Saturday, December 26, 2020

గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహనరావు

*చిలుకూరు బాలాజీ దేవాలయం*

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి. తెలంగాణ తిరుమల గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. 
ఆలయం యొక్క వివరాలు మరియు  ప్రత్యేకత :-

• ప్రధాన దైవం: బాలాజీ.  (బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.)
• ప్రధాన దేవత: రాజ్యలక్ష్మి
• ఉత్సవ దైవం: వెంకటేశ్వరుడు
• ఇతిహాసం నిర్మాణ తేదీ: క్రీ.శ.1067
• వీసాల దేవుడు
•  ఐదు వందల సంవత్సరాల చరిత్ర
•  వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి
• ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. 
• అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి
• ప్రదేశము: చిలుకూరు గ్రామము, రంగారెడ్డి జిల్లా,తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.

*చిలుకూరు బాలాజీ:*
చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజూ 20 - 30 వేల మంది భక్తులు, సెలవుదినాలలో
 30 -50 వేల మంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీ లు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత.

*క్షేత్ర పురాణం:*
 ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లివచ్చేవాడట. అయితే, కొంత కాలానికి ఆయన జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వరస్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట. అప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చేబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్టించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట.
1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

*మందిరం యొక్క ప్రాముఖ్యత :*

వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ (వీసా గాడ్ )అని పిలుస్తారు. 

*చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనం :*

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 :45 వరకు భక్తుల దర్శనార్ధం తెరిచే ఉంచుతారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. ఎంతటివారైనా క్యూలైన్ లో వెళ్ళవలసిందే!
ఇతర విశేషాలు
దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు. దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.
 
*రవాణా సౌకర్యాలు:*

రవాణా సౌకర్యాలు హైదరాబాద్ నగరం నుండి చిలుకూరు బాలాజీ ఆలయానికి చక్కటి రోడ్డు రవాణా సదుపాయాలూ కలవు. మెహదీపట్నం నుండి ప్రతి 5 నిమిషాలకొకసారి 222D నెంబరు గల బస్సు బయలుదేరుతుంది. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్ పల్లి నుండి కూడా సిటీ బస్సు సర్వీసులు కలవు. లంగర్ హౌస్ నుండి ఆటోల్లో ఎక్కి గుడి వద్దకు చేరుకోవచ్చు. ప్రయాణ సమయం గంట పడుతుంది.

గోవిందా గోవింద 🌹🙏🏻🌺🌸🙇🏼‍♂️🙆🏻‍♂️🌹🌺

Saturday, December 19, 2020

సాయిబాబా చేష్టలు మనకి అర్ధం కావు

సాయబాబా మాటలు ,చేష్టలు ,గాధలు ఒకొక్కసారి అర్థం కావు .సాయి తత్వాన్ని గ్రహించినవారే వాటికి అర్ధాలను కొంతవరకు చెప్పగలరు .సాయిబాబా ఒకసారి ఒక గాధను 
తెలిపారు ."ఒక తోటమాలికి ఒక కొడుకుండేవాడు వాడు రాజుగారి తోటకు వచ్చి అక్కడే ఉండిపోయాడు .12 సంవత్సరాలు తరువాత 
తన తల్లితండ్రులవద్దకు వెళ్తానని ,చెప్పగా రాజు 
అతనికి ఒక భవనము ఇచ్చి ,తనకూతురినిచ్చి 
వివాహం చేశాడు .చాలాకాలము అయినా సంతానం కలగలేదు .అతను తన తల్లితండ్రులవద్దకు వెళ్లిపోయాడు .రాజు అతనికి 
కొంత ధనము ఇచ్చి పంపాడు .బాబా ఈ గాధను 
కాకాసాబ్ దీక్షిత్ కు చెప్పాడు .దానితోపాటు దాని 
అంతరార్ధము గ్రహించాడు .ఒకసారి సాయబాబా ఫోటో తీయడానికి ఒక యువత బృందం వచ్చింది 
బాబా శ్యామాతో " ఫొటొ తీయనవసరం లేదని 
అడ్డు గొడ పడితే చాలు " అని అన్నారు .బాబా మాటలకు కాకాసాబ్ ఇలా విశ్లేషించారు .ఆ యువకులు ఫోటో తీయాలనుకొన్నది తన మూడున్నర మూరల దేహానాన్ని ,నిజానికి అది తన అసలు రూపం కాదనీ ,తాను వేరు ,జగత్తు 
వేరని ద్వైత భావమనే అడ్డుగోడ వల్ల కలిగిన 
అజ్ఞానము వల్లనే ,భౌతిక దేహమే తాము అన్న 
భ్రాంతి కలుగుతున్నదని ,అజ్ఞానమనే అడ్డుగోడను  
పడగొడితే తన నిజ స్వరూపము అర్ధమవుతుంది 
అని ,ఈ మాటలు వల్ల శ్రీ సాయిమహరాజ్ చెప్పారు .ఆ ఆదేశంలోని అంతరార్ధాన్ని గ్రహించి 
భక్తులు అజ్ఞానమనే అడ్డుగోడను పడగొట్టి బాబా 
సత్య రుపాన్ని దర్శించాలి .

Monday, December 14, 2020

మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా

*మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా*

సాయి బాబా     ...            సాయి బాబా          ...            సాయి బాబా          ...            సాయి బాబా.


*శ్రీమతి సాయిలీలమ్మగారు కలకత్తాలో యుండగా నడుమునొప్పితో బాధపడుచున్నది*.
*ట్యూమర్ ఉన్నదని, అది ముందు, ముందు క్యాన్సర్ గా మారవచ్చునని, కనుక గర్భసంచి తీసివేయవలెనని డాక్టర్లు చెప్పిరి. పెద్దాపరేషన్ చేశారు.*

*ఆ పరిస్థితిలో ఇవ్వకూడని మందు నర్సు ఇవ్వటంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు లీలమ్మగారు. బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బాబా తమ చమత్కారం చూపారు.*

*తెల్లని దుస్తులు ధరించి బాబా లీలమ్మ గారి వద్దకు వచ్చి, ఆప్యాయముగా "అదేమిటి వీళ్ళు నీకు విభూతి పెట్టలేదా? అని ప్రశ్నించారు. అపస్మారకం నుండి తేరుకున్న లీలమ్మ గారు ఆ స్థితిలో "బాబా! మీరెందుకు కష్టపడతారు అనుచు తన కుమార్తె లలితను అమ్మగారు పిలవగా ఆమె వచ్చి విభూతి పెట్టినది. అప్పుడు బాబా అంతర్థానమైనారు. అంతే ఆమె ఆరోగ్యం మెరుగుపడసాగింది.*

*ఆమెను పరీక్షించుచున్న డాక్టర్లు ఆమె ఆరోగ్యము మెరుగుపడటం చూచి విస్మయం చెందారు. లీలమ్మగారి భర్త స్నేహితునకు బాబా స్వప్నంలో కనిపించి ఆమె ఆరోగ్యము బాగవుతుందని దైర్యంగా యుండమని చెప్పామన్నారు*

*ఇరువది ఒకటవ రోజు మాతాజీని ఆస్పత్రినుండి ఇంటికి పంపినారు. ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇంటి వద్ద ఉన్న పనిమనిషి మాములు పనులు చేస్తుంది కానీ పిల్లల పని, తన పని ఎవరు చూచుకుంటారని మాతాజీ ఆలోచన చేయసాగింది.*

*ఇంటిపట్టునేయుండి శ్రద్దగా ఇవన్నీ చూచుకునేందుకు ఎవరన్నా తెలుగువచ్చిన యువకుడు దొరికితే బాగుండుననుకొని శ్రీ సాయినాధుని హృదయపూర్వకంగా వేడుకున్నది.*

*లీలమ్మ గారు అలా* *అనుకున్న తరువాత ఆమె ఇంటికి వచ్చిన మూడవ రోజు ఒక కుర్రవాడు వారి ఇంటి తలుపు తట్టారు.* *రామారావు గారు వెళ్లి తలుపు తీస్తే ఆ కుర్రవాడు తెలుగులో మాట్లాడుతూ*
*ఇంట్లో పని ఉంటె చేస్తానన్నాడు.* 
*ఆ పిల్లవాడిని అమ్మగారి దగ్గరకు తీసుకొని వచ్చి పనిచేస్తానంటున్నాడు మాట్లాడు అని చెప్పి పరిచయము చేశారు రామారావు గారు.*

*ఆ కుర్రవాడు 16 సం: వయస్సు వానిగా యున్నాడు. లీలమ్మ గారు చూచింది. కుర్రవాడు బాగానే యున్నాడు కాని బట్టలు బాగాలేవు.*

*బాబా నా మోర ఆలకించాడన్నమాట.* *కలకత్తాలో తెలుగువారు దొరకటమేమిటనుకుంటూ, నీ పేరేమిటి బాబు అని అడిగితె, నాకు పేరు లేదు. ఎపేరైనాసరే, మూర్తి అని పిలువండమ్మా*.
*నా అమ్మ నాన్నా చిన్నప్పుడే పోయారు. ఎవరు లేరు అని అన్నాడు ఆ కుర్రవాడు.*

*బీరువాలో చొక్కా గుడ్డయుంటే దానిని కూతురు చేత తెప్పించి గుడ్డ అతనికి చాలదేమో అనుకుంటూ అమ్మగారే కుట్టింది. ఆ కుర్రవాడు స్నానం చేసి వచ్చి ఆ చొక్కా వేసుకుంటే సరిపోయినట్లు అనిపించింది అమ్మగార్కి.*

*ఇంట్లో పనంతా చూచుకుంటున్నాడు. పిల్లలిద్దరికీ అన్ని సమయానికి చూస్తున్నాడు. అంతకు ముందున్న పనిమనిషిని మాన్పించాడు. ఆ పనిచేస్తున్నాడు అమ్మకు మందులివ్వటం దగ్గర నుండి అన్ని తనే చూస్తున్నాడు.*

*పనిమనిషిని ఎందుకు వద్దన్నావని అమ్మ అడిగితె ఎందుకమ్మా నేను నీదగ్గరేవున్నాగా! నీకు ఆపరేషన్ చేసినప్పుడు చాలా రక్తం పోయిందిగా? ఇప్పుడు నీ ప్రక్కనే వున్నాగా. ఆ పనిమనిషికి ఇచ్చే 21 రూపాయలు నీ ఆరోగ్యానికి పండ్ల కొరకు వాడొచ్చుగా" అని అన్నాడు.*

*స్నానానికి అన్ని సిద్ధం చేసేవాడు. స్నానం చేసేటప్పుడు మగపిల్లలు రాకూడదు" అని అమ్మగారంటే చిన్న పిల్లవానిగా కనిపించాడు.* *ఇట్లు అనేక చమత్కారాలు చేస్తున్నా మాతాజీ గుర్తించలేకపోయింది మాయచేత.*

*పిల్లవాడి మాటలు సాయిసచ్చరిత్రతో పోలివున్నవని తెలుసున్నా కూడా బాబాని గుర్తించలేకపోయింది.*

*భోజనం చేసేటప్పుడు దగ్గరుండి తీనిపించేవాడు. ఆరు నెలలు తరువాత డాక్టర్లు చూసి అంతాబాగుంది ఇంకా ఒక్క నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు.*

*ఇంటికి వచ్చేటప్పటికి కుర్రవాడు ఇంట్లోలేడు. అమ్మగారు వాడేమైనాడోనని బాధపడింది. మూడురోజుల తరువాత వచ్చాడు.*

*ఏమైనావురా? అని ఆంటే నన్ను పోలీసులు పట్టుకెళ్లి జైల్లో పెట్టారు. నీవు మహ్మదీయుడవన్నారు. కాదు హిందువన్నారు. అప్పుడు వెంటనే నిక్కరు విప్పి చూపిస్తే వదిలేశారు అని చెప్పాడు*.

*నెల గడిచింది. మరలా డాక్టర్ల దగ్గరకు మాతాజీ సాయిలీలమ్మగారు వెళితే అంతా బాగుంది. మీరు మాములుగా పనులు చేసుకోవచ్చన్నారు.*

*ఆమె ఇంటికి వచ్చేటప్పటికి ఆ కుర్రవాడు లేదు. తిరిగి యిక రానేలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు. ఇంట్లో ఎప్పుడుండేవాడు. ఎక్కడికెళ్ళాడు? ఆమెకు ఆర్డమే కాలేదు.*

*అతను వున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ సచ్చరిత్రలోని బాబా మాటలేనని గుర్తుకు వస్తున్నాయి. బాబా! మీరా ఇలా పని పిల్లవాడిగా ఉంది కాపాడినది అని బాధపడ్డది. గుర్తించలేకపోయినందుకు చింతించింది.*

*ఇలా ఆమెకు బాబా ఎప్పుడు నిదర్శననిస్తూనే యున్నారు.*

సాయి లీలమ్మ గారు 1923 ఆగస్టు 17న విజయవాడలో శ్రీ గోవిందరాజు నాయుడు (మునిసిపల్ ఛైర్మన్ గా మూడుసార్లు పనిచేశారు) మరియు శ్రీ రుక్మిణి భాయ్ పుణ్య దంపతులకు జన్మించారు. ఆమె ఏడు సంవత్సరాల వయస్సు నుండి ఆమె తండ్రి భగవత్ గీతా యొక్క  ప్రసస్త్యాన్ని వివరించి చెప్పేవారు. ముందుగా ఆమె శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టారు.

1938లో ఆమె తన మేన మామయ్య శ్రీ వేణుగోపాల్ గారిని కలిసినప్పుడు అక్కడ వారి ఇంటిలో మొదటిసారి బాబా యొక్క అందమైన చిత్రాన్ని చూసే అవకాశం ఆమెకు లభించింది. ఆ ఫోటోలో బాబా యొక్క నోరు హనుమంతుడిని పోలినట్లు ఉందని ఆమె సరదాగా అన్నారు. ఆమె అక్కడ బాబా యొక్క లీలలును మరియు బాబా తన భక్తులను ఇబ్బందులు మరియు అడ్డంకులను ఎలా తొలగించేవారో తెలుసుకున్నారు.

మరుసటి రోజే ఆమెకు మొదటి అనుభవం  కలిగింది. ఆమె పాఠశాలకు వెళ్ళడానికి ఆమె ఆతురుతలో ఉన్న సమయంలో ఒక ముఖ్యమైన పుస్తకం కనిపించలేదు.ఆమె శ్రీ సాయినాధుని తలుచుకొని హృదయపూర్వకంగా ప్రార్ధించారు. మరుక్షణమే ఆ పుస్తకం ఆమె తన ముందు ఉండటం గమనించారు. అప్పటినుండి బాబాతో ఆమెకు అనుబంధం మొదలైయింది. ఆమె జీవితంలో రానున్న ప్రతి కష్టాన్ని బాబా  ముందుగా హెచ్చరిస్తూ ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకోనేవారు.

1947లో శ్రీమతి సాయి లీలామ్మ గారు కలకత్తాలో నివసించేవారు. ఆమె తన కుమార్తె కోసం ఊలు కోటు అల్లిక నేర్చుకోవాలనుకున్నారు. కాబట్టి ఆమె తన ఇంటికి సమీపంలో ఉండే వాళ్ళ ఇంటికి  అల్లిక నేర్చుకోవడం కోసం వెళ్లారు. కొంతసేపటి తరువాత భారీ వర్షం పడింది.వెంటనే ఆమెకు తన ఇంటి మేడపై ఎండబెట్టడం కోసం ఉంచిన మైదా పిండి గుర్తుకు వచ్చింది. ఆమె ఆ సమయంలో చాలా చిన్న వయస్సులో ఉన్నందున ఆమె భర్త తిడతారని బాధపడుతూ ఆమె చాలా ఆందోళన చెందారు. "బాబా మీరే నన్ను కాపాడాలి" అని ప్రార్ధించారు. బాబా అలానే చేసారు కూడా.

ఆమె వర్షం పడటం ఆగిపోయిన తరువాత గాబరాగా ఇంటి మేడపైకి వెళ్లి చూస్తే, ఆశ్చర్యం!  మేడ మీద ఉంచిన పిండి ఎవరో గొడుగుతో  తడవకుండా రక్షణ ఇచ్చినట్లు మైదా పిండి పొడిగా ఉన్నట్లు గమనించారు. పిండి ఎండబెట్టడం కోసం ఉంచిన స్థలం తప్ప మొత్తం మేడ అంతా తడిగా ఉంది. మధ్యాహ్నం వర్షం పడుతున్నప్పుడు అలా ఎవరు రక్షించగలరు! బాబా కాకుండా!

ఆ యవ్వన గృహిణికి ఇది ఒక రోజువారీ ప్రాముఖ్యమైన లోకిక విషయం అయినప్పటికీ కూడా బాబా తమ యొక్క ప్రమేయంతో ఒక అద్భత అనుభవంగా మారింది.

***శ్రీ షిర్డి సాయిబాబా ధ్యానం గురించి సాయి అంకిత భక్తురాలైన, కీర్థి శేషు రాలైన మాతాజీ సాయిలీలమ్మ చెప్పిన విషయాలు .-అమ్మ తన ఎదుట బాబా ఫొటో కాని ,విగ్రహం కానీ లేకుండానే మానసికంగా ధ్యానించేవారు 
.ధ్యానానికి కూర్చుని నిర్మలంగా ,నిశ్చలం గా పవిత్రమయిన మనస్సుతో ముందు బాబాను సంకల్పించు కోవాలి

 *.కనుబొమ్మల మధ్య దృష్టిని కేంద్రికరించగానే బాబా పవిత్ర ఆకారం మనకు కనపడుతుంది .
తరువాత బాబాను రత్నాలు ,వజ్రాలు విలువైన మణులు పొదిగిన సింహాసనం మీద ఆసీనులైనట్లు భావించాలి .బంగారు గంగాళంలో నుండి బంగారు చెంబుతో పన్నీరు ని తీసి స్నానం చేయించాలి .బంగారు పిడిగల గంధపు కర్రతో గంధాన్ని తీయాలి .శుబ్రమైన మంచి తువాలు తీసుకొని శరీరం అంతా తుడవాలి ,తరువాత గంధం పూయాలి .బంగారు పన్ను గల రోకలితో కుంకమ దంచి నొసట బొట్టు పెట్టాలి .పన్నీరు సెంటు లాంటి సుంగధ పరిమళములు వెదజల్లాలి .సాంబ్రాణి ధూపం వేయాలి .
*నిష్ట ,సబూరి అనే రెండు రూపాయలు .తాంబూలం సమర్పించి ,ఎంతో శ్రద్ద తో మానసిక మాలవేసి 'ఓం సాయి 'నామముతో పాద పూజ చేయాలి .హారతి ఇవ్వాలి .ఇదే మానసిక పూజ .అమ్మ నిత్యం చేసే ధ్యానం .ఆమె నిరంతర సాధన .అదే ఆమె విశేష తపోబలం .***

*1954 లో షిర్డీలో శ్రీ ప్రత్తినారాయణరావు గారిచే తెలుగు అనువాదం చేసిన సచ్చరిత్ర ఆవిష్కరణ సమయములో మొదటి కాపీ వీరికి ఇవ్వబడినది. వారు ఎవరిని పలకరించినా బాబా అనే సంబోధిస్తారు.*

సాయి లీలమ్మ ...శ్రీ.అవతార్ మెహర్ బాబా, శ్రీ.అబ్దుల్ బాబా, శ్రీ. శివనేషన్ స్వామీజీ, శ్రీమతి కుసుమ కుమారి, శ్రీ పూర్ణానంద స్వామి, శ్రీ.వెంకయ్య స్వామి, శ్రీ.మార్కెట్ స్వామి, చీరాల అవధూత, శ్రీ.గోపాల్ బాబా, శ్రీ , సబరి మాతా, నాంపల్లి బాబా .. దర్శనం ఆశీస్సులు పొందారు. . 1946 లో ఆమె శ్రీ బి.వి.నరసింహ స్వామీజీని సందర్శించారు. 

1948 లో, ఆమె షిర్డీకి వెళ్లి, షిర్డీలో శ్యామా కుమారుడు ఉద్దవ్ దేశ్‌పాండేను కలుసుకుంది మరియు అతని నుండి ఒక రూపాయి నాణెం అందుకునే అదృష్టం కలిగింది.

సాయి లీలమ్మ 1968 లో రిషికేశ్‌లోని మహర్షి శివానంద ఆశ్రమంలో 3 రోజులు గడిపారు. 

సాయి లీలమ్మ తండ్రి 1968 సంవత్సరంలో బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్‌లో దాదాపు రెండేళ్లపాటు ఉన్నప్పుడు, ఆమె చాలా మంది సాధువులను కలుసుకున్నారు. 

1970 లో ఆమె కేశవయ్యను సందర్శించింది. 

 1980 సంవత్సరంలో, తిరువన్నమలైలోని రమణాశ్రమంలో కొన్ని రోజులు నివసించారు. 

23 అక్టోబర్ 2005 న సాయి లీలమ్మ షిర్డీకి వెళ్ళినప్పుడు, సాయి బాబా సంస్థాన్ మేనేజ్మెంట్ టీం ఆమెతో పాటు వచ్చింది. వారు “తల్లి, మీరు 1948 నుండి సంస్థకు వస్తున్నారు. మీరు జీవిత సభ్యత్వం తీసుకున్నారు. మీలాంటి వ్యక్తులు  'ధర్మం' మరియు సత్యాన్ని కొనసాగించడానికి ఎంతో సహాయపడతారు ".అన్నారు.

ఆమె ప్రజల  సమస్యలను సాయికి చెప్పడం మరియు వారి సమస్యలను పరిష్కరించేది. ఈ విధంగా, ఆమె చాలా మంది ప్రజల సమస్యలను మరియు అనారోగ్యాలను నయం చేసింది. భక్తులు బాధపడుతున్న అనేక వ్యాధులు ఆమె ద్వారా నయమయ్యాయి. వారి దీర్ఘకాలిక వ్యాధులను తీసుకోవడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు.

*సాయి లీలమ్మ *ధ్యానం,* అన్నదానం, *సత్సంగం ,మరియు *నామ జపా లకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆమెను సందర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుడి నుదిటిపై ఆమె ఉధీని ఉంచేవారు. 

సాయి లీలమ్మ తన భక్తులకు అనేక సందేశాలు ఇచ్చేది. సాయి భక్తుల ప్రయోజనం కోసం అటువంటి అద్భుతమైన సందేశం.......

*విశ్వాసం ఉన్నచోట, ప్రేమ ఉంది,;;, 
*ప్రేమ ఉన్నచోట శాంతి ఉంది,; , 
*శాంతి ఉన్నచోట దేవుడు ఉన్నాడు, 
*సాయి ఎక్కడ ఉన్నారో అక్కడ, అన్ని ఉన్నాయి

2014 ఆగస్టు 25, సోమవారం ఉదయం 11:05 గంటలకు   91 సంవత్సరాల వయసులో సికింద్రాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్ నివాసం కమ్ మందిరంలో సిధ్ధి  పొందారు.

*గురువుల నుండి*సద్గురులీల నుండి *అంతర్జాలం నుండి సేకరణ*
అల్లు జయశ్రీ.

Sunday, December 6, 2020

షోడశ దత్త అవతారాలు.... 16:: శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం..🙏🏻

షోడశ దత్త అవతారాలు....

16:: శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు 


అవధూత,అది గురువు, శ్రీ దత్తాత్రేయ, దిగంబరుడు, యోగిరాజు, అత్రివరదుడు, సిద్ధరాజు ఇలాంటి అనేక అవతారాలు భూమిపై  ఎత్తి జ్ఞాన, వైరాగ్య, సేవ,స్నేహ భక్తి, అష్టాంగ యోగ, లాంటి అనేక మోక్ష మార్గాలు బోధించి,సర్వ సాధనలు తన భక్తులకు బోధించి కృతార్థులను చేశారు. అందరినీ ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. తరువాత స్వామి కార్య సిద్ధుడై జ్ఞాన మార్గంలో యోగనిద్రని స్వీకరించి విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు స్వామి భక్తులు, శిష్యులు, స్వామి దర్శనమునకు వచ్చిన వారికి  శ్రీ కృష్ణ శ్యామకమలనయనుడు అవతారంలో దర్శనం ఇచ్చారు.

శ్లో ॥ కార్తీకే శుద్దపక్షే తూ ద్వాదశ్యాం బుధవాసరే!

రేవత్యాం భాస్వాదుద్యవేలాయం జగదాశ్రయ!!

కార్తీక శుద్ధ ద్వాదశి రోజు, రేవతి నక్షత్రంలో బుధవారం సూర్యోదయానికి అవతరించారు. స్వామి దర్శనంతో అందరూ ఆనందంతో జయ జయ కారాలు చేశారు. పూలవర్షం కురిపించారు.

దత్తాత్రేయ రూపం ఇంద్రనీల మణి లాగా అత్యంత తేజస్సుతో వెలిగింది.

ఈ రూపమును ధ్యానించి వారికి కళ్యాణకరం అవుతుంది. మనోరధాలు నెరవేరుతాయి. సర్వదేవతలు ఈ రూపంలో ఉంటారు కాబట్టి వారు అందరూ సంతుష్టులు అవుతారు.

స్వామి ధర్మతత్వంతో అందరికి మార్గదర్శనం చేశారు. ఎలా చింతన చేస్తే అలా పలుకుతారు. ప్రేమ,భక్తికి లొంగుతారు. ఏ భక్తులు శరణాగతి చెందుతారో వారికి దత్తం అవుతారు. నా భక్తులకు నేనే దత్తం అవుతాను. నా భక్తులకు ,నాకు దూరం లేదు, నన్ను అనన్యంగా  ధ్యానం చేసేవారికి నేను ప్రసన్నుడను. వారి ఇహ,పర శ్రేయస్సులు నావే. భక్తితో నన్ను కొలిస్తే నేను మీతోనే ఉంటాను. మీతో ఏకమౌతాను.అన్న దత్త స్వామికి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. 

శ్లో॥ అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే




స్వామి ని యథాశక్తి పూజించి  బ్రాహ్మణ భోజనము విధి గా చేయాలి.

షోడశ దత్త అవతారాలు... 15::: దిగంబరుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం...🙏🏻

షోడశ దత్త అవతారాలు...

15::: దిగంబరుడు


సోమవంశ రాజు అయిన యదురాజు కు దర్శనం ఇవ్వడానికి స్వామి ఈ అవతారం తీసుకున్నారు. ఒకసారి యదురాజు కావేరి నది దగ్గర పర్వతాల మధ్య, అడవిలో తిరుగుతున్నాడు. యదురాజు దత్తాత్రేయ భక్తులు, ఉపాసకులు. యదురాజుకు అకస్మాత్తుగా దిగంబరుడు అయిన దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చారు. యదురాజు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, వినమ్రంగా, మహారాజ!సర్వలోకంలో జనులు సంపత్తి, ఆయుష్యు,  కీర్తి, వైభవం, ధనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ప్రకాశవంతమైన యువకులు. వీటి కోసం ప్రయత్నం చేయకపోయినా మీరు ఇంత తృప్తిగా ఎలా ఉండగలుగుతున్నారు?కామము, వికారాలు,ద్వేషం ఇలాంటివి మీకు అంటడం లేదు ఎందుకు? మీరు సంతోషంగా కనిపిస్తున్నారు.దయచేసి నాకు వివరించవలసినది,  అని అడిగాడు. అప్పుడు దిగంబరుడు అయిన అవధూత ఆత్మ సంతృప్తి కోసం విశ్వంలో తిరిగేటప్పుడు ప్రకృతి లోని 24 మంది గురువులను కనుగొన్నాను. వాటి నుంచి 24 రకాల భోధలు తీసుకున్నాను. అదే నా ఆనందమునకు కారణం. అవి భూమి,వాయువు,ఆకాశము, అగ్ని,సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, ఏనుగు,చీమ,చేప, వేశ్య, శరకారుడు, బాలుడు,చంద్రుడు, తేనె టిగ,లేడీ, గ్రద్ద,కన్య,సర్పము,సాలె పురుగు, భ్రమర కీటకం,జలము. ఇలా 24 గురువుల నుంచి నేర్చుకున్నాను. అని బోధించారు. కృతజ్ఞతగా యదురాజు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు.దత్తాత్రేయ స్వామి దయతో బోధించన ఆత్మజ్ఞానంతో యదు మహరాజు, కృతార్థుడై రాజ్యాన్ని పాలించాడు. ప్రహ్లాదుడుకి జ్ఞానం,  కార్తవీర్యార్జునకి సేవ, స్మరణ వల్ల, వేదధర్ముడుకి నామజపం, దీపకునికి లీలా శ్రవణం,విష్ణుధర్ముడు కి పాదార్చన, పరశురాముడుకి స్నేహ భక్తిచే తరింపజేశారు.

అవతారం:ఆషాఢ మాసం,పూర్ణిమ, బుధవారం, సూర్యోదయంలో, అశ్వని నక్షత్రంలో అవతరించారు.

అర్చన:

వస్త్ర, మాలలుతో పూజ చేయడం. శ్లో ॥ దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే 

దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షిణే ॥

జై గురు దత్త.

షోడశ దత్త అవతారం-14....🙏🏻 శ్రీ దేవదేవ/దేవదేవేశ్వర

 శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం...

షోడశ దత్త అవతారం-14....🙏🏻


శ్రీ దేవదేవ/దేవదేవేశ్వర...

మార్కండేయ ఋషి చెప్పిన కథ ఇది.

ముఖ్యంగా మాహుర్ క్షేత్ర  ప్రాంతంలో శతానందా అనే భక్తునకు దర్శనం ఇచ్చి,అనుగ్రహము ఇవ్వడానికి ఈ అవతారం తీసుకున్నారు.

స్వర్గంలో ఇంద్రాది దేవతలు,సత్య లోకంలో బ్రహ్మలకు  దర్శనం ఇచ్చి ఈ అవతారంలోనే అనుగ్రహించారు. శ్రీ దత్తత్రేయ స్వామి నర్మదా తీరం లోని దక్షిణ తీరంలోని అడవి నుంచి బయలుదేరి అనేక ఋషుల ఆశ్రమాలు, అనేక తీర్ధాలు, జలాశయాలు,పవిత్ర పరచుతూ చివరకు 6 పర్వతాల సమూహం,అతి ప్రాచీనం అయిన సహ్యాద్రికి వచ్చారు. ఇది దత్తాత్రేయ జన్మస్థానం అని కూడా చెప్తారు.అక్కడి అనేక ఆశ్రమాలలోని ఋషులకు దర్శనం ఇచ్చారు. దీనిని  అనసూయ శిఖరం అని,దత్తాత్రేయ స్వామి చాలా రోజులు నివసించడo వల్ల దత్త పాదుకా శిఖరం అని కూడా అంటారు. దత్తాత్రేయ స్వామి నిరంతరం  యోగ సమాధిలో తన్మయులై వుండే మహాయోగి. దత్త ఆశ్రమం మహా సుందర మైనది. చక్కటి పూలు,పండ్ల తో అలంకరింపబడినది. అనేక యోగులు, సిద్ధ మునులు,ఇక్కడే నివసిస్తారు. ఇంద్రాది దేవతలు, సిద్ధులు,గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, ఇక్కడే స్వామిని దర్శించుకుo టారు. క్రూర జంతువులు తమ వైర భావము మాని అన్ని కలిసి మెలిసి ఉంటాయి. మహావిష్ణు రూపం అయిన దత్తత్రేయ స్వామి  దేవదేవుడు రూపంలో ఇక్కడ అవతరించి, కృష్ణా మలకి వృక్షం క్రింద నీడలో శోభితులైనారు. శంఖం, చక్రం,గద ఇలాంటి ఆయుధాలు ధరించి దేవదేవుడుగా వున్నారు. ఇక్కడకు  బ్రహ్మ దేవుడు, సత్ భక్తులు దర్శనంకు వచ్చారు. గౌతమ మహర్షి కుమారులు , జనకమహారాజు పురోహితులు అయిన శతానంద మహముని స్వామిని ఇక్కడే దర్శించుకున్నారు. అప్పుడు స్వామి, బ్రహ్మ కు,సత్ భక్తులకు,శతానంద మహామునికి దేవదేవుడు రూపంలో దర్శనం ఇచ్చారు.

శ్లో ॥ భాద్రే దివా శుక్ల చతుర్దశీతిథో భృగోర్దినే భే శతతారకాఖ్యే!

ఆదయే చ యామే శుభదే మహూర్తే దృశ్యో భవత్తత్ర స దేవదేవః ॥

భాద్రపద శుక్ల చతుర్దశి రోజు ,శుక్రవారం శతభిషా నక్షత్రంలో మొదటి ఘడియ లో శుభముహూర్తంలో స్వామి దేవదేవేశ్వర రూపములో  అవతరించడం జరిగింది. సిద్ధులు అందరూ స్వామిపై పూల వర్షం కురిపించారు. జయ,జయ కారాలు మారుమోగిపోయాయి.

తలపై కిరీటం సూర్యతేజస్సుతో, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. విశాలమైన నుదురు, నల్లటి రింగుల జుట్టు,శంఖం వంటి గొంతు,తేజస్సుతో మెరుస్తున్న బుగ్గలు, పెద్ద బహువులు, అందమైన చేతులు, వంపు కనుబొమ్మలు,పద్మం లాంటి కళ్ళు, మెడలో పొడుగాటి వైజయంతి మాల, సూటి ముక్కు, చక్కటి పళ్ళ వరస, తెల్లని దంతాలు,చెవికి కుండలాలు, అందమైన గడ్డం, అజానుబహు,  గొంతుకు పగడ, రుద్రాక్ష మాల,పసుపు రంగు పట్టు వస్త్రములు కట్టి, భుజాములపై అంగ వస్త్రము వేసుకొని దత్తాత్రేయ స్వామి శ్రీ  దేవదేవ అవతారంలో దేదీప్యమానంగా వెలిగిపోయారు. చూసిన మునుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. 

 శ్లో ॥సర్వాపరాధ నాశాయ సర్వపాప హరాయ చ!

దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే॥

జై గురు దత్త

దత్తాత్రేయ షోడశ అవతారాలు... 13::: శివరూపుడు లేక శివదత్త

 దత్త లీలా క్షేత్ర మహత్యం....🙏🏻

దత్తాత్రేయ షోడశ అవతారాలు...

13::: శివరూపుడు లేక శివదత్త


పింగళ నాధుడు అనే బ్రాహ్మణుడు శ్రీ విష్ణువు యొక్క సుదర్శన చక్రంలో అధిష్టించిన ఉన్న మహుర్ నగరంలో ఉండేవారు. పెద్ద వేద పండితులు. సదాచార సంప్రదాయ కర్మిష్ఠి బ్రాహ్మణుడు. ఈ మహుర్ క్షేత్ర పరిసరాల్లో నడుస్తూ ఒకసారి  ఉసిరిగ చెట్టు దగ్గరకు వస్తారు. ఈ చెట్టు నల్ల ఉసిరిగ చెట్టు. పింగళనాధుడు అక్కడ తేజోమయ రూపంతో, యవ్వనంలో ఉన్న ఒక యువకుని చూస్తారు. ఆ యువకుడు సంస్కార హీనంగా నల్ల గుడ్డ నెత్తినవేసుకొని జుట్టు జడలు వేసుకొని, మెడలో రుద్రాక్ష ధరించి, బ్రహ్మ తేజస్సుతో నోటితో వేదం చదువుతూ  ఉంటాడు. కానీ పిగాళనాగునికిఎవరు ఇతను?చూడడానికి అమంగళకారుడు లాగా వున్నాడు?దిగంబరంగా వున్నాడు,అని ఎవరు నీవు?వేదం పఠిస్తున్నావు?బ్రహ్మచారివి కూడా కాదు, నీ దగ్గర కౌపినం,దండం, జింక చర్మం కూడా లేదు,నడుముకు మొలతాడు కూడా లేదు,అగ్నిహోత్రం కూడా వేయలేదు, ఎవరు నువ్వు?ఏ ఆశ్రమం నీది అని అడిగాడు. దత్తాత్రేయ స్వామి ఇలా తెలిపేరు,నాకు బ్రహ్మచర్య,గృహస్థు, వామప్రస్థ,సన్యాస ఆశ్రమాలు లేవు. నా ఆశ్రమం భిన్నంగా ఉంటుంది. నాకు అందరిపట్ల ఎలాంటి వివక్ష లేకుండా, బేధభావం లేకుండా, నిస్వార్ధంగా ప్రవర్తిస్తాను. నా ఆశ్రమం పేరు "పంచమాశ్రమి"అత్యాశ్రమి అని అంటారు. ఈ ఆశ్రమం మీకు తెలియదు.ఎక్కడ విని ఉండవు. కేవలం ఆత్మ సాక్షత్కారం అయినవారు మాత్రమే గుర్తు పట్టగలరు.

నువ్వు అంతర్ ముఖుడై ,నిరంతరం ధ్యానం చేయి. కేవలం వర్ణాశ్రమాలకు ప్రాముఖ్యం ఇవ్వక,వివేక, వైరాగ్యం లతో మనస్సు శుద్ధి చేసుకొని విషయవాసనాలు జయించు. అప్పుడు మనస్సుకు శాంతి,మరియు తృప్తి కలుగుతుంది ,అంతర్ ముఖుడై ఎప్పుడూ నీలో ఉన్న  ఆత్మ స్వరూపాన్ని గురించి చింతన చేయి అని బోధించారు.

సుందరము, శుభమూ అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణమాసం పూర్వార్థంలోని అష్టమి, సోమవారం, రోజు అవతరించారు. ఈ మాటలు అతనికి చెవిలో నించి హృదయం లోకి ప్రవేశించగానే ఒక కాంతి ప్రవేశించింది.

ఆహా!సతి అనసూయ గర్భంలో జన్మించిన, అవధూతలకే చూడామణి అయిన వీరు సాక్షాత్ దత్తాత్రేయ స్వామియే. మూర్తీభవించిన బ్రహ్మతేజస్సులే వీరు, ఆహా!ఈ రోజు స్వామి నన్ను అనుగ్రహించారు. స్వామి దృష్టిలో నేను పడ్డాను, ఆశీర్వదించబడ్డాను. అని స్వామి కి నమస్కారం చేసుకొని క్షమాపణ వేడుకున్నాడు.

 శ్లో ॥ శుక్లాష్టమ్యాం శ్రావణస్య విశేషార్దీ దిదువాసరే I

 శివరూపధరణం దృష్టవా దత్తాత్రేయ మహమునిం II

 శ్రావణ శుద్ధ అష్టమి రోజు, సోమవారం, శ్రీదత్తాత్రేయుడు శివుని రూపాన్ని తీసుకొని పింగల్నాగుడుకు దర్శనం ఇచ్చారు. దత్తాత్రేయుడికి నమస్కరించి, కృతార్థుడైన  పింగల నాగ తన ఆశ్రమానికి వెళ్ళాడు.

శ్లో ॥  సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే |

దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే॥

దత్త లీలా క్షేత్ర మహత్యం..... షోడశ దత్త అవతారాలు.... 12::: అదిగురువు

 దత్త లీలా క్షేత్ర మహత్యం.....

షోడశ దత్త అవతారాలు..... 🙏🏻

12::: అదిగురువు


సంస్కృత:వాసుదేవనంద సరస్వతి స్వామి

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

శ్లో॥ చిదాత్మా జ్ఞాన రూపాయ గురవే బ్రహ్మ రూపిణే!

దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ॥

మహారాజు అయిన సుబాహువు,  జ్ఞానియైన మదాలసలకు ముగ్గురు  కొడుకులు జన్మించారు. వారిని ఆమె   బాల్యంలోనించే ఉయ్యాలలో నుంచే, జోలపాట  నుంచే జ్ఞానాన్ని బోధించి లౌకిక  ముక్తులను చేసి ,ఆధ్యాత్మికo వైపు పంపింది. భర్త ఆజ్ఞ, కోరిక మేరకు చివరి పిల్లవాడిని రాజ్యాధికారుడని చేయాలని  అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. కానీ అతని అన్నగారు అతడికి వివేకముదయింప చేయదలచిన ,అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి ఇతనిపై దండయాత్ర చేసేలా  చేశాడు. రాజ్యం మొత్తం వదిలి అలర్కుడు అడవిలోకి పారిపోయి,సంక్షొభ సమయంలో మాత్రమే తెరిచి చూడమని, తన తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి తన దగ్గర ఉన్న పెట్ట  తెరచి చూడగా తల్లి గారు రాసిన ఉత్తరం కనపడింది. ఉత్తరంలో చెడు సహవాసాలకు దూరంగా ఉండు, నీతిమంతులను మాత్రమే దరి చేర్చు.దుర్మార్గులకు, చేడు ప్రభావాలకు దూరంగా ఉండు, సద్గురువులను ఆశ్రయించడం  మాత్రమే ఉత్తమం, అన్ని కోరికలు వదిలి వేయాలి.  దుష్పరిణామాలు,దుర్జనుల సాంగత్యం వలన ఏర్పడిన ప్రభావానికి  సాధు,సత్పురుషుల సాంగత్యం మాత్రమే దివ్య ఔషధం. గుంపులో ఉండద్దు. అంతః కరుణను శుద్ధి చేసుకో, ముముక్షువై ఉత్తమ సద్గురువు ఆశ్రయించడమే శరణ్యం అని ఆమె ఆదేశంగా రాసింది.

ఉత్తమ సాధువులు,సద్గురువు ఎక్కడ ఉంటారు?ఎలా కలుసుకోవాలి?అని తపనతో చివరకు  సహ్యాద్రిపర్వత శ్రేణి కి వచ్చాడు. అక్కడ  తపస్వియైన దత్తుని, ఆమలక వృక్షం క్రింద ఆషాడపూర్ణిమయుక్త శనివారంనాడు దత్తాశ్రమంలో దర్శించాడు. స్వామిని విశ్వాసంతో,ఆర్తితో ప్రార్ధించారు. దత్తుడతనికి శ్రీ మాయాముక్తావధూత నుంచి శ్రీ  ఆది గురువుగా అవతరించి, అతనికి దర్శనమిచారు. స్వామి అతని విచారంవిని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. దానితో అతనికి స్వాంతన చేకూరింది. మమతా పూర్వకంగా దగ్గరకు తీసుకున్నారు.

నీ దుఃఖానికి కారణం ఏమిటి?సరిగా విచారిస్తే ఈ శరీరం ఎక్కడ నుంచి వచ్చింది?ఎక్కడ కు పోతోంది?నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?అని విచారించు. ఈ శరీరం నీరు, ఆకాశం, తేజస్సు,వాయువు,భూమి అనే పంచ భూతల కలయికతో తయారయి మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది.

ఈ దేహం మొత్తం చేయి, కాలు, ముక్కు,నోరు,చెవి ఇలా అనేక అవయవాల కలయిక. ఇలాంటి అవయవ సమాహారం పై మక్కువ వద్దు. నేను వీటి అన్నింటిని మించి స్వచ్చమైన చైతన్య స్వరూప ఆత్మను. కాబట్టి ఆత్మకు ఆనందం,దుఃఖం, అనేవి లేవు. శరీరానికి గాయం, మనస్సుకు బాధ ఇలాంటివి అహంకార భావ ఫలితాలే. అహం పోతే దుఃఖం,బాధ అన్ని పోతాయి అని దత్తత్రేయ స్వామి అదిగురువుగా ఆత్మ విచారాన్ని బోధించి  అలర్కుడుని తరింప చేసాడు. అలర్కుడు శ్రీ దత్తాత్రేయ పాదపద్మాలకు నమస్కరించి సర్వ రాజ్యాన్ని సుబాహుకు అప్పగించి, ఆనందంలో ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ వున్నాడు. దత్త స్వామి ఆషాఢ శుద్ధ పూర్ణిమ, శనివారం నాడు ఆదిగురువుగా అవతారం స్వీకరించారు. 

జై గురు దత్త.

దత్తాత్రేయ షోడశ అవతారాలు 10 వది మాయాయుక్తావధూత ::

 శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం...


షోడశ అవతారాలలో 10 వది

మాయాయుక్తావధూత :: 🙏🏻🙏🏻

సంస్కృతం:శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

దత్తాత్రేయ ప్రభు తన భక్తుడిని పరీక్షించడానికి వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం ,స్వాతి నక్షత్రంలో భిక్షు రూపంలో మధ్యాహ్న సమయంలో శీలుడు అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు.

మాధవస్య చతుర్దశ్యాం  శుక్లాయాం బుధవాసరే!

స్వాత్ర్యు క్షయుక్తే మాధ్యాహ్నే వ్యక్త:స లోకపావన!!

భక్తుల హృదయంలో ప్రేమ, విశ్వాసం మరియు పవిత్ర సంకల్పములను చూడడానికి దత్తాత్రేయ స్వామి సంపన్నుడు అయిన శీలుడు అనే బ్రాహ్మణ ఇంట్లో శ్రార్ధకర్మ సమయంలో సన్యాస వేష ధారణలో అకస్మాత్తుగా ప్రకటం అయ్యారు. కౌపీనధారి, విశాలమైన, తేజోవంతుమైన కన్నులతో, ద్విబహు, శరీరం బంగారు తేజస్సుతో వెలిగిపోతూ, రెండు చేతులు మోకాళ్లను దాటి పొడవుగా, గొంతుకు రుద్రాక్ష మాల, కుడి చేతిలో భిక్షాపాత్ర,ఎడమచేతిలో దండం,శరీరం అంతా చందన మరియు విభూది మిశ్రమ  సుగంధములతో, శోభిలుతున్నారు. పక్కనే ఒక నల్ల కుక్క కూడా ఉంది. అలా ఆ అద్వితీయ మూర్తి అకస్మాత్తుగా వచ్చి ఇంట్లో పీట మీద కూర్చున్నారు. ఆ అవధూతను చూసి, ఆ శీలుడు కఠిన శబ్దములు వాడి అగౌరవ పరిచారు.

దత్తాత్రేయ స్వామి దానికి సమాధానం గా నేను అప్రతీత,నిరాకార,అగోచర, అనంత నామాలతో పిలవబడుతూ, విశ్వవ్యాప్తి చెందిన అవధూతను అని తెలిపారు. ఆ శీలుడు స్వామి సమాధానం తో తృప్తి చెంది, మీ ఆశ్రమం ఏమిటి?మీ శాఖ ఏమిటి?మీరు ఎవరు? మీ ఆరాధన ఏమిటి?అని అడిగారు. దత్తాత్రేయ స్వామి నాకు ఏ ఆశ్రమం వర్తించదు, నేనే అందరికి ఆశ్రయ స్థానం.నాకు ప్రభువు అంటూ ఎవరు లేరు, ఈ ముల్లోకాలకు, ప్రపంచానికి నేనే ప్రభువును, అన్నారు. అది విన్న శీలుడు తన గురువు వారే అని గుర్తించారు. స్వామిని పూలు,పంచామృతములతో పూజించి, తాంబూలం ఇచ్చి సాష్టాంగ  నమస్కారం చేశాడు.

శ్రార్ధకర్మకు వచ్చిన మిగతవారు కలత చెంది కోపంతో దత్తాత్రేయ స్వామిని దుర్భాషలాడారు. హే దుష్టుడా!నువ్వు వర్ణ హీనుడవు, భ్రస్టుడువు. బ్రహ్మకర్మని భ్రష్టం చేశారు అని అన్నారు.

 ఓంకారమే బ్రహ్మము,అక్షర పరబ్రహ్మ స్వరూపమే వేదం,నీకు వేదములు శ్రవణం చేయడము అర్హత లేదు అని అరిచారు. భిక్షకుని వేషంలో ఉన్న దత్తాత్రేయ స్వామి నాకు వేదములు తెలియదు, కానీ నేను సర్వ సృష్టి,పోషణ,లయం నా నుంచే జరుగుతుంది, బ్రహ్మకర్మ అంటే తెలియదు,కానీ ఓం కారం నా నుంచే జనించినది. సుగుణ మైన నిత్య వేద కర్మలకు నేనే అర్హుడను. నేను మాయా రహితుడు. నాకు ఏమి తెలియక పోయినా నా కుక్కకు చక్కగా 4 వేదాలు వచ్చు,బాగా ప్రావీణ్యం వుంది. అది మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. అనగానే స్వామితో ఉన్న కుక్క వెంటనే 4 వేదాలు, శాస్త్రాలు గురించి వివరంగా చెప్పింది. ఇది విని అక్కడివారు ఆశ్చర్యపోయారు. పితృలోకం నుంచి ఆ బ్రాహ్మణుడు తల్లిదండ్రులు భూమి మీదకు వచ్చారు. దత్తాత్రేయ ప్రభువు తన అద్వితీయ శక్తితో అందరికి గర్వభంగం చేసి, వారి అందరికి దీక్ష ఇచ్చి, తత్త్వశాస్త్రం ఉపదేశం ఇచ్చారు. తరువాత అందరూ దత్తాత్రేయ స్వామి ని ప్రార్ధించారు. ఈయనను మూడు కార్యాలు పెరుగు, అన్నం తో పూజించాలి. 

జై గురు దత్త.

శ్లో య॥ మాయాయుక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ తే | శుద్ధబుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే॥

దత్తాత్రేయ షోడశ అవతారాలు 9::: విశ్వంభరావధూత

 శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం..🙏🏻

9::: విశ్వంభరావధూత


సంస్కృత o:శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

అత్రినందన భగవాన్ శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల సంక్షేమం కోసం విశ్వంభరావధూత అవతారం స్వీకరించారు. బదరికాశ్రమంలో తపస్సుతో సిద్ధి పరిపూర్ణం చేయడానికి  తపస్సు చేస్తున్న యోగులను, భక్తజనులను అనుగ్రహించడానికి, అజ్ఞానమును నిర్మూలించటానికి  జ్ఞానసాగర రూపంలో ప్రకటం అయి

అహంకారం పరిహారం చేశారు.

దత్తాత్రేయ స్వామి సిద్ధులందరూ నా సలహా పాటించడం ద్వారా వేగంగా ఆధ్యాత్మిక పురోగతి పొందుతున్నారా, లేదా అని దత్తత్రేయ స్వామి అనుకున్నారు. సద్గురువు కేవలం భోధతో అగకూడదు, తన భక్తులు భోధలు ఆచరించడానికి కావలసిన పరిస్థితిని కూడా కల్పిస్తారు.

దత్తాత్రేయ స్వామి సిద్ధ జనులను పరీక్షిoచడానికి ఒక విచిత్ర మారువేషంలో, వికృత రూపంలో కుక్క ముసుగులో లోపలికి ప్రవేశించి, వారి మధ్య ధ్యానమునకూ కూర్చున్నారు.

వారిలో కొందరు విచారంగా,కొందరు చపల చిత్తంతో, కొందరు కోపంతో,కొందరు ఆతృతతో, కొందరు వ్యర్ధ ప్రసoగంతో ఉంటే, కొందరు తీవ్ర ధ్యానంలో వున్నారు. దత్తాత్రేయ స్వామి వారిపై దయతో వారికి తన విశ్వరూపం తెలియజేసారు.

దత్తాత్రేయుడు చంచలమైన మనస్సు గల వారికి  స్థిరమైన మార్గనిర్దేశం చేశాడు.  ఈ అవతారాన్ని విశ్వంభవరావధూత అంటారు.  ఈ అవతారం చైత్ర మాసంలో, పౌర్ణమి రోజున, చిత్ర రాశిపై రెండవ గడియారం యొక్క మొదటి క్షణంలో జరిగింది.  మంగళవారం అయిన ఆ శుభ క్షణంలో శ్రీదతత్రేయ తొమ్మిదవ అవతారాన్ని స్వీకరించారు.

విశ్వరూప దర్శనంలో చాలా దశలవారిగా వేలాది మంది జననం, వేలాది మరణం కనిపించాయి. వేలాది ముఖాలు కూడా ఉన్నాయి. అనంతమైన అసంఖ్యాక తేజోమయ  దివ్య జ్యోతిర్మయ నక్షత్రాలు వస్తున్నాయి,పోతున్నాయి.  ఈ విశ్వంలో కనిపించడం ద్వారా, నేను విశ్వం యొక్క మూలం,విశ్వం యొక్క  జననం మరియు లయ అని శ్రీదత్తాత్రేయుడు అందరి దృష్టికి తీసుకువచ్చాడు. ఆయన తన మాయకు తానే ఆశ్రయమని, తాను నిర్గుణుడు చెప్పి ,సిద్ధులకు, భక్తులకు అభయమిచ్చాడు. ఆ రోజు ఈ క్రింద శ్లోకం చదివి అర్ఘ్యం , గోదానము యిచ్చి పూజించాలి.

శ్లో:: విశ్వంభరాయ దేవాయ భక్త ప్రియ కరాయచ !

 భక్త ప్రియాయ దేవాయ నామ ప్రియాయ తే నమః ॥

జై గురు దత్త

దత్తాత్రేయ షోడశ అవతారాలు... 8 :: జ్ఞాన సాగరుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం....🙏🏻


దత్తాత్రేయ షోడశ అవతారాలు...

8 :: జ్ఞాన సాగరుడు

ఒకసారి విశ్వగురువు అయిన భగవాన్ దత్తాత్రేయ స్వామి ఏకాంతంగా బదరికావనంలో కూర్చొని వున్నప్పుడు ఈ సిద్దలోకం నా ఉపదేశం తీసుకొని సిద్ధ స్థితికి వచ్చింది. కానీ వారిలో కామ,క్రోధం,వికారం,నశించలేదు.  శాంతి,సుఖం,లాభం,వీరు పొందలేదు. అన్ని దుఃఖాలకు మూలం అయిన కామం,క్రోధం,అజ్ఞానం ఈ జీవులకు క్షోభకు గురి చేస్తోంది. వీటిని అధీనం లో ఉంచుకోవాలి.అందుకే ఈ జీవులకు విపత్తులు కలుగుతున్నాయి.ఈ అజ్ఞానం వారిని, ఈసప్రపంచంని నాశనం చేస్తోంది. అని తనలో తాను తలచారు. వీటి నుంచి జీవులను బయట పడేయాలి అని తలచి వారికి జ్ఞాన బోధ చేయాలి అని తలచారు. జ్ఞానం ద్వారానే వీరు సంతోషంగా ఉండగలరు అని తలచి స్వచ్ఛమైన జ్ఞాన స్వరూపులుగా కనిపించారు.

అందుకే ఈ అవతరానికి జ్ఞాన సాగరుడు అని పేరు.ఫాల్గుణ మాసం,ఆదివారం, పునర్వసు నక్షత్రం,శుద్ధ దశమి రోజు జ్ఞాన సాగరుడుగా అవతరించారు.


ఫాల్గునే మాసి శుక్ల మాం

దశాత్మమ్ రవివాసరే!

భాస్కర ఉదయే చైవ

పునర్వసు నక్షత్ర యోక్తే!!

ఈ విధంగా శుభ ముహూర్తంలో బాదరికాశ్రమం లో సిద్ధుల మండలిలో వారి పైన ప్రకాశవంతమైన తేజస్సుతో పెద్ద కాంతి పుంజంలో దత్తాత్రేయ స్వామి కూర్చొని వున్నారు. ఈ సిద్ధులు అజ్ఞానంతో స్వామిని స్వామి నేర్పిన సిద్ధితోనే కిందకు లాగాలని 

చూశారు. కానీ వారి వల్ల కాలేదు. ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. ఎంత గాలి వీచిన రాతి పర్వత శిఖిరాలు స్వల్పంగా కూడా మారవు. అలాగే ఆకాశం నుంచి పుట్టిన గాలి ఆకాశమును కదల్చలేదు,ఈ సర్వ కారణములకు కారణమైన వాడిని నేనే ,నన్ను ఏమి చేయలేరు అని పలికిన  దత్తుల మాటలు విని స్వామి ని శరణు పొందారు. స్వామి వారితో  తాను చెప్పిన మంత్రాలు జపించమని,జ్ఞాన బోధ చేశారు.

శ్లో ॥ సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞాన దీపాయచాత్మనే!

సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాయ నమోనమః॥

దత్తాత్రేయ షోడశ అవతారాలు... 7::: సిద్ధరాజు

 దత్త లీలా క్షేత్ర మహత్యం ...🙏🏻


దత్తాత్రేయ షోడశ అవతారాలు...

7::: సిద్ధరాజు 🙏🏻

శ్రీ లీలావిశ్వంభర అవతారంలో  ప్రజల మనస్సులో ధ్యాన మూర్తిగా నిలిచిపోయారు. తరువాత భూమి మీద అంతా తిరుగుతూ బదరికావన్ (హిమాచల్ ప్రదేశ్)లోనికి ఒంటరిగా ప్రవేశించారు. అక్కడ కఠోర  తపస్సులో ఉన్న సిద్ధులు చాలా మంది ఉన్నారు. బాలా స్వరూపంలో చిన్మయానందంలో వున్న దత్తాత్రేయుని చూసి ఆశ్చర్య పోయి ఇంత ఆనంద స్థితిలో ఎలా ఉన్నారు? అని అడిగారు. ఆ పరమాత్మయే తమపై కరుణతో ప్రత్యక్ష మయ్యారని ఆనందించారు. దత్తుడే సర్వ సిద్ధులకు మూలం అని తెలుసుకొని తమను అనుగ్రహించమన్నారు. స్వామికి భక్తులుగా మారారు. వారి పట్ల ప్రసన్నులు అయిన దత్తుడు నేనే సర్వ సిద్ధులకు అధిపతిని. మీ అధిష్టాన దేవతలకి మీ అందరి ఆశ్రయ స్థానంని అని అన్నారు. అప్పుడు సిద్ధులు పరమేశ్వరా!మా పట్ల ప్రసన్నులై,మాకు అన్ని సిద్ధులు ప్రసాదించండి. దయాళువు అయిన తండ్రివి అయిన మీ పుత్రులమైన మాకు కళ్యాణం కలిగించండి. యోగ మార్గ సిద్ధులు ఉపదేశించి మాకు అంత:కరణo లో అఖండ భక్తిని ప్రసాదించండి. అని వేడుకున్నారు. వారిలో అహంకారం పూర్తిగా నశించిపోయింది.

దత్తాత్రేయ స్వామి వారికి అతి రహస్య కవచ,యోగాన్ని, చిత్త యోగ సాధన ను,అంగన్యాస,కర్మనిష్ఠ, తాంత్రిక పద్ధతులను ఉపదేశించారు. సిద్ధరాజు ఈ పద్ధతిని సిద్ధరాజ గమ"అని తెలిపారు. ఈ సిద్ధరాజ గమని తన అనన్య భక్తుడు అయిన శ్రీ దాసోపంత్ (ఆంబోజ్గాయి)కి ఉపదేశించారు.

బదరికాశ్ర మంలో సర్వ సిద్ధమండలి లోని అందరూ సిద్ధరాజ గమ"పద్ధతి అనుసరించి అనుష్ఠానం చేసి,జ్ఞాన సిద్ధులు అయ్యారు. సిద్ధరాజు కృపతో వారి సర్వ మనోభీష్ట ములు పూర్తి అయి కృతజ్ఞులు అయి ధన్యులు అయ్యారు.

సిద్దరాజు భగవాన్ శ్రీ దత్తత్రేయ సిద్ధ మండలికి సిద్ధరాజ గమ"ని ఉపదేశించిన రోజునే సిద్ధరాజు జయంతిగా చేస్తారు.

మాఘ పూర్ణిమ, మఖా నక్షత్రం, గురువారం, శుభ ముహూర్తంన ఈ సిద్ధరాజ గమ భోధించబడినది. ఈ రోజు క్రింది మంత్రం చదివి పూజ చేయాలి.

శ్లో॥ సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే ॥ 

సిద్ధ రాజాయ సిద్ధాయ మంత్ర దాత్రే నమో నమః॥

జై గురు దత్త

దత్తాత్రేయ షోడశ అవతారాలు.6::: శ్రీ లీలా విశ్వంభరుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం



దత్తాత్రేయ షోడశ అవతారాలు...

సంస్కృతం:శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి.

6::: శ్రీ లీలా విశ్వంభరుడు

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

సద్గురు భగవాన్ శ్రీదత్తాత్రేయ ఆరవ అవతారాన్ని 'లీలావిశ్వంభర్' అంటారు.  ఇంతకు ముందు వివరించిన యోగిజన వల్లభ అవతారం అన్ని యోగుల సంక్షేమం కోసమే కాబట్టి, ఈ అవతారంలో అతను యోగుల సంక్షేమం కోసం అవతారం తీసుకున్నాడు, ఆ అవతారంలో అతను యోగుల సమాజంలో నివసించాడు.  యోగాకు మార్గం చూపించారు.  వారి యోగాభ్యాసంలో అన్ని అడ్డంకులను పరిష్కరించడం ద్వారా యోగులకు గొప్ప వరం ఇచ్చారు. ప్రజలు మాయలో, అహంకారం, కామము,క్రోధంలలో  చిక్కుకొని దారి తప్పి  అనేక ఇబ్బందులు పడ్డారు.

 ఒకప్పుడు దేశమంతా  కరువు ఉండేది.  ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని నాశనం చేశాయి.  కొన్నిసార్లు వర్షాలు పంటలను నాశనం చేస్తాయి, కొన్నిసార్లు వర్షాలు లేనందున పంటలు ఎండిపోయాయి.  ప్రజలు ఆహారం మరియు నీటి కోసం నిరాశకు గురయ్యారు.  జంతువులకు కూడా ఆహారం రాలేదు కాబట్టి వాటి శరీరాలు ఎముకలు అయ్యాయి.  ప్రజలు ఆకలితో చనిపోయే సమయం ఆది.  కఠినమైన హృదయంతో  వ్యాపారులు  ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా ప్రజలను పీడించడం ప్రారంభించారు.  దొంగలు  వేధించడం ప్రారంభించారు.  ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల కారణంగా, ప్రజలు అల్లాడిపోతున్నారు.

 అటువంటి పరిస్థితిలో,సత్పురుషులు,  బ్రాహ్మణులు మరియు దత్త భక్తులు అందరూ దయగల శ్రీదత్తాత్రేయుడిని శరణు వేడారు. ఆ సమయంలో, దత్తాత్రేయుడు మహాసతి అనసూయ మాత వడిలో వున్నారు.  పేద ప్రజల కరుణ ప్రార్థన విన్న వెంటనే, పేదల పాలిటి భక్త వత్సలుడు  శ్రీదతత్రేయుడు తన చిన్ననాటి రూపాన్ని విడిచిపెట్టి,  విశ్వ రూపంలో అందరి ముందు ముందుకు వచ్చి కరుణా  ముఖంతో నిలబడ్డాడు.

 దత్తాత్రేయుడు వారందరినీ దయతో చూశాడు.  ఆహారం మరియు దుస్తులు పుష్కలంగా ఇచ్చి  ప్రజలందరినీ సంతృప్తిపరిచారు. కాబట్టి ప్రజలు ప్రపంచమంతా లీల అని అనుకున్నారు.  దేవుడు ఈ ప్రజలందరికీ తన దయను ప్రసాదించాడు మరియు వారి విశ్వరూపమును వారికి చూపించాడు. అనేక లీలలు చేశారు.

 భగవంతుని విశ్వరూపం  గమనించి అందరూ ఆ 'లీలా విశ్వంభర్' దత్తాత్రేయకు నమస్కరించి చేతులు కలిపి దత్తాత్రేయను స్తుతించారు. ప్రారంభించారు.

 శ్లో ॥పూర్ణబ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంభరాయచ!

 దత్తాత్రేయాయ దేవాయ నమో స్తు సర్వసాక్షిణే |!

జననం::పుష్య పౌర్ణమి, పుష్యమి నక్షత్రం, బుధవారం, సూర్యోదయానికి పూజ చేయాలి.నైవేద్యం పండ్లు.

జై గురు దత్త.

దత్తాత్రేయ షోడశ అవతారాలు ... 5:: యోగిజన వల్లభుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం....

దత్తాత్రేయ  షోడశ అవతారాలు ...


5:: యోగిజన వల్లభుడు

దత్తాత్రేయ ప్రభువు 5 వ అవతారం ఇది.

శ్రీ వాసుదేవనంద సరస్వతి. స్వామి విరచిత.

తెలుగు అనువాదం:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

దత్తాత్రేయ స్వామి అత్రిమహర్షి యొక్క యోగాగ్నిని చల్లార్చి, అనాది సిద్ధ ప్రభు, పురుషోత్తముడు, పరమాత్మ, భగవాన్ శ్రీ దత్తాత్రేయస్వామి బాలుని రూపంలో అనసూయ సన్నిధిలో విరాజిల్లుతూ, అత్రి ఆశ్రమంలో అవతరించారని తెలుసుకొని, యోగ జనులు అయిన ఇంద్రాది దేవతలు, గంధర్వులు, మునులు,సత్పురుషులు,యోగులు,సాధువులు, ప్రజలు అందరూ దర్శనానికి వచ్చారు.  అప్పుడు బాలుని రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి తన తేజోమయ రూపంలో దర్శనం ఇచ్చి, యోగబోధను,  మధుర కంఠంతో ఈవిధంగా చేశారు. నాకు జన్మ,కర్మ,గుణ,ఆకారం,కాలము,మాయ,మృత్యువు, గుణం,నాశనము ఏమి లేవు. సర్వవ్యాపిని. ఈ మూర్తి స్వరూపమును మీరు ధ్యానించండి. అని జనులకు యోగం ఉపదేశించారు కాబట్టి స్వామిని అందరూ యోగిజన వల్లభుడు అని పిలిచారు.

మార్గశీర్షం శుద్ధ పౌర్ణమి రోజు గురువారం మధ్యాహ్నం అవతరించారు. కాబట్టి మార్గశీర్షంలో స్వామి రెండు అవతారాలు వచ్చాయి.

జై గురు దత్త.


శ్లో॥ యోగ విజ్ఞాన నాథాయ భక్తానంద కరాయచ!


దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ:


జననం:మార్గశిర పూర్ణిమ, గురువారం మధ్యాహ్నం.

నైవేద్యం:పంచభక్ష్యాలు.సమర్పించి పై శ్లోకం చదవాలి

దత్తాత్రేయ షోడశ అవతారాలు 4::: కాలాగ్ని శమనుడు.

 దత్తలీలా  క్షేత్ర మహత్యం...🙏🏻

దత్తాత్రేయ షోడశ అవతారాలు



4::: కాలాగ్ని శమనుడు.

వాసుదేవనంద సరస్వతి స్వామి దత్త పూర్ణ నుంచి

తెలుగు;రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.


దత్తాత్రేయ అవతారాలలో చాలా ప్రముఖమైన అవతారంగా చెప్పబడినది.

అత్రి మహర్షి ధ్యానస్థులైనప్పుడు యోగాగ్ని జన్మించి మరలా అత్రిముని శరీరంలోకి ప్రవేశించి దహించసాగింది. శ్రీ హరి దత్తాత్రేయునిగా బ్రహ్మరంద్రం ద్వారా  శరీరంలో ప్రవేశించగానే అత్రి మునికి కోటి చంద్రులు చల్లదనం కలిగి,నఖశిఖ పర్యంతం చల్లగా అయిపోయింది. ధాన్యం నుంచి లేవగానే అత్రిమహర్షి చూపు ద్వారా  అనసూయ మాత  ఉదరంలోకి దత్తాత్రేయ స్వామి మార్గశిర మాసం,శుక్ల పక్షం సప్తమి అనే శుభ ముహూర్తంలో  ప్రవేశించారు. అనసూయ మాత అమిత తేజోమయ మైన అగ్నిలా ప్రకాశించింది. 9 రోజులు 9 మాసాలుగా జరిగిపోయి పౌర్ణమి రోజు నిర్గుణ, నిరాకార స్వరూపం తో 16 సంవత్సరాల బాలుడుగా బయటకు వచ్చారు. అర్ధం కాని అనసూయ మాత ఆనందంతో, ప్రశాంతం అయిన మనస్సుతో ఇలా కొడుకుగా జన్మించటం నాకు తృప్తిగా లేదు.నువ్వు చంటి పిల్లవాడుగా కావాలి. నీకు ఆహారం పెట్టడం,నలుగు పెట్టడం,నిన్ను సంరక్షించడం, మధురమైన జోల పాటలు పాడటం ఇలా పెంచుకోవాలి అని తెలిపింది. దత్తాత్రేయ స్వామి,  చంటి పురిటి  పిల్లవానిగా మారి అనసూయ మాత పక్కన కనిపించారు.సూర్యాస్తమయం తరువాత పౌర్ణమి చంద్రుడు చల్లని కిరణాలతో మరిపిస్తున్నాడు. అనసూయ మాత మాటను గౌరవిస్తూ స్వామి అవతరించారు.

అన్ని మాసాల్లో మార్గశిర మాసం శ్రేష్ఠమైన మాసం."(మాసానం మార్గశీర్షోహం"అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడా తెలియజేసారు.)

దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు అమృత గానంతో మురిపించారు. మంగళ వాద్యాలు మోగాయి. సకల సృష్టి పులకించింది. క్రీడలతో ,చంద్ర,దత్త, దుర్వాస మహాముని రూపంలో విశ్వ గురువు అయిన భగవాన్ దత్తాత్రేయ అత్రి,అనసూయలను చిన్న బాలుని రూపంలో సంతోష పెట్టారు.

జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్నిశమనా చ I

 భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే !!

జననం:మార్గశిర పూర్ణిమ బుధవారం మృగశిరా నక్షత్రంలో జన్మించారు.

ఆ రోజు పంచామృత నైవేద్యం పెట్టి పై శ్లోకం చదవాలి.

దత్తాత్రేయ షోడశ అవతారాలు 3.::శ్రీ దత్తాత్రేయడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం 🙏🏻



దత్తాత్రేయ షోడశ అవతారాలు

3.::శ్రీ దత్తాత్రేయడు

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

త్రిమూర్తులు అత్రిమహర్షి తపస్సుకు మెచ్చి నేనే మీకు స్వయంగా దత్తం అవుతాను, మీ తపస్సుకు, అనన్య భక్తికి ప్రసన్నం అయ్యాను. నేనే స్వయంగా మీకు కుమారుడుగా జన్మిస్తాను అని వరమిచ్చిన అత్రి వరదుడు తానే స్వయంగా అత్రికి అర్పణం అయి, అతి దుర్లభం అయిన ఆ పరమాత్మ బాల రూపంలో  అత్రి కుమారుడుగా, అత్రి మహర్షికి దత్తమై దత్తాత్రేయడుగా అవతరించారు.

ఈ అవతార సంప్రదాయం ప్రకారం దత్తాత్రేయ నామ ధేయం తో ప్రసిద్ధి చెందారు.

ఈ అవతార జననం:::కార్తీక బహుళ విదియ,మృగశిర నక్షత్రం,శుక్రవారం వేకువఝామున 1 గంటకు జన్మించారు. జ్ఞాననిధి, విశ్వ గురువు దత్తాత్రేయ స్వామి.

ఈ దత్తాత్రేయ రూప వర్ణన:

ఈ అందమైన రూపాన్ని  శాండీల్యోపనిషత్తు ఈ విధంగా  వివరించింది.

ఇంద్రనీల రత్నం  రంగులో మెరుపు వంటి శరీరం కలిగి, ముఖం చంద్ర బింబంతో మంచి సువాసనలతో కూడి, చతుర్ భుజాలతో అవతరించిన త్రి మూర్తి స్వరూప విష్ణువై, శంఖు, చక్రం, పద్మం, గద కలిగి ఉండే దివ్య మంగళ స్వరూపం.

ధ్యానం చేసే వారికి స్వామి ఎక్కువగా ఈ రూపంలో దర్శనం ఇచ్చి ఆశీర్వదిస్తారు. శరీరం అంతా భస్మం ధరించి తలపై జటా జూటాలు ధరించి, వికసించిన పద్మముల వంటి అత్యంత సుందరం మైన కళ్ళు కలిగి ఉంటారు.

యోగిజన ప్రియుడు, విశ్వ గురువు, భగవాన్ దత్తాత్రేయ జ్ఞానయోగి అయి, విశ్వమునకు సర్వసాక్షి అయి, భక్త వత్సలుడుగా, కేవలం భక్తి కలిగిన భక్త జనులకు సులభుడు గా,

దయసింధుగా ఉంటారు.

దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల నిభం ప్రభుమ్!

ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ॥ భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూట ధర విభుమ్ ॥

చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్!!

స్వామికి చెరకు రసం నైవేద్యంగా పెట్టి శ్లోకం చదవాలి.

జై గురుదేవ దత్త.🙏🏻


దత్తాత్రేయ షోడశ అవతారాలు 2 వ అవతారం అత్రివరదుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం



దత్తాత్రేయ షోడశ అవతారాలు

2 వ అవతారం


అత్రివరదుడు

శ్రీ వాసుదేవనంద సరస్వతి. స్వామి విరచిత 

తెలుగు :రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

ముందు అవతార మైన యోగిరాజు దర్శనం కలగాలని,  అత్రి మహర్షి కోరిక.

బ్రహ్మ సప్త ఋషులను సృష్టించిన తరువాత అత్రి మహర్షిని గృహస్థాశ్రమం స్వీకరించి,సృష్టిని వృద్ధి చేయమని అజ్ఞ పించారు.తండ్రి మాట కొరకు అత్రి మహర్షి అనసూయ ని వివాహం చేసుకొని  అనసూయ మాత తో  కూడా ఒంటి కాలు పై రూక్ష పర్వతం పై  ఉండి వందల సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు చేశారు.అప్పుడు అత్రి మహర్షి తల లోనించి యోగాగ్ని వెలువడి,లోకాలను అగ్నితో కాలిపోతోంది.

అప్పుడు త్రిమూర్తులు దర్శనం ఇవ్వగా నేను యోగిరాజు కోసం తపస్సు చేస్తున్నాను.మీరు దర్శనం ఇచ్చారేమి? అన్నారు.త్రిమూర్తులు మేము 3 ఒక్కరే,సృష్టి కార్యం కోసం త్రిగుణాత్మకమై 3 రూపాలుగా కనపడుతున్నాము.అని వారు యోగిరాజు రూపం అయిన శుద్ధ స్పటిక రూపం తో 6 భుజాల తో దర్శనం ఇచ్చారు.తాను అత్రి మహర్షి కి వరదుడు అయ్యాడు కాబట్టి అత్రి వరదుడు అయ్యాడు.


అత్రి వరదుడు వర్ణన;

6 చేతులలో కుడి వైపు 3 చేతుల్లో జపమాల(ఈ జపమాల 52 బీజాక్షరాలతో కూడి ఉంటుంది),2 వ చేతిలో డమరుకం(శాస్త్రo, శృతి,వేదలుకు సంకేతం),3 చేతి లో చక్రం సంసార బంధం విచ్ఛిన్నం చేసి,జ్ఞాన తేజస్సును ఇచ్చి మోక్షం కలిగించడానికి)

ఎడమ వైపు 3 చేతులలో

కలశం-కర్మ సూత్రాన్ని బట్టి కర్మ ఫలాన్ని (ఆహార-నీరు)ఇవ్వడం

త్రిశులం-3 కోనలు-ఆచార, వ్యవహార,ప్రాయశ్చిత్తము, ధర్మం, అర్ధం,కామం,లని

శంఖం-ధ్వని,అపూర్వ,మొదలగు వాటితో యజ్ఞ ద్వారా సృష్టి క్రమం గురించి తెలియజేస్తుంది.

మాలా కమండలు ధర కరపద్మ యుగ్మే!


మధ్యస్థ పాణి యుగళే డమరూ త్రిశూలే !

యస్యస్త ఊర్ధ్వ కరయో: శుభ శంఖచక్రే!


ధ్యాయేత్త మత్రి వరదం భుజషట్క యుక్తం!!


జననం:కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రం గురువారం రోజు జన్మించారు.

కుడి చేతిలో 52 పూసల బీజాక్షర  జపమాల,మాలా, డమరుకం, చేతిలో పద్మము,చక్రం, జల కలశం, త్రిశులం,శంఖం, చేతుల్లో కలిగి ఉంటారు.

స్వామి కి నైవేద్యం గా అరటిపండ్లు పెట్టి పై శ్లోకం చదవాలి.

జై గురు దత్త

దత్తాత్రేయ షోడశ అవతారాలలో ప్రధమ అవతారం 1) యోగిరాజు.

 శ్రీ దత్తాత్రేయ షోడశావతారములు.🌹


కలియుగం ముందు గల దత్తాత్రేయ అవతారాలు మొత్తం 16 గా శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి దత్త పురాణంలో వర్ణించి వున్నారు. ఆ అవతార కార్యం వెనుక రహస్యాన్ని , తెలుగులో స్వామి వారి సంస్కృత శ్లోకాల నుంచి అనువాదం చేయడం జరిగింది.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

దత్తాత్రేయ షోడశ అవతారాలలో ప్రధమ అవతారం

1) యోగిరాజు...🙏🏻

అద్వయ ఆనంద  రూపాయ యోగమాయా ధర్మాయ |

యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమోనమః ॥


ఒక కార్తీక శుద్ధ  పౌర్ణమి బుధవారం నాడు, కృతికా నక్షత్రంలో శ్రీ యోగిరాజు అవతారం దాల్చారు.

బ్రహ్మ దేవుని అనుగ్రహించడానికి పరమేశ్వరుడు మరియు విష్ణు స్వరూపుడై, యోగిరాజుగా అవతరించారు.

మానవ సృష్టి మొదలైన తరువాత జీవులు అనేక విధములు అయిన దుఃఖములు,జనన,మరణ రూప అవిచ్ఛిన్నము లైన జన్మ పరంపర నుంచి, ప్రారబ్ధ కర్మల నుంచి, సంసారాలలో వివిధ కష్టముల నుంచి,జీవులను పుణ్య ,పాపముల నుంచి తరిపజేయడానికి మార్గం ఏది?

ఇలా విచారిస్తున్న బ్రహ్మ దేవుడు సర్వ విశ్వమునకు ఆధారుడైన శ్రీ హరిని వేడుకున్నాడు.


 శ్లో::ఏవంనిష్మాయాత్మభూవో నియోగo సాడగం! నిజోపాసన్ముక్తావన్ స: 

 త్వం సాత్వికం మమకమేవ భావజ్ఞ

ధా మతి తరా ముపాస్య!

బ్రహ్మ దేముడు ప్రార్ధన మేరకు 

శ్రీహరి  తేజోమండలవర్తి అయిన,  మంగళమయ రూపమైన  జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చి తను ఎవరిపట్ల ప్రసన్నులో తెలిపి బ్రహ్మకు యోగ మార్గం  తెలిపారు.

లోక కల్యాణం కొరకు నీవు భక్తితో ప్రార్ధించావు. అందుకే నేను త్వరగా ప్రసన్నుడనైనాను.ఈ రూపం నిర్గుణ, నిరాకార అత్యంత తేజోమయ రూపం. ధ్యానం చేసే వారికి మాత్రమే అవగతం అవుతుంది.

నేను  సాత్విక గుణముకు త్వరగా  ప్రీతి చెందుతాను. నా తేజోమయ స్వరూపమును ఉపాసన చేయడం ద్వారా లోకంలో వచ్చే సుఖ, దుఃఖాలు, మృత్యువు నుంచి విముక్తులు అవుతారు అని  యోగ తత్వం తెలిపారు.

ఈ తత్వ బోధ విన్న బ్రహ్మ, 'దత్తోహం, దత్తోహం', అని నమస్కారం చేసి, జీవుల జీవిత కార్యమును,సృష్టిని సుఖమయం చేశారు.

ఈ అవతారంలో గంధ, పుష్ప , బ్రహ్మోపచారాలు అవసరం లేదు. కేవలం సచ్చిదానంద జ్యోతిర్మయ దత్తుని చింతన చేస్తే చాలు తరించవచ్చు.

బ్రహ్మ దేముడు సప్త ఋషులను సృష్టించారు. తర్వాత  అత్రి, కర్ధమముని కుమార్తె అయిన అనసూయ మాతలకు బ్రహ్మ,విష్ణు,శంకరల మూడు  రూపాలు, 3 గుణాలు జ్యోతిర్మయ దత్త రూపంలో నిక్షిప్తం చేసి, త్రయాత్మ అని,పరమాత్మ అని పిలిచారు.

అలా బ్రహ్మకు యోగం బోధించి "యోగిరాజు",గా అవతరించారు అని శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి దత్త పురాణం లో సంస్కృత శ్లోకాలలో వివరించారు.

తేజోమయ యోగిరాజు రూపం ఎలా ఉంటుంది: అంటే అత్యంత కోమలము, నయన మనోహరంగా, స్పష్ట మైన, ప్రకాశవంతం అయిన స్పటికం లాంటి స్వచ్ఛత కలిగి, ఏకముఖి, నాలుగు చేతులుతో చూడడానికి శ్రీ విష్ణువుమాదిరిగా  వుంటారు. ఈ రూపం నిరాకారమైనది మరియు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.  అందువల్ల, బ్రహ్మ ప్రార్థనల నుండి, జ్ఞానోదయం పొందిన విష్ణువు అతని తపస్సుతో సంతోషించి, మంగళమయ రూపంలో అవతరించాడు. యోగిరాజ్ పేరుతో దత్తాత్రేయుడు యొక్క మొదటి అవతారం ఇది.  శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృత శ్లోకాలలో వెల్లడించారు. ప్రకాశవంతంగా వుండే  యోగిరాజ్ రూపం చాలా మృదువైనది మరియు మనోహరమైనది మరియు అవయవాలు స్వచ్ఛమైన స్ఫటికాల వలె శుభ్రంగా ఉంటాయి. ఈ అవతారం అసలు విష్ణువు మాదిరిగానే ఏకపక్ష మరియు చతురస్రాకారంగా ఉంటుంది.  నిరాకారంగా ఉన్నప్పటికీ, దత్తాత్రేయుడు  రూపం తీసుకుని   ఉనికిలోకి వచ్చాడు.  అతను యోగా బోధించడం ద్వారా ప్రజలను సంతోషపెట్టాడు.  అందువల్ల అతనికి యోగేశ్వర్ లేదా యోగిరాజ్ అనే పేరు వచ్చింది