*సాయిబాబా లీలా విన్యాసాలకు సాక్షీభూతమై బాబా కు ఆశ్రయమిచ్చినది ద్వారకామాయి కాగా బాబా సమాధి మరియు మూల విరాట్ సమాధి మందిరంలో ఉన్నవి.*
*" ఈ శరీరాన్ని నేను వదలివెళ్ళిపోయినా వస్తాను పరుగు పరుగున నా భక్తుల* *హితం కొరకు " అన్నదే కాకుండా " నా సమాధి నుండే మీ కోరికలన్నీ ప్రాప్తిస్తాయి. నాయందు ధృడ విశ్వాసముంచండి. నేను ఎల్లప్పుడు సజీవంగా ఉంటాను.*
*ఇది పరమ సత్యం.*
*ఇది సత్యమని నిత్యమని మీ స్వానుభవంతో తెలుసుకోండి " అని బాబా తన భక్తులకు అభయము ఇచ్చుటయే గాక అవి నిత్యసత్యములని నేటికినీ నిరూపిస్తున్నారు.*
*ఆనాటి సాయిబాబా యే నేడు షిరిడీలో అర్చామూర్తి రూపంలో దర్శనం కలిగిస్తున్నాడు.*
*తన భక్తులకు అసంఖ్యాక అనుభూతులు కలిగిస్తున్నారు.*
*షిరిడీలో సమాధి మందిరంలో ప్రతినిత్యం బాబా విగ్రహానికి అభిషేకము చేస్తుంటారు.*
*ఒకనాడు సమాధి మందిర పూజారి ఒకరు, బాబా విగ్రహనికి, చేతికి వెండి ఉంగరాన్ని ధరించి అభిషేకము చేస్తున్నప్పుడు, ఉంగరమున్న చేతితో బాబా ముఖాన్ని రుద్దాడు.*
*ఆనాటి రాత్రి బాబా పూజారి కలలో కనిపించి " నీవు ఉంగరము ధరించి నా ముఖము శుభ్రపరుచుటచే నా ముఖం అంతయు గీరుకుపోయినది.*
*రేపటి నుండి అభిషేకం చేస్తున్నప్పుడు ఉంగరం తీసి అభిషేకము చేయండి " అని చెప్పగా, ఆ పూజారి తన తప్పును తెలుసుకుని తెల్లవారగానే సమాధి మందిరానికి పోయి, బాబా విగ్రహము ముందు నిలబడి క్షమాపణలు వేడుకున్నాడు.*
*బయ్యాజీ అప్పాకోతే పాటిలు షిరిడీ నివాసి.*
*బాబాకు అంకితభక్తుడు మరియు గ్రామ రెవెన్యూ అధికారి.*
*బయ్యాజీ ధృడమైన శరీరం కలిగి పుష్టిగా కండలు కలవాడుగా ఉండెడివాడు.*
*బయ్యాజికి అతని శరీర బలముపై అచంచల విశ్వాసముండెడిది .రోజూ ద్వారకామాయి కి వచ్చి బాబాను దర్శించి, బాబా ఎక్కడ కూర్చున్నా, బాబాను ఎత్తుకుని వచ్చి ధుని ముందు కుర్చోపెట్టెడివాడు. అతనిలో బాబానే ఎత్తగలను అనే అహంకారం కలిగినది.*
*ఒకరోజు బయ్యాజీ ద్వారకామాయికి వచ్చి ఏప్పటిలాగునే బాబాను ఎత్తడానికి ప్రయత్నించగా, బాబాను ఎత్తలేకపోవడమేగాక, ఒక అంగుళం కూడా కదల్చలేకపోయాడు.*
*తన అహంకారము వలెనే అలా జరిగినదని గ్రహించి బాబాను క్షమాపణ వేడగా, బాబాను అతి సునాయాసంగా ఎత్తకలిగాడు.*
*సాయిబాబా చివరగా తన శరీరత్యాగము చెందేముందు, ఆయన చెంతనున్న అతి కొద్ది భక్తులలో ఇతడు కూడా ఒకడు.*
No comments:
Post a Comment