Sunday, June 2, 2024

సాయబాబా కర్మ సిద్ధాంతానిగూర్చి తనను దర్శించేవారికి, భక్తులకు తెలిపేవాడు

*సాయబాబా కర్మ సిద్ధాంతానిగూర్చి తనను దర్శించేవారికి, భక్తులకు తెలిపేవాడు.*

*అనేక గాధలతో ఆయన మనసుకు హత్తుకుపోయే విధముగ కర్మ సిద్ధాంతాన్ని గూర్చి చెప్పేవాడు.*
*చెడు పనులకు చెడు ఫలితం ఉంటుంది. మంచి పనులకు మంచి ఫలితం ఉంటుంది.*
*ఈ మంచి ఫలితంగాని, చెడుఫలితంగాని అనుభవించి తీరవలెను.*
*ఈ అనుభవం ఈ జన్మలో జరగవచ్చును. లేదా మరుజన్మలో జరగవచ్చును అందులకు ఉదాహరణముగా రెండు మేకల గాధను తెలిపారు.* 
*సాయిబాబా తాను చూసిన మేకల మందలోని రెండు మేకలను గమనించి, వాటిని కొని, వాటికి కొంత శనగపప్పు కొని, అవి తినుటకు పెట్టాడు. ఆ మేకలు ప్రీతిగా తిన్నాయి.*
*బాబా అలా చేయడం వింతగా తోచింది కొందరికి.*
*వారు బాబాను ప్రశ్నించారు.*
*అలా ప్రశ్నించిన ఒక వ్యక్తితో " మీరు ఆ మేకల గాధను వినండి. గత జన్మలో వారు అన్నదమ్ములు. వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు.*

*ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ ఉండెడిది రానురాను వారి సంపాదన పెరిగింది. వారి మధ్య శత్రుత్వం కలిగింది.*

*అది మరింతగా పెరిగి ద్రవ్యమును అపహరింపదలచి, ఒకరికొకరు చంపుకొనుటకు ప్రయత్నించిరి.*
*ఒకనాడు అన్న తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇరువురు చచ్చిరి.*
*వారు ఈ జన్మలో మేకలుగా పుట్టిరి " అని కర్మ సిద్థాంతం ప్రకారం వారికి అట్టి హీన జన్మలు కలిగాయని చెప్పారు.*

*అటులనే కర్మసిద్ధాంతంగూర్చి మరొక గాథ.*

*అది ఎండాకాలం.*
*మిట్ట మధ్యాన్నం వేడి భరింపరానిదిగా ఉన్నది.*
*భూమి అంతా మండుచున్నట్లు ఉన్నది.*

*కాళిదాసు ఒక మహాకవి ఏదో పనిమీద బయటకు వెళ్లి ఆ మండుటెండలో నగరానికి తిరిగివస్తున్నాడు.*
*ఆమార్గంలో ఒక వ్యక్తి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు.* 

*అతని కాళ్ళు ఎండ వేడికి బొబ్బలెక్కి పోతున్నాయి.*
*అతడు ఆ బాధను భరించలేక పోయినా, అలానే నడుస్తున్నాడు. కాళిదాసుకు ఆ వ్యక్తి మీద సానుభూతి కలిగింది.*

*అప్పుడు కాళిదాసు తను ధరించిన చెప్పులను ఆ వ్యక్తీ కి ఇస్తూ, "నాయనా ! ఈ చెప్పులను తొడుక్కొని ప్రయాణించు " అని చెప్పగా ఆ వ్యక్తి కాళిదాసుకు కృతఙ్ఞతలు చెప్పి హాయిగా వెళ్లిపోయాడు.*

*ఇప్పుడు కాళిదాసుకు చెప్పులు లేనందున ఆయన కాళ్ళు ఎండలో నడుస్తున్నందున బొబ్బలెక్కుతున్నాయి.*
*అయినా ఆ మహా కవి బాధపడక ఆనందించసాగాడు.*

*ఎందుకంటే బాధపడుతున్న ఒక వ్యక్తికి సహాయము చేసానని.*
*ఆ సమయములో రాజుగారి పట్టపుటేనుగును తోలుకుంటూ, మావటి వాడు అటువైపుగా వచ్చి ఆగి, కాలినడకన పోతున్న కాళిదాసును మదపుటేనుగుపై ఎక్కించుకుని నగరానికి చేర్చాడు.* 

*ఆ దేశాన్ని పరిపాలిస్తున్న భోజరాజు, ఏనుగుపై ఎక్కి వస్తున్న కాళిదాసును చూసి " మహాకవీ ! ఈ మదపుటేనుగు ఎక్కడ దొరకింది ? " అని రాజు అనగా " మహరాజా ! నేను చెప్పులను దానం చేయుటవలన " అని తనకు జరిగిన అనుభవాన్ని వివరంగా చెప్పాడు ఆ మహాకవి.*

No comments:

Post a Comment