ఓం శ్రీ సాయిరాం 🙏🙏
సాఠేవాడా...
సాయిని సందర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 1908లో రావు బహద్దూర్ హరివినాయక్ సాఠే దీనిని నిర్మించారు..
షిరిడీలో ఏర్పడిన మొట్టమొదటి వాడా..
షిరిడి సందర్శించే యాత్రికుల కోసం సాఠే ఒక వాడా కట్టాలని ఆలోచిస్తున్నప్పుడు.. బాబా సాఠేతో "గ్రామ గోడను తీసివేసి కట్టండి!" అన్నారు..
బాబా ఆజ్ఞ ప్రకారం గ్రామ గోడ శిథిలమైన చోట గురుస్థాన్ దగ్గర స్థలాన్ని కొని.. హరివినాయక్ సాఠే గ్రామ గోడతో సహా సాఠేవాడా నిర్మించారు..
అప్పట్లో దూరం నుండి వచ్చే భక్తులకు ఈ వాడా ఉపయోగకరంగా ఉండేది..(సాయి సచ్చరిత్ర అధ్యాయం-4)..
బాబా నిర్ణయించిన సమయానికి సాఠేవాడా ఒక పౌర్ణమి రోజున ప్రారంభమైంది... నిర్మాణం జరుగుతున్నప్పుడు గోడలు ఎత్తుగా కట్టవలసిన చోట గురుస్థానంలోని వేపచెట్టు కొమ్మలు అడ్డుగా వచ్చాయి..
బాబా నిర్మాణానికి అడ్డుగా ఉన్న కొమ్మలని నరికి వేయమని చెప్పారు.. కానీ గురుస్థాన్ వేపచెట్టు కొమ్మలని నరకడానికి ఎవ్వరూ సాహసించలేదు..
అప్పుడు బాబాయే స్వయంగా అడ్డుగా ఉన్న కొమ్మలను నరికేశారు..
ఈ వాడాలో ఎంతోమందికి సాయితో భక్తులకు గల అనుభవాలు.. సాయి లీలలు దాగి ఉన్నాయి..
తాత్యాసాహెబ్ నూల్కర్ సద్గతి పొందింది ఈ వాడాలోనే.. ఆ సమయంలో అతని చిన్ననాటి స్నేహితుడు నీలకంఠ సహస్రబుద్దే అక్కడే ఉన్నారు.. వారు ఎప్పుడు షిరిడి వచ్చినా సాఠేవాడాలోనే ఉండేవారు..
దాదా కేల్కర్.. హరివినాయక్ సాఠే ఈ వాడాలోనే నివసించేవారు..
మేఘశ్యాముడు.. ఖపర్థే చాలాకాలం ఈ వాడాలోనే ఉన్నారు..
మేఘశ్యాముడు మసీదులో బాబాను పూజించి.. ఈ వాడాలోనే నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన బాబా చిత్రపటాన్ని పూజించేవాడు..
ఒకసారి బాబా స్వప్నంలో త్రిశూలం గీయమని మేఘుడుని ఆజ్ఞాపించారు.. బాబా ఆజ్ఞ ప్రకారం త్రిశూలం గీసిన మరుసటి రోజే పూనా నుండి వచ్చిన ఒక రామదాసి భక్తుడు సమర్పించిన శివలింగాన్ని బాబా మేఘశ్యాముడికి ఇచ్చారు.
మేఘశ్యాముడు దానిని తాను పూజించే బాబా చిత్రపటం వద్ద ప్రతిష్టించి పూజించేవాడు..(ప్రస్తుతం ఆ శివలింగం గురుస్తాన్ లో ప్రతిష్టించబడింది..)
ఖపర్థే ఈ వాడాలోనే షిరిడి డైరీ (ఖపర్థే డైరీ)వ్రాశారు..
భీష్మ.. "శ్రీ సాయినాథ సగుణోపాసన" (ఆరతి పుస్తకం..) ఇక్కడే రచించారు..
రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ కుటుంబం..(సీతాదేవి తర్ఖడ్..జ్యోతేంద్ర తర్ఖండ్..) (సాయి సచ్చరిత్ర అధ్యాయం-9).. ఈ వాడాలోనే ఉండేవారు..
స్వామి సాయి శరణానంద షిరిడి సందర్శించినప్పుడల్లా..(1983లో తన 94 సంవత్సరాల వయసులో సాయిలో ఐక్యమయ్యేంతవరకు..)ఈ వాడాలోనే నివసించేవారు..
1924 సెప్టెంబర్ 30వ తేదీన R.S. నవాల్కర్ ఈ వాడాను కొనుగోలు చేశారు.. 1939లో V.N..గోరక్షకర్ ఈ వాడాను షిరిడి సంస్థానానికి అప్పగించడంలో నవాల్కర్ వారసులని ఒప్పించారు..
1939లో నవాల్కర్ వారసులు ఈ వాడాను షిరిడి సాయి సంస్థానానికి బహుమతిగా సమర్పించారు..
1941లో భక్తుల సౌకర్యార్థం సంస్థానం వారు అదనంగా నాలుగు గదులు నిర్మించారు.. 1980 వరకు ఈ వాడాను భక్తుల సౌకర్యార్థం ఉపయోగించారు.. ఆ తర్వాత క్యాంప్ ఆఫీసుగా వినియోగించారు..
1998-99లో షిరిడి సంస్థాన్ వారు ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలని ఆధునీకరణ (రీ మోడలింగ్) చేసే ప్రక్రియలో భాగంగా ఈ వాడాను పడగొట్టారు..
ఇలా ఎంతోమంది సాయిభక్తుల హృదయాలలో ఎన్నో జ్ఞాపకాలకు.. సాయితో ప్రత్యక్షంగా కలిగిన ఎన్నో అనుభవాలకు నిలయమైన ఈ వాడా ఇప్పటి తరం సాయి భక్తులకు ఒక జ్ఞాపకం మాత్రమే..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

.jpg)
No comments:
Post a Comment