*కోరవలిసిన మూడు కోరికలు.*
*భగవంతుణ్ణి మనం ఏదైనా కోరితే దాన్నే తీరుస్తాడు.*
*ఏదీ కోరకుండా నమస్కరిస్తే మనకు ఏది అవసరమో దాన్నే ఇస్తాడు, అని అంటారు పెద్దలు.*
*నిజమే రెండోదే శ్రేయస్కరం.*
*కానీ సామాన్య మానవులం కనుక ఏ కోరికనూ కోరుకుండా ఉండలేం, కనుక ఏదో ఒకటి కోరుతూనే ఉంటాము.*
*ఎవరి అవసరం వారిది.*
*ఎవరి కోరిక వారిది.*
*అందరమూ అన్ని సమయాలలో కోరవలిసిన కోరికలు మూడు ఉన్నాయి*
*అవి ఏమిటంటే*
*'అనాయాసేన మరణం*
*వినా దైన్యేన జీవనం*
*దేహంతే తవ సాయుజ్యం*
*దేహి మే పార్వతి పతే '*
*ఎటువంటి యాతన పడకుండా చాలా సులభంగా మరణించటం,*
*ఏ విధమైన దీనావస్థకూ లోను కాకుండా గౌరవంగా జీవించటం,*
*మరణించిన తరువాత నీలో ఐక్యమైపోవటం -* *పరమేశ్వరా ఈ మూడు వరాలనూ నాకు ప్రసాదించు !*
*మన శరీరానికి దగ్గర మరణాలు - వ్యాధి, ముసలితనం, మరణం - చాలా సహజమైన, అనివార్యమైన లక్షణాలు.*
*ఈ మూడు స్థితులలోనూ శరీరం యాతనకు గురి కాక తప్పదు.*
*ముసలితనం రాగానే శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి పని చేయకపోవటం.*
*మల మూత్ర విసర్జనకు కూడా అవతలకు వెళ్లే శక్తిలేక మంచంలోనే కానివ్వటం, తాను ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టడం - ఈ శారీరిక కష్టాలేవీ లేకుండా "ఉర్వారుక మివ ..." బాగా పండిన దోస పండు తొడిమ నుంచి ఏ విధంగానైతే మృదువుగా ఊడి పోతుందో ఆ విధంగానే ఈ శరీరం నుంచి ప్రాణం బయటకు వెళ్ళిపోవాలి.*
*అంత హాయిగా మరణించాలి.*
*ఇదీ మొదటి కోరిక.*
*ప్రతీ మనిషికి తీరవలిసిన కనీస అవసరాలు మూడు.*
*కడుపు నిండా భొజనం, ఒంటినిండా మంచి వస్త్రం, తల దాచుకోవటానికి మంచి ఇల్లు.*
*ఇవి ఎంత అవసరమంటే - ఇతరులను యాచించి అయినా సమకూర్చుకోవలిసినవి.*
*కనుక వాటికి లోటులేకుండా, ఇతరుల వద్దకు వెళ్లి ,' దేహీ !' అని యాచించే దుస్థితి లేకుండా గౌరవంగా బ్రతకాలి*
*ఇది రెండో కొరిక.*
*ఇక చివరిది అత్యంత ప్రధానమైనది ముక్తి.*
*ముక్తి అను పదానికి విడిపడటం అని అర్థం.*
*శారీరక బాధలనుండి, మనో వేదనల నుంచి, సమస్త లౌకిక బంధాల నుంచి విముక్తులం కావాలి*
*ఆపై పరిస్థితి ఏమిటి ? స్వర్గం వద్దు 'క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి '*
*సంపాదించుకొన్న పుణ్యాన్ని ఆ స్వర్గంలో అనుభవించటం పూర్తి కాగానే తిరిగి భూలోకంలో జన్మించవలసిందే అంటారు.*
*అట్లా కాకుండా పునర్జన్మ లేని విధంగా భగవంతుడిలో ఐక్యమైపోవాలి.*
*మనం ఏ సచ్చిదానంద బ్రహ్మం నుంచి ఈ లోకానికి వచ్చామో ఆ బ్రహ్మం లో మమేకమై పోవాలి.*
*ఇదేసాయుజ్యం, సాలోక్యం, సామీప్యం, సారూప్యం అనే నాలుగు విధాలైన ముక్తులలో ఇది శ్రేష్ఠతమమైనది.*
*ఇది మూడో కోరిక.*
*సారాంశమేమంటే - బ్రతికినన్నాళ్ళు సంతోషంగా, గౌరవప్రదంగా బ్రతకాలి.*
*సంపూర్ణమైన ఆరోగ్యంతో
సంపూర్ణ ఆయుషున్ని అనుభవించి హాయిగా మరణించాలి.*
*మరణించి మన ఇష్ట దైవంలో ఐక్యమైపోవాలి*
*మనమందరమూ సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుణ్ణి కోరవలిసిన ముచ్చటైన మూడు కోరికలివే !*
No comments:
Post a Comment