ఓం శ్రీ సాయిరాం 🙏 🙏
శ్రీమతి సుందరి బాయి క్షీరసాగర్ (రాధాకృష్ణమాయి).
ఈరోజు షిరిడి సంస్థానం ఒక సంస్థగా రూపుదిద్దుకున్నది అంటే దానికి ఆద్యం మూలం సుందరీబాయి. సాయికి శేజ్ ఆరతి, కాకడాఆరతి జరుగుతున్నాయి అంటే దానికి కారణం సుందరి బాయి. బాబా చావడికి వెళ్ళేటప్పుడు సంగీత వాయిద్యాల ఘోష, గుర్రం, పల్లకీ, పతాకాలు వంటి అన్ని హంగులు, ప్రత్యేక దుస్తులు ధరించి ముందు నడిచే దండధారులు, భజన బృందాలు.. అది ఒక ఉత్సవంలా రూపుదిద్దుకోవడానికి కారకురాలు సుందరిబాయి (రాధాకృష్ణమాయి) . ఆ రోజుల్లోనే శిరిడీ రూపురేఖలు మార్చడంలో ఆమె ఎంతగా కృషి చేసిందో స్పష్టంగా తెలుస్తుంది.
ఆమె 1882లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి పేరు శకుంతలాబాయి క్షీరసాగర్. ఆమె తండ్రి గురించిన సమాచారం లేదు. 1899లో ఆమెకు వివాహమైంది. విధివశాత్తూ వివాహమైన 8 వ రోజున ఆమె భర్త మరణించాడు. వితంతువైన స్త్రీ పట్ల ఆనాటి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఎంతో కఠినంగా ఉంటాయో మనకి తెలియనిది కాదు. భర్త మరణంతో కుంగిపోయిన సుందరీబాయి తన శేష జీవితాన్ని తనకి ఇష్టమైన శ్రీకృష్ణుని సేవలో గడపాలని పండరీపురం చేరుకొని అక్కడ వకీలుగా పనిచేస్తున్న తన మామగారి ఇంట్లో ఉండ సాగింది. ప్రతిరోజు ప్రాతఃకాలం స్నానం ఆచరించి రాధాకృష్ణమూర్తిని తనివి తీరా పూజించి పండరీనాథని దర్శనానికి వచ్చి కనులారా ఆ స్వామిని దర్శించి.. ఈ దీనురాలికి అనన్యమైన భక్తిని ప్రసాదించు.. నీ దివ్యచరణాలాను సేవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆర్తితో వేడుకునేది. ఆమెకు పాండురంగని పాదాల యందు భక్తి.. సంకీర్తన.. పాండురంగని అర్చన తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది. కీర్తనలు ఆలపిస్తే ఆమె గొంతులోని మాధుర్యానికి శ్రీకృష్ణుడు సైతం పరవశించి పోవాల్సిందే.. అంత మధురంగా తుకారాం అభంగాలను ఆలపించేది. అంతటి మహా భక్తురాలు నానా సాహెబ్ ఛాందోర్కర్ ద్వారా బాబా గురించి విని 1906 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షిరిడి చేరి బాబా పాదాలు ఆశ్రయించింది. షిరిడి గ్రామం చేరగానే ఆమెకు ఆ గ్రామం మధురానగరంలా, బృందావనంలా అడుగడుగునా శ్రీకృష్ణుని రూపమే కనిపించింది. శ్రీకృష్ణుడు నివసించినది ద్వారకానగరం. బాబా నివసించిన మసీదుకు ద్వారకామాయి అని పేరు. తన పాదాలను ఆశ్రయించిన సుందరీబాయికి బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మునిలా దర్శనమిచ్చారు.
ఆమెను ఆశీర్వదించి ఎదురుగా కనిపిస్తున్న ఒక కుటీరాన్ని చూపించి "నీవు ఆ శాలలో నివాసం ఉండవచ్చు" అని చెప్పారు. షిరిడియే తన నివాసమని సాయిబాబాయే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని, సద్గురువు అని భావించి షిరిడిలోనే నివాసం ఉండాలని నిశ్చయించుకుంది. అందుకే సుందరిబాయి కుటీరాన్ని అందరూ శాల అని పిలిచేవారు. షిరిడి చేరుకున్నాక సుందరిబాయి నిరంతరం రాధాకృష్ణ నామాన్ని జపిస్తూ రాధాకృష్ణుల విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించేది. అందుకే షిరిడి గ్రామస్తులు రాధాకృష్ణ ఆయి అని పిలిచేవారు. అప్పటినుండి సుందరీ బాయ్ క్షీరసాగర్ పేరు రాధాకృష్ణమాయిగా పేరు స్థిరపడిపోయింది. ఆయి అంటే తల్లి అని అర్థం. బాబా మాత్రం 'రామకృష్ణీ' అని పిలిచేవారు.
ఆమె తన శాల నుంచి బయటకి వచ్చేది కాదు. ఎప్పుడైనా రావాల్సి వస్తే ముఖానికి ముసుకు ధరించేది. ఒకసారి బాబా నీమ్ గావ్ వెళుతుంటే బాబాకి నమస్కరించాలన్న తొందరలో ముసుగు వేసుకోకుండా బాబాకి నమస్కరించింది. ఎన్నో నెలలనుంచి షిరిడీలో ఉంటున్న ఖపర్థే మొదటిసారిగా రాధాకృష్ణమాయిని ముసుగు లేకుండా చూశాను అని తన డైరీలో రాసుకున్నారు.
బాబా లెండితోటకి.. చావడికి.. మసీదుకి నడిచే దారిని బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండేవాడు. నేవాస్కర్ చేసే ఆ పనిలో రాధాకృష్ణమాయి సహాయం చేయడం ప్రారంభించి, అతను మరణించాక ఆ పనిని తానే పూర్తిగా చేయడం ప్రారంభించింది. బాబా ప్రతి రోజు లెండితోటకి వెళుతుండేవారు. ఆ సమయంలో బాబాకి ఎండ తగలకూడదని తోటి భక్తులతో కలసి దారి పొడవునా వంపుగా ఉండే ఇనుప స్తంభాలు పాతించి వాటికి ఇనుప తీగలు బిగించి వాటి మీదకి పూలచెట్ల తీగలు అల్లుకునేలా స్తంభాలకి ఇరువైపులా చెట్లు నాటించేది. ప్రతినిత్యం వాటికి నీరు పెట్టి వాటి నిర్వహణ బాధ్యత జాగ్రత్తగా చూసేది. తన చేసే పని యందు ఎంత శ్రద్ధ అంటే బాబా నడిచేదారులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి వాటి మీద తన అడుగులు కూడా పడకుండా జాగ్రత్త పడేది.
ఆమె నిత్యం బాబా సేవలో గడపడమే కాక సాటి భక్తులను కూడా సేవలో పాల్గొనేలా ప్రోత్సహించేది. ప్రతినిత్యం చేసే సేవే కాకుండా పర్వదినాల్లో మసీదుని శుభ్రపరచడం.. రంగురంగుల కాగితాలలో పువ్వులు జెండాలు తయారు చేయడం... షిరిడీకి వచ్చే ఉత్సవ పతకాలను ఇది శుభ్రపరచడం.. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మసీదులో ఉయ్యాల ఏర్పాటు చేయడం... గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మ దినోత్సవ వేడుకకి ఏర్పాట్లు చేయడం.. హరిదాసుల భగవత్ సంకీర్తనకు అవసరమైన ఏర్పాట్లు.. ఆ సందర్భంగా తన ఇంటిలో విపరీతంగా మిఠాయిలు వండడం ఈ బాధ్యతలన్నీ ఆమె ఇతర భక్తులతో సాయంతో నెరవేర్చేది.
రాధాకృష్ణమాయి కొన్ని సేవలలో సాటి భక్తుల సహాయం తీసుకున్న.. కొన్ని పనులు మాత్రం తను ఒక్కతే నిర్వర్తించేది ఆ పనులలో ఎవరిని జోక్యం చేసుకోనిచ్చేది కాదు. మసీదులో రెండు మట్టి కుండలు ఉండేవి ఆ కుండలలో నీరు ఎప్పుడూ నిండుగా ఉండేది. వాటిని ఎవరు ఎప్పుడు నింపుతున్నారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. దీక్షిత్ వాడా వెనుక ఒక బావి ఉండేది. ఆ బావి నుండి అర్ధరాత్రి మూడు గంటలకు రాధాకృష్ణమాయి నీళ్లు తీసుకుని వచ్చి మసీదులో కుండలు నింపేది. ఈ సంఘటనని తాను స్వయంగా చూసినట్లుగా వామనరావు పటేల్ (సాయి శరణానంద) తన రచనలలో వ్రాసుకున్నారు. షిరిడి గ్రామస్తులే కాక సాయిని దర్శించుకున్న భక్తులు.. బూటీ..రేగే.. ఖపర్థే మొదలగువారు ఆమెని ఎంతగానో గౌరవించేవారు.
1914వ సంవత్సరం గురుపౌర్ణమి వేడుకల కోసం రాధాకృష్ణమాయ ఇంటిలో వంట కార్యక్రమం జరుగుతున్నప్పుడు మసాలా దినుసులు నూరటం కోసం వంటవారు ఒక రోలుని అడిగారు. రోలుని వంట వారి దగ్గరకు చేర్చే ప్రయత్నంలో.. M.B.రేగేగారు, రాధాకృష్ణమాయి ఇద్దరూ కలిసి రోలుని కొంత దూరం కదిలించారు. మధ్యలో పురందరే వచ్చి సాయం చేశారు.. రోలుని కదిలించే సమయంలో రోలు పొరపాటున ఒక ప్రక్కకి ఒరిగి పురందరేగారి వేలు నలిగే పరిస్థితి వచ్చింది. వెంటనే రాధాకృష్ణమాయి ఒడుపుగా దినిని తన వైపు త్రిప్పుకుంది. ఆమె కుడిచేతి చూపుడు వేలు రెండు ముక్కలయినట్లుగా నలిగిపోయింది. అంత బాధని ఓర్చుకుని రక్తం కారుతున్న వేలుకి నూనె తడిపిన ఒక వస్త్రం చుట్టి.. వంటలో సాయం చేయటానికి వెళ్లి.. వంట అంతా పూర్తయ్యాక రేగే గారిని పిలిచి.. "నొప్పి చాలా ఎక్కువగా ఉంది. తోటలోకి వెళ్లి ఏడవాలని ఉంది!" అని చెప్పింది. ఇద్దరి తోటలోకి వెళ్ళగా అరగంటపాటు కూర్చొని తనివి తీరా ఏడ్చింది.
షిరిడిలో నిత్యం జరిగే సేవలలోను పర్వదినాల్లో జరిగే విశేష కరమైన సేవలలోను.. ప్రతి కార్యక్రమంలోనూ రాధాకృష్ణమాయి యొక్క కృషి స్పష్టంగా కనిపిస్తుంది..
రాధాకృష్ణమాయి ఒక గంట ఒక రోజు వారం రోజులు కాదు దాదాపు తొమ్మిది సంవత్సరాలు (బ్రతికి ఉన్నంతవరకు) ప్రతినిత్యం రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు అనే ఊసే లేకుండా భక్తితో శ్రద్ధతో ప్రతి సేవ త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణా చేసే సేవ యందు లగ్నం చేసి ధన్యురాలయింది..
రాధాకృష్ణమాయి 1916లో 35 సంవత్సరాల వయస్సులో మరణించింది..
(శ్రీ బి.వి. నరసింహ స్వామిజీ గారి భక్తుల అనుభవాలు ఆధారంగా..)
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment