ఓం శ్రీ సాయిరాం..
ఆనందరావు పాఖాడే.. (సాయి సచ్చరిత్ర..అధ్యాయం - 45)
ఆనందరావు పాఖాడే ప్రముఖ వ్యాపారవేత్త.
ముంబై లామింగ్టన్ రోడ్డులో నివసించేవాడు..
1914లో నెహ్రూ రోడ్‌లోని విలేపార్లేలో ఒక బంగ్లాను కొన్నాడు.కాకా సాహెబ్ దీక్షిత్ ఇల్లు కూడా ప్రక్కనే ఉండేది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆనందరావు పాఖాడే దీక్షిత్ ద్వారానే షిరిడి దర్శించాడు..
స్థానికంగా ఆయన చేసిన సేవ జ్ఞాపకార్థం అతని ఇంటికి సమీపంలో ఉన్న ఒక కూడలికి "పాఖాడే చౌక్" అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఆనందరావు పాఖాడే మనవడు మనోజ్ పాఖాడే కుటుంబం విలేపార్లేలోని కొత్త ఇంట్లో నివసిస్తున్నారు.
శ్రీ సాయి సచ్చరిత్రలో ఆనందరావు పాఖాడే ప్రస్తావన 45వ అధ్యాయంలో వస్తుంది..
కాకా సాహెబ్ దీక్షిత్ షిరిడిలో సాయి సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రతిరోజు భావార్థ రామాయణం..ఏకనాథ భాగవతం ప్రతినిత్యం పారాయణం చేసేవారు.. బాబా సమాధి చెందిన తరువాత కూడా ప్రతినిత్యం వీటిని పారాయణం చేస్తూ ఉండేవారు.
ఒకరోజు ముంబై చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం పారాయణం చేస్తున్నారు. అక్కడ శ్యామా.. కాకా మహాజని ఇద్దరూ శ్రద్ధగా ఆ పారాయణాన్ని వింటున్నారు..
దీక్షిత్ ఏకాదశ స్కందంలోని 2వ అధ్యాయంలో భాగవత ధర్మాల గురించి జనక మహారాజు అడిగిన ప్రశ్నలకు నవనాథులు చెప్పిన సమాధానాలు విని.. దీక్షిత్ నిరాశగా "నవనాథులు వర్ణించిన భక్తి ఆచరించుట ఎంత కష్టం..కాబట్టి మనం మోక్షం పొందలేము" అని అంటారు..
దీక్షిత్ నిరాశ చూసి శ్యామా.. బాబా యందు నిశ్చలమైన విశ్వాసం ఉన్నవారు ఎందుకు నిరాశ చెందుతారు?.. నవనాథుల భక్తి బలమైనదే!.. కానీ మనది ప్రేమానురాగాలతో కూడిన భక్తి!.. గురునామస్మరణ...హరినామ స్మరణ మోక్షదాయకమని బాబా చెప్పారు కదా! అని అంటాడు.
అయినా దీక్షిత్ మనోవేదన తీరదు.. మరునాడు భాగవతం పారాయణం జరిగే దగ్గరకి ఆనందరావు పాఖాడే వచ్చి.. శ్యామాకు ముందు రోజు తనకు కలిగిన స్వప్న దృశ్యాన్ని వివరించి.. బాబా మీకు పట్టు ధోవతిని బహుమతిగా ఇవ్వమన్నారు అని.. శ్యామాకు పట్టుధోవతి బహుకరిస్తాడు.
"గురు నామస్మరణ..గురు పాదాలని భక్తితో ధ్యానించినా చాలు మోక్షం తథ్యం".. అనే విషయాన్ని పాఖడే స్వప్న దృశ్యం ద్వారా బాబా తెలిపి దీక్షిత్ నిరాశని పోగొట్టారు..
బాబా స్వప్న దృశ్యం ద్వారా దీక్షిత్ నిరాశని పోగొట్టడమే కాదు.. సాయి భక్తులకు కూడా మోక్షానికి సులభమైన మార్గాన్ని బోధించారు..
అదే గురువు యందు ప్రేమతో కూడిన భక్తి... గురు నామస్మరణ.. గురువు యొక్క పాదాలని భక్తితో ధ్యానించడం..
సాయి భక్తులు అందరూ ఆచరించడానికి చాలా సులువైన మార్గాన్ని బాబా మనకు చూపించారు..
మనం చేయవలసిందల్లా.. ఏ పని చేస్తున్నా.. ఎక్కడ ఉన్నా.. గురువు పాదాల మీద మనోదృష్టి నిలిపి.. ఓం శ్రీ సాయిరాం.. ఓం శ్రీ సాయిరాం.. ఓం శ్రీ సాయిరాం.. అంటూ గురునామస్మరణ చేయడమే..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment