Saturday, June 8, 2024

బాబా సశరీరంగా ఉన్న రోజులలో శ్రీరామనవమి ఉత్సవం ఎంతో వైభవంగా జరిపించేవారు.. శ్రీరామనవమికి ఒకరోజు ముందే రాధాకృష్ణమాయి మసీదు శుభ్రం చేసేది..

 ఓం శ్రీ సాయిరాం 



     శ్రీరామనవమి శుభాకాంక్షలు... జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్..


       సద్గురువైన సాయినాథుడు శ్రీరామనవమికి.. రామాయణానికి.. చాలా ప్రాధాన్యతనిచ్చారు..


      బాబా సశరీరంగా ఉన్న రోజులలో శ్రీరామనవమి ఉత్సవం ఎంతో వైభవంగా జరిపించేవారు.. శ్రీరామనవమికి ఒకరోజు ముందే రాధాకృష్ణమాయి మసీదు శుభ్రం చేసేది..


      1897 నుండి శ్రీరామనవమి రోజున ఉరుసు ఉత్సవం కూడా ప్రారంభమైంది.. ఆ రోజునే ఈ ఉత్సవాన్ని జరిపించడంలో బాబా ఉద్దేశం సర్వమత సమానత్వమే..

  

         1912 నుండి శ్రీరామనవమి రోజున రామజన్మోత్సవం జరపాలి అన్న భీష్మ కోరికని బాబా వెంటనే ఆమోదించగానే.. ఆరోజున శ్రీరామ జన్మోత్సవం ఎంతో వైభవంగా జరిపి..రామాఖ్యానము భీష్మనే సంకీర్తన చేశాడు..


      శ్రీరామనవమికి చైత్ర శుద్ధ పాడ్యమి నుండే రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించేది.. భక్తులందరూ వంతుల వారీగా నామసప్తాహం చేసేవారు.. అష్టమి నుండి ద్వాదశి వరకు షిరిడి భక్తులతో కిటకిటలాడేది.. అంగళ్లు.. కుస్తీ పోటీలు.. పేదలకు అన్నసంతర్పణ విరివిగా జరిగేది..( శ్రీ సాయి సచ్చరిత్ర..అధ్యాయం - 6)


       బాబా సలహా మేరకు  బాపూసాహెబ్ జోగ్..కాకా సాహెబ్ దీక్షిత్ ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయి మసీదులో "భావార్థ రామాయణం" చదివేవారు..


        ఒక్కోసారి భక్తులు తమ సమస్యలకి పరిష్కారం చెప్పమని సాయిని అడగగా.. బాబా భావార్థ రామాయణంలోని ఒక నిర్దిష్టమైన అధ్యాయాన్ని చదవమని చెప్పేవారు..బాబా సలహా మేరకు భక్తులు ఆ ప్రత్యేక భాగాన్ని చదివినప్పుడు, ఆశ్చర్యకరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించేది (అధ్యాయం 18 & 19, శ్రీ సాయి సచ్చరిత్ర)..


        సాయిబాబా కూడా శ్రీరామ విజయం పారాయణానికి ప్రాముఖ్యతను ఇచ్చారు..బాబా మహాసమాధికి 14 రోజుల ముందు  “శ్రీరామ విజయం” చదవడానికి వఝే అనే భక్తుడిని నియమించారు..


      వఝే ద్వారకామాయి మసీదులో కూర్చుని శ్రీరామ విజయాన్ని శ్రద్ధగా చదవడం ప్రారంభించి.. వారం రోజులలో పూర్తి చేశాడు. బాబా మరొకసారి పారాయణం చేయమనడంతో రాత్రింబవళ్లు చదివి 3 రోజులలో పూర్తి చేశాడు..


          వఝే మొత్తం పదకొండు రోజులు శ్రీరామ విజయం చదివాడు. అప్పటికే అతను చాలా అయిపోవడంతో  బాబా వఝేను పంపించారు...(శ్రీ సాయి సచ్చరిత్ర.. అధ్యాయం-43).


       "శ్రీరామ విజయం" పేరు తగ్గట్లుగా "రామ విజయం" గురించి చెబుతుంది.. రాక్షసులైన  రావణుడు-కుంభకర్ణుడు-శుక-శరణ-ఇంద్రజిత్-ప్రహస్తలపై రాముడు స్వయంగా యుద్ధం చేసి వారిని సంహరించి విజయాన్ని సాధించాడు..


       అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న రాక్షస గుణాలైన కామ-క్రోధ-లోభ-మోహ-మధ-మాత్సర్యాలు అనే శత్రువులతో యుద్ధం చేసి జయించిన తర్వాత జ్ఞానదీపం ప్రకాశిస్తుంది...భయంకరమైన జనన మరణ చక్రం నుండి విముక్తినిస్తుంది.. అదే సాధించాల్సిన విజయం.. శ్రీ రామ విజయాన్ని చదివిన వ్యక్తి తన పాపాల నుండి  విముక్తి పొందుతాడని నమ్ముతారు...


      సాయి సచ్చరిత్రలో బాలాజీ పాటిల్ నేవాస్కర్ ధాన్యం పంట చేతికి వచ్చాక మొత్తం బాబాకి సమర్పించేవాడు.. బాబా దానిలో కొంచెం తీసుకుని మిగతాది బాలాజీ పాటల్ కి తిరిగి ఇచ్చేసేవారు.. వారి వారసులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి గోధుమల బస్తా ద్వారకామాయికి తీసుకొచ్చి సాయికి సమర్పిస్తారు.. పాత బస్తాని తీసివేసి దాని స్థానంలో వీరు తెచ్చిన కొత్త ధాన్యం బస్తాని ద్వారకామాయిలో ఉంచుతారు.


  ఓం శ్రీ సాయిరాం..🙏🙏🌹..జైశ్రీరామ్..జైశ్రీరామ్

No comments:

Post a Comment