ఓం శ్రీ సాయిరాం🙏🙏
1917లో హోలీ పండుగ పౌర్ణమి రోజు(సాయి సచ్చరిత్ర 40వ అధ్యాయం) తెల్లవారుజామున హేమాడ్‌పంత్‌కు ఒక స్వప్నం వచ్చింది..
సాయిబాబా అతని కలలో సాధువు రూపంలో కనిపించి, ఆ రోజు అతని ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారు. అతను మేల్కొని చూడగా ఎవ్వరూ కనిపించలేదు...
హేమాడ్‌పంత్‌కు 7 సంవత్సరాలుగా బాబాతో పరిచయం ఉన్నప్పటికి, బాబాను ధ్యానిస్తున్నప్పటికీ, బాబా తన ఇంటికి భోజనానికి వస్తాడని అతను ఎప్పుడూ భావించలేదు...
తన భార్య శ్రీమతి రుకుమాబాయి వద్దకు వెళ్లి, హోళీ పండుగ కాబట్టి ఒక అతిథి(సాధువు) భోజనానికి వస్తున్నాడని, మరికొంత ఆహారాన్ని తయారు చేయమని చెప్పాడు.
ఆమె ఎవరు ఆ సాధువు? అని అడుగగా.. ఆమెతో అబద్ధం చెప్పడం ఇష్టం లేక "సాయిబాబానే భోజనానికి వస్తున్నారు!" అని చెప్పాడు
షిరిడీలో రకరకాల పిండివంటలు, రుచికరమైన ఆహారాన్ని కాదని.. "బాబా షిర్డీ నుండి బాంద్రాకు రావడం సాధ్యమేనా?" అని ఆమె సందేహంగా అడిగింది.
హేమాడ్‌పంత్ ఆమెతో బాబా స్వయంగా రాకపోవచ్చని, ఏదైనా అతిథి రూపంలో హాజరవుతారని, మరికొంత అన్నం వండడం వల్ల తమకు ఏమీ నష్టం జరగదని చెప్పారు.
మధ్యాహ్న సమయానికి భోజనాలు సిద్ధం చేసి.. దైవానికి నివేదన చేసి..కుటుంబం మొత్తం రెండు వరుసలలో భోజనానికి కూర్చుని..వచ్చే అతిథి కోసం రెండు వరుసల మధ్యలో ప్రత్యేకంగా పీఠం వేసి ఎదురు చూడసాగారు.
కుటుంబం మొత్తానికి వివిధ రకాల వంటకాలను వడ్డించడం ప్రారంభించారు. ఇది జరుగుతున్నప్పుడు అందరూ అతిథి కోసం చూస్తున్నారు, కానీ మధ్యాహ్నం దాటినా ఎవరూ రాలేదు. నెయ్యి కూడా వడ్డించారు...శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించారు. అందరూ భోజనం చేయడం ప్రారంభిస్తూ ఉండగా.. హఠాత్తుగా మెట్లపై అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపించింది.
హేమాడ్‌పంత్ వెంటనే వెళ్లి తలుపు తెరిచి చూడగా..వాకిలి ముందు ఇద్దరు వ్యక్తులు నిలుచుని ఉన్నారు. వారు అలీ మహమ్మద్ మరియు మౌలానా ఇస్ము ముజావర్..
వారు కుటుంబ సభ్యులందరూ భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉండటం చూసి హేమాడ్‌పంత్‌కు క్షమాపణలు చెప్పి...“మీరు భోజనం వదిలేసి మా దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి ఈ చిత్రాన్ని తీసుకోండి..దీని వివరాలు త్వరలో మీకు తెలియజేస్తాము!" అని చెప్పి పాత న్యూస్ పేపర్ కవర్‌లో చుట్టిన ప్యాకెట్ తీసి టేబుల్‌పై పెట్టారు.
హేమాడ్‌పంత్ ప్యాకెట్‌ని తీసి చూడగా.. అందులో సాయిబాబా యొక్క పెద్ద చక్కని చిత్రపటం కనిపించింది..ఆ పటం చూసి హేమాడ్‌పంత్ చలించిపోయాడు..అతని కళ్ళ నుండి నీళ్ళు కారుతున్నాయి...వంగి చిత్రపటంలోని బాబా పాదాలపై తన తల ఉంచి..బాబా ఆశీర్వాదం పొందినట్లుగా భావించాడు.
ఉత్సుకతతో అతను అలీ మహ్మద్‌ని ఈ చిత్రం ఎక్కడది? అని అడిగాడు. ఆ చిత్రాన్ని ఓ షాపులో కొన్నానని, దాని గురించిన వివరాలన్నీ తర్వాత చెబుతానని, కుటుంబ సభ్యులంతా మీ కోసం ఎదురు చూస్తున్నారని, ముందు భోజనం చేయమని చెప్పి వెళ్ళిపోయారు.
హేమాడ్‌పంత్ వారికి కృతజ్ఞతలు తెలిపి, వీడ్కోలు చెప్పి భోజనం చేయడానికి తిరిగి వచ్చి..అతిథి కోసం ప్రత్యేకంగా కేటాయించిన పీఠంపై బాబా చిత్రాన్ని ఉంచి... సాయిబాబా చిత్రపటానికి నైవేద్యం అర్పించిన తర్వాత కుటుంబమంతా భోజనం చేయడం ప్రారంభించారు.
హేమాడ్ పంత్ కు కలలో భోజనానికి హాజరవుతానని బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఈ రూపంలో వచ్చారు. షిర్డీలో అదే రోజు అదే సమయంలో హేమాడ్‌పంత్ ఇంట్లో బాంద్రాలో తాను రకరకాల పిండివంటలతో విందు భోజనం చేశానని బాబా శ్యామాతో చెప్పారు. హేమాడ్‌పంత్ బాబాను కలవడానికి షిరిడీకి వచ్చిన తరువాత... హోళీ పండుగ రోజున హేమాడ్ పంత్ ఇంటిలో బాబా విందు భోజనం చేసానని చెప్పిన మాటలు శ్యామాకు అప్పుడు అర్థం అయింది..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹
.jpg)
.jpg)


No comments:
Post a Comment