భక్తి అంటే భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ప్రేమించడం
.భక్తుడు భగవంతునికి దాసుడైతేఆ భగవంతుడు భక్తి కి దాసుడవుతాడు .తనను
పట్టుకొన్నవారిని తానెప్పుడూ విడువఁడు .ఎవరు నామీద మనసు పెడతారో వాళ్లు తలచుకోలేని నాడు నేనే వారిని తలచుకొంటాను అని పురాణ
వాక్యం .భక్తులంటే భగవంతునికి ప్రాణం .తన భక్తులకోసం ఆయన ఏదైనా చేస్తాడు .పదవి ,
సంపద ,శక్తి ,విద్య ,అందం ,జాతి ,ఐశ్వర్యంతో
సంబంధం లేకుండా భక్తుడి మనసు మాత్రమే
గమనిస్తాడు .ఆయన కల్మషరహితుడు కాబట్టి
నిష్కల్మషమైన మనసున్న భక్తులను ఆదుకొంటాడు .అండగా ఉంటాడు .ఏ పదవీ లేని
విభీషణుని ,రాజ్యం కోల్పోయిన సుగ్రీవునికి మంత్రిగా ఉన్న హనుమంతుణ్ణి అనుగ్రహించాడు .
ఏ సంపదా లేని కుచేలుణ్ని అభిమానించాడు .
ఎలాంటి ఐశ్వర్యాలు లేని విదురుడి ఆతిధ్యాన్ని ప్రేమగా స్వీకరించాడు .నిస్సహాయురాలైన ద్రౌపదిని ఆదుకున్నాడు .కృష్ణుడిగా రాజసూయ యాగంలో అందరూ భుజించిన ఎంగిలి విస్తరాకులను తీశాడు .రాముడిగా శబరి భక్తి కి
ఆమె ఇచ్చిన ఎంగిలి ఫలాలను తిన్నాడు .
వెంకటేశ్వరునిగా అన్నమయ్యను పల్లకిలో తన
భుజాలపై మోశాడు .భగవంతుని పట్ల సంపూర్ణ
విశ్వాసం కలిగిన భక్తుల సంరక్షణను ఆయనే వహిస్తాడు .కృష్ణావతారం ద్వారా భగవంతుడు
ఈ విషయాన్ని సృష్టీకరించాడు .నిర్మలమైన
మనసుతో ,నిష్కామభావంతో ,ఆకు ,పూవు ,పండు ,చివరకి జలం .ఏది అర్పించినా తనకు ఇష్టమేనంటాడు .
భక్తిమార్గంలో నడిచే భక్తుడికి భగవంతుడే ఆప్తుడు .ఆ మనిషికి ప్రపంచమంతా పరమాత్మ
ప్రతిరూపంగా అనిపిస్తుంది .తన దైవం సర్వవ్యాపకుడు అన్న సత్యం గ్రహించిన భక్తుడు
ఏ తప్పూ చేయడు .సుఖదుఃఖాలను సమానముగా స్వీకరిస్తాడు .ఏ మత గ్రంధమైనా
మంచి పనులు చేయాలని ,మంచితనాన్ని పెంచుకోవాలని బోధిస్తుంది .సత్ కార్యాలు ద్వారా
భగవంతుణ్ణి మెప్పించకలిగితే ఆంతకంటే గొప్ప భక్తి ఏముంటుంది ? భక్త శిరోమణులెందరో భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించి తరించారు .భక్తిమార్గం ద్వారా బ్రహ్మానందాన్ని పొందాలనుకున్న సాధకుడు ఆ భక్తుల బాటలో
పయనించాలి .అప్పుడే అతడికి ఆశించిన అత్మానందం లభిస్తుంది .

No comments:
Post a Comment