Saturday, August 8, 2020

హేమాడ్ పంత్- అన్నాసాహెబ్ దబోల్కర్.

*హేమాడ్ పంత్- అన్నాసాహెబ్ దబోల్కర్.*

అన్నాసాహెబ్ దబోల్కర్ 1856 సంవత్సరంలో మహారాష్ట్రలోని థానే జిల్లాలో  జన్మించారు. వారి తండ్రి శివ భక్తులు. వారి ఇల్లు అత్యంత నిరుపేద స్థితిలో ఉండేది. పైగా వారు బాల్యంలోనే వారి తండ్రి మరణించడం వల్ల  చాలా శ్రమపడి చదువుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీష్ ఐదవ తరగతి  కాగానే, ఆ చదువు వదిలేసి ఇంట్లో ఉండిపోవలసి వచ్చింది.

ఇంటి పరిస్థితి పేదరికంలో ఉన్నా,వారి స్వభావం చిన్నప్పటినుండి చాలా ఉదారంగా ఉండేది.పేదరికం వలన మరియు ఉదరపోషణకు వేరే సదుపాయం లేనందు వలన వారికి ప్రారంభంలోనే ఎనిమిది రూపాయలకు బడిపంతులు ఉద్యోగం చేయవలసి వచ్చింది.

ఆ ఉద్యోగాన్ని కొంతకాలం చక్కగా చేశాక,వారి తెలివితేటలు, ప్రేమమయ స్వభావం వలన వారికి  ఠానే జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్ సహాయంతో గ్రామమునసబు పని లభించింది.

దీనుల, పేదల యోగక్షేమాలను తెలుసుకోవడంలో వారికి చాలా ఉత్సాహంగా ఉండేది. వారి శ్రమపడే స్వభావం మరియు ఆఫీస్ పని విషయంలో చాలా కర్తవ్య దక్షత ఉండటం వల్ల వారిపై కలెక్టర్కు రోజురోజుకు అభిమానం పెరిగి కొన్ని రోజులలోనే వారు రెవెన్యూ ఖాతా పరీక్ష పాసయ్యాక వారిని మహాద్ వద్ద మొదట గుమస్తాగా నియమించడం జరిగింది.తరువాత వారికి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఉద్యోగిగా ప్రమోషన్ లభించి కొద్దిరోజుల్లోనే భతోడ్ వద్ద కరువు పనిలో నియమింపబడ్డారు.

ఆహార పంపిణీ చక్కగా జరిగినందుకు అక్కడ ప్రజలకు వారిపై చాలా ప్రేమ కుదిరింది. ఈ నిష్కామ భగవత్సేవ వలన వారికి 1901లో పర్మనెంట్ మామలేదారుగా ఉద్యోగం వచ్చింది.తరువాత 1903 నుండి 1907 వరకు బాంద్రా వద్ద ఫస్ట్ క్లాస్ రెసిడెన్షియల్ మెజిస్ట్రేట్ గా పనిచేశారు. 1907లో వారికి ఖేడా జిల్లాకు బదిలీ అయ్యింది. 1910 సంవత్సరంలో వారు మరల బాంద్రా లో రెసిడెన్షియల్  మెజిస్ట్రేట్ గా నియమింపబడ్డారు. ఆ పోస్టులో 1916 మార్చి నెలాఖరు వరకు పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.

అన్నాసాహెబ్ 1903 నుండి 1907 వ సంవత్సరం వరకు బాంద్రా లో  ఉండగా వారికి హరి సీతారాం దీక్షిత్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ భగవద్గీత కలిసి పఠించేవారు. ఇద్దరిలో ఎవరికైనా ఒక మహాత్ముడు కనపడితే వారిగురించి మరొకరికి తెలియ చేసుకునేవారు.

1909లో నానా చందోర్కర్ ద్వారా దీక్షిత్ షిరిడీలోని సాయిబాబా వారి వద్దకు వెళ్లడం జరిగింది. ఇలాంటి మహాత్ముని అన్నాసాహెబ్ కలవాలని గుజరాత్లోని ఆనంద్ లో ఉన్నప్పుడు దీక్షిత్ తెలియజేశాడు. బాబా దర్శనం చేసుకోవాలని ఒక నెల రోజులు సెలవు కోసం కమిషనర్ కు దరఖాస్తు పెట్టుకోగా సెలవు మంజూరు కాలేదు.బాంద్రా కు ట్రాన్స్ఫర్ చేయమనగా అప్పటికే వారు రెండు సార్లు అక్కడ పని చేశారు. కనుక అదే ప్రదేశంలో నియమించడం మంచిది కాదని నిరాకరించారు.

బాబా సంకల్పించారు అన్నట్లు, బాంద్రా లో పనిచేసే అసిస్టెంట్ కలెక్టర్ అకస్మాత్తుగా మరణించడం వల్ల బాంద్రాలో ఖాళీ ఏర్పడింది. అప్పుడు అన్నాసాహెబ్ రెసిడెన్షియల్ మెజిస్ట్రేట్ గా అక్కడ నియమించబడ్డారు. నియమించబడిన పది రోజులకు సెలవు తీసుకుని వెంటనే తమ మొత్తం కుటుంబంతో సహా సాయిబాబాను ప్రధమంగా దర్శించుకున్నారు. ఆ కలయిక లోని ఆనందాన్ని ఆయన సచ్చరిత్ర'లో చక్కగా వివరించాడు. ఆ మొదటి దర్శనంలోనే సాయిబాబా ఇతనికి హేమాడ్ పంత్ అనే బిరుదు ఇచ్చారు.

1916లో రిటైర్ అయిన తరువాత ధబోల్కర్ బాబా చరిత్ర రాయడానికి శ్యామా ద్వారా బాబా నుంచి అనుమతిని పొందాడు. బాబాను చూడటానికి అవకాశం లేని వారికి  అతని రచన ద్వారా బాబా గురించి చక్కగా తెలుసుకునే  అవకాశము కలుగుతుంది.

బాబా యొక్క లీలలు ఆసక్తికరంగానూ ప్రబోధాత్మక గానే ఉంటాయి. వాటిని గనుక మనము ధ్యానిస్తే భగవంతునితో మనము లయము పొందగలము.అంతేకాక యోగములో నిపుణతను, యోగానందాన్ని కలిగిస్తాయి.  ఈ ఆలోచనను తన మనస్సులో పెట్టుకుని వాటిని సేకరించి బాబా యొక్క జీవితచరిత్రను వ్రాయి నారంభించాడు. అదే తన ఉపాసనగా చేసుకోవాలి అని భావించాడు.

దీక్షిత్, చందోర్కర్ మరియు ఇతర భక్తులతో ఆయనకున్న సన్నిహిత సాన్నిహిత్యం అతనికి విషయ సేకరణకు బాగా ఉపయోగపడింది. సచిత్ర రాయటానికి అతనికి అనుమతి 1916 లో ఇవ్వబడింది. బాబా సమాధి చెందే సమయానికి రెండు మూడు అధ్యాయాలు మాత్రమే రాశాడు. చాలా రచనలు 1918 తరువాత వ్రాయబడ్డాయి. అతను 52 అధ్యాయాలు వ్రాసాడు. 1923 నుండి 1929 వరకు అతని అధ్యాయాలు సాయి లీలా మాసిక్ లో ప్రచురించబడ్డాయి.

వీరు తమ జీవితాన్ని చాలా నియమబద్ధంగా గడిపారు. ఎవరైనా శ్రీమంతుడైన పేదవారైనా కలుసుకోవడానికి వస్తే, వారితో చాలా ప్రేమగా మాట్లాడే వారు. పేద విద్యార్థుల చదువు కోసం సహాయపడేవారు. ఈ విధంగా అన్నాసాహెబ్ ప్రపంచకంగా ఉంటూనే పరమార్ధాన్ని చక్కగా సాధించారు. వారి మరణం 1929వ సంవత్సరం జూలై 15వ తారీఖున మధ్యాహ్నం తమ సొంత ఇంటిలో ఏ యోగికో సంభవించే  విధంగా లభించింది.

వారు రచించిన సచ్చరిత్ర  ద్వారానే మనం ఇప్పుడు శ్రీ సాయిబాబా గారి గురించి తెలుసుకొనుట, పారాయణ చేయట, సాధన చేయట, చేయగలుగుతున్నాము. వారికి, వారి సేవకు మనం సదా,సర్వదా కృతజ్ఞులమే.

*శ్రీ సాయి మహారాజ్.*
(జూలై 15  హేమాడ్ పంత్ వర్ధంతి సందర్భంగాప్రత్యేక వ్యాసం)

No comments:

Post a Comment