ఓం శ్రీ సాయిరాం 🙏🙏
ఉపాసనీ బాబా కన్యాకుమారి ఆశ్రమం.. సాకోరి..
గోదావరి మాత.. ఈమె1914 డిసెంబర్ 24వ తేదీన మహారాష్ట్ర అకోలా జిల్లా షేగావ్ లో (గజానన్ మహారాజ్ గారి.. స్థానం) జన్మించింది.
తల్లిదండ్రులు శ్రీ వాసుదేవరావు గారు.. రమాబాయి.. తాతగారు భాస్కరరావు హాత్వాళీకర్ గారు..
గోదావరి మాత తాతగారు గజానన్ మహారాజు గారి శిష్యులు.. ఒకసారి వారిని దర్శించుకోగా.. మహారాజ్ గారు "నేను నీకు ఇచ్చే బహుమతి ఏ మహాత్ముడు ఇవ్వడు.. నేను నీ ఇంట జన్మించి నీ వంశాన్ని ఉద్ధరిస్తాను!" అని చెప్పారు..
గజానన్ మహారాజ్ గారు నిత్యం "గంగా - గోదావరి" నామాలు ఉచ్చరించెడివారు.
డిసెంబర్ 24వ తేదీన తన కుమారుడు వాసుదేవరావుకు కుమార్తె జన్మించగా.. గజానన్ మహారాజు నిత్యం ఉచ్చరించే "గోదావరి" నామాన్ని తన మనవరాలికి పెట్టారు.
గోదావరిమాత చిన్నతనంలో తండ్రి గారికి ఉద్యోగం నాగపూర్ కి బదిలీ కాగా.. ఒక రోజున కుటుంబ సమేతంగా తాజుద్దీన్ బాబా దర్శనం చేసుకున్నారు..
అక్కడికి వెళ్లి గోదావరి మాత తాజుద్దీన్ బాబాకి నమస్కరించగా.. తాజుద్దీని బాబా తన మెడలో పూల హారం తీసి గోదావరి మాత మెడలో వేశారు..(గజానన్ మహారాజ్ గారికే పూలమాల వేశాను అనే భావంతో..)
మరొకసారి నాగపూర్ లోని సాయి మౌలా అనే మహమ్మద్ ఫకీర్ ను దర్శించగా.. వారు కూడా గజానన్ మహారాజు గారికే సమర్పిస్తున్నట్లుగా తన మెడలో పూలహారం తీసి గోదావరి మాత మెడలో వేసి ఆశీర్వదించారు..
1923వ సంవత్సరంలో శ్రీ వాసుదేవరావు గారికి కులకర్ణి అనే వారితో పరిచయమేర్పడి.. ఉపాసనీ బాబా గురించి వారు రచించిన "సాయి - వాక్సుధా" గురించి విని వారిని దర్శనం చేసుకోవాలని ఉత్కంఠ కలిగింది.
గోదావరి మాతకి 10 సంవత్సరాల వయసులో కులకర్ణి గారు.. వారి తల్లి.. మరి కొంతమందితో కలిసి సాకోరి వెళ్లి మొదటిసారిగా ఉపాసనీ బాబా గారిని దర్శించుకుంది.. ఉద్యోగంలో సెలవు దొరకని కారణంగా ఆమె తండ్రికి అవకాశం లేకపోయింది..
ఆమెను చూసిన ఉపాసనీ బాబా.. జామపండు ప్రసాదంగా ఇచ్చి.. వారి సమీపమున నిలబడి ఉన్న స్త్రీలను చూసి.. "వీరందరూ మనవారే ఇక్కడున్నదంతయు నీదే!" అని అన్నారు..
కొద్ది సంవత్సరాలకి ఉపాసనీ బాబా ఆమెకి ఉపదేశం ఇవ్వడంతో..అప్పటినుండి వారిని సద్గురువుగా భావించి గురువే తల్లి, తండ్రి, దైవంగా భావించి సేవ చేయసాగింది.
ఉపాసనీ బాబా స్త్రీలకు కూడా యజ్ఞకర్మలాచరించు అధికారము కలదని భావించి.. సంస్కృత పాఠశాల స్థాపించి.. కన్యాకుమారి ఆశ్రమం నందలి కన్యలకి యజ్ఞ కర్మలు బాబాగారే స్వయంగా నేర్పించి.. అక్కడ శాశ్వత యజ్ఞమండపం ఒకటి కట్టించి.. యజ్ఞ కర్మలను కూడా చేయనారంభించారు. అప్పటినుండి సాకోరినందు యజ్ఞ కార్యములు ఆరంభమయ్యాయి.
ఉపాసనీ బాబా సమాధి అనంతరం ఆశ్రమం బాధ్యతలు స్వీకరించి.. యజ్ఞ యాగాది క్రతువులు చేయనారంభించింది.. 1951లో ఏడుగురు కన్యలు ఈమెకి శిష్యులుగా వచ్చారు..
ఇక్కడ సంవత్సరానికి 7 యాగములు జరుగుతాయి..
చైత్రమాసం.... రామ యాగం
వైశాఖ మాసం... విష్ణు యాగం
ఆషాడ మాసం... గురు యాగం
భాద్రపద మాసం... గణేశ యాగం
ఆశ్వయుజ మాసం... దేవి యాగం
పుష్య మాసం.. సూర్య యాగం
మాఘమాసం... రుద్ర యాగం..
ఈ యజ్ఞ కార్యములన్నీ గోదావరి మాత ఆధ్వర్యంలో శిష్యులతో కలిసి నిర్వహించేవారు..
ఇప్పటికీ ఆశ్రమంలో యజ్ఞ కార్యాలు నిర్వహిస్తున్నారు..
గోదావరి మాత ఆగష్టు 11, 1990న సమాధి చెందారు. ఆమె ఎవరినీ వారసునిగా పేర్కొనలేదు.
శ్రీ ఉపాసనీ మహారాజ్ మరియు గోదావరి మాత సమాధులు కన్యాకుమారి ఆశ్రమం ప్రాంగణంలోనే ఉన్నాయి.
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment