*పుణ్యపురుషుల సమాధులు సదా సజీవములై ఉంటాయి.*
*ఆ పవిత్ర మూర్తుల సమాధులు వారిని ఆశ్రయించినవారి మొరలాలకించి వారి కోర్కెలు తీరుస్తాయి. సర్వదా వారి అండగా ఉంటాయి. వారి చెంతకు వచ్చి మ్రొక్కినవారికే గాక, రాలేని వారి కి కూడా తమ అశీర్వచనములు అందిస్తాయి.*
*సజీవంగా ఉన్నవారికి ఎటువంటి స్పందనలు ఉంటాయో ఆ సమాధులకు అటువంటి స్పందనలు వుంటాయి.*
*అటువంటిదే ఒక సంఘటన.*
*పాండురంగ భక్తుడైన సంత్ జ్ఞానేశ్వర మహరాజ్ పూణే సమీపమునగల ఆళందిలో తన 21 వ సంవత్సరంలో సజీవ సమాధి చెందారు.* *(1275 -1296 సం ) దాదాపు 300 సంవత్సరాల తరువాత మరొక సత్పురుషుడైన శ్రీ ఏకనాధ్ మహరాజ్ కు జ్ఞానేశ్వరుడు స్వప్నములో కనబడి "ఏకనాధా ! నా సమాధి చెంత, దగ్గరలో నున్న ఒక అశ్వద్ద వృక్షము వ్రేళ్లు తాకుచున్నవి.*
*అందుచే నీవు వచ్చి ఆ వృక్షమును సమూలంగా పెకలించి వేరొక ప్రదేశమున నాటుము " అని చెప్పగా ఏకనాధుడు తనను కరుణించాడని తలంచి, వెంటనే ఆళంది వెళ్లి సిద్దేశ్వర్ స్వామిని దర్శించి, నమస్కరించి, అటు పిమ్మట జ్ఞానదేవుని సమాధి వద్దకు వెళ్ళి, ఆ సమాధికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి యోగాసనంలో ఉన్న జ్ఞానదేవుని దర్శించి సమాధికి అడ్డముగా ఉన్న అశ్వద్ద వృక్షమును సమూలంగా పెకలించి ఆ వృక్షమును మరొకచోట ప్రతిష్ఠించెను.*
*ఆ పిదప తాపీ పని వారలను రప్పించి, సమాధిని పూర్వము వలె కట్టుటకు కావలిసిన రాళ్లు, సున్నము, పనిముట్లను తెప్పించి పని ప్రారంభించెను.*
*అక్కడ పని చేయువారికి ఆళందిలో నిత్యావసర సరకులు లభించలేదు.*
*అది గ్రహించి రుక్మిణీ వల్లభుఁడు ఒక వర్తకుని వేషముతో సరుకులన్నిటితో ఒక దుకాణం తెరచి అక్కడ పనిచేయు వారితో "మీకు కావలిసిన సరకులు తీసుకొండి.*
*మీ పని అంతయూ పూర్తి అయిన తరువాత డబ్బులు చెల్లించవచ్చు " అని చెప్పి, వారలకు కావలిసిన సరుకులన్నిటినీ వారు పని చేయుచున్నంత కాలము అప్పుగా ఇచ్చెను.*
*సమాధి పని పూర్తైన తరువాత, అందరూ ఏకనాధుని స్వస్థలమైన పైఠాన్ పురమునకు బయలుదేరగా వర్తకుని వేషములో ఉన్న పాండురంగడు సహితము తన సరుకులన్నింటినీ ఒక బండిలో వేసుకొని వారితో పాటు బయలుదేరెను.*
*కానీ మార్గమధ్యమున అదృశయుడయ్యెను.*
*అదంతయు పాండురంగని కరుణయే నని గ్రహించిరి.*
*రెండవ సంఘటన -*
*షిరిడీలో ఉన్న సాయి సమాధి కూడా సజీవ సమాధియే.*
*బాబా సమాధి చెందిన మరుక్షణం నుండి తాను సదా సజీవుడనే నిరుపిస్తున్నారు.*
*సాయిభక్తులందరూ దీనిని శంకించ అవసరం లేదు.*
*అది 1936 సంవత్సరం మార్చి రెండవ వారం.*
*ఆ సంవత్సరం అప్పటికే శీతాకాలం ముగిసి వేసవి ఉధృతి పెరిగి వాతావరణం పూర్తి వేడిగా వుండెను.*
*ఉదయమునుండే ఉష్ణోగ్రతలు అధికం కాజొచ్చెను.*
*ఆనాడు కాకడ హారతి సమయాన మాధవరావ్ దేశపాండే (శ్యామా ) మరికొంత మంది సమాధి మందిరంలో ఉండగా, అందరూ చూచుచుండగానే, బాబా సమాధి పైన ఉన్న ఉన్ని శాలువా (woolen ) దానంతట అదే కదలి దూరముగా పడినది.*
*ఆ సమయం లో గాలి ఏమాత్రము లేదు.*
*తిరిగి శాలువా కప్పగా మరల శాలువా దూరంగా పడినది.*
*అక్కడున్నవారు అందరూ పరీక్షించి చూడగా సమాధికి చెమటలు పట్టెను.*
*అది గ్రహించి వారు వెంటనే ఉన్ని శాలువా తీసివేసి కాటను (నూలు ) శాలువాను కప్పిరి.*
*ఆనాటినుండి నేటివరకు బాబా విగ్రహానికి, సమాధికి వేసవి కాలంలో కాటను శాలువాను, మరియు శీతాకాలంలో ఉన్ని (woolen ) శాలువాతో అలంకరించుచున్నారు.*
*సమాధికి చెమటలు పట్టాయంటే అది సజీవ సమాధియే కదా !*
No comments:
Post a Comment