Tuesday, June 16, 2020

సఖారాం ఔరంగాబాద్ కర్

సఖారాం ఔరంగాబాద్ కర్ 
మహారాష్ట్రలో నివసించే సఖారాం ఔరంగాబాద్ కర్ అనే వాడికి  వివాహం అయ్యి 27 సం లు పూర్తయినా సంతానం కలుగలేదు. సుప్రసిద్ధులైన ఎందరో డాక్టర్ల చేత లక్షలకు లక్షలు వైద్యం చేయించుకున్నారు.ఎన్నో వ్రతాలు, పూజలు, హోమాలు చేయించారు, ఎందరో దేవతలకు మొక్కుకున్నారు గాని ఫలితం కనిపించలేదు. చివరకు తమకు సంతాన యోగం లేదని నిర్ణయించుకున్నారు. అంతులేని ఆందోళన, ఆవేదనతో నిస్సారమైన జీవితం గడుపుతున్నారు. 

శ్రీశిరిడి సాయినాధుని మహత్యం గురించి విని శిరిడి వెళ్ళి ఆఖరు ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. ఔరంగాబాద్ కర్ భార్య తన బంధువైన విశ్వనాధునితో శిరిడీ వచ్చి బాబా దర్శనం చెసుకొని అక్కడ రెండు నెలలు గడిపింది. ప్రతీ రోజూ పూజాది కార్యక్రమము లను నిర్వహించడం, నాలుగు వేళలా ఆరతులలో పాల్గొనడం, సేవ, సద్గ్రంధ పఠనం, సద్గోష్టి లో పాల్గొనడం, వంటి సత్కార్యాలలో చాలా చురుకుగా పాల్గొంది.

ఒక్కసారైనా బాబాను ఒంటరిగా వున్నప్పుడు దర్శించుకొని తన కోరికను వెల్లడించుదామని ఆమె అనుకుంది, కాని మసీదు ఎల్లప్పుడూ  భక్తులతో కిట కిట లాడుతుందడం వలన అది ఆమెకు సాధ్యపడలేదు. ఇక ఆగలేక ఔరంగాబాద్ కర్ భార్య శ్యామాను కలిసి తన మనసులోని మాటను చెప్పింది. శ్యామా ఆమెకు సహాయం చేయ సంకల్పించి బాబా భోజన సమయంలో కొబ్బరికాయ ఇత్యాది పూజా ద్రవ్యాలతో మశిదు వాకిలి వద్ద సిద్ధం గా వుండమని చెప్పాడు. 

ఒకరోజు బాబా భోజనం చేసాక శ్యామా ఆయన చేతులను తువ్వాలుతో తుడుస్తున్నాడు. అప్పుడు సాయి ప్రేమతో శ్యామా బుగ్గలు గిల్లారు. అందుకు శ్యామా కినుక వహించి “ సాయి ! నా బుగ్గను గిల్లడం నీకు భావ్యం కాదు. మా బుగ్గలు గిల్లే అల్లరి దేముడు మాకు అక్కర లేదు,” అని అన్నాడు. శ్రీ సాయి చిరునవ్వుతో “ శ్యామా ! గత 72 జన్మల నుండి మనకు సంబంధం వుంది. అయినా నిన్ను నేను ఎన్నడూ గిల్లలేదు. ఇన్నాళ్లకు నిన్ను గిల్లగా నీకు కోపం వస్తుంది.” ఆని అన్నారు. 

“దేవా ! మాకు మీ నుండి ఎటువంటి స్వర్గ సౌఖ్యాలు అవసరం లేదు.మమ్మల్ని ఎల్లవేళలా కనిపెట్టుకొని వుండి కాపాడితే అదే చాలు” అని మనస్పూర్తిగా ప్రార్ధించాడు శ్యామా. ఈ మాటల ద్వారా తన భక్తులతో ఎన్నో జన్మల నుండి తనకు అనుబంధం వున్నదని, అన్ని జన్మలలోనూ తన భక్తులను ఒకే విధంగా కంటికి రెప్పలా కాపాడుతూ వుంటానని శ్రీ సాయి స్పష్టంగా తెలియ జేసారు. అంతే కాక జనన మరణం ఎరుగని పరబ్రహ్మానిని అని, తనను నమ్మి శరణు జొచ్చే భక్త జనావళికి రక్షణ కవచం అందిస్తూ సన్మార్గ వర్తులను గావించడమే తన ముఖ్య కర్తవ్యమని శ్రీ సాయి తెలియజేసారు.

శ్రీ సాయి వెళ్ళి తన ఆసనంపై కూర్చోగానే శ్యామా ఔరంగాబాద్ కర్ భార్యను రమ్మని సైగ చేసాడు. ఆమె ఆర్ద్రతతో పరుగు పరుగున వచ్చి శ్రీ సాయికి నమస్కరించి కొబ్బరికాయ, ఇతర పూజాద్రవ్యాలను ఆయనకు సమర్పించుకుంది. శ్రీ సాయి కొబ్బరికాయ నాడిస్తూ “ శ్యామా ! ఇది ఎండిన టెంకాయ, ఇది ఏమంటుందో విను” అని అన్నారు.

“ సాయి, నీ భక్తురాలు తన గర్భం లో ఒక బిడ్డను ఇదే విధం గా ఆడాలని కోరు కుంటోంది. దయ చేసి ఆమెకు ఈ వరం ప్రసాదించు” అని శ్యామా ప్రార్ధించాడు. “ శ్యామా మీరెంత అమాయకులు ? టెంకాయ బిడ్డలను ప్రసాదిస్తుందా ? “ అని సాయి చిరునవ్వు నవ్వారు. “ దేవా ! నీ ఆశీర్వాద ప్రభావం నాకు బాగా తెలుసు. నీ కరుణామృత చూపులే ఆమెకు బిడ్దల పరంపరను ప్రసాదిస్తుంది. దయ చేసి ఆ అమాయకురాలి తప్పులను మన్నించి ఆమెకు నీ వరాన్ని అనుగ్రహించు " అంటూ బాబాను శ్యామా పరి పరి విధాలుగా వేడుకున్నాడు. 

ఔరంగాబాద్ కర్ భార్య కూడా తమ గత జన్మల పాపములను మన్నించి తమకు ఒక బిడ్డను ప్రసాదించమని మనసులోనే ఎంతో ఆర్ద్రతతో ప్రార్ధించింది. తుదకు భక్తుల ప్రార్ధనకు, ప్రేమకు లొంగిపోయి నీకు ఒక సంవత్సరంలోగా బిడ్దలు కలుగుతారని ఆశీర్వదించారు. అట్లా ఆశీర్వదించి టెంకాయను పగుల గొట్టి ఒక భాగాన్ని ఔరంగాబాద్ కర్ భార్యకు ప్రసాదంగా 
శ్రీసాయి ఇచ్చారు. ఔరంగాబాద్ కర్ భార్య పట్టరాని సంతోషం తో శ్రీ సాయికి నమస్కరించి తమ ఊరికి తిరుగు ప్రయాణం కట్టింది.

శ్రీ సాయినాధుని మాటలు నిజం చేస్తూ సంవత్సరంలోగా ఆమెకు పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు అయిదవ నెలలో ఆ దంపతులిద్దరూ శిరిడీ వచ్చి శ్రీ సాయి దర్శనం చేసుకొని తమ బిడ్డను సాయి పాదాలపై పడుకో బెట్టి ఆశీర్వదించవల్సిందిగా ప్రార్ధించారు. తమకు పుత్రోదయం కల్గించి నందుకు కృతజ్ఞతతో ఆ దంపతులిద్దరూ శ్రీ సాయికి దక్షిణగా అయిదు వందల రూపాయ లను దక్షిణగా సమర్పించారు. 

శ్రీ సాయి వారిద్దరి పేరిట ఆ దక్షిణతో తన గుర్రమైన శ్యామకర్ణకు ఒక శాలను కట్టించారు. వైద్యుల ట్రీట్మెంట్, జ్యోతిష్కుల పరిశోధనలను అధిగమించి తమ భక్తులకు వారి లలాట లిఖితాన్ని తిరగరాసి బిడ్డలను ప్రసాదించిన శ్రీ శిరిడీ సాయినాధుని కరుణను, ప్రేమాను రాగాలను, భక్త పరాయణ తత్వాన్ని వర్ణించుటకు మాటలు చాలడం లేదు. అనుక్షణం శ్రీ సాయికి పరిపూర్ణమైన హృదయంతో కృతజ్ఞతలు అర్పించడం తప్ప మనమిక ఏమి చేయగలం ? 

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు..🙏🙇
Source :- chsairutvik.blogspot.com

No comments:

Post a Comment