Saturday, June 8, 2024

ఉపాసనీ బాబా ఆశ్రమం.. సాకోరి..మహారాష్ట్ర..


 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏

ఉపాసనీ బాబా ఆశ్రమం.. సాకోరి..మహారాష్ట్ర..


     ఉపాసనీ బాబా (కాశీనాథ్ గోవిందరావు ఉపాసనీ..).. మహారాష్ట్ర సతానాలో బ్రాహ్మణ కుటుంబంలో 1870 మే 15వ తేదీన జన్మించారు..


చిన్నతనం నుండి ఆధ్యాత్మిక జ్ఞానమైన యోగాభ్యాసము సంధ్యావందనం మీద ఆసక్తిగా ఉండేది..


ఒకసారి ఓంకారేశ్వరంలో సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొలిపింది..


అప్పటినుండి అతనికి శ్వాసకోశానికి సంబంధించిన (ఊపిరి పీల్చుకోవడం..) బాధ ఎక్కువైంది..


యోగాభ్యాసంలో వచ్చిన సమస్య యోగాభ్యాసం తెలిసిన యోగులే పరిష్కరించగలరని.. రాహూరీలోని యోగి కులకర్ణి గారిని దర్శిస్తే.. వారు "మీ సమస్యకు పరిష్కారం షిరిడి సాయిబాబా చెప్తారు. ఆయనని దర్శించుకోమని" సలహా ఇచ్చారు..

సాయి "ముస్లిం" అని భావించి.. ఖేడ్గావ్ బేట్ లో ఉన్న నారాయణ మహారాజ్ గారిని దర్శించుకుందామని బయలుదేరాడు..


మార్గమధ్యంలో శ్వాస పీల్చుకోవడం కష్టమైతే.. ఒక వృద్ధుడు వచ్చి.. "చల్లటి నీరు వద్దు?" వేడి నీరు త్రాగమని సలహా ఇచ్చారు.. ఆ సలహాను పాటించక చల్లటి నీరు త్రాగబోతే ఆ వృద్ధుడు మందలించి.. "ప్రక్క గ్రామానికి వెళ్లి వేడి నీరు తాగమని" చెప్పారు...


వృద్ధుడి సలహాతో వేడి నీరు త్రాగగానే బాధ తగ్గింది..

ఖేడ్గావ్ బేట్ వెళ్లి నారాయణ మహారాజు గారిని దర్శించగానే.. వారు "నీవు మంచి యోగ స్థితిలో ఉన్నావు!" అని చెప్పారు.. కానీ అతని సమస్య తీరలేదు..


నిరాశగా మరల యోగి కులకర్ణి గారిని దర్శించుకోగా.. వారు షిరిడి సాయిబాబాని దర్శించుకోమని మరలా సలహా ఇచ్చారు..


వేరేదారి లేక 1911 జూన్ 27వ తేదీన షిరిడి వచ్చి మొట్టమొదటిసారిగా సాయిని దర్శించుకున్నారు..

సాయి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడక తిరిగి వెళ్లడానికి బయలుదేరగానే.. "నీవు వెళ్ళవద్దు? వెళ్ళినా 8 రోజులలో తిరిగి వస్తావు!" అన్నారు బాబా..


అయినా వినకుండా షిరిడి నుండి బయలుదేరి ఎంత వేగంగా నడిచినా 8 రోజులలో కోపర్గావ్ మాత్రమే చేరుకోగలిగారు..


అక్కడ మొదటిసారిగా షిరిడి దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు తోడుగా రమ్మని బలవంతన షిరిడి తీసుకొచ్చారు..


సాయి అతడిని చూస్తూనే నవ్వి.."ఎన్ని రోజులైంది నువ్వు వెళ్లి?" అని అడిగారు.. తర్వాత "ఖండోబా మందిరంలో 4 సం:లు పాటు మౌనంగా ఉంటే నా స్థితి నీకు వస్తుంది!" అని చెప్పారు..


మూడున్నర సం:ల తర్వాత.. సాయికి చెప్పకుండా భక్తులతో కలిసి షిరిడి విడిచి ఖరగ్ పూర్ వెళ్లారు.. 1915 తర్వాత ఖరగ్ పూర్ విడిచి నాగపూర్ వెళ్లి అక్కడనుండి షిరిడి వచ్చారు..


1915లో ఉపాసనీ బాబా సాయిబాబాతో ఉన్నప్పుడు.. మెహర్ బాబా ఉపాసనీబాబాని మొదటిసారిగా కలిశారు..


1917 జూలైలో సాకోరి గ్రామంలో కొంతమంది సాయిభక్తులు ఉపాసనీ బాబాని తమ గ్రామంలో ఉండమని చెప్పగా.. అక్కడ ఆశ్రమం నిర్మించి ఉపాసనీ బాబాగా స్థిరపడ్డారు..


1922లో వెదురు కర్రలతో పంజరాన్ని నిర్మించుకొని.. (ప్రస్తుతం వెండితో చేయబడింది) అందులో తనకు తానుగా బందీగా ఉన్నారు..


మెహర్ బాబా తరచుగా సాకోరి వెళ్లి ఉపాసనీ బాబాని దర్శించుకునేవారు.. 1941 అక్టోబర్ 17వ తేదీన.. నాసిక్ జిల్లా.. నిఫాడ్ తాలూకా.. దహిగావ్ అనే గ్రామంలో.. మెహర్ బాబా చివరిసారిగా ఉపాసనీ బాబాని దర్శించారు..


ఉపాసనీ బాబా1941 డిసెంబర్ 24వ తేదీన సమాధి చెందారు..

వారి ఆశ్రమాన్ని సాకోరిలో దర్శించవచ్చు..

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment