*సాయి సచ్ఛరిత్రలో 17 వ అధ్యాయములో బ్రహ్మ జ్ఞాన వివరణ కనిపిస్తుంది.*
*బ్రహ్మజ్ఞానమనగా ఈ సకల సృష్టి దేనియందు పుట్టి, పెరిగి, లయమవుతుందో ఆ సద్వస్తువే " బ్రహ్మము ".*
*ఇది నిత్యసత్యమైనది.*
*స్వయం ప్రకాశమైనది.*
*ఆ సద్వస్తువే అనగా భగవంతుడు లేదా బ్రహ్మము మానవ దేహంలో "ఆత్మ స్వరూపంగా " ప్రతిష్ఠితమై ఉన్నాడు.*
*ఆ పరబ్రహ్మమూ, మానవదేహములోని ఆత్మా ఒకటే అని వేరుకాదనే అను ప్రత్యక్ష అనుభవము కలగడమే "బ్రహ్మ జ్ఞానమంటారు ".*
*బ్రహ్మ జ్ఞానం కలిగిన మానవులకు ఈ జగత్తులోని సమస్తమూ తమవే అవుతాయి. తాను తప్ప ఈ జగత్తులో రెండో వస్తువు లేదన్న భావన కలుగుతుంది.*
*అందువలన ఎటువంటి భీతి వుండదు. సర్వమును అరచేతిలోని ఉసిరికాయ వలె అవగతమవుతుంది.*
*సమస్త దుఃఖాల నుండి చింతల నుండి నివృత్తి కలుగుతుంది.*
*పరమానంద స్ధితి లభ్యమవుతుంది.* *పునర్జన్మ వుండదు.*
*అందుకే బ్రహ్మజ్ఞానం పొందటం అవసరం.*
*ఈ అధ్యాయములోనే మనసును ఎలా స్వాధీన పరుచుకోవచ్చును ? అన్న విషయము ప్రస్తావించబడినది.*
*మనసు నిరంతరమూ బహిర్ముఖమై, దృశ్య విషయాలతో మమేకమై, బంధంగా పరిణమిస్తుంది.*
*ఏఏ సంకల్పముల వలన, మనసు బహిర్ముఖమై, దృశ్య విషయాలపై పోవుచున్నదో గమనించి, ఆ సంకల్పముల నుండి మనసును మరల్చి అంతర్ముఖం చేయుట ద్వారా మనసును స్వాధీన పరచుకోవచ్చును.*
No comments:
Post a Comment