌చంద్ బాబాను దర్శించుకుని ఎంతో ఆనందించాడు.
పారమార్థిక జీవితంలో మనిషి కర్తవ్యం ఏమిటో, మానవ వికాసానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆచరించి చూపారు బాబా. వాటిని ఇతరులను ఆచరించమన్నారు. ఒకసారి కుశాల్‌చందుకు కూడా బాబా అలాంటి అనుభవాన్ని స్వయంగా కలిగించారు. బాబా సహించని వాటిలో సోమరితనం ఒకటి. మనిషికి రాయిలా ఒకచోట పడివుండే గుణం అచ్చిరాదని బాబా చెప్పేవారు. 84 లక్షల జన్మల తరువాత లభించిన మానవజన్మను ఫలప్రదం చేసుకోవాలంటే బ్రతికున్నంతకాలం ఏదో పని చేస్తూనే ఉండాలని బోధించేవారు.
కుశాల్‌చంద్ చాలాసార్లు బాబాను దర్శించుకునే వంకతో వచ్చి మసీదులోనే ఉండిపోయేవాడు. రోజుల తరబడి అలాగే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలంపాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్‌ను బాబా దగ్గరకు పిలిచారు.
"కుశాల్‌చంద్! నీకు కొంత పొలం ఉంది కదా? అందులో ఏ పంటలూ పండించడం లేదా?" అని బాబా అడిగారు.
"లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు" అని కుశాల్‌చంద్ చెప్పాడు.
"భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా బాబూ! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను" అని బాబా అతనికి చెప్పారు.
కుశాల్‌చంద్ పొలం మొత్తం దున్ని, లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ, "దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్?" అని అడిగారు. కుశాల్‌చంద్ తాను నిలువుగా దున్నానని చెప్పగానే, "ఈసారి అడ్డంగా దున్ని చూడు, తప్పకుండా దొరుకుతాయి!" అని బాబా చెప్పారు. కుశాల్‌చంద్ అలా కూడా చేసి, లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. "సరే! దొరక్కపోతే ఏం చేస్తాం? ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి, అందులో మిరపవిత్తనాలు చల్లు!" అని బాబా సూచించారు. కుశాల్‌చంద్ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరపపంట అన్నదే లేదు. కుశాల్‌చంద్ ఒక్కడే పండించాడు. దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. కుశాల్‌చంద్ తనకు వచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు.
"లంకె బిందెలు ఎదురుగా పెట్టి దొరకలేదని అబద్ధం చెబుతావేమయ్యా? ఇవే లంకెబిందెలు. సుఖం, కోరికలు, సంపద, కీర్తి, ప్రతిష్ట ఏదైనా సరే అయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిది సంపద దక్కదు. సాధన చేయనిది ఏదీ సాధ్యం కాదు. మనిషిగా పుట్టినందుకు ఏదో పని చేయాలి. భక్తి మంచిదే. కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డగుణం. పనీపాటా చేసుకుంటూ, "ఓం సాయి శ్రీ సాయి" నిత్యం స్మరించుకో! ఇక నువ్వు చేసే పనికి ఆటంకం ఉండదు. నా భక్తులు నిత్య చైతన్యంతోనే ఉండాలి. అర్థమైందా?" అన్నారు బాబా. బాబా విపులంగా బోధించేసరికి కుశాల్‌చందులోని బద్ధకం, సోమరితనం, ఎగిరిపోయాయి. ఆ తర్వాతకాలంలో సాయిభక్తుల్లో కుశాల్‌చంద్ అగ్రగణ్యునిగా వినుతికెక్కారు.
కుశాల్‌చంద్ పైన బాబా చూపిన ప్రేమ అపారం. వీరి కుటుంబానికి బాబా ప్రసాదించిన అనుభవాలు అనిర్వచనీయం. బాబా ప్రేమామృతాన్ని తనివి తీరా రుచి చూసిన కుశాల్‌చంద్, బాబా లేని లోకంలో తాను ఎందుకనుకున్నాడో ఏమో గాని, సరిగ్గా బాబా సమాధి చెందిన నెల రోజులకు, అంటే 15-11-1918వ తేదీన సాయిలో ఐక్యమైనాడు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు *కుశాల్‌చంద్ పార్ట్ 2.*
సాయితో పెనవేసుకున్న అనురాగబంధం - ఏ జన్మదో ఈ ఋణానుబంధం.
శ్రీసాయి దేహధారిగా ఉన్నప్పుడు ఆయన దర్బారులోని భక్తమండలిని నిశితంగా అవలోకిస్తే అనేక విధాలుగా వారు బాబాతో ప్రేమ అనే బంధంతో ముడిపడిన విధానం అద్భుతంగా గోచరిస్తుంది.
సమర్థ సద్గురునాథుడైన శ్రీసాయి సన్నిధానం కోసం ప్రాపంచిక సుఖాలను తృణప్రాయంగా త్యజించి తమ జీవితాలను సాయి సాన్నిహిత్యంలో పునీతం చేసుకున్న భక్తులు కొందరైతే, రకరకాల కోరికలు ఇష్టాలను తీర్చుకోవడానికి మొదటగా బాబా వద్దకు వచ్చినా, ఆయన సన్నిధిలో కుండపోతగా వర్షించే ఆనందానుభూతిలో తడిసి జ్ఞానసూర్యుని ప్రేమకక్ష్యలో చిక్కుకుపోయిన భక్తులు ఇంకొందరు. పై రెండువిధాలుగా కాక తమ ప్రాపంచిక జీవితంలో తలమునకలవుతూనే ఎటువంటి ఐహిక ఆధ్యాత్మిక ఆశలు లేనప్పటికీ సాయిని తమ జీవితంలో అత్యంత ప్రీతిపాత్రునిగా భావించి, ఆరాధించి తరించిన భక్తులు మరికొందరు! అందరిపై శ్రీసాయినాథుడు సమదృష్టి సారించినప్పటికీ లౌకికంగా కొందరిపై శ్రీసాయి చూపించిన ప్రత్యేక ప్రేమాభిమానాలు కించిత్తు ఆశ్చర్యం కలిగించక మానవు. అటువంటి అపార ప్రేమాభిమానాలు పొందిన భక్తులలో రహతాకు చెందిన శ్రీచంద్రభాన్‌శేఠ్, శ్రీకుశాల్‌చంద్‌లను ప్రముఖంగా పేర్కొనవచ్చు.
ముఖ్యంగా శ్రీకుశాల్‌చంద్‌పై బాబా చూపించిన అభిమానం - కుశాల్‌చంద్ తమ దర్శనానికి రావడం కొద్దిరోజులు ఆలస్యం చేస్తే అతనిని చూడడానికి బాబా చూపే ఆరాటం, స్వయంగా తానే పరామర్శించడానికి వెళ్లడం చూస్తే సర్వాంతర్యామి, సకల జీవస్వరూపుడు అయిన శ్రీసాయిలో కనిపించే మాతృప్రేమకు నిదర్శనంగా అనిపించక మానదు.
సాయి మమతను చూరగొన్న భాగ్యశాలి - భక్తి ప్రేమలు సమ్మిళితమైన సుగుణశీలి
అంతటి అదృష్టాన్ని స్వంతం చేసుకున్న శ్రీ కుశాల్‌చంద్, శ్రీచంద్రభాన్‌శేఠ్‌ల జీవిత విశేషాలను, బాబాతో వారి అనుబంధాన్ని పరిశీలిద్దాం.
శ్రీచంద్రభాన్‌సేఠ్, శ్రీకుశాల్‌చంద్‌సేఠ్ రహతాకి చెందిన ప్రఖ్యాత సాండ్ కుటుంబానికి చెందినవారు. వీరి ఆధీనంలో నడిచే వివిధ వ్యాపారసంస్థలు మహారాష్ట్రలో విఖ్యాతమైనవి. ఆ రోజుల్లో వీరికి రెండువేల ఎకరాల భూమి, అహ్మద్‌నగర్, తంబూరి ప్రదేశాలలో కాటన్ మిల్లులు ఉండేవి. అంతేగాక అహ్మద్‌నగర్, ఔరంగాబాదు, సేలు, జాల్నా, నిజాం రాష్ట్రాలలో వీరికి చెందిన వివిధ వ్యాపారసంస్థలు ఉండేవి. అంతటి ధనిక కుటుంబానికి శ్రీశివరాం రామచంద్రసేఠ్ కుటుంబ పెద్ద. ఆయన రెండవ కుమారుడే శ్రీచంద్రభాన్‌శేఠ్. చంద్రభాన్‌శేఠ్ అన్నగారి కుమారుడు శ్రీకుశాల్‌చంద్. మొదట శ్రీచంద్రభాన్‌సాండ్‌తో మొదలైన శ్రీసాయి అనుబంధం కుశాల్‌చంద్ తో బాగా బలపడింది. ఈ కుటుంబసభ్యులపై శ్రీసాయి ప్రేమాభిమానాలు అపారం. వీరి కుటుంబానికి శ్రీసాయి ప్రసాదించిన అనుభవాలను సాండ్ కుటుంబసభ్యులతో 'సాయిపథం' సత్సంగసభ్యులు జరిపిన ఇంటర్వ్యూను కూడా తరువాత భాగంలో మీ ముందు ఉంచుతున్నాము.
శ్రీసాయి కుశాల్‌చంద్ ఇంటికి తరచుగా వచ్చేవారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. శ్రీచంద్రభానుశేఠ్ 1911లో దివంగతులైనప్పటికీ శ్రీకుశాల్‌చంద్ కోసం బాబా రహతా వెళ్లేవారు. కుశాల్‌చంద్ బాబా దర్శనానికి ఒక వారం పది రోజులు పని ఒత్తిడి వలన రాలేకపోయినట్లయితే స్వయంగా బాబానే ఆయనను చూడటానికి వెళ్లేవారు, లేదా ఎవరైనా భక్తులను కుశాల్‌చంద్‌ని తీసుకురమ్మని పంపేవారు. అలాంటి కొన్ని సంఘటనలు ఇక్కడ చూద్దాం. ఒకసారి మధ్యాహ్న ఆరతి తర్వాత బాపూసాహెబు జోగ్, వామనరావు పటేల్ (సాయి శరణానంద) వద్దకు వచ్చి బాబా రహతాలో కుశాల్‌చంద్ ఇంటికి వెళ్లారని, తను తన భార్య అక్కడికే బయలుదేరామని, వామనరావు కూడా రావాలనుకుంటే రావొచ్చని చెప్పాడు. అప్పుడు బాపూసాహెబు జోగ్, శ్రీమతి జోగ్, వామనరావు పటేల్ ముగ్గురూ బండిలో రహతాలోని కుశాల్‌చంద్ ఇంటికి వెళ్లారు. కుశాల్‌చంద్ బాబాను అత్యంత భక్తిశ్రద్ధలతో లోపలికి ఆహ్వానించి, పూజించాడు. కుశాల్ ఒక ప్లేటునిండా పండ్లు తీసుకువచ్చి బాబా ముందు పెట్టగా, వామనరావు ఒక అరటిపండును ఒలిచి బాబా చేతిలో ఉంచాడు. బాబా సగం పండు తిని, మిగిలిన దానిని ప్రసాదంగా వామనరావుకి ఇచ్చారు. కొంతసమయం అక్కడ గడిపాక బాబా బండిలో శిరిడీకి వచ్చేశారు.
అలాగే ఒక మధ్యాహ్నం బాబా కాకాసాహెబ్ దీక్షిత్‌ను పిలిచి, "రహతాకు టాంగాలో వెళ్లి కుశాల్‌భావుని తీసుకునిరా, తను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయ్యింది. బాబా నిన్ను చూడాలంటున్నారని, తొందరగా రమ్మంటున్నారని చెప్పు" అని అన్నారు. బాబా ఆజ్ఞను సవినయంగా స్వీకరించి టాంగాలో రహతాకు వెళ్లి కుశాల్‌చంద్‌ను కలిసి తను వచ్చిన పనిని, బాబా చెప్పమన్న మాటలను చెప్పాడు శ్రీదీక్షిత్. ఆ మాటలను వినగానే శ్రీకుశాల్‌చంద్ సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోతూ, "నేను ఇందాక నిద్రపోతుంటే నిద్రలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా కనిపించి ఇవే మాటలు చెప్పారు. వెంటనే బాబాను చూడాలని శిరిడీ బయలుదేరాను. కానీ గుర్రం లేకపోవడం వలన రాలేకపోయాను. ఈ విషయం బాబాకు తెలియజేయమని ఇంతకుమునుపే నా కుమారుడిని శిరిడీకి పంపించాను" అన్నాడు. ఇప్పుడు బాబా మీకోసం టాంగాను పంపించారని, కావాలంటే అందులో రావచ్చని కాకాసాహెబ్ చెప్పగా కుశాల్‌చంద్ కాకాసాహెబుతో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.
పై రెండు ఉదాహరణలు బాబాకు, కుశాల్‌చంద్ కుటుంబానికీ మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధానికి తార్కాణాలు. బాబా సమాధి చెందే కొద్దిరోజుల ముందు కూడా రహతా వెళ్లి కుశాల్‌చంద్ కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారని తెలుస్తున్నది. శ్రీసాయి అక్టోబర్ 15, 1918 సంవత్సరంలో దేహత్యాగం చేసినప్పుడు ముస్లిం భక్తులతో పాటుగా బాబాను కబరిస్థాన్‌లో సమాధి చేయాలని పట్టుపట్టిన వారిలో కుశాల్‌చంద్ ఒకరు. బాబా ప్రేమామృతాన్ని తనివితీరా గ్రోలిన కుశాల్‌చంద్ బాబా లేని లోకంలో తనెందుకు అనుకున్నాడో ఏమో, బాబా సమాధి చెందిన సరిగ్గా నెల రోజులకు అంటే 15-11-1918వ తేదీన సాయిలో ఐక్యమయ్యారు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment