ఓం శ్రీ సాయిరాం
భీమాజీ పాటిల్ ఖేవడే (సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం..)
భీమాజీ పాటిల్ ఖేవడే మహారాష్ట్ర పూనే జిల్లా, జున్నర్ తాలూకాలోని నారాయణ్‌గావ్ వాస్తవ్యులు.
(ఇతని ప్రస్తావన సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో వస్తుంది.)
వ్యవసాయ భూములు కలిగిన సంపన్నుడు, గ్రామానికి వచ్చిపోయే సందర్శకులను ఆదరించి అన్నం పెట్టేవాడు.
1909లో హఠాత్తుగా క్షయవ్యాధికి గురై తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. క్షయవ్యాధి ప్రభావం వల్ల తీవ్రమైన జ్వరంతోను, విపరీతమైన దగ్గుతోను బాధపడుతూ తరచూ రక్తం కక్కుకుంటుండేవాడు. శరీరమంతా వణుకుతూ, కడుపులో వికారంగా ఉండి అన్నపానీయాలు రుచించేవి కావు. ఈవిధంగా అతను ఎంతో బాధను అనుభవిస్తూ పూర్తిగా మంచంపట్టి చిక్కిశల్యమైపోయాడు.
అన్ని రకాల ఔషధాలు, నివారణోపాయాలు, కులదేవతకు చేసిన ప్రార్థనలు అన్నీ వ్యర్థం అయిపోయాయి. వైద్యులు, జ్యోతిష్యులు, హకీములు, ఆయుర్వేద నిపుణులు ఏమీ చేయలేకపోయారు. వాళ్లందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
భీమాజీకి తన స్నేహితుడైన నానాసాహెబ్ చాందోర్కర్ గుర్తుకొచ్చి ..వెంటనే తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ నానాకు ఒక లేఖ వ్రాశాడు.
భీమాజీ పాటిల్ లేఖను చదివిన నానాచందోర్కర్ గుండె బరువెక్కి వెంటనే...‘శిరిడీ వెళ్ళి శ్రీసాయిబాబాను దర్శించి వారి పాదాలు పట్టుకోమని, అదే అతని బాధకు అంతిమ నివారణోపాయమని’ తెలియజేస్తూ ఒక లేఖ వ్రాసారు.
స్నేహితుని సలహాతో భీమాజీ కొంతమంది బంధువులను వెంటబెట్టుకొని శిరిడీ ప్రయాణమయ్యాడు. వాళ్ళ బండి మసీదు ప్రవేశద్వారం వద్ద ఆగగానే నలుగురు వ్యక్తులు భీమాజీ పాటిల్‌ని మోసుకొని మసీదు లోపలికి తీసుకొని వెళ్లారు. ఆ సమయానికి నానాసాహెబ్ చాందోర్కర్ అక్కడికి చేరుకున్నాడు.
భీమాజీని చూస్తూనే బాబా ప్రక్కనే ఉన్న శ్యామాతో...“షామా, ఇంకెంతమంది దొంగలను తెచ్చి నాపై భారం వేయబోతున్నావు? నీకిది భావ్యమా?” అని అన్నారు.
బాబా మాటలు విన్న భీమాజీ బాబా పాదాలపై తన శిరస్సు ఉంచి, “సాయినాథా! నాపై కృప చూపి నన్ను కాపాడండి” అని దీనాతిదీనంగా వేడుకున్నాడు.
బాబా జాలితో చిరునవ్వుతో, “శాంతించు! ఆందోళనలన్నీ విడిచిపెట్టు. శిరిడీలో అడుగిడిన క్షణమే నీ బాధలు ముగిశాయి. ఈ మశీదు మెట్లెక్కినంతనే నీ దుఃఖం అంతరించింది. నీవు గొప్ప ఆనందాన్ని పొందుతావు. వెంటనే నువ్వు భీమాబాయి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండు. 2 రోజులలో నీకు ఉపశమనం లభిస్తుంది” అని అన్నారు.
గంటసేపు అతను మశీదులో బాబా సమక్షంలో కూర్చున్నాడు. అంతసేపు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా వాంతి కాలేదు.
బాబా తమ స్వహస్తాలతో ఊదీ తీసుకొని కొద్దిగా భీమాజీ చేతికిచ్చి, మరికొంత అతని నుదుటిపై రాశారు.
అప్పటివరకూ జబ్బుతో నీరసించిపోయి ఏమాత్రమూ నడవలేని స్థితిలో ఉన్న భీమాజీ తనంతటతానే లేచి ఎవరి సహాయం లేకుండా బండి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు.
భీమాబాయి ఇల్లు అప్పుడే మట్టితో చదును చేసినందువలన నేలంతా తేమగా ఉంది. బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాబాయి ఇంట ఉండటానికే నిర్ణయించుకుని.. తేమగా ఉన్న ఆ నేలపై రెండు గోనెసంచులు పరచుకొని వాటిపై ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఆ రాత్రి బాబా చిన్ననాటి ఉపాధ్యాయునిగా స్వప్నదర్శనమిచ్చి అతని చేతులపై బెత్తంతో కొట్టసాగారు. ఆయనెందుకలా తనను శిక్షిస్తున్నారో భీమాజీకి అర్థం కాలేదు. మరికొంతసేపటికి మరొక కలలో ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి అతని ఛాతీపై కూర్చొని, బలంగా అదిమిపెట్టి, ఒక పొత్రాన్ని అతని ఛాతీపై ఉంచి బలంగా నూరసాగాడు. విపరీతమైన బాధతో భీమాజీకి ప్రాణాలు పోతున్నట్లనిపించింది. కొద్దిసేపటికే ఆ కల ముగిసింది.
మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే ఆ భయంకరమైన వ్యాధి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు గ్రహించిన అతని ఆనందానికి అవధులులేవు.
వెంటనే బాబా దర్శనానికి పరుగుతీశాడు. బాబాని చూస్తూనే భీమాజీ ఆనందంతో బాబా పాదాలపై తన శిరస్సునుంచి భక్తితో నమస్కరించుకున్నాడు.
బాబా చేసిన మేలుకు కృతజ్ఞతగా భీమాజీ పాటిల్ ప్రతి గురువారం ‘సాయి సత్యనారాయణ వ్రతం’ ఆచరించడం ప్రారంభించాడు. సత్యనారాయణ వ్రతకథ చదవడానికి బదులుగా దాసగణు రచించిన ‘అర్వాచీన భక్తలీలామృతం’లోని సాయిలీలలను చదివేవాడు. కుటుంబసభ్యులను, బంధువులను, స్నేహితులను, ఇంకా తెలిసినవారందరినీ వ్రతానికి ఆహ్వానించి ఎంతో శ్రద్ధగా వ్రతం చేసేవాడు.
భీమాజీ పాటిల్ మరణించిన తరువాత కొన్ని సంవత్సరాల వరకు అతను మొదలుపెట్టిన సాయి సత్యనారాయణ వ్రతం సంప్రదాయం కొనసాగింది. కానీ ఆ తర్వాత అతని తరువాతి తరాలవారు వ్రతం చేయడం పూర్తిగా మానేశారు.
వాళ్లకు రకరకాల సమస్యలు రావడంతో ...ఒకరోజు బాబా భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ గారి 4వ తరానికి చెందిన శ్రీ నందకుమార్ నిమోన్కర్ (రేవణ్‌నాథ్ దేశ్‌పాండే నిమోన్కర్ కుమారుడు ) నారాయణ్‌గావ్ గ్రామంలోని ద్వారకామాయి సాయిబాబా మందిరంలో పాదుకాపూజ కోసం వచ్చారు.
శ్రీ శివాజీ బోరడే అనే సాయిభక్తుడు భీమాజీ పాటిల్ వారసుల వద్దకు తీసుకువెళ్లగా.. శ్రీ నందకుమార్ నిమోన్కర్ వాళ్ళ సమస్యలు విని, వాళ్ళను తిరిగి సాయి సత్యనారాయణ వ్రతాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చాడు. దానితో వారు సాయి సత్యనారాయణ వ్రత సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. అంతటితో వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి సుఖంగా ఉన్నారు.
భీమాజీ పాటిల్‌కు చెందిన పురాతన ఇంటిని పడగొట్టి ఆ ప్రదేశంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. అందులోని ఒక భాగాన్ని వారి పూర్వీకుల గృహంలా మలచి, ఆ ఇంటిలోనే ఒక చిన్న సాయిబాబా మందిరం నిర్మించారు.
భీమాజీ పాటిల్ కొడుకు నారాయణ్ భీమాజీ ఖేవడే పాటిల్, అతని కొడుకు ప్రకాష్ నారాయణ్ భీమాజీ పాటిల్. కొంతకాలం తరువాత అతను మరణించాడు. ప్రస్తుతం అతని భార్య శ్రీమతి ఉష తన ముగ్గురు కుమారులు (సంజయ్, అజయ్, వైభవ్) కోడలితో కలిసి ఆ ఇంటిలో నివసిస్తున్నారు.
భీమాజీ పాటిల్ కుటుంబీకులు 2013లో ‘సాయి తేరా ధాం మందిర్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించారు. ఆ మందిరం లోపలి గోడపై శ్రీసాయి సచ్చరిత్ర 13వ అధ్యాయాన్ని (క్షయవ్యాధి బారినుండి భీమాజీ పాటిల్‌ను బాబా కాపాడిన లీల..) చెక్కించారు. ఈ మందిరం భీమాజీ పాటిల్ పూర్వీకుల ఇంటినుండి కేవలం 7 నిమిషాల ప్రయాణదూరంలోనే ఉంది.
బాబా తాము సమాధి చెందడానికి కొద్దిరోజుల ముందు భీమాజీ పాటిల్‌కు ఒక ఎద్దును ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఎద్దు మరణించింది. దానిని ద్వారకామయి సాయిబాబా మందిరం ప్రాంగణంలో సమాధి చేశారు. దాని గుర్తుగా ఆ సమాధిపై ఒక నల్లరాతి నంది విగ్రహాన్ని స్థాపించారు.
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹
.jpg)
No comments:
Post a Comment