Saturday, June 8, 2024

శ్రీ పత్తి నారాయణరావు గారు...


 

ఓం శ్రీ సాయిరాం 🙏🙏


శ్రీ పత్తి నారాయణరావు గారు...


         శ్రీ పత్తి నారాయణరావు గారు ఆంధ్రప్రదేశ్ , శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురంలో ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు...


       తల్లిదండ్రులు శ్రీ పి.కామయ్యగారు, శ్రీమతి రామరత్నంగారు.. వీరికి నారాయణరావుగారు రెండవ కుమారుడు. అతనికి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు...


       1924 మే 15వ తేదీన శ్రీమతి కామేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. తర్వాత విజయనగరానికి వచ్చి.. ట్యుటోరియల్ కళాశాల నడుపుతూ ట్యూషన్లు చెప్పేవారు..


    వీరికి ఒక కుమార్తె (చంద్రమతి)..ఇద్దరు కుమారులు (శ్రీ సత్యనారాయణ.. శ్రీ కృష్ణారావు..)..వీరిలో పెద్దవారు విజయనగరంలో స్కూల్ టీచర్ గా..రెండవ వారు భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేశారు.


         కూతురు శ్రీమతి చంద్రమతికి 10 సం:ల వయస్సులో ఇంటి నుండి వెళ్లిపోయారు...ఎక్కడెక్కడో తిరుగుతూ షిరిడి చేరారు.  షిర్డీ వచ్చాక తిరిగి స్వగ్రామం వెళ్ళలేదు..


      హేమాడ్ పంత్ చిత్తు కాగితాలు మీద వ్రాసిన సాయి సచ్చరిత్రని కాకాసాహెబ్ దీక్షిత్ సాయిలీలా మాస పత్రికలో ప్రచురించేవారు...


       బాబా మహా సమాధి చెందిన 12 సం:ల తర్వాత 1930 నవంబర్ 26వ తేదీన శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీలో పుస్తకంగా ప్రచురితమైంది..


       బాబా సమాధి చెందిన 25 సం:ల తర్వాత 1944లో కర్ణాటక బెల్గాంకి చెందిన న్యాయవాది శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజీ గారు ఇంగ్లీషులోకి అనువదించారు..


        1945 సంవత్సరం తర్వాత తెలుగు భక్తులు షిరిడి దర్శించుకోవడం ఎక్కువైంది..


    పత్తి నారాయణరావు గారు షిరిడి రాగానే బాబా యందు మనసు లగ్నమై.. ఒక కోటి నామ జపం చేశారు..ఒకరోజు బాబా స్వప్న దర్శనమిచ్చి.. "ముంబైలో మీకోసం ఒక ట్యుటోరియల్ ఎదురు చూస్తూ ఉంది. అక్కడికి వెళితే నీకు ఉద్యోగం వస్తుంది!" అని చెప్పారు..


  బాబా చెప్పినట్లుగా ముంబై వెళ్లగా అక్కడ ట్యుటోరియల్ వారు అతను ఊహించనంతగా రూ.600/-ల జీతంతో ఉద్యోగంలో చేర్చుకున్నారు..


       షిరిడి నుండి వస్తూ గుణాజీ గారు వ్రాసిన సాయి సచ్చరిత్ర ఇంగ్లీష్ పుస్తకం తెచ్చుకున్నారు.. కానీ దానిని చదవటానికి సమయం కుదరలేదు..


      ఒకరోజు కాస్త ఖాళీ దొరకగా ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించారు.. ఇక విడవకుండా 16 సార్లు పారాయణం చేశారు.. 4 నెలల పాటు ప్రతినిత్యం బాబా చరిత్ర చదవడం నిత్యకృత్యం అయిపోయింది..


       ఆ తర్వాత ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనే సంకల్పం కలిగింది.. కానీ అప్పటికే ముంబై, పూనేలోనే కాక అనేకచోట్ల బాబా గురించి అనేక ప్రసంగాలు అనర్గళంగా ప్రసంగించేవారు..


    దానితో నేను అనర్గళంగా ప్రసంగిస్తున్నాను అనే అహంభావం ప్రవేశించింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తెలుగులోకి అనువదించలేక పోయారు..


     ఒకసారి దత్త జయంతికి షిరిడి వెళ్లడానికి ఒక సాయిభక్తుడు నుండి ఆహ్వానం వచ్చింది.. వెంటనే బయలుదేరి శిరిడి వెళ్ళారు..


    షిరిడిలో ఉండగా ఒకసారి స్వప్నంలో..బాబాగారి దగ్గరికి వెళుతున్నాను కదా!.. సద్గురువు దగ్గరకి ఉత్త చేతులతో వెళ్లకూడదని 2 దాన్నిమ్మ పండ్లు తీసుకొని సమాధి మందిరంలోకి వెళ్లి బాబాకు సమర్పించగా బాబా వాటిని ఎంతో ఇష్టంగా తిన్నట్లుగా స్వప్నం వచ్చింది..


        మరుసటి రోజు కాకడా హారతికి వెళ్ళగా.. స్వప్నంలో తాను ఎక్కడైతే బాబాకి దానిమ్మ పండ్లు సమర్పించాడో అక్కడ కొన్ని దానమ్మ గింజలు పడి ఉండటం చూసారు..

     

       స్వప్నంలో నువ్వు సమర్పించిన దానిమ్మ పండ్లని నేను స్వీకరించాను అని బాబా అతనికి తెలిసేలా చేశారు.. వెంటనే ఆ గింజలని ప్రసాదంగా తీసుకున్నారు..


     ఆ మరుసటి రోజు నుండి సాయి సచ్చరిత్ర తెలుగులోకి అనువదించటం ప్రారంభించారు.. ఆ దానిమ్మ గింజలని తిన్న 45 రోజులకి ఎంతో శ్రద్ధతో.. దీక్షతో సచ్చరిత్ర ప్రారంభించి అక్కడే ఉన్న శ్రీ శివనేసన్ స్వామి వారి సహాయం తీసుకుని.. 45 రోజులలో సచ్చరిత్రని పూర్తి చేశారు..


      45 రోజులపాటు సచ్చరిత్రను అనువదించే ప్రక్రియలో 18 గంటలు పని చేసేవారు.. ఒక్కొక్క అధ్యాయం, పేరా, లీలలు అన్ని శ్రద్ధగా పరిశీలించి శ్రీ శివనేశన్ స్వామివారి సహకారంతో...ఇద్దరూ చావడిలో కూర్చొని చర్చించి అనువాదం చేసేవారు..


     ఆ విధంగా తెలుగు సాయి సచ్చరిత్ర చావడిలో ప్రాణం పోసుకుంది.. అయితే ఆ పుస్తకం అంత తేలికగా ప్రచురితం కాలేదు.. ఆ రోజుల్లో షిరిడి సంస్థానం దగ్గర ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి తగిన ఆర్థిక వనరులు లేవు..అప్పటికే తాను చేస్తున్న 600 రూపాయలు ఉద్యోగాన్ని వదిలేశారు.. 


         పుస్తకం ప్రింటింగ్  భారాన్ని బాబా మీద వేసారు....

   ఇక్కడే బాబా తన మహిమని చూపించారు.. 


         వారు వ్రాసిన పేజీలని ఒక కాషాయ రంగు వస్త్రంలో మూటకట్టి.. సచ్చరిత్రకి వివిధ క్షేత్రాలలో ఉన్న సకల దేవతల ఆశీర్వాదం అందేలాగా..



దానిని చేతిలో పట్టుకుని కాశీ, కొల్హాపూర్, కర్నూలు, మహూర్‌గఢ్, కురుపురం, గాణుగాపూర్, హుమ్నాబాద్, అక్కల్‌కోట్, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వర్, పరేలి, ధాకిని, రామేశ్వరం, త్రయంబకేశ్వర్ (ఈ ఘ్రుష్ణేశ్వర్) జునాగఢ్, భద్రాచలం, ద్వారక, పండరీపురం, వేమపల్లి, పూరి, తిరుపతి, శ్రీ రంగం, తిరువనంతపురంలో పారాయణ చేయడమే కాక మూడు కోట్ల నామ జపం చేశారు..


    తిరిగి షిరిడి వచ్చి మరలా సచ్చరిత్ర పారాయణం చేశారు.. ఒకరోజు బాబా స్వప్నంలో.."నీవు సికింద్రాబాద్ వెళ్ళు!.. అక్కడ నా భక్తుడు ఒకరు నీకు సహాయం చేస్తారు!" అని చెప్పారు.. బాబా ఆజ్ఞ ప్రకారం సికింద్రాబాద్ వెళ్లి ఇద్దరు సాయి భక్తులని షెల్టర్ కోసం అడగగా.. వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పాపయ్యగారికి పరిచయం చేసారు..


      నారాయణరావు గారి సంకల్పం విని పాపయ్య గారు ఆ పుస్తకాన్ని నేను ప్రింటింగ్ చేయిస్తానని వాగ్దానం చేశారు.. ఆ రోజుల్లో హైదరాబాద్ లో షిరిడి సాయి సేవా సమాజం నడుపుతున్న జి .ఆర్ నాయుడు గారు పాపయ్య గారి స్నేహితులు..

   

         ప్రీమియర్ ప్రింటర్స్ అధినేత చందా నారాయణ శ్రేష్ఠి గారు అందరూ కలసి పేజీలలోని అక్షర దోషాలు సరిచేసి.. 1953 మే 19న.. ప్రీమియర్ ప్రింటర్స్ లో సాయి సచ్చరిత్ర తెలుగులో మొదటి పుస్తకం ప్రింట్ చేయించారు..


     ప్రింట్ అయిన పుస్తకాలని బాబాకి అంకితమివ్వాలని పాపయ్య గారు, జి. వి నాయుడు గారు, సాయిబృందం షిరిడి వచ్చి.. సమాధి మందిరంలో ఉంచి పూజ చేసి చేతిలో పట్టుకుని బయటకు వస్తూ ఉండగా.. ఒక స్త్రీ మూర్తి ఎదురు పడి "అవి ఏమిటి?" అని ప్రశ్నించింది..


      వారు "ఇవి సాయిబాబా చరిత్ర పుస్తకాలు" అని చెప్పగా... "మేము బెంగాల్ లో ఉంటాము..నేను చిన్నప్పట్నుండి సాయిని పూజిస్తున్నాను.. నేను ఇదే మొదటిసారి షిరిడి రావడం.. బాబా నన్ను అనుగ్రహించారు అనుకుంటాను..నాకు ఒక పుస్తకం ఇస్తారా?" అని అడిగింది.. 


      వెంటనే వారు ఒక పుస్తకాన్ని తీసి ఆమెకు అందించారు... ఆమె ఎవరో కాదు సాయి లీలమ్మ గారు.. తెలుగులో ప్రచురితమైన శ్రీ సాయి సచ్చరిత్రని మొట్టమొదటిసారిగా అందుకున్న మహాభాగ్యశాలి..


     1974 వరకు శ్రీ షిరిడి సాయి సేవా సమాజం హైదరాబాద్ వారే  పుస్తకాన్ని ప్రింటింగ్ చేయించేవారు..


   1975లో ఆ సంస్థానం హెడ్ అయిన జీ.వి నాయుడు గారు షిరిడి సంస్థానానికి తెలుగు పుస్తకం రైట్స్ స్వీకరించమని ఉత్తరం రాశారు.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పుస్తకం తాలూకు కాపీ రైట్స్ సంస్థానానికి అప్పగించారు.. అప్పటినుండి పుస్తకాన్ని షిరిడి సంస్థానం ప్రచురించడం ప్రారంభించింది..


     సాయిబాబా పాద పద్మముల వద్ద అలుపెరుగని సేవ చేసిన.. శ్రీ పత్తి నారాయణరావు గారు తన 56వ ఏట సాయిలో ఐక్యమయ్యారు. 

        

       భగవంతుడు అంటే భయం కాదు..భక్తి - ప్రేమ అనే దారి చూపేదే.. శ్రీ సాయి సచ్చరిత్ర..


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment