Saturday, June 8, 2024

బాలారాం దురంధర్...(1878-1925) 1912 ఏప్రిల్ 6వ తేదీన బాలారాం దురంధర్ మొదటిసారిగా షిరిడి వచ్చి బాబాను దర్శించుకున్నారు. (సాయి సచ్చరిత్ర..అధ్యాయం-50)

 ఓం శ్రీ సాయిరాం🙏🙏..



బాలారాం దురంధర్...(1878-1925)

  

        1912 ఏప్రిల్ 6వ తేదీన బాలారాం దురంధర్ మొదటిసారిగా షిరిడి వచ్చి బాబాను దర్శించుకున్నారు. (సాయి సచ్చరిత్ర..అధ్యాయం-50)


     బాలారామ్ దురంధర్ బొంబాయి శాంతాక్రూజ్ లో పఠారే ప్రభు జాతికి చెందినవారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాది.. బొంబాయిలో న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు..


      భగవద్గీత...జ్ఞానేశ్వరి..వేద గ్రంథాలు..బ్రహ్మవిద్యను పారాయణం చేసినవారు.. పండరీపురం విఠోబా భక్తుడు..


        1911లో అతని సోదరులు వామన్ రావు, బాబూల్జీ షిరిడి వచ్చి బాబాని దర్శించి.. ఇంటికి వెళ్లి వారి అనుభవాలను బాలరామునికి తెలియజేశారు..


        6 నెలల తర్వాత 1912 ఏప్రిల్ 6వ తేదీన సోదరులందరూ షిరిడి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.. వారు షిరిడీకి రాకముందే బాబా ద్వారకామాయిలో భక్తులతో.. "ఈరోజు నా దర్బార్ వాసులు చాలామంది వస్తున్నారు!" అని చెప్పారు.


        దురంధర్ సోదరులు షిరిడి వచ్చి ద్వారకామాయిలో  సాయికి నమస్కరించగానే.. వీరు షిరిడి వస్తున్న విషయం ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా.. వీరి రాక గురించి బాబా ప్రస్తావించిన విషయం... తోటి భక్తుల ద్వారా విని ఆశ్చర్యపోయారు..


      భక్తులందరూ సాయికి నమస్కరించి దురంధర్ సోదరులతో మాట్లాడుతూ ఉండగా బాబా వారితో.. "వీరే నా దర్బార్ వాసులు.. ఇంతకుముందు వీరి రాక గురించే మీకు చెప్పియున్నాను" అని.. దురంధర్ సోదరులతో "గత 60 తరాలుగా ఒకరికొకరం పరిచయం గలవారము" అన్నారు.


      సోదరులందరూ కూడా ఎంతో వినయ విధేయతలు కలవారు.. భోజనానంతరం బాలారాం మసీదుకు వచ్చి బాబా వద్ద కూర్చుని పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉండగా.. బాబా చిలుము త్రాగుతూ దానిని బాలారాంకి ఇచ్చి పీల్చమన్నారు.. బాలారామ్ కి చిలుం పీల్చడం అలవాటు లేదు.. గురువాజ్ఞ కనుక దానిని అందుకుని కష్టంతో పిల్చి.. దానిని తిరిగి బాబాకిచ్చి నమస్కరించాడు..


        6 సంవత్సరాల నుండి అతనిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఉబ్బసం వ్యాధి.. బాబా ఇచ్చిన చిలుం పీల్చడంతో పూర్తిగా నయమైంది.. 6 సంవత్సరముల తర్వాత బాబా సమాధి చెందిన రోజున ఉబ్బసం వ్యాధి మరలా వచ్చింది.. ఆ తర్వాత ఆ వ్యాధి తిరిగి ఎప్పుడూ రాలేదు..


      వారు షిరిడి వచ్చింది గురువారం.. ఆరోజు రాత్రి చావడి ఉత్సవం దర్శించుకోగానే.. చావడిలో హారతి సమయంలో.. మరునాడు కాకడా హారతి సమయంలో.. సాయినాథుడు బాలారాం దురంధర్ కి పాండురంగనిగా దర్శనమిచ్చారు..


     బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని వ్రాశారు.. ఆ పుస్తకాన్ని ప్రచురించక మునుపే 1925 వ సంవత్సరంలో స్థాయిలో ఐక్యమయ్యారు..3 సంవత్సరముల తర్వాత 1928లో వారి సోదరులు ఆ పుస్తకాన్ని ప్రచురించారు.. అందులో బాలారామ్ జీవితము.. మొట్టమొదటిసారిగా షిరిడి దర్శనం గురించిన ప్రస్తావన ఉంది..


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment