Saturday, June 8, 2024

శ్రీ తుకారాం రాఘూజి ( శ్రీ. అప్పాసాహెబ్ బాపురావు బోరవాకే)..

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏..


శ్రీ తుకారాం రాఘూజి ( శ్రీ. అప్పాసాహెబ్ బాపురావు బోరవాకే)..



     వీరు సాయిని సశరీరంగా ఉన్నప్పుడు దర్శించలేదు..  కాలినడక షిరిడి వచ్చి అక్కడే స్థిరపడి సాయిభక్తులుగా మారి లక్షలు సంపాదించారు..


   వీరి ప్రస్తావన శ్రీ సాయి సచ్చరిత్రలో కనిపించదు... కానీ సాయి శరణానందుల వారు రచించిన "సాయి ద సూపర్ మాన్'" పుస్తకంలో వీరి ప్రస్తావన ఉంటుంది.. ఈ పుస్తకాన్ని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వారు ప్రచురించారు.. 1930లో సంస్థానవారు ప్రచురించే సాయి లీలా మ్యాగజైన్లో వీరి గురించి ప్రచురించారు..


     బాపురావు 1901వ సం:లో ససావాద్‌లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు...


     అతను పసితనంలో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయాడు.. పసితనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అతని బంధువులు ఆస్తిని కాజేసి ఒంటరిగా వదిలేశారు.. బాపురావు 10వ (SSC) తరగతి వరకు చదువుకున్న వెంటనే ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చింది.


     ఇతను 1920-21 మధ్యకాలంలో మొదటిసారిగా కేవలం మూడు అణాలను జేబులో పెట్టుకుని కాలినడకన షిర్డీకి వచ్చి... శ్రీ సాయిబాబా అనుగ్రహంతో లక్షల రూపాయలు సంపాదించాడు.


     అతనికి మామ వరస అయ్యే బంధువు షిరిడిలో ఉండడంతో.. ఏదైనా ఉపాధి దొరుకుతుంది అన్న ఆశతో షిరిడికి బయలుదేరి కోపర్ గావ్ చేరుకున్నాడు.. అప్పటికే అతని వద్ద ఉన్న డబ్బు అయిపోయి కేవలం మూడు అణాలు మాత్రమే మిగిలాయి.  మూడు అణాలకి టాంగా వ్యక్తి టాంగా ఎక్కించుకోక పోవడంతో కోపర్ గావ్ నుండి కాలినడకన షిరిడి చేరుకున్నాడు..


     షిరిడి చేరుకున్న వెంటనే.. సమాధి మందిరానికి వెళ్లి బాబాను దర్శించి నమస్కరించి.. తర్వాత తన బంధువు మామగారింటికి వెళ్లాడు.. ఆయన బాపురావుని ఆప్యాయంగా ఆహ్వానించి.. వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలాన్ని ఇచ్చాడు..


     బాపురావు అందులో చెరుకు పంట వేసి.. బాగా దిగుబడి సాధించాడు.. మరుసటి సంవత్సరం మరికొంత పొలాన్ని తీసుకొని చెరుకు పంట సాగు చేశాడు.. ఆ సంవత్సరం చెరుకుకి ఎక్కువ డిమాండ్ ఉండటంతో ధర బాగా పలికి.. వ్యవసాయం ప్రారంభించిన రెండు సంవత్సరాలకే లక్ష రూపాయలు సంపాదించాడు..


     ఇదంతా బాబా అనుగ్రహం వల్ల జరిగిందని భావించి... ప్రతిరోజు బాబాను దర్శించుకోవచ్చు అన్న సంకల్పంతో షిరిడీలోనే కొంత భూమిని కొనుగోలు చేసి.. అందులో తనకోసం ఇల్లు నిర్మించుకుని.. ఆ భూమిలోనే ఆధునిక కెనాల్ ఇరిగేషన్ టెక్నిక్ ఉపయోగించి నారింజ, బత్తాయి తోటలను వేశాడు..


    1930 సంవత్సరంలో షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు జరిగాయి.. ఆ సందర్భంగా సాయిభక్తులైన తాత్యా గణపతి కోతే పాటిల్, వామన్ మంకు, రామచంద్రదాదా, బయాజీ సఖారామ్‌తో పాటు మరికొంతమంది గ్రామస్థులకు విభేదాలు వచ్చాయి..

బాపురావు గ్రామస్తులకి సాయి భక్తులకు మధ్య సఖ్యత కుదిర్చి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరిపించారు..


    ఈ సమాచారాన్ని దాసగణు మహారాజ్ సాయి లీల మ్యాగజైన్ లో ప్రచురించారు..


    1950-54 సంవత్సరంలో బాపురావు పూర్తిగా బత్తాయి పంట సాగుపై దృష్టి పెట్టి.. ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పంటని సాగుబడి చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు..


     అప్పటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు.. ముంబై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారు.. స్వయంగా ఆయన క్షేత్రాన్ని సందర్శించి ఆయన సాధించిన విజయాన్ని చూసి ఆశ్చర్యపోయి వారిని అభినందించారు..


     1955-56 సంవత్సరంలో న్యూ ఢిల్లీలో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో అతని బత్తాయి పండ్ల స్టాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి పండ్ల విభాగంలో మొదటి బహుమతిని పొందాడు...


       బాపురావు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీగా కూడా కొన్నాళ్లు పనిచేశారు...ఇతను 1988 ఏప్రిల్ 1వ తేదీన షిర్డీలో మరణించారు...మరణించే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరాలు...


     ఇప్పటికీ షిర్డీ నుండి రహతా వెళ్లే మార్గంలో ఆయన పండ్లతోట ఉన్న బంగ్లాను చూసినప్పుడు..తనను పూర్తిగా నమ్మినవారి పట్ల బాబా దయ ఏ విధంగా ఉంటుందో?.. బంధువులు ఆస్తిని కాజేసినా.. కృషి ,పట్టుదల అన్నింటికీ మించి సాయి అనుగ్రహం ఉంటే చాలు ఏదైనా సాధించగలం అనే విషయం సాయి భక్తులకు గుర్తుకువస్తుంది...


     బాపురావు షిర్డీకి చేరినప్పటి నుండి తన పొలం నుండి  సాయిబాబా సమాధికి మరియు అబ్దుల్ బాబా సమాధికి గులాబీ పువ్వులను సమర్పించేవాడు. దాదాపు 45 సంవత్సరాల పాటు ఈ ఆచారాన్ని పాటించాడు. ఉదయం కాకడా ఆరతి, సాయంత్రం ధూప్ ఆరతికి  తప్పకుండా హాజరయ్యేవాడు...


     నేటికీ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు స్వర్గీయ బాపురావు వారసులు.. తండ్రి ప్రారంభించిన ఆచారాన్ని వదలకుండా తమ పొలం నుండి సాయిబాబా సమాధికి మరియు అబ్దుల్ బాబా సమాధికి పూలు సమర్పిస్తారు...


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏🌹...

No comments:

Post a Comment