Thursday, May 16, 2024

ఈ కలియుగములో నామ సంకీర్తనకు మించిన సాధనము మరొకటి లేదు. ముక్తికి సులభ మార్గము నిరంతర నామ స్మరణే.* *" కలౌ నామ సంకీర్తనం స్మృతం " అన్నది ఆర్యోక్తి.

 *ఈ కలియుగములో నామ సంకీర్తనకు మించిన సాధనము మరొకటి లేదు. ముక్తికి సులభ మార్గము నిరంతర నామ స్మరణే.*

*" కలౌ నామ సంకీర్తనం స్మృతం " అన్నది ఆర్యోక్తి.*

 

*మహరాష్ట్రలో పాండురంగని భక్తులలో కబీరుదాసు కుమారుడు కమాల్. అతడు తండ్రివలె పరమ భక్తాగ్రేసరుఁడు. అతిధి, అభాగ్యులను ఆదరించుటలో ముందుండేవాడు.*

 

*ఒకనాడు జ్ఞానేశ్వరమహరాజ్ , భక్త నామదేవ్ భక్త సమేతంగా తీర్థయాత్రలు చేయుచూ కాశీ నగరములోనున్న కబీరుదాసు ఇంటికి వెళతారు.* 


*కబీరుదాసు ఆ భగవద్భక్తులను గాంచి పరమానందం చెంది వారిని తన గృహములోనికి ఆహ్వానించి, వారికి భోజన సదుపాయములు చేసిన తరువాత వారిని విశ్రమింపచేస్తాడు.*


*వారందరూ నిద్రించిన తరువాత కబీరుదాసు భార్య అయిన 'లోయీ ' భర్త వద్దకు చెంతకు వెళ్ళి మరునాడు అతిధులకు అతిథి సత్కార్యములు చేయుటకు ఇంటిలో సరుకులు నిండుకొన్నవని చెపుతుంది.* 


*అప్పటికే సమయము అర్ధరాత్రి దాటింది.*

 *చేతిలో డబ్బులు లేవు. ఇంటిలో సరుకులు లేవు. అంగళ్ళన్నీ మూసివేసి ఉన్నవి. కబీరుకు ఏమిచేయుటకు పాలుపోలేదు.* 

*యింతలో అతని మదిలో తళుక్కున ఒక ఆలోచన వచ్చింది.*


*అది దొంగతనము చేయుట. అంతకు మించిన మార్గం కనిపించలేదు.*

*చోరత్వం మహా పాపమని తెలుసు. కానీ ఎంతోమందికి ఆతిధ్యమిచ్చే అవకాశం మరల మరల రాదు.*


*ఒక సత్కార్యానికై దొంగతనం చేయుట అపరాధము కాదు అని నిశ్చయించుకుని తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక దుకాణము వద్దకి వెళ్లి, ఆ దుకాణము వెనుక వైపున ఉన్న గోడకు మనిషి దూరేంత కన్నం చేసి కబీరు కొడుకైన కమాల్ ఆ కన్నం లోపలకు దూరుటకు సిద్ధమవుతుండగా కబీరు అతనితో " నాయనా అతిధులు ఆతిధ్యానికి కావలిసిన సరకులు మాత్రమే తీసుకురా ! ఇతరమైన వస్తువులు తాకనైనా తాకవద్దు.*

*రజిత, కాంచనముల వస్తువుల జోలికి పోవద్దు " అని హితబోధ చేశాడు.*

*తండ్రి హితబోధను చక్కగా అవగతము చేసుకున్న కమాల్, గోడ కన్నము ద్వారా దుకాణములోనికి ప్రవేశించి అతిథులకు ఆతిధ్యము కొరకు కావలిసిన సరకులు మూటగట్టి కన్నములోంచి తండ్రికి చేరదీస్తాడు.*


*అక్కడ అమూల్యమైన బంగారు వెండి వస్తువులున్ననూ వాటిని తాకలేదు.*

*తాము బయటకి వెళ్ళిపోయినచో, తాము చేసిన కన్నము ద్వారా ఎవ్వరైనా దొంగలు ప్రవేశించి వాటిని దొంగిలించెదరేమో అన్న అనుమానము కలిగి, అక్కడ నిద్రిస్తున్న యజమానిని నిద్రలేపి " మేము దొంగలం కాదు.* 

*అవసరార్ధం కొన్ని సరకులు తీసుకుపోతున్నాము. వాటి మూల్యమును త్వరలోనే తీర్చివేయుదము. మేము గోడకు చేసిన కన్నము ఆలాగునే ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి ." అని కమాల్ చెప్పి కన్నము గుండా బయటకి వెళ్ళుటకు ప్రయత్నించి కన్నములో దూరి నడుము వరకు వెళ్ళగానే ఆ దుకాణపు యజమాని జరిగినది గ్రహించి కమాల్ కాళ్ళు గట్టిగా పట్టుకొని " దొంగ దొంగ " అని అరవసాగాడు.*


*పరిస్థితి గమనించిన కమాల్ తండ్రితో " తండ్రీ ! మనము దొరికిన యెడల లోకులందరూ మనలను చోరులందురు, నీవు నా తలను నరికి తీసుకొనిపొమ్ము.*

*అప్పుడు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు " అని కబీరు తన పుత్రుడని కూడా ఆలోచించక, వెనుకంజ వేయక కమాల్ శిరమును నరికి చడీచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లి కుమారుని తల భార్యకిచ్చి జరిగినదంతా వివరించెను.*


*ఆ మహాసాధ్వియు కుమారుని మరణమునకు చింతించక అతిధుల సత్కారమునకు సరకులు లభించినవని సంతోషించి తెల్లవారిన తరువాత ఆ భక్తాగ్రేసురలకు అతిథి సత్కార్యములు చేసెను.*


*అతిథులు ఆ సత్కారములకు మిగుల సంతసించి తిరుగు ప్రయాణమయ్యిరి.*


*కమాల్ శిరము లేని శరీరమును ఆ గ్రామస్తులు ఎవ్వరూ గుర్తించక బజారులో ఒక స్తంభమునకు త్రాళ్లతో ఆ మొండెమును వ్రేలాడదీసిరి.*


*జ్ఞానేశ్వర మహరాజ్, నామదేవ్ మహరాజ్ భక్తబృందముతో సంకీర్తన చేయుచూ పుర వీధులగుండా వెళ్లుచుండగా కమాల్ మొండెమును వ్రేలాడదీసిన ప్రదేశమునకు రాగానే వారి కీర్తనలకు అనుగుణంగా కాళ్ళు, చేతులు లయబద్ధంగా కదుపుతూ రెండు చేతులూ పైకెత్తి వారికి‌ నమస్కరించెను.*


*అది చూసి జ్ఞానదేవ్ ఆ మొండెము ఒక మహా భక్తాగ్రేసుడదని తలంచి, తన దివ్య దృష్టితో జరిగినదంతయు తెలుసుకుని, కబీరు వద్ద గల శిరమును తెప్పించి, మొండెము దగ్గర ఉంచి పాండురంగడుని ప్రార్ధించగానే కమాల్ నిద్రలోంచి మెల్కొన్నట్లు మేల్కొని అందరినీ చూసి వారికి సాష్టాంగ ప్రణామములు అర్పించెను.*


*" జై జై పాండురంగ విఠలా ! పండరిపుర నివాసా రుక్మిణీ వల్లభా ! " అన్న నినాదములతో ఆ ప్రదేశమంతయు మారుమ్రోగెను.*

No comments:

Post a Comment