Sunday, December 6, 2020

శ్రీ సాయి భక్తుడు ధుమాల్

 శ్రీ సాయి భక్తుడు ధుమాల్:-


సాయి భక్తులలో ముఖ్యుడైన నాసిక్ వాసి శ్రీ సఖారాం బల్వంత్ ధుమాల్ వృత్తి రీత్యా న్యాయవాది.మహరాష్ట్ర లో ప్రభుత్వ శాఖలలో అతనికి మంచి పలుకుబడి వుండేది. బూజు పట్టిన దురాచారాలను ఖండిస్తూ ఒక కొత్త సమాజాన్ని అభ్యుదయ వాదులందరం కలిసి నిర్మించాలని పిలుపు నిస్తుండేవాడు. 1917 వ సంవత్సరం నుండి 1925 వరకు నాసిక్ జిల్లా ప్రాంతీయ అభివృద్ధి బోర్డు కు చైర్మన్ గా పనిచేసిన తొలి ప్రభుత్వేతర ఉద్యోగి ఆయన. ఈ పదవి వలన లాయర్ గా తన స్వంత ప్రాక్టీసుకు తగినంత సమయం కేటాయించలేకపోయేవారు ధుమాల్. అబివృద్ధి బోర్డు చైర్మన్ గా రాత్రింబవళ్లూ కృషి చేసి ప్రభుత్వం తో పోరాడి , నిధులను తీసుకువచ్చి నాసిక్ జిల్లా అభివృద్ధికి ముఖ్య కారకుడయ్యాడు. ప్రభుత్వం అతను చేసిన కృషికి  గుర్తింపుగా రావు బహద్దూర్ అనే బిరుదు నిచ్చి ఘనంగా సత్కరించింది. 1925 వ సంవత్సరం తర్వాత తన పదవికి స్వచ్చందం గా రాజీనామా చేసి తిరిగి తన ప్రైవేట్ ప్రాక్టీస్ ను పున: ప్రారంభించాడు ధుమాల్. బాబా దయ వలన అతని ప్రాక్టీస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లి సిరి సంపదలతో పాటు ఎనలేతి ఖ్యాతిని ధుమాల్ సంపాదించారు.ధుమాల్ మిక్కిలి ఆచారవంతుడు, చిన్నప్పటి నుండి అతని కుటుంబం యావత్తూ షేగాం లోని యోగిశ్రేష్టుడు శ్రీ గజానన్ మహారాజుకు భక్తులు. 1907 వ సంవత్సరం లో మిత్రుల ప్రోధ్భలం మీద శిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాడు. తొలి దర్శనంతోనే శ్రీ సాయిబాబా వారి యందు గొప్ప అభిమానం పెంచుకున్నారు.  శ్రీ సాయికి తొలిసారిగా సాష్టాంగ నమస్కారం చేయగా రెండు రూపాయలు దక్షిణ అడిగారు. ధుమాల్ వెంటనే ఇవ్వగా శ్రీ సాయి వాటిని ఆశిర్వదించి ధుమాల్ కు తిరిగి ఇచ్చేసి “ వీటిని బధ్ర పరచుకో. నీకు జీవితం లో ఏ లొటు వుండదు” అని అన్నారు.ధుమాల్ నాగ్ పూర్ లో నివసించే బాపు సాహెబ్ బూటీ కి అత్యంత సన్నిహితుడు. ఒకసారి ధుమాల్ బూటీని సాయి దర్శనానికి  తీసుకువెళ్ళాడు. ధుమాల్ వలె బూటీ కూడా సాయి పట్ల ఆకర్షితుడై జీవితాంతం ఆయనకు మహా భక్తుడైనాడు.ఒక సందర్భం లో ధుమాల్ శ్రీ సాయిని దర్శించుకోగానే, శ్రీ సాయి “ భావూ ! నేను నిన్ను ప్రతీ క్షణం కనిపెట్టుకొని వుంటాను. నేనలా చేయకపోతే ఏ క్షణం లో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?” అని అన్నారు. మరొక సారి” భావూ ! నిన్న రాత్రంతా నాకు నిద్ర లేదు, నీ గురించే ఆలోచిస్తూ గడిపాను. నీ సర్వ బాధ్యతలు నావే ‘ అని అన్నారు. ఆ మాటలకు ధుమాల్ చలించిపోయి కన్నీళ్ళతో శ్రీ సాయి పాదాలకు అభిషేకం చేసారు. కన్న తల్లి కంటె మిన్నగా తన భక్తులను ప్రతీ క్షణం కాపాడే శ్రీ సాయి యొక్క అపూర్వమైన ప్రేమ, అనురాగం, వాత్సల్యాలకు ముదమొందాడు. బాబాకు సర్వశ్య శరణాగతి ఒనరిస్తే చాలు, ఇక జీవితం లో దేనికీ ఆలోచించనవసరం లేదు. కూడు, గుడ్డ ల దగ్గర నుండి  రక్షణ వరకు అంతా శ్రీ సాయియే చూసుకుంటారు.

1909 వ సంవత్సరం లో ధుమాల్ భార్య ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడి హఠాత్తుగా మరణించింది. అప్పటికి ధుమాల్ వయసు కేవలం 36 సంవత్సరాలు. అతనిని తిరిగి వివాహం చేసుకోమని అతని స్నేహితులు బలవంత పెట్టగా ధుమాల్ సాయి అనుమతిస్తేనే జరుగుతుందన్నాడు. ధుమాల్ మిత్రుడైన సాయి భక్తుడు బాపూసాహెబ్ కింకేఢే ధుమాల్ ను తీసుకొని శిరిడీ వెళ్ళి ధుమాల్ రెండవ వివాహ విషయమై అడగగా బాబా అనుమతి ఇవ్వలేదు. సమర్ధ సద్గురువైన శ్రీ సాయి మాటలపై కొండంత విశ్వాసముంచి ధుమాల్ చివరి వరకు వివాహం చేసుకోలేదు.భార్య మరణం నుండి తేరుకున్నాక ధుమాల్ లాయర్ పట్టా కోసం ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బూటీ కూడా అతని ఉన్నత చదువులకు చేతనైనంత సహాయం చేస్తానన్నాడు. బాబా అనుమతి అడుగగా నీ గమ్యం ఇక్కడే నని ధుమాల్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నివ్వలేదు. బాబా ఆజ్ఞను మరొక సారి ధుమాల్ శిరసా వహించాడు.

ఒకసారి శ్రీ సాయి  దర్శనం తర్వాత వెళ్ళిపోతున్న ధుమాల్ ను రాధా కృష్ణ ఆయి పిలిచి శ్రీ సాయి యొక్క అధ్భుతమైన తైల వర్ణ పటాన్ని కానుకగా ఇచ్చింది.దానిని తీసుకు వెళ్ళి శ్రీ సాయి ఆశీర్వాదం కోసం ఆయన పాదాల వద్ద వుంచగా శ్రీ సాయి దానిని నఖ శిఖ పర్యంతరం గమనించి ఆశీర్వదించి ధుమాల్ కు తిరిగి ఇచ్చేసారు. శ్రీ సాయి  చేతుల మీదుగా ఆయన యొక్క చిత్ర పటాన్ని పొందాలన్న ధుమాల్ యొక్క చిరకాలపు ఆకాంక్ష ఆ విధంగా  తీరింది.దానిని చూసినప్పుడల్లా ధుమాల్ కు శ్రీ సాయి తనతో “ నేను రేయింబవళ్ళూ నీ గురించే ఆలోచిస్తాను, నీ సర్వ బాధ్యతలూ నావే ” అన్న మాటలు గుర్తొచ్చి ఆనంద బాష్పాలు రాలేవి.శ్రీ సాయి కృప వలన ధుమాల్ యొక్క న్యాయవాది ప్రాక్టీస్ చాలా బాగా సాగింది. అపజయమే లేని న్యాయవాదిగా ధుమాల్ గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు. 1930 నుండి 1932 వరకు దేవాస్ సంస్థానానికి ట్రస్టీ గా వ్యవహరించాడు. ఆ సమయం లో దేవస్ నుండి నాసిక్ కు తరచుగా ప్రయణం చేసేవాడు. ప్రయాణం లో తనతో పాటు పైన లభించిన శ్రీ సాయి చిత్రపటాన్ని విధిగా తీసుకెళ్ళేవాడు. అతని మేనల్లుడు,వంటవాడు లకు ముస్లిం ఫకీరైన సాయి చిత్రపతం తీసుకెళ్ళడం ఇష్టం వుండేది కాదు. ఒకసారి బాబా చిత్ర పటం ముందు చీట్లు వెయ్యగా ఆ చిత్ర పటాన్ని నీ తోనే వుంచుకో అన్న సందేశం వచ్చింది.అడపా దడపా సారి ఇచ్చిన దక్షిణ అరవై ఏడు రూపాయలు అయ్యింది.1918 వ సంవత్సరం లో ధుమాల్ శిరిడీ వెళ్ళినప్పుడు  వెంటనే శ్రీ సాయి ఆ డబ్బు తిరిగి తిసేసుకొని ఇంకొక ఏడు రూపాయలను అడిగారు. “నా వద్ద ఇంక డబ్బు లేదు బాబా “అని ధుమాల్ మొర పెట్టుకోగా “ఎవరి వద్ద నుండైనా అప్పు తీసుకొని రా” అని శ్రీ సాయి సలహా ఇచ్చారు. డబ్బుపై మమకారం కూడదని శ్రీ సాయి ఈ విధం గా తెలియజేసారు.

శ్రీ సాయి సమాధికి ముందు ధుమాల్ కు పూణే లో వున్న  అతని వదినగారికి తీవ్రం గా జబ్బు చేసినట్లు టెలిగ్రాం వచ్చింది. వెంటనే ఎనభై రూపాయలు తీసుకొని హుటాహుటిగా బయలు దేరి మధ్య మార్గం లో శిరిడీ లో దిగి తన వదిన గారికి స్వస్థత చేకూరాలని ప్రార్ధించాడు. బాబా ధుమాల్ దగ్గర వున్న డబ్బంతా తీసేసుకొని అతననిని పూనే వెళ్లనివ్వలేదు.రెండు రోజుల లోనే అతని వదిన గారు మరణించినట్లు అతనికి టెలిగ్రాం వచ్చింది.

అ సంఘటన జరిగిన కొద్ది రోజులకే శ్రీ సాయినాధులు మహా సమాధి చెందారు. ధుమాల్ వదిన గారు మరణిస్తారన్న సంగతి శ్రీ సాయికి ముందుగానే తెలుసు. అయినా తాను శరీరం తో వున్న ఆ ఆఖరు రోజులలో తనకు ప్రియ భక్తుడైన ధుమాల్ తన వద్దే వుండాలన్న ఆకాంక్షతో అతనిని పూనే వెళ్ళనివ్వలేదు.శ్రీ సాయి మహా నిర్యాణం అనంతరం శ్రీ శిరిడీ సాయి సంస్థాననికి ట్రస్టీ గా ధుమాల్ నియమించబడ్డాడు. తన అనుభవం, న్యాయ శాస్త్రం లో ప్రావీణ్యతలతో శిరిశీ సంస్థానం ఒక మార్గంలో పడడానికి విశేషమైన కృషి చేసి అందరికీ ఆదర్శం గా నిలిచాడు శ్రీ సఖరాం బల్వంత్ ధుమాల్.

తన ఆఖరు శ్వాస వరకు సాయి సేవలోనే గడపాలన్న ఆకాక్షతో జీవితం గడిపిన శ్రీ ధుమాల్ జూన్ 20, 1940(శనివారం) నాడు పరమపదించారు.

No comments:

Post a Comment