*స్కూల్ టీచరుగా పనిచేస్తూన్న కుశాభావ్ అను బ్రాహ్మణుడు, అద్భుత శక్తులుగల దత్త మహరాజ్ అనే ఒక యోగిపుంగవుని అశ్రయించి, అయనను పీడించి మారణము, వశీకరణం మొదలైన క్షుద్ర విద్యలు నేర్చుకొన్నాడు.*
*అతని చేతికి ఇనుము, రాగి కడియాలుండేవి. అతను ఏది కోరితే అవి అనగా పండ్లు, మిఠాయిలు మెదలైనవి తక్షణమే అతని చేతికి వచ్చేవి.*
*కొన్నాళ్లకు అతని గురువైన దత్త మహరాజ్ హిమాలయ పర్వతాలకు తపస్సు నిమిత్తం వెళ్ళిపోతూ, ఇక ముందు షిర్డీలోగల సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి వెళ్లిపోయాడు.*
*కుశాభావ్ 1908 సం. లో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించగా బాబా కోపోద్రిక్తులై అతనిని మశీదులో ప్రవేశించనివ్వలేదు.*
*అతడు గత్యంతరం లేక అక్కడగల ఇతర భక్తులను, తనపై బాబా కృపచూపునట్లు బాబాను ప్రార్దించమని కోరాడు.*
*అప్పుడు బాబా వారితో "అతడు ఆ క్షుద్ర శక్తులను విడచి, చేతి కడియాలు తీసిపారేస్తే గానీ అతనిని మసీదులోకి రానివ్వను " అని గట్టిగా చెప్పగానే కుశాభావ్ అలాగునే చేసాడు.*
*తరువాత అతనికి సమర్థ రామదాసు రచించిన "దాసబోధ "పారాయణ చేయమని ఆజ్ఞాపించారు.*
*కొంతకాలం తరువాత బాబా ఆజ్ఞానుసారం దత్త క్షేత్రమైన "గాణ్గా పూర్ "వెళ్ళి దత్త పాదుకలు సేవించి శ్రీ గురుచరిత్ర 108 సార్లు పారాయణం చేసాడు.*
*ఒకసారి అతడు ఏకాదశి ఉపవాసం వున్నట్లు చెప్పగా, బాబా ఉపవాసాన్ని నిరసిస్తూ, అతని చేత ఉల్లిగడ్డలు తినిపించి, తాను కూడా తిన్నారు.*
*బాబా అక్కడ ఉన్నవారితో చమత్కరిస్తూ, కుశాభావ్ ఏకాదశినాడు ఉల్లిగడ్డలు తిన్నాడని చెప్పగా అందుకు బాబా ఉల్లి స్వీకరిచినందున తాను తిన్నానని చెప్పాడు.* *సాయిబాబా మాత్రం తాను ఉల్లిగడ్డలు తినలేదని, కందమూలములు తిన్నాననీ, తన మాటను ఋజువు చేయడానికి నోటిలోంచి కక్కారు.*
*వేంటనే కుశాభావ్ తన గురుదేవుడైన సాయిబాబా ఏకాదశి రోజున ప్రసాదం అనుగ్రహించారని అనుకొని బాబా నోటిలోంచి కక్కిన వాటిని తినసాగాడు.*
*బాబా అతనిని తిట్టి, కొట్టి వారించారు గానీ, అతడు పూర్తిగా తిని, ఆయన మాటలను దెబ్బలను ప్రసాదంగా స్వీకరించాడు.*
*తక్షణమే బాబా శాంతించి, అతని భక్తీ విశ్వాసాలకు ఆనంద బాష్పాలు రాలుస్తూ, అతడిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు " నీవు ఎప్పుడైనా నన్ను ధ్యానించిన తక్షణం, నీ చేతిలోకి ధుని నుండి విభూతి రాగలదు, ఇది నా వరం. దానిని కోరినవారికి ఉచితంగా ప్రసాదించు. అది నీకు మేలు చేయగలదు."*
*తరువాత అనేక మంది కుశాభావ్ చేయి నుండి విభూతి గురు కృపంగా వచ్చుట ఆనాడు అనేక మంది భక్తులు ప్రత్యక్షంగా చూశారు.*
No comments:
Post a Comment