*భక్తుల జీవితాలలోని అంధకారం తొలగించి జ్యోతులను నింపే శివలింగాన్ని జ్యోతిర్లింగం అంటారు.*
*అటువంటి జ్యోతిర్లింగాలు మన దేశములో పన్నెండు వున్నాయి.*
*అందులో మొదటిది గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథలింగం.*
*త్రేతాయుగములో రావణాసురుడు ఇక్కడ తపస్సుచేసి పది తలలను పరమశివునికి సమర్పించాడంటారు.*
*ద్వాపరయుగములో శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి.*
*రెండో జ్యోతిర్లింగం మన రాష్ట్రంలోని కర్నూలుజిల్లా శ్రీశైలంలో వుంది.*
*మల్లికార్జున మహాలింగమని అని దీని పేరు.*
*చంద్రగుప్తుడు అను రాజుకు చంద్రవతి అను కుమార్తె ఉండేది.*
*ఆమెను వివాహం చేసుకోవడానికి ఎందరో రాజకుమారులు పోటీ*
*పడుతుండగా, ఆమె ఎటూ చెప్పలేక రాజ భవనాన్ని వదలి శ్రీపర్వతం మీద తపస్సు చేసిందట.*
*ఆమె తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఆమె అల్లిన మల్లెపూల దండ పరమశివుని శిరస్సును గంగలాగా అలంకరించి ఉండాలని కోరుకోవడంవల్ల మల్లికార్జునుడు అని పేరు వచ్చిందంటారు.*
*మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు.*
*నేటి ఉజ్జయినికి ప్రాచీన నామం అవంతి.* *మార్కండేయుని రక్షించటానికి కాలుడైన యముణ్ణి సంహరించిన ఘనత ఈయనకు ఉండటంవల్ల మహాకాలుడు అని పేరు స్థిరపడింది.*
*తరువాత జైనమతస్తుడైన ఒక రాజు అవంతిని ఉజ్జయినిగా మార్చాడు.*
*ఉజ్జయిని అంటే జైనమతానికి నెలవు అని అర్థం*
*ఈ జ్యోతిర్లింగం ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది.*
*నాలుగో జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం.*
*మధ్యప్రదేశ్ లో రెండువైపులా వింధ్య పర్వతాల నడుమ, నర్మదా కావేరి నదుల మధ్య ఉన్న క్షేత్రము ఇది.*
*సూర్యవంశ రాజైన మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీప నైవేద్యాలు లేని ఒక శివలింగం కనపడింది.*
*ఆ లింగం నుంచి " ఓం " అని ప్రణవనాదం వినిపిస్తుంది.*
*అప్పుడు కొందరు ఋషులను, పండితులను అక్కడకు తీసుకెళ్లగా ఆ లింగానికి " ఓంకారేశ్వరుడు " అని పేరుపెట్టారు.* *మాంధాతమహారాజు ఓంకారేశ్వరునికి గొప్ప దేవాలయము నిర్మించి పూజలు చేశాడు*
*అయిదో జ్యోతిర్లింగం భూమికి 11500 అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం.* *హిమాలయాపర్వతం మీద ఉంది.*
*ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారంటారు.*
*ఆరో జ్యోతిర్లింగం భీమశంకరం.*
*నేటి మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతం మీద ఉంది. ఇక్కడ " భీమా "అను నది ప్రవహిస్తుంది.*
*అందుకే ఈ లింగానికి భీమశంకరం అని పేరు.*
*ఈ ప్రాంతానికి ఢాకిని అని మరోపేరు ఉన్నది.*
*ఢాకిని అంటే దక్షప్రజాపతి కూతురు దాక్షాయణి పరమశివునికై ఆమె తపస్సు చేసిన భూమి ఇది.*
*ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఏడో జ్యోతిర్లింగం వారణాశి.*
*వారణ - అసి అని రెండు నదుల సంగమము వల్ల వారణాసి అయినది.*
*విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు అని ఈ దేవుని పేరు.*
*ఎనిమిదో జ్యోతిర్లింగం*
*" త్రైయంబకేశ్వరం ".*
*మహారాష్ట్రలోని గోదావరి నది పుట్టిన చోట,సహ్యాద్రి అను కొండమీద వుంది.*
*ఇక్కడ పంచవటి అని పేరు గల అయిదు వటవృక్షాల*
*సముదాయంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు వనవాసం చేశాడని ప్రతీతి.*
*తొమ్మిదో జ్యోతిర్లింగం వైద్యనాధేశ్వరం. ఇది మహరాష్ట్రలో ఉంది.*
*ఈ జ్యోతిర్లింగాన్ని సృశించడంవల్ల దీర్ఘ వ్యాధులు సైతము నయమవుతాయని, వైద్యము చేసేవాడు కనుక వైద్యనాధేశ్వరుడు అని పేరు.*
*క్షీరసముద్ర మధనంలో బయటపడిన దేవతావైద్యుడు ధన్వంతరి ప్రతిష్ఠించిన లింగం అని భావించడంవల్ల ఈ* *జ్యోతిర్లింగానికి అధిక ప్రాముఖ్యం వుంది.*
*పదో జ్యోతిర్లింగం నాగేశ్వరలింగం.*
*గుజరాత్ లోని పశ్చిమ సముద్రతీరాన ద్వారకా పట్టణానికి సమీపంలోని దారుకావనంలో ఈ లింగం వుంది.*
*దారుకుడు అను రాక్షసుడు దుష్ట చేష్టల నుండి కాపాడమని సుప్రియుడు అను భక్తుడు కోరగా పరమశివుడు దారుకుణ్ణి సంహరించి ప్రజలను కాపాడాడని చెబుతారు.*
*సుప్రియుని కొరికమేరకు నాగేశ్వర లింగం రూపంలో దారుకావనంలో పరమశివుడు స్ధిరపడ్డాడని కథనం.*
*పదకొండో జ్యోతిర్లింగం రామేశ్వరం.*
*శ్రీరాముఁడు ప్రతిష్ఠించిన ఈశ్వరుఁడు కనుక రామేశ్వరుడు అను పేరువచ్చింది.*
*లంకాధిపతీ రావణుని జయించటానికి శ్రీరాముఁడు సముద్రం మీద సేతువు నిర్మిస్తాడు.*
*తామ్రపర్ణి అనే నది ఇక్కడ సముద్రం లో కలుస్తుంది.* *పన్నెండో జ్యోతిర్లింగం ఘృష్టే శర్వము.*
*మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు దగ్గరలో వుంది.* *ఎల్లోరా ప్రాచీన నామం ఇలాపురం. ఒకప్పుడు పార్వతీపరమేశ్వరులు*
*కొంతకాలం ఇక్కడ ఉన్నారట.*
*ఒకనాడు పార్వతీదేవి తన ఎడమ అరచేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వేలితో రుద్దుతుండగా ఆ ఘర్షణకు ఒక జ్యోతి ప్రజ్వరిల్లిందనీ దాన్ని అక్కడే శివలింగంలో ప్రవేశపెట్టినది అని కథనం.*
*ఆమె వేలి ' ఘర్షణతో' ఆవిర్భవించిన లింగం కనుక*
*" ఘృష్టే శ్వర " లింగం అని పేరు వచ్చిందంటారు.*
*ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించలేనివారు కనీసము స్మరించినా వారి కోర్కెలు సిద్ధిస్తాయని శివపురాణం చెబుతుంది.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
No comments:
Post a Comment