ఓం శ్రీ సాయిరాం 🙏🙏
శ్రీ సాయి మహరాజ్ దేవాలయం, జిల్లా కోర్టు కేంద్రం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం-521 002, ఆంధ్రప్రదేశ్
ఈ మందిరం ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని APSRTC బస్టాండ్, మెయిన్ రోడ్ సమీపంలో జిల్లా కోర్టు సెంటర్ వద్ద ఉంది. మందిరం ప్రధాన రహదారిపై APSRTC బస్టాండ్ నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది.
ఈ మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ.లక్ష్మీపురం విట్టల్ రావుగారు.
మందిర నిర్మాణానికి భూమి పూజ 1994లో విజయదశమి రోజున నిర్వహించారు. ఈ మందిరాన్ని 1998 మార్చి 15వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాయిభక్తులు శ్రీ మహాభాష్యం రంగాచారిగారు, శ్రీ కె.వి.రమణిగారు, స్వర్గీయ శ్రీ.సాయిలీలమ్మ గారు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక సాయిభక్తులు పాల్గొన్నారు.
మందిరం యొక్క గర్భగుడిలో 7.2 అడుగుల మార్బుల్ సాయిబాబా విగ్రహం నిలబడి ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం ప్రతిష్ఠాపనకు ముందు ఎంతో శ్రద్ధాభక్తులతో భక్తులు వ్రాసిన సాయి కోటి పుస్తకాలను భద్రపరిచారు...
ఈ మందిరంలో సమాధిలో సాక్షాత్తు శ్రీ సాయిబాబా నిద్రిస్తున్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని దర్శించగానే సమాధిలో బాబా సజీవంగా దర్శనం ఇచ్చిన అనుభూతి కలుగుతుంది...
మందిరం ప్రవేశ ద్వారం వద్ద 54 అడుగుల ఎత్తున్న పెద్ద సాయిబాబా విగ్రహం...విగ్రహం శిరస్సు మీద 5 తలలున్న ఆదిశేషుడు పడగను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించింది.
ఈ విగ్రహాన్ని 2007లో విజయదశమి రోజున హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలోని శ్రీ.రమణి బాబాగారు ప్రతిష్టించారు.
మందిరం లోపల గౌతమబుద్ధుడు మొదలుకొని సత్యసాయి బాబా వరకు 16 మంది సద్గురువుల ఇక్కడే కొలువై ఉన్నారనిపించేలా విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ సద్గురు విగ్రహాలని 2009లో గురుపూర్ణిమ నాడు ప్రతిష్ఠించారు...
ఈ మందిరంలో మహల్సాపతి, శ్యామా, చాందోర్కర్, దాసగణు మొదలైన సాయిబాబాకు ప్రత్యక్షంగా సేవ చేసిన సాయిభక్తుల విగ్రహాలు నిర్మించే పని జరుగుతోంది.
ఇక్కడ ప్రతి గురువారం, భజనలు..సత్సంగాలు..పల్లకీ సేవ నిర్వహిస్తారు. మందిరం 3 అంతస్తుల భవనం.
మొదటి అంతస్తులో ప్రతి గురువారం దాదాపు 2,500 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన మందిరం సత్సంగాలు, యోగా తరగతులు మొదలైన వాటికి కూడా ఉపయోగిస్తారు. రెండవ అంతస్తు ధ్యాన మందిరంగా ఉపయోగించబడుతుంది.
మందిరం ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. ప్రతిరోజూ 4 హారతులు నిర్వహిస్తారు. సాయిబాబా విగ్రహానికి ప్రతిరోజూ అభిషేకం నిర్వహిస్తారు. సప్తాహంగా సాయి సచ్చరిత్ర పారాయణం మందిరంలో ప్రతిరోజూ జరుగుతుంది.
ఈ మందిరాన్ని దర్శించుకున్న సాయిభక్తులకు మంచి మందిరాన్ని దర్శించిన అనుభూతితో పాటు... ప్రశాంతత, ఆనందం తప్పకుండా కలుగుతాయి.
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment