Thursday, June 27, 2024

షిర్డీసాయిబాబా మాటలు ప్రతీకలతో నిండి ఉంటాయి.*

*షిర్డీసాయిబాబా మాటలు ప్రతీకలతో నిండి ఉంటాయి.*


*ఉదాహరణకి సాయిబాబా పాముని "లంబా బాబా " అని అంటారు.*
*ఒక చోట భక్తులను ఉద్దేశించి " పైసా " అంటే  బాబా దృష్టిలొ భక్తులు గానీ వ్యక్తియే గానీ డబ్బు కాదు.*

*బాబా అలాంటి మాటలు మహాసమాధికి పూర్వము మట్లాడేవారు.*

*కానీ మహాసమాధి అనంతరం తన మాటలను ప్రతీకలతో జోడించి పలుకుతుంటారు కూడా.*

*బాబా మహాసమాధీ అనంతరం దాసగణు మహరాజ్ కు ఒక స్వప్నం వచ్చింది  ఆ స్వప్నములో బాబా దాసగణుకు సాక్షాత్కరించి " మశీదు కూలిపోయింది.*
*వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి.*
*కనుక ఆ స్థలము విడిచిపెట్టినాను " అని పలికారు.*

*సాయిబాబాను వర్తకులు చికాకుపెట్టడం అనేది జరగని పని.*

*మహామహిమాన్వితుడైన సాయిబాబా ఎక్కడ ?* *వర్తకము చేయు వ్యక్తులు ఎక్కడ ?* 
*సాయిబాబాను సాయి అష్టోత్తర శత నామావళిలో* 
*" అక్షోభ్యయాయ " అని కీర్తిస్తారు.*

*అయితే బాబా పలికిన పలుకులలో అర్థం ఉండదా ?వర్తకులు అను సాయి సాహిత్యంలో అనేక చోట్ల వచ్చునట్టి పదమే.*

*బాబా పలికిన " వర్తకులు " అను పదానికి అర్ధం వేరుగా ఉంటుంది.*

*వర్తకుడు అనగా లాభముకొరకు బేరసారములు చేసి వస్తువులను క్రయవిక్రయము చేసెడివారు.*
*అంటే ఒక వస్తువును తక్కువ ధరకు కొని, ఆ వస్తువును వేరొకచోట లాభమునకు అమ్ముట అనేది వ్యాపారం. అట్టి పనిచేయు ప్రతి వ్యక్తియు వ్యాపారే.*
*అయితే బాబా కూడా వ్యాపారాన్ని తగిన మోతాదులో నడిపిస్తే అంగీకరిస్తాడు. పేరాశకు పొవద్దంటాడు వ్యాపారంలో.*
 *ఒక కొబ్బరికాయ కొట్టి పరీక్షల్లో పాసు చేయమనే కోరికని గర్హిస్తాడు.*

*కనీస అర్హతను కొంచమైనా సంపాదించుకొని కోరికను కోరవచ్చు.*

*గాలిలో దీపంపెట్టి దేవుడా, నీ మహిమను చూపమని బాబాను కోరరాదు.*

*ఒక రూపాయి ఖర్చుపెట్టి లాటరీ టికెట్టు కొని, ఆ లాటరీలో లక్షరూపాయలు కోరుకోవడాన్ని సాయిబాబా అంగీకరించరు.*

*గోరంత భక్తితో కొండంత కోరికను తీర్చుకొనకూడదని సాయిబాబా భావము.*

*బాబా తనను వ్యాపార దృష్టితో చూడవద్దంటారు.*

*అదీ బాబా తత్వం.*

Wednesday, June 26, 2024

సాయిబాబా షిరిడీలో సజీవముగ ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మున్నగు ప్రదేశాలలో అనేక మంది భక్తులుండేవారు.

*సాయిబాబా షిరిడీలో సజీవముగ ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మున్నగు ప్రదేశాలలో అనేక మంది భక్తులుండేవారు.*


*అందులో బొంబాయి నగరంలో రామకృష్ణ కొఠారీ అని పేరుగల వ్యక్తి మాతృమూర్తి ఒకరు.* *ఒకసారి రామకృష్ణ కొఠారి తండ్రికి న్యుమోనియా జ్వరం వచ్చి పరిస్ధితి విషమించింది.*
*డాక్టర్లు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు.*
*కొఠారి తల్లికి షిర్డి సాయినాధుడు తప్ప వేరే దైవం లేడు. బాబాను ఆర్తితో ప్రార్ధించింది. షిరిడీకి పాదయాత్ర చేస్తానని మొక్కుకుంది.*

*సాయిబాబా కరుణించినందున కొఠారీ తండ్రి ప్రాణాలు దక్కాయి.*
*మొక్కుకున్నందున కొఠారి తండ్రి, తల్లి,మరి కొందరితో బొంబాయి నుండి పాదయాత్ర చేస్తూ, షిరిడీకి దగ్గరలోగల కోపరగాన్ పట్టణానికి చేరుకున్నారు.*

*అక్కడనుంచి మొక్కుకున్న కొఠారి తల్లి తప్ప మిగతావారందరూ ఎద్దులబండ్లలో షిరిడీకి వెళ్లిపోయారు.*
*కోపెరగాన్ నుండి ఆమె షిరిడీకి నడక మొదలెట్టింది.* *అక్కడనుంచి అమెకు కాళ్ళు వాచిపోయి నెప్పుపెట్టినందున, దారిలో గల ఒక చెట్టుక్రింద విశ్రమించినపుడు,బాగా గెడ్డం పెంచుకొని ఉన్న, పశువుల కాపరిగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి " అమ్మా !సాయిబాబా నీ మొక్కును స్వీకరించారు. ఇక నీవు బండిలో షిరిడీకి వెళ్ళు " అని చెప్పాడు.*
*అయినా ఆమె అందుకు అంగీకరించకుండా,నడక సాగించింది.*
*షిరిడీలో అది మధ్యాన్న సమయము ఆరతి సమయము.*
*బాబా ద్వారకామాయిలో ఆసీనుడైయున్నాడు. బాబాకు నిత్యమూ ఆరతి యిచ్చే బాపూసాబ్ జోగ్ బాబాకు హారతి ఇవ్వడానికి సిద్ధపడుతుండగా బాబా, జోగ్ ను కొంచంసేపు ఆగమన్నారు.*
*కొంతసేపటికి రామకృష్ణ కొఠారి తల్లి కాలినడకను ద్వారకామాయిని చేరుకొంది.*

*సాయిబాబాను మనసారా దర్శించుకొన్నది. బాబా ఆక్కడివారితో " ఈ తల్లిని దారిలో కలిసాను. నడక చాలునని చెప్పినా వినిపించుకోకుండా పాదయాత్ర చేసింది "అన్నారు.*

Monday, June 17, 2024

షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటున్నది ఏకాదశ సూత్రములో మొదటిది.

*సాయి సచ్చరిత్ర పారాయణ ఫలితం.* 


*"షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటున్నది ఏకాదశ సూత్రములో మొదటిది.*

*అమర్నాధ్ బరేలియా అనే సాయి భక్తుడు ఉండేవాడు.*
*సాయి భక్తుడు అని చెప్పుకోవడానికి, సాయి కటాక్షం ఉండాలి.* 
*అలా అనుభూతి చెందిన మనసే సాయి దివ్యత్వాన్ని గ్రహించేది.*

*అమర్నాద్ బరేలియా అనేక సార్లు షిరిడీ యాత్ర చేశాడు. అవన్నీ యాంత్రికంగానే అయినట్టు లెక్క.*
*ఆయన 13 -6 -1985 నుండి అనేక కష్ట నష్టములు అనుభవించాడు.*
*తన దుఃఖ నివారణ కొరకు షిరిడీ చేరాడు. సాయి దర్శనం అయినది.*
*అక్కడికి ఇంకా చాలా సమయమున్నది, అక్కడ గల లైబ్రరీ కి వెళ్ళాడు. అక్కడ గల ఒక ఇంగిలీషు  సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని చదివాడు.*
*కష్ట సాగరాన్ని నుండి బయటపడవేసేది శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ అని తెలుసుకున్నాడు.*
*ఆ గ్రంథంలో సప్తాహ పారాయణ చేయాలని ఉన్నది.*
*గ్రంథం కొందామని బజారుకు వెళ్లాడు.*
*అన్నిటికంటే హిందీ భాషలో గల సచ్చరిత్ర గ్రంథం తక్కువ ధరలో ఉంది.*
*ఆ గ్రంథాన్ని ఏడురోజుల పాటు షిరిడీలో ఉండి పారాయణ చేయడానికి తన వద్ద అంత ధనము లేదు.*
*ఆర్తితో, బాబా కృపతో మూడే మూడు రోజులలో సచ్చరిత్ర ( త్రిదివస ) పారాయణ చేసాడు.*
*తనవద్ద గల కొద్దీ డబ్బుతో ధుని మాతకు నారికేళం సమర్పించి, పటిక బెల్లాన్ని సాయికి నివేదించి తన ఊరికి బయలుదేరాడు.*

*ఆశ్చర్యంగా తన మనసు ఎంతో తేలిక పడిందని గ్రహించాడు.తనకు గల సమస్యలు తీరకుండానే అంత ప్రశాంతత ఎలా కలిగిందని ఆశ్చర్యపోయాడు.*

*ఇంకా 18 -6 -1985 నాడు తన ఇంటికి రాగానే, అమెరికా నుండి తన మిత్రుడు, తన ఇంటికి వచ్చి, తాను లేడని తెలిసి, అదే ఊరిలో గల ఫలానా హోటల్లో ఉంటానని, వచ్చి కలవమని చెప్పి వెళ్లిపోయాడు.*

*వెంటనే అమర్నాద్ ఆ మిత్రుడు ఉండే హొటల్ కి వెళ్లి, తన కష్టాలను అతనికి తెలిపాడు.*
*ఆ మిత్రుడు విని బాధపడి అమర్నాద్ కు ఒక ఉద్యోగం చూపాడు.*
*అప్పటివరకు ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న అమర్నాద్ వెంటనే ఉద్యోగంలో చేరాడు.*
*తన కష్టాలు తొలిగి పోయాయి. కుటుంబం అంతా సుఖముగా జీవించసాగారు.*

 *ఇది అంతా సాయి సచ్చరిత్ర పారాయణ ఫలితమే అని గుర్తించి ఆనందించాడు.*

Saturday, June 15, 2024

ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్.*

*ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్  తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్.* 

*భావ ఔన్నత్యం:*


*ఈ జగత్తు అంతా (మార్పు చెందే వాటితో సహా ) భగవంతుడు నిండి ఉన్నాడు.* 
*ఈ భావన చేత త్యాగం అలవరచుకో .. ఈ భావం చేత కష్టార్జితాన్ని మాత్రమే అనుభవించాలి.*

*షిర్డీ లో ఒక సారి ఉభయ భాషా ( సంస్కృత మరాఠా భాష ) పండితుడు, దాసగణు, బాబాని సమీపించి ఈశవాస్య ఉపనిషత్ భాష్యం వ్రాయాలి కానీ హృదయం లో ఏదో వెలితిగా ఉండి భావం అక్షర రూపం దాల్చే అవకాశం లేదు సహాయం చెయ్యమంటారు.* 
*బాబా వారు ఈ ఉపనిషత్ సారాన్ని నీకు నీ ముంబై మిత్రుడు పని పిల్ల బోధపరుస్తుంది అని అంటారు.*
*బాబా వారు హాస్యం అడారు అని ఆ పండితుడు ఊరుకుంటాడు.*
*కొన్నాళ్ళకి దాసగణు ముంబై తన మిత్రుడి ఇంటికి వెళ్ళే సందర్భం వస్తుంది. అక్కడ బస చేసినప్పుడు అక్కడి పని చేసే చిన్న అమ్మాయి చూడ ముచ్చటగా ఉండి అన్ని పనులు ఎంతో చలాకిగా పూర్తి చేస్తూ కనిపిస్తుంది. ఆ పని పిల్ల పై జాలి కలిగి నూతన వస్త్రాలు ఆ అమ్మాయి కి ఇప్పిస్తాడు. నూతన వస్త్రాలు కట్టుకున్న ఆ అమ్మాయి "భగవంతుడు దయ అపారం " అనే అర్థం తో చక్కని గీతం పాడి ... తోటి పిల్లలతో సరదాగా గడిపి ఆ నూతన వస్త్రాలు తీసి మునుపు కట్టుకున్న చిరిగిన వస్త్రాలు తిరిగి ధరించి అదే ఆనందం తో పనులలో నిమగ్నమై పోయింది.* *చినిగిన బట్టలు ఆ అమ్మాయి భగవంతుని పై విశ్వాసం ..ఆనందాన్ని తగ్గించలేదు కొత్త వస్త్రాలు పెంచలేదు.* 
*ఈశ్వరుడు మార్పు చెందే వస్తువులను తాను మారకుండా ఆవరించి ఉన్నాడు అనే స్పృహ బ్రహ్మానందానికి కారణం అవుతుంది.*
*ఇదే పని పిల్ల తెలియచేసిన ఉపనిషత్ సారం.* 

*ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ విషయాన్ని ముందుగానే చెప్పిన సాయినాథుని త్రికాలజ్ఞానం.* 

*జై సాయినాథ.*

భక్తుల పాపాల్ని దక్షిణగా స్వీకరించే దయామయి సాయి బాబా దక్షిణగా డబ్బునే కాక చెడు లక్షణాలను, సద్గ్రంథాలలోని మంచి విషయాలను ఆచరించటమనే లక్ష్యంతో కూడా దక్షిణలను స్వీకరించేవారు.

భక్తుల పాపాల్ని దక్షిణగా స్వీకరించే దయామయి సాయి బాబా దక్షిణగా డబ్బునే కాక చెడు లక్షణాలను, సద్గ్రంథాలలోని మంచి విషయాలను ఆచరించటమనే లక్ష్యంతో కూడా దక్షిణలను స్వీకరించేవారు. ఒకసారి బాబా ఫ్రొఫెసర్ నార్కేను పదిహేను రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు.అయ్యో నావద్ద సమయానికి పైసా కూడా లేదే ఏం చేయాలి అని నార్కే బాధపడ్డాడు.


నీదగ్గర డబ్బులు లేవన్న విషయం నాకూ తెలుసు. ప్రస్తుతం నువ్వు యోగవాశిష్టం చదువుతున్నావు కదా ఆ పుస్తకం చదివి నేర్చుకున్న పదిహేను విషయాలను దక్షిణగా ఇవ్వు అని అడిగారు బాబా ఇక్కడ బాబా కోరిన దక్షిణలోని పరమార్థం యోగవాశిష్టం చదివి నేర్చుకున్న అంశాలను జాగ్రత్తగా హృదయంలో పదిలపర్చుకుని వాటిని ఆచరిస్తున్నామా లేదా అనేది పరీక్షించటానికే బాబా నార్కేను కోరిన ఆ పదిహేను లక్షణాలు ఏమిటంటే....

1. ఆశలేకపోవటం,
2. నిర్భయత్వం,
3. నిత్యత్వం,
4. సమత్వం,
5. జ్ఞానం,
6. ఏకాగ్రత,
7. కర్తవ్యం,
8. సదా ప్రసన్నంగా ఉండటం,
9. వికల్పరాహిత్యం,
10. ధైర్యం,
11. సర్వ భూతదయ,
12. ఉత్తమ బుద్ధి,
13. సంతుష్టి,
14. మృదుత్వం,
15. మృదు భాషణం.

యోగవాశిష్టం ఈ లక్షణాలనే నేర్పుతుంది. నార్కే ఈ సుగుణాలను అలవర్చుకుంటున్నాడా? లేదా? తెలుసుకోవటానికే బాబా అతనిని దక్షిణ అడిగారన్న మాట. మరోసారి ఆత్మారామ్ తర్ఖడ్ భార్య బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది.

అమ్మా  నీలోని ఆరు గుణాలను నాకు దక్షిణగా ఇచ్చేయ్ అని అడిగారు బాబా.తర్ఖడ్ భార్యకు ఏమీ అర్థం కాలేదు. పకనే ఉన్న ఆమె భర్త బాబా అడిగిన దక్షిణ భావంలోని అంతరార్థాన్ని భార్యకు ఇలా చెప్పాడు.

బాబా నీ మనసులో ఉన్న కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాతర్యాలనే లక్షణాలను తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమంటున్నారు. అదే బాబా నిన్నడిగిన దక్షిణలోని భావం అని ఆత్మారామ్ తర్ఖడ్ వివరించాడు. ఇవి ప్రతి మనిషిలో ఉండే ఆరు గుణాలు. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషి ఎప్పుడూ వీటికి బానిసై ఉంటాడు. వీటి బారిన పడితే మోక్షం పొందలేం కాబట్టి వాటిని తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమన్నారు బాబా. ఇంకోసారి బాబా ఒక భక్తిడికి 'జ్ఞానేశ్వరి' గ్రంథాన్ని ఇచ్చారు.

ఆ పుస్తకంలో ఉన్న తొమ్మిది విషయాలను చదివి, మననం చేసుకుని నేర్చుకుని ఆచరించు. అదే నువ్వు నాకిచ్చే దక్షిణ అని చెప్పారు. బాబా మన నుంచి దక్షిణ కోరేది మన కర్మల ధ్వంసానికే. పాపాల్ని దక్షిణగా అడిగి తీసేసుకుని భక్తుల్ని పావనుల్ని చేసే దయామయి సాయి.

Thursday, June 13, 2024

భాగ్యనగరంలో సాయి ఫకీరు.* *సాయిబాబా భక్తులు, మన తెలుగు రాష్ట్రాలలోనే గాక, భారతదేశం అన్ని రాష్ట్రాలతో పాటు, విదేశాలలో కూడా కూడా విశేషంగా ఉన్నారు

*భాగ్యనగరంలో సాయి ఫకీరు.*


*సాయిబాబా భక్తులు, మన తెలుగు రాష్ట్రాలలోనే గాక, భారతదేశం అన్ని రాష్ట్రాలతో పాటు, విదేశాలలో కూడా కూడా విశేషంగా ఉన్నారు.*

*మన భాగ్యనగరంగా పిలువబడ్డ సికింద్రాబాద్ లో పాట్ మార్కెట్ నందు బంగారు షాపులుండేవి. అందులో ఒక షాప్ యజమాని నేమిచంద్ జైన్. వారు జైన మతానికి చెందినవారు.*
 *ఆయన తల్లితండ్రులు మేఘరాజ్ జైన్, శ్రీమతి తారాబాయి జైన్. వారు పరమ దైవ భక్తి పరాయణులు.*

*1960 సం. జూన్ 14 వ తేదీ నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది* 
*ఆ రోజు నేమిచంద్ తన బంగారు షాపు లోని ఆభరణాలు కొనుగోలుదారులకు చూపిస్తున్నాడు.*
*ఇంతలో ఆజానుబాహుడైన ఒక ఫకీరు షాప్ ముందు నిల్చొన్నాడు.*
*ఫకీర్ వద్దకి నేమిచంద్ వచ్చి " మీకు ఏమి కావాలి ? " అని అడిగాడు. ఫకీరు " నాకు అయిదు అణాలు ( ఇప్పటి షుమారుగా 35 నయాపైసలు ) కావాలి అని అడిగాడు ఫకీర్.* 
*నేమిచంద్ తన కాష్ బాక్స్ వెదికితే అందులో నాలుగు అణాలు మాత్రమే కనిపించాయి.*
*అయిదు అణాలు కన్నా తక్కువ తీసుకోనన్నాడు ఫకీర్.*
 *"నీవు కడుపు నొప్పుతో బాధపడుతున్నావు కదా! " అని అడిగాడు ఫకీర్.*
*"అవును " అని జవాబిచ్చాడు నేమిచంద్.*
*" నీవు కొన్ని నిబంధనలు పాటిస్తే నేను మందిస్తాను" అన్నారు ఫకీర్.*
*" సరే  " అన్నాడు నేమిచంద్.*
*"మొట్టమొదట ఇతర మందులు వాడుట మానేయాలి. గురువారము నాటికి నొప్పి తగ్గుతుంది.* *అప్పటి నుండి షిరిడీ సాయి పూజ ప్రారంభించాలి "అని పలికాడు ఫకీర్.* 
*దానికి అంగీకరించాడు జైన్.* 
*పూజా విధానం సులభంగా ఉన్నది ."వీలుంటే తీపి పదార్ధాలను నైవేద్యంగా పెట్టాలి. లేకుంటే లేదు. రెండు అగరు వత్తులైనా వెలిగించి, నమస్కరించాలి " అని అన్నాడు ఫకీర్.*
*అంగీకరించాడు జైన్.*

*ఫకీరు కొంత విభూతి ఇచ్చాడు. కొంత నోటిలో వేసుకొని, కొంత నుదుటన రాసుకోమన్నాడు. జైన్ ఆలాగే చేశాడు.*

*వెంటనే ఫకీర్ రూపాయి నాలుగు అణాలు అడిగాడు. డబ్బు కోసం వెతుకుతుండగా ఫకీర్ మాయమయ్యాడు.*
*మరో సారి ఆశ్చర్యపోయాడు జైనుడు. ఫకీర్ చెప్పినట్లు గురువారాని కల్లా కడుపు నొప్పి పోయింది.*
*ఇక నేమిచంద్ పూజా మందిరంలో సాయినాధుడు కొలువుదీరాడు.*

*కొన్నాళ్ల తరువాత జైన్ తన కుటుంబసభ్యులతో కలసి షిరిడీ దర్శించి సమాధి మందిరం చేరాడు.*

*అక్కడ తనకు సికింద్రాబాద్ లో కనిపించిన ఫకీరు మహరాజులా సింహాసనం పై కూర్చుని ఉన్నాడు.*
*కలకాదు కదా అని అనుకొన్నాడు.*
*నమస్కరించాడు.*
*వెంటనే రూపాయి నాలుగు అణాలు హుండీలో వేసాడు.*
*మరల సింహాసనం వైపు చూసాడు.*
*ఇప్పుడు పాలరాయి విగ్రహ రూపంలో చిరునవ్వు చిందిస్తూ సాయి ఫకీర్ కనిపించాడు.*  

  *ఇది సాయి ఫకీర్ లీల*

Monday, June 10, 2024

సాయిబాబా ను "గణపతి " నీవే అంటారు కేశవ చిదంబర గాడ్గిల్

*" తానొకడైనా తలకొక రూపై "* 
*ఉండెడివాడు శ్రీకృష్ణుడు అంటాడు సినీ గేయ రచయితా సముద్రాల రాఘవాచార్యులు గారు.* 


*సాయిబాబా ను "గణపతి " నీవే అంటారు కేశవ చిదంబర గాడ్గిల్.*
*"మారుతి" నీవే అంటాడు సాయిబాబాను మారుతి రూపంలో దర్శనం పొందిన నానాసాబ్ డేంగ్లే కుమారుడు సోమనాధ్ శంకర్ దేశపాండే.*
 *"మారుతి నేవే, గణపతి నీవే, సర్వదేవతల నవ్యాకృతి నీవే " జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు.*

*విశ్వంభరుడైన ఆ సాయినాథుని ఆ రెండు చరణాలలో దర్శింపచేసారు ఆయన.*
*"నుడులకు అందవు సుతులకు పొంగవు " అంటూనే "పాపాలు కడిగేసే పావన గంగ" గా సాయినాథుని గానం చేసేడు ఆయన.*
*సాయిబాబా - కాదనగలడా ?*

*"నిన్నుగానీ శరణుమని  సన్నుతించువేళ, జన్మ ధన్యమవుతుంది బాబా " అంటూనే " దాతవని తలచుకొని, జోతలిడేవేళ, దైవం తల ఊపుతుంది కాదా ? మా దైవం తల ఊపుతుంది కాదా ? అని అంటారు డాక్టర్ సి. నా రె గారు.*

*సాయిబాబా కాదనగలడా ?*
*అంతటితో ఆగక "తొలగించినావు వ్యాధులను ఊదీతో " అని అంటారు ఆయన.*
*బాబా ఎప్పుడో నీవు షిరిడీలో నడయాడినప్పుడు చేసానని కాదు, ఇప్పుడు, ఎల్లప్పుడూ అలా ఉదీతో వ్యాధులను నయం చేయమనీ కోరుతూ అడిగాడు ఆయన.*
*"బాబా చూపే మలయ సమీరం " అనేది సి .నా .రే .భావన కాదు.*
*అది పరమసత్యం.*

*సమస్యలతో, బాధలతో, దరి కానని వారికి సాయి సన్నిధి సేద తీరుస్తుంది. ఊరట కలిగిస్తుంది. ఇది జరిగిన జరగుతున్న అనుభవాలు తెలిపే నిత్య సత్యాలు.*

*అందుకనే ప్రతీ భక్తుడు " నీ పాద సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం " అని అంటారాయన.*
*ఎందుకంటే " కలుష భావనలు చొరబడనీయని కవచం నీ ధ్యానము "అని ప్రతీ భక్తునికి తెలుసు.*
*మరింతగా " అది భవ జగతికే నావ " ఇక మనం సాయినాథుని శరణమని సన్నుతించు వేళ " అయింది అని గుర్తు చేస్తారు.*
*"ఎంతెంత దయ నీది ఓ సాయి"*
*సాయి దివ్య ప్రేమను మరువ కుందుము గాక !*

Saturday, June 8, 2024

ప్రొ. గణేష్ గోవింద్ నార్కే...(జి.జి.నార్కే)...(బాపూసాహెబ్ బూటి అల్లుడు)..1918లో పూణేలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగం పొందారు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏..



    ప్రొ. గణేష్ గోవింద్ నార్కే...(జి.జి.నార్కే)...(బాపూసాహెబ్ బూటి అల్లుడు)..1918లో పూణేలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగం పొందారు.. 


   శ్రీ సాయి సచ్చరిత్ర -14, 27 & 42 అధ్యాయాలలో ఇతని ప్రస్తావన ఉంటుంది..శ్రీసాయిబాబాతో ప్రత్యక్ష అనుబంధం ఉండి, సాయి సంస్థాన్‌కు సేవలను అందించిన భక్తులలో గణేష్ గోవింద్ నార్కే ఒకరు...


      1905వ సంవత్సరంలో ఎమ్.ఎ. పట్టా పుచ్చుకున్నాడు...1907 నుండి 1909 వరకు కలకత్తాలో భూగర్భ పరిశోధనలో శిక్షణ పొందాడు...1909లో భారత ప్రభుత్వం అతన్ని ఉన్నత విద్యకై మాంచెస్టర్(ఇంగ్లాండ్) పంపింది. అతనక్కడ గనులు, భూగర్భశాస్త్రంలో ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకుని 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాడు...


     అతని భార్య, తల్లి, మామగారు బూటీ తరచూ శిరిడీ దర్శిస్తూ, బాబా సన్నిధిలో గడుపుతుండేవారు. ఒకసారి వాళ్ళు, "శిరిడీ వచ్చి బాబాను దర్శించుకోమ"ని నార్కేకు ఉత్తరం వ్రాశారు...అందువలన నార్కే 1913, ఏప్రిల్ నెలలో మొదటిసారి శిరిడీ సందర్శించాడు...


      శ్యామా అతనిని బాబా దర్శనానికి తీసుకుని వెళ్లి బాబాకు పరిచయం చేయగా..."ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా! ముప్ఫై జన్మల నుండి ఇతను నాకు తెలుసు!" అన్నారు.


      మొదటిసారిగా నార్కే బాబాను దర్శించినప్పుడు వారి అనుభవం గురించి చెప్తూ...ఆరతి సమయంలో బాబా మిక్కిలి కోపంగా ఉన్నారు. అకారణంగా వారు కోపగించి శపించి భయపెట్టుచున్నారు... "ఆయన పిచ్చివాడా!" అనే సంశయం నా మనసులో మెదిలింది..ఆరతి పూర్తయ్యాక నేను బాబా పాదాలు ఒత్తుతూ ఉండగా.. బాబా ప్రేమగా నా తల నిమిరి నేను పిచ్చివాడను కాను అన్నారు.. (సాయి సచ్చరిత్ర ఉపోద్ఘాతం...)


    నార్కే మొదటిసారి బాబా దర్శనం చేసుకున్నప్పుడు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే శిరిడీలో ఉన్నాడు. తరువాత బాలఘాట్, బర్మాలకు వెళ్ళి.. బర్మా ఆయిల్ కంపెనీలో మూడునెలలు ఉద్యోగం చేసి తిరిగి నాగపూర్ చేరుకున్నాడు...బాబా అతనిని శిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి అతనొక్కడే శిరిడీ వెళ్లి 13 నెలలు శిరిడీలో గడిపాడు...


     1913లో ఒకరోజు బాబా నార్కేతో, “మీ మామ ఇక్కడొక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తాడు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు" అని అన్నారు. బూటీ 1915-1916లో ప్రస్తుత సమాధిమందిరం  నిర్మాణాన్ని ప్రారంభించాడు...బాబా చెప్పినట్లుగానే..1920 తరువాత ఏర్పాటు చేసిన సమాధిమందిర ట్రస్టులో నార్కే ఒక సభ్యునిగా సేవలు అందించాడు...


     నార్కేకు చాలాకాలం వరకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు...ఆ విషయమై అతని తల్లి చాలా ఆందోళన చెంది... ఉద్యోగ కోసం తన బిడ్డ కలకత్తా, బర్మా వంటి దూరప్రాంతాలకు వెళ్లడం చూసిన ఆమె ఒకసారి బాబాతో, "బాబా! నా బిడ్డని మా ఊరిలోగానీ, శిరిడీకి దగ్గరలోగానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి" అని మొరపెట్టుకుంది. అప్పుడు బాబా, "నేనతనిని పూనాలో స్థిరపరుస్తాను!" అని అన్నారు.


      తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తనలో తాను నవ్వుకునేవాడు నార్కే...1917లో ఒకసారి వారణాసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్వ్యూకి రమ్మని అతనికి ఉత్తరం వచ్చింది. బాబాను సలహా అడిగితే, “నువ్వు వారణాసి వెళ్ళనవసరం లేదు, పూనా వెళ్ళు” అన్నారు..


     1917వ సంవత్సరంలో పూనా విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్రానికి సంబంధించిన కోర్సు ప్రారంభమయి... ఆ శాస్త్రాన్ని బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికా ప్రకటన వెలువడింది...


        అది చూసిన నార్కే, "ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా?" అని బాబాను అడగగా..బాబా అనుమతించడంతో వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు...ఎంతోమంది అభ్యర్థులు ఆ ఉద్యోగానికై పోటీపడ్డారు. 


     బాబా ఆశీర్వదించినట్లుగానే నార్కే 1918లో ఆ విశ్వవిద్యాలయంలో భూగర్భ, గనుల శాస్త్రంలో ప్రొఫెసర్‌గా మంచి జీతంతో నియమితుడయ్యాడు. 1919లో ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది...


    బాబా ప్రతిసారీ ‘పూనా’ వెళ్ళు అని ఎందుకు అనేవారో అప్పుడతనికి అర్థమై, ఈ ఉద్యోగ విషయం 1913లోనే బాబా దృష్టిలో ఉందని గ్రహించాడు. "నా భవిష్యత్తు మొత్తం బాబాకు తెలుసన్నమాట" అని అనుకున్నాడు...


      (మూలం:- భక్తుల అనుభవాలు: శ్రీ బి.వి నరసింహ స్వామిజి..)


   ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹..

సాయి భక్తుడు దేవ్ బాబా (హేమాడ్ పంత్ మనవడు..అనంతప్రభు వాల్వాల్కర్..) సమాధి చెందిన రోజు..

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏



  సాయి భక్తుడు దేవ్ బాబా (హేమాడ్ పంత్ మనవడు..అనంతప్రభు వాల్వాల్కర్..) సమాధి చెందిన రోజు..


    దేవ్ బాబా 1994, మే 25, గురువారం, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సమాధి చెందాడు.

 

     దేవ్ బాబా తండ్రి రాజారాం కాకా సింధుదుర్గా జిల్లాలోని వళవల్‌కు చెందినవారు. అందుకే వారిని "వాల్ వల్కర్లు" అని పిలిచేవారు...


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹

మోరేశ్వర్ వామన్ ప్రధాన్ 1918లో లెండి బాగ్‌ని కొనుగోలు చేసి...తర్వాత దానిని శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు బహుమతిగా ఇచ్చారు...

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏



    మోరేశ్వర్ వామన్ ప్రధాన్ 1918లో లెండి బాగ్‌ని కొనుగోలు చేసి...తర్వాత దానిని శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు బహుమతిగా ఇచ్చారు... 


    లెండి బాగ్ షిర్డీలో ఈశాన్య దిక్కులో ఉంటుంది. సాయిబాబా ప్రతిరోజు ఉదయాన్నే లెండి బాగ్‌కు వెళ్లేవారు...


     షిరిడి ఊరి పొలిమేరలో ఉన్న చిన్న వాగు పేరు లెండి. 

అందుకే వాగు సమీపంలోని భూమిని బాబా 'లెండి బాగ్' అని పిలిచేవారు...


     బాబా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం లెండి బాగ్‌కి వెళ్ళేవారు.. బాబా వెంట బూటీ, భాగోజిషిండే, నిమోన్కర్ ఉండేవారు.. కొంతమంది భక్తులు లెండి బాగ్ లో బాబాను దర్శించుకునేవారు..


     1910 మే నెలలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇద్దరు కుమారులు బాపు, బాబులతో  కలసి ప్రధాన్ మొట్టమొదటిసారిగా బాబాని దర్శించుకున్నారు.. బాబా అతనిని ఎనిమిది రోజులు షిరిడీలో ఉంచారు. షిరిడీలో ఉన్న సమయంలో ప్రధాన్ కి బాబా మీద అమితమైన భక్తి, విశ్వాసం కలిగాయి..


     ఒక గురువారం మధ్యాహ్నం బాబా...ప్రధాన్, బాపు, బాబులను తీసుకొని లెండీకి వెళ్ళారు. సాధారణంగా వారు లెండీకి వెళ్లే సమయం కాదది. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి ప్రధాన్ చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలిచ్చి ఆ గుంటలలో పెట్టించి, వాటిపై మట్టి కప్పి నీళ్ళు పోయమన్నారు. ప్రధాన్ బాబా చెప్పినట్టే చేశాడు..తరువాత వాళ్ళు మసీదుకు తిరిగి వచ్చారు.


       ఈ సంఘటన జరిగిన ఏడెనిమిది సంవత్సరాల తరువాత ఆ లెండి బాగ్ ని ప్రధాన్ రూ. 1500/-లకి కొనుగోలు చేసి, సంస్థాన్ ఏర్పడ్డాక దాన్ని సంస్థాన్‌కు బహుమతిగా సమర్పించాడు...


     షిర్డీని సందర్శించే భక్తులు గేటు పైన "మోరేశ్వర్ ప్రధాన్ చే లెండి బాగ్" అని రాసి ఉన్న బోర్డును చూడవచ్చు...


     లెండి బాగ్ బాబా పాదధూళితో పవిత్రమైన ప్రదేశం... 

ఈ తోట నిండా  పారిజాత, చంపా, చమేలీ, జుయ్ మరియు జై వంటి పూల మొక్కలు ఉన్నాయి. 


     1980ల వరకు లెండి బాగ్ లో ఒక అందమైన ప్రవేశద్వారం దానిపైన  పూవులతో బౌగెన్‌విల్లా  పందిరి ఉండేది..లెండి బాగ్  ఎడమ వైపున, జింకలు, కుందేళ్ళు సంచరించే మరొక గులాబీ తోట ఉండేది..


     దేవతా వృక్షాలైన మామిడి..వేప.. అశ్వత్థ.. ఔదుంబర్ వంటి చెట్లను బాబా స్వయంగా నాటి పోషించారు... నందా దీపం వెలిగించారు..

     

  ఓం శ్రీ సాయిరాం🙏🙏🌹

స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బాలగంగాధర తిలక్ బాబాని దర్శించిన రోజు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 



    స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బాలగంగాధర తిలక్ బాబాని దర్శించిన రోజు..


      దాదాసాహెబ్ ఖపర్థేతో కలసి లోకమాన్య బాలగంగాధర తిలక్.. మే 19, 1917లో మొదటిసారిగా షిరిడి వచ్చి బాబాని దర్శించుకున్నారు..


     బాలగంగాధర తిలక్ స్వాతంత్ర సమరయోధులు.. వారికి "లోకమాన్య" బిరుదు కలదు... అంతేకాదు జాతిపిత మహాత్మా గాంధీ తిలక్ గారిని.."The Maker of Modern India" అని పిలిచేవారు..


     తిలక్ బాబా కోసం తెల్లటి వస్త్రాన్ని కానుకగా తెచ్చి.. బాబాకి సమర్పించారు.. ఆ వస్త్రాన్ని బాబా శ్యామాకు బహుమతిగా ఇచ్చారు..


    ప్రస్తుతం ఆ వస్త్రం శ్యామా వారసుల వద్ద ఇప్పటికీ ఉంది..

    

    (ఖపర్థే డైరీ ఆధారంగా..)


   ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

మే 19, 1953 శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగువారికి అందినరోజు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 



 మే 19, 1953 శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగువారికి అందినరోజు..


   తెలుగు రాష్ట్రాలలో ప్రతిసాయిభక్తుడు ఎంతో ఆనందంతో గుర్తుంచుకునే రోజు మే 19.. ఆరోజు శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులకు అందిన రోజు..


      సాయి ఎవరెవరికి ఏ కర్తవ్యాన్ని అప్పగిస్తారో? ఎవ్వరు ఊహించలేనిది.. మరాఠీలో సాయిసచ్చరిత్రని వ్రాసే అదృష్టాన్ని హేమాడ్ పంత్ కి ఇచ్చారు.. ఇంగ్లీషులో ఎన్. వి గుణాజి గారికి ఆ అదృష్టం దక్కింది.. తెలుగులో అనువదించడానికి శ్రీ పత్తి నారాయణరావు గారిని బాబా ఎంచుకున్నారు..


      పత్తి నారాయణరావు గారు శివనేసన్ స్వామి వారితో కలసి.. చావిడిలో45 రోజులపాటు రోజుకు 18 గంటలు చొప్పున సచ్చరిత్రలోని ప్రతి పేజీ.. ప్రతి పేరా.. ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి.. శ్రీ సాయి సచ్చరిత్రని అనువదించారు..


     సాయి ఎప్పుడూ తనకి దక్షిణగా రెండు రూపాయలు (శ్రద్ధ - సబూరి) భక్తుల నుండి ఆశించేవారు.. సాయి సచ్చరిత్రని తెలుగులోకి అనువదించిన పత్తి నారాయణరావు గారి విషయంలో బాబా ఈ శ్రద్ధ - సబూరి ఎంతవరకు ఉన్నాదో చాలా పరీక్షలు పెట్టారు..


      మరాఠీలోను, ఇంగ్లీషులోనూ వ్రాసిన సచ్చరిత్రని షిరిడి సంస్థానం వారు ప్రింటింగ్ చేశారు.. కానీ తెలుగు సచ్చరిత్రకు సంస్థానం నిధుల కొరత వలన ప్రింటింగ్ చేయలేకపోయారు.. అందువలన పుస్తకం ప్రింటింగ్ చేయించడానికి నారాయణరావు గారు పడ్డ శ్రమ వర్ణనాతీతం..


      ఏది జరిగినా అంతా సాయి సంకల్పం ప్రకారమే జరుగుతుంది అని ఆయన సచ్చరిత్రలో ఎన్నో తార్కాణాలు.. అలాగే తెలుగు సాయి సచ్చరిత్ర ప్రచురణ విషయంలోనూ జరిగింది.. ప్రచురణ ఎప్పుడు? ఎవరి ద్వారా? ఎక్కడ జరగాలో? సద్గురువు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప మనం అనుకుంటే జరగదు..


      సచ్చరిత్ర పుస్తకాన్ని ఎలా ప్రింటింగ్ చేయాలో? దిక్కు తోచక ఆ ప్రతులని కాషాయ వస్త్రంలో కట్టుకొని.. సాయి నామ జపం చేసుకుంటూ.. అనేక తీర్థయాత్రలు చేశారు..


        కాశీ, కొల్హాపూర్, కర్నూలు, మహూర్‌గఢ్, కురుపురం, గాణుగాపూర్, హుమ్నాబాద్, అక్కల్‌కోట్, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వర్, పరేలి, ధాకిని, రామేశ్వరం, త్రయంబకేశ్వర్ (ఈ ఘ్రుష్ణేశ్వర్) జునాగఢ్, భద్రాచలం, ద్వారక, పండరీపురం, వేమపల్లి, పూరి, తిరుపతి, శ్రీ రంగం, తిరువనంతపురంలో పారాయణ చేయడమే కాక మూడు కోట్ల నామ జపం చేశారు..


      ఎన్ని క్షేత్రాలు దర్శించినా తన కోరిక తీరలేదు అని నిరాశ చెందకుండా.. తన సంకల్పాన్ని వదలక.. మరింత పట్టుదలతో నామ జపం చేసుకుంటూ.. ఆయా క్షేత్రాల యొక్క దేవీ దేవతల ఆశీర్వాదాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో నిక్షిప్తం చేసుకుంటూ క్షేత్రాల దర్శనం చేశారు..


         ఏ దైవమూ తన కోరిక నెరవేర్చలేదు అని నారాయణరావు గారు ఎప్పుడు నిరాశ చెందలేదు.. మరింత పట్టుదలతో అన్ని క్షేత్రాలు దర్శించి.. సచ్చరిత్రకి సద్గురువైన ఆ సాయినాధుని ఆశీర్వాదంతో పాటు.. ఆయా క్షేత్రాల దేవతల ఆశీర్వాదం కూడా లభించింది.. అదే తెలుగు సచ్చరిత్ర పారాయణం చేసే భక్తులకు దక్కిన అదృష్టం..


       క్షేత్ర దర్శనాలు పూర్తవగానే బాబానే పుస్తకం ప్రింటింగ్ ఎవరు చేస్తారో? ఎక్కడ చేస్తారో? స్వప్న దర్శనం ద్వారా నారాయణరావు గారికి చూపించి సికింద్రాబాద్ జి. ఆర్. నాయుడు గారి దగ్గరికి పంపించారు..


     చివరికి జి. ఆర్ నాయుడు గారి ద్వారా...ప్రీమియం ప్రింటర్స్ అధినేత చందా నారాయణ శ్రేష్ఠి గారు.. తమ ప్రెస్ లో పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి అంగీకరించి.. 1953 మే 19వ తేదీన మొట్టమొదటిగా తెలుగులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని ప్రింటింగ్ చేశారు..


       సచ్చరిత్రలో బాబా శ్రద్ధ, సహనం ప్రాముఖ్యత గురించి చెప్పారు.. భక్తులు కూడా తమ ప్రవచనాలలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. కానీ ఆచరించడమే కష్టం.. ఇవి రెండు నారాయణరావు గారు ఆచరించి చూపారు..


       పుస్తకాన్ని ప్రింటింగ్ చేయించడానికి వారు పడ్డ శ్రమ... చూపిన సహనం.. పెంచిన పట్టుదల.. సంకల్ప బలం.. అన్నిటికీ మించి ఆ సాయినాధుని ఆశీర్వాదం.. భారతదేశంలోని క్షేత్రాల దేవి దేవతల ఆశీర్వాదం.. నామ జపం యొక్క శక్తి.. ఇవన్నీ కలిస్తేనే.. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో సాయి భక్తులు ఎంతో భక్తితో పారాయణం చేసుకుంటున్న సాయిసచ్చరిత్ర మన ముందుకి ఆవిష్కృతమైంది..


       శ్రీ సాయి సచ్చరిత్రలో ఇంత శక్తి ఉంది కనుకనే భక్తులు భక్తితో పారాయణం చేస్తున్న.. వారి కోరికలు నెరవేరుతున్నాయి.. భక్తులకు మంచి మార్గాన్ని.. మానవులు త్రికరణ శుద్ధిగా సత్కర్మలను ఆచరించడంలో  దారి చూపిస్తుంది.. మనసులోని దుష్ట ఆలోచనలను పోగొడుతుంది..


      సచ్చరిత్రను పారాయణం చేస్తున్న భక్తులు.. బాబా అడిగిన శ్రద్ధ, సబూరి విషయంలో ఎంతవరకు నిలబడగలుగుతున్నామని ఎవరికివారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. ఒక్కసారి మనం పారాయణం చేస్తున్న సాయి సచ్చరిత్ర ప్రింటింగ్ కోసం నారాయణరావు గారు పడ్డ శ్రమని ఆరాటాన్ని గుర్తు చేసుకుంటూ.. భక్తులు పారాయణం చేయాలి... వారే మనకి ఆదర్శం కావాలి..

భగవంతుడు అంటే భయం కాదు భక్తి - ప్రేమ అని తెలియచెప్పేదే.. సద్గురువైన శ్రీ సాయి సచ్చరిత్ర..

 ఎన్నిసార్లు పారాయణం చేసిన మా కోరిక నెరవేరలేదు.. బాబా మా కోరిక తీర్చలేదు.. అని సాయిని నిందించకుండా శ్రద్ధ, సహనంతో సద్గురువు చరిత్రని పారాయణం చేస్తే.. న్యాయమైన కోరికలు సద్గురువు తప్పక తీరుస్తారు..



     భగవంతుడు అంటే భయం కాదు భక్తి - ప్రేమ అని తెలియచెప్పేదే.. సద్గురువైన శ్రీ సాయి సచ్చరిత్ర..


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹..

ఈ క్రింది బాబా ఫోటో.. ఫోటో కాదు.. శ్యామారావు జయకర్ వేసిన పెయింటింగ్..

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏..



    ఈ క్రింది బాబా ఫోటో.. ఫోటో కాదు.. శ్యామారావు జయకర్ వేసిన పెయింటింగ్..


    ఒకరోజు ఉదయం రామచంద్ర ఆత్మారామ్ తర్ఖడ్..శ్యామారావ్ జయకర్ ద్వారకామాయికి వెళ్ళారు..


    అప్పుడు బాబా స్నానానికి సిద్ధమవుతున్నారు.. ఆ సమయంలో సూర్యోదయపు సూర్యకిరణాలు బాబాపై పడి  శరీరం మొత్తం ప్రకాశవంతంగా ఉంది...


      ఆ దృశ్యం తర్ఖడ్ కి వేయి సూర్యుల తేజస్సు బాబాపై ప్రకాశిస్తున్నట్లుగా కనిపించింది...


    వెంటనే తర్ఖడ్ జయకర్‌ని తన మనసులో ఆ దృశ్యాన్ని బంధించి.. దానిని పెయింటింగ్ వేయమని కోరారు..


     తర్ఖడ్ కోరిక ప్రకారం శ్యామారావు జయకర్ ఆ దృశ్యాన్ని యధాతధంగా అద్భుతంగా పెయింటింగ్ వేశారు..


     ఈ పెయింటింగ్ ని నిశితంగా గమనిస్తే.. బాబా ముందు నీటితో ఉన్న గంగాళా, చిన్న లోటాని చూడవచ్చు..


     ప్రస్తుతం ఈ పెయింటింగ్ ముంబై శాంతాక్రూజ్ లోని వీరేంద్ర తర్ఖడ్ (రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ మనవడు.. జ్యోతేంద్ర తర్ఖడ్ కుమారుడు..) గృహంలో ఉంది..


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹..

కాశీనాథ్ గోవిందరావు ఉపాసనీ మహారాజ్ జన్మదినం..(మే15, 1870 – డిసెంబర్ 24, 1941)

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏..



     కాశీనాథ్ గోవిందరావు ఉపాసనీ మహారాజ్ జన్మదినం..(మే15, 1870 – డిసెంబర్ 24, 1941)


  1870వ సంవత్సరంలో నాసిక్ జిల్లాలోని సాతానా గ్రామంలో సంస్కృత పండితుల కుటుంబంలో జన్మించారు. 


    తండ్రి పేరు గోవింద్ శాస్త్రి మరియు అతని తల్లి రుక్మిణి...ఐదుగురు కుమారులలో ఉపాసనీ మహరాజ్ రెండవవారు..


    ఆయుర్వేద వైద్యునిగా వృత్తిని ప్రారంభించి.. ముగ్గురు భార్యలు మరణించిన తరువాత..అనేక ఇతర సమస్యల రావడంతో..అతను సాయిబాబాను కలవడానికి దారితీసింది..


    ఉపాసని మహారాజ్ జూలై 1917లో సకోరీకి మారారు.. బాబా 71 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 24, 1941న సకోరిలో సమాధి చెందారు..


    ఉపాసనీ మహారాజ్ మెహర్ బాబాకు ప్రధాన గురువు..1915లో ఉపాసని మహరాజ్ సాయిబాబాతో షిర్డీలో ఉన్నప్పుడు మెహర్ బాబా మొదటిసారిగా ఉపాసనీ మహారాజ్‌ను కలిశారు...మెహెర్ బాబా 1922 అక్టోబరు వరకు తరచుగా సాకోరిలోనే ఉండేవారు...


      1921 చివరలో ఉపాసనీ మహారాజ్ మెహర్ బాబాకు సంబంధించి తన శిష్యులకి.."నా బాధ్యతను మెహర్వాన్జీకి ఇచ్చాను..వారిని తనలాగే గురువుగా భావించండి" అని చెప్పారు..


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹...

శ్రీ తుకారాం రాఘూజి ( శ్రీ. అప్పాసాహెబ్ బాపురావు బోరవాకే)..

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏..


శ్రీ తుకారాం రాఘూజి ( శ్రీ. అప్పాసాహెబ్ బాపురావు బోరవాకే)..



     వీరు సాయిని సశరీరంగా ఉన్నప్పుడు దర్శించలేదు..  కాలినడక షిరిడి వచ్చి అక్కడే స్థిరపడి సాయిభక్తులుగా మారి లక్షలు సంపాదించారు..


   వీరి ప్రస్తావన శ్రీ సాయి సచ్చరిత్రలో కనిపించదు... కానీ సాయి శరణానందుల వారు రచించిన "సాయి ద సూపర్ మాన్'" పుస్తకంలో వీరి ప్రస్తావన ఉంటుంది.. ఈ పుస్తకాన్ని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వారు ప్రచురించారు.. 1930లో సంస్థానవారు ప్రచురించే సాయి లీలా మ్యాగజైన్లో వీరి గురించి ప్రచురించారు..


     బాపురావు 1901వ సం:లో ససావాద్‌లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు...


     అతను పసితనంలో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయాడు.. పసితనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అతని బంధువులు ఆస్తిని కాజేసి ఒంటరిగా వదిలేశారు.. బాపురావు 10వ (SSC) తరగతి వరకు చదువుకున్న వెంటనే ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చింది.


     ఇతను 1920-21 మధ్యకాలంలో మొదటిసారిగా కేవలం మూడు అణాలను జేబులో పెట్టుకుని కాలినడకన షిర్డీకి వచ్చి... శ్రీ సాయిబాబా అనుగ్రహంతో లక్షల రూపాయలు సంపాదించాడు.


     అతనికి మామ వరస అయ్యే బంధువు షిరిడిలో ఉండడంతో.. ఏదైనా ఉపాధి దొరుకుతుంది అన్న ఆశతో షిరిడికి బయలుదేరి కోపర్ గావ్ చేరుకున్నాడు.. అప్పటికే అతని వద్ద ఉన్న డబ్బు అయిపోయి కేవలం మూడు అణాలు మాత్రమే మిగిలాయి.  మూడు అణాలకి టాంగా వ్యక్తి టాంగా ఎక్కించుకోక పోవడంతో కోపర్ గావ్ నుండి కాలినడకన షిరిడి చేరుకున్నాడు..


     షిరిడి చేరుకున్న వెంటనే.. సమాధి మందిరానికి వెళ్లి బాబాను దర్శించి నమస్కరించి.. తర్వాత తన బంధువు మామగారింటికి వెళ్లాడు.. ఆయన బాపురావుని ఆప్యాయంగా ఆహ్వానించి.. వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలాన్ని ఇచ్చాడు..


     బాపురావు అందులో చెరుకు పంట వేసి.. బాగా దిగుబడి సాధించాడు.. మరుసటి సంవత్సరం మరికొంత పొలాన్ని తీసుకొని చెరుకు పంట సాగు చేశాడు.. ఆ సంవత్సరం చెరుకుకి ఎక్కువ డిమాండ్ ఉండటంతో ధర బాగా పలికి.. వ్యవసాయం ప్రారంభించిన రెండు సంవత్సరాలకే లక్ష రూపాయలు సంపాదించాడు..


     ఇదంతా బాబా అనుగ్రహం వల్ల జరిగిందని భావించి... ప్రతిరోజు బాబాను దర్శించుకోవచ్చు అన్న సంకల్పంతో షిరిడీలోనే కొంత భూమిని కొనుగోలు చేసి.. అందులో తనకోసం ఇల్లు నిర్మించుకుని.. ఆ భూమిలోనే ఆధునిక కెనాల్ ఇరిగేషన్ టెక్నిక్ ఉపయోగించి నారింజ, బత్తాయి తోటలను వేశాడు..


    1930 సంవత్సరంలో షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు జరిగాయి.. ఆ సందర్భంగా సాయిభక్తులైన తాత్యా గణపతి కోతే పాటిల్, వామన్ మంకు, రామచంద్రదాదా, బయాజీ సఖారామ్‌తో పాటు మరికొంతమంది గ్రామస్థులకు విభేదాలు వచ్చాయి..

బాపురావు గ్రామస్తులకి సాయి భక్తులకు మధ్య సఖ్యత కుదిర్చి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరిపించారు..


    ఈ సమాచారాన్ని దాసగణు మహారాజ్ సాయి లీల మ్యాగజైన్ లో ప్రచురించారు..


    1950-54 సంవత్సరంలో బాపురావు పూర్తిగా బత్తాయి పంట సాగుపై దృష్టి పెట్టి.. ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పంటని సాగుబడి చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు..


     అప్పటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు.. ముంబై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారు.. స్వయంగా ఆయన క్షేత్రాన్ని సందర్శించి ఆయన సాధించిన విజయాన్ని చూసి ఆశ్చర్యపోయి వారిని అభినందించారు..


     1955-56 సంవత్సరంలో న్యూ ఢిల్లీలో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో అతని బత్తాయి పండ్ల స్టాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి పండ్ల విభాగంలో మొదటి బహుమతిని పొందాడు...


       బాపురావు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీగా కూడా కొన్నాళ్లు పనిచేశారు...ఇతను 1988 ఏప్రిల్ 1వ తేదీన షిర్డీలో మరణించారు...మరణించే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరాలు...


     ఇప్పటికీ షిర్డీ నుండి రహతా వెళ్లే మార్గంలో ఆయన పండ్లతోట ఉన్న బంగ్లాను చూసినప్పుడు..తనను పూర్తిగా నమ్మినవారి పట్ల బాబా దయ ఏ విధంగా ఉంటుందో?.. బంధువులు ఆస్తిని కాజేసినా.. కృషి ,పట్టుదల అన్నింటికీ మించి సాయి అనుగ్రహం ఉంటే చాలు ఏదైనా సాధించగలం అనే విషయం సాయి భక్తులకు గుర్తుకువస్తుంది...


     బాపురావు షిర్డీకి చేరినప్పటి నుండి తన పొలం నుండి  సాయిబాబా సమాధికి మరియు అబ్దుల్ బాబా సమాధికి గులాబీ పువ్వులను సమర్పించేవాడు. దాదాపు 45 సంవత్సరాల పాటు ఈ ఆచారాన్ని పాటించాడు. ఉదయం కాకడా ఆరతి, సాయంత్రం ధూప్ ఆరతికి  తప్పకుండా హాజరయ్యేవాడు...


     నేటికీ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు స్వర్గీయ బాపురావు వారసులు.. తండ్రి ప్రారంభించిన ఆచారాన్ని వదలకుండా తమ పొలం నుండి సాయిబాబా సమాధికి మరియు అబ్దుల్ బాబా సమాధికి పూలు సమర్పిస్తారు...


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏🌹...

లక్ష్మణ్ మామా జోషి అలియాస్ లక్ష్మణ్ రత్నపార్కి కుమారుడు బపాజీ రత్నపార్కి మరణించిన రోజు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 



     లక్ష్మణ్ మామా జోషి అలియాస్ లక్ష్మణ్ రత్నపార్కి కుమారుడు బపాజీ రత్నపార్కి మరణించిన రోజు..


      లక్ష్మణ్ మామా జోషి అలియాస్ లక్ష్మణ్ రత్నపార్కి కుమారుడు బపాజీ రత్నపార్కి (అధ్యాయం-43-44) మే12, 1987న కన్నుమూశారు..


     లక్ష్మణ్ రత్నపార్కి పూర్వీకులు విలువైన రాళ్లు వజ్రాలను అంచనా వేయడంలో నిపుణులు. కాబట్టే వారిని రత్నపార్కి అనే ఇంటిపేరుతో పిలిచేవారు...


     వృత్తి రీత్యా బ్రాహ్మణులు, పూజారులు. వారు షిరిడీకి వలస వెళ్లి అక్కడే తమ నివాసంగా చేసుకున్నారు. లక్ష్మణ్ మామా గ్రామ పూజారి మరియు జ్యోతిష్కుడు..శ్యామాకు మేనమామ వరుస..వీరి ఇల్లు విఠల్ మందిరం వెనుక ఉంది.


        ఒకసారి బాపాజీకి అనారోగ్యం రావడంతో రకరకాల చికిత్సలు అందించారు, కానీ ఏమీ పని చేయలేదు. చివరికి అతని తండ్రి (లక్ష్మణ్ మామా)వైద్యం కోసం బాబా వద్దకు పరుగెత్తాడు. బాబా అతనిపై గట్టిగా అరిచి... కొద్దిసేపటి తరువాత బాబానే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆశీర్వదిస్తూ తన చేతిని బాపాజీ నుదిటిపై ఉంచారు.  అతని అనారోగ్యం తగ్గటంతో.. ఈ సంఘటన బాబా పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని, భక్తిని మరింత బలపరిచింది..


         1918 అక్టోబరు 15న బాబా మహాసమాధి చెందినప్పుడు బాపాజీ ఆయనతో పాటు ద్వారకామాయిలో ఉన్నారు. బాబా ఆందోళనతో ఉన్న భక్తులను ఇంటికి పంపించారు. ఇంకా కొంతమంది భక్తులు వెనుక ఉండిపోయారు వారిలో బాపాజీ ఒకరు. 


       మరుసటిరోజు తెల్లవారుజామున లక్ష్మణ్ మామాకు బాబా కలలో తనకు కాకడా ఆరతి ఇవ్వమని చెప్పారు. బాబా ఆజ్ఞానుసారం కాకడా ఆరతికి మౌల్వీలు అడ్డు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా...ఎంతో  భక్తితో బాబా పాదాలు కడిగి, కన్నీరు కారుస్తూ ఆరతి ఇచ్చాడు. తర్వాత బాబా మూసి ఉన్న పిడికిలిని తెరిచి తన దక్షిణ, తాంబూలం ఉంచి వెళ్లిపోయాడు. (శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం- 43-44)..


       "జోషి" అనే ఇంటిపేరుతో పిలవబడే వారి కుటుంబ వారసులు.. ముని మనవలైన జగదీష్ రత్నపార్కి, వినాయక్ రత్నపార్కి ఇప్పటికీ షిర్డీలోని పాత విఠల్ మందిరం దగ్గరలోని అదే ఇంటిలో నివసిస్తున్నారు.. 


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹

1917లో జయకర్ షిరిడీకి వచ్చినప్పుడు ఈ క్రింది చిత్రపటాన్ని పెయింటింగ్ వేశారు. జయకర్ ద్వారకామాయి భంగిమను..బాబా చావడి ఊరేగింపు యొక్క ఈ చిత్రపటాన్ని బాబా అనుమతి తీసుకుని చిత్రీకరించారు..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 



  ఈ క్రింది చిత్రం ఫోటో కాదు శ్యామారావ్ జయకర్ వేసిన పెయింటింగ్..


     1917లో జయకర్ షిరిడీకి వచ్చినప్పుడు ఈ క్రింది చిత్రపటాన్ని పెయింటింగ్ వేశారు. 


    జయకర్ ద్వారకామాయి భంగిమను..బాబా చావడి ఊరేగింపు యొక్క ఈ చిత్రపటాన్ని బాబా అనుమతి తీసుకుని చిత్రీకరించారు..


 1.  ఈ కలర్ పెయింటింగ్‌లో బాబాకు  కుడి వైపున నానా సాహెబ్ నిమోంన్కర్..

  

 2.  నిమోన్కర్ వెనుక దాసగణు...

 3.   దాసగణు వెనుక బాలాషింపీ..


  4.  బాబాకు ఎడమ వైపు బూటీ..


  5.  మాల పట్టుకున్నవారు మోరేశ్వర్ ప్రధాన్..


  6.  మోరేశ్వర్ ప్రధాన్ కుమారుడు సాయినాథ్..(పూజా సామాగ్రితో ఉన్న ప్లేట్ పట్టుకున్న బాలుడు..)..


 7.  శ్యామారావ్ జయకర్ కుమారుడు..(వెండి దండం పట్టుకున్న బాలుడు..)


 8.  కుడి వైపున బాబా వెనుక కాకాసాహెబ్ దీక్షిత్..


 9.  గొడుగు పట్టుకున్నవారు భాగోజీ షిండే..


10.  బుటీ , మోరేశ్వర్ ప్రధాన్ మధ్య బాలారాం మాన్కర్..


11.  భాగోజీ షిండే వెనుక లక్ష్మీ బాయి షిండే...


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏🌹...

V.H. ఠాకూర్...శ్రీ.వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్..(శ్రీ సాయి సచ్చరిత్ర.. అధ్యాయం - 21)

 ఓం శ్రీ సాయిరాం 🙏🙏..



   V.H. ఠాకూర్...శ్రీ.వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్..(శ్రీ సాయి సచ్చరిత్ర.. అధ్యాయం - 21)


      వీరు ప్రస్తావన సాయి సచ్చరిత్ర 21వ అధ్యాయంలో వస్తుంది... తండ్రి  శ్రీ.హరిశ్చంద్ర ఠాకూర్.. పుట్టినతేదీ ఖచ్చితంగా తెలియదు..వారి వారసులు చెప్పిన దాని ప్రకారం 1865-1870 మధ్య జన్మించినట్లు చెబుతారు...


        భార్య పేరు శ్రీమతి సరస్వతి ఠాకూర్‌..రెవెన్యూ శాఖలో మామల్తదార్‌గా పని చేసేవారు...ఒకసారి సర్వే బృందంతో వడ్గామ్ అనే పట్టణానికి వచ్చాడు. అక్కడ అతను కన్నడ సాధువు అప్పాను కలుసుకుని నమస్కరించాడు. 


     ఆ సమయంలో వారు నిశ్చల్‌దాస్ రచించిన “విచార-సాగరం” అనే పుస్తకంలోని కొంత భాగాన్ని ప్రేక్షకులకు వివరిస్తున్నారు.


      ఠాకూర్ వెళ్ళబోతుంటే, అప్ప అతనితో, “నువ్వు ఈ పుస్తకాన్ని చదవాలి.. మీరు భవిష్యత్తులో మీ విధులను నిర్వర్తిస్తూ ఉత్తరాదికి వెళ్ళినప్పుడు మీరు ఒక గొప్ప సాధువును కలుసుకునే అదృష్టం వస్తుంది. అప్పుడు వారు నీకు భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తారు ”. అని అంటారు..


      కొద్ది రోజులకి అతనికి జున్నూర్‌కు బదిలీ అవుతుంది..అక్కడ అతను పని చేయడానికి ప్రతిరోజూ నాన్హేఘాట్ (కఠినమైన లోయ) దాటవలసి వచ్చేది...ఆ సమయంలో వారి వయస్సు 40సం:రాలు..


      దానిని దాటడానికి గేదె తప్ప ఇతర రవాణా సౌకర్యాలు ఏమీ ఉపయోగపడలేదు. అందువల్ల అతను ఘాట్ గుండా గేదెల సవారీ చేయాల్సి వచ్చింది..ఈ ప్రయాణం అతనికి చాలా అసౌకర్యాన్ని కలిగించింది...


         తర్వాత పదోన్నతిపై కళ్యాణ్‌కి బదిలీ అయి అక్కడ నానాసాహెబ్ చాందోర్కర్‌ను కలిశాడు. అతను చాందోర్కర్ ద్వారా సాయిబాబా గురించి విని బాబాను చూడాలని తహతహలాడాడు..


            ఒకరోజు నానాసాహెబ్ షిరిడీకి వెళుతూ.. ఠాకూర్‌ని తనతో రమ్మని అడిగాడు. ఠాకూర్ ఒక కేసు నిమిత్తం ఠాణా సివిల్ కోర్టుకు హాజరు కావాల్సి రావడంతో వెళ్ళలేకపోయాడు...  నానాసాహెబ్ ఒక్కడే షిరిడి వెళ్ళాడు. ఠాకూర్ ఠాణాకు వెళ్లగా అక్కడ కేసు వాయిదా పడిందని  తెలుసుకుని నానాసాహెబ్‌ తో షిరిడి వెళ్ళనందుకు బాధపడి..అయినప్పటికీ అతను షిరిడీకి బయలుదేరాడు.. 


     అతను షిరిడి రాగానే నానాసాహెబ్ క్రితం రోజే షిరిడీ నుండి వెళ్ళినట్లు తెలుసుకున్నాడు.. అక్కడ అతనికి పరిచయమైన  స్నేహితులు అతన్ని బాబా దగ్గరకు తీసుకెళ్లారు. అతను బాబాను చూసి పాదాలపై పడగానే ఎంతో ఆనందానికి లోనయ్యాడు.. కళ్ళు ఆనందంతో కన్నీళ్లతో నిండిపోయాయి..


        సర్వజ్ఞుడైన బాబా అతనితో .. ఈ ప్రదేశం యొక్క మార్గం అప్పాబోధనలంత సులభం కాదు..న్హానేఘాట్‌లో గేదెల స్వారీ అంత సులభం కాదు . ఈ ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టతరమైనది..


      అప్పా నీకు చెప్పింది నిజమే.. కేవలం పుస్తకాలు  చదవడం కాదు... వాటిని బాగా ఆలోచించి ఆచరణలో పెట్టాలి లేకుంటే ప్రయోజనం లేదు. గురువు అనుగ్రహం లేకుండా కేవలం పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదు.

అని బోధించారు .."విచార సాగరం" లోని అంశాలు అప్పా బోధన ద్వారా..వాటి ఆచరణ షిరిడిలో సాయి బోధనల ద్వారా తెలుసుకున్నాడు..


       వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ 1936లో  కన్నుమూశారు (మరణించిన తేదీ తెలియదు). స్వర్గీయ శ్రీ. వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ మనవడు శ్రీ. దిలీప్ శివాజీ ఠాకూర్ & అతని భార్య శ్రీమతి హేమలత దిలీప్ ఠాకూర్ పశ్చిమ ముంబైలోని థానేలో నివసిస్తున్నారు...


ఓం శ్రీ సాయిరాం🙏🙏🌹

శ్రీమతి సుందరి బాయి క్షీరసాగర్ (రాధాకృష్ణమాయి)



ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 


శ్రీమతి సుందరి బాయి క్షీరసాగర్ (రాధాకృష్ణమాయి). 


      ఈరోజు షిరిడి సంస్థానం ఒక సంస్థగా రూపుదిద్దుకున్నది అంటే దానికి ఆద్యం మూలం సుందరీబాయి.  సాయికి శేజ్ ఆరతి, కాకడాఆరతి జరుగుతున్నాయి అంటే దానికి కారణం సుందరి బాయి. బాబా చావడికి వెళ్ళేటప్పుడు సంగీత వాయిద్యాల ఘోష, గుర్రం, పల్లకీ, పతాకాలు వంటి అన్ని హంగులు, ప్రత్యేక దుస్తులు ధరించి ముందు నడిచే దండధారులు, భజన బృందాలు.. అది ఒక ఉత్సవంలా రూపుదిద్దుకోవడానికి  కారకురాలు సుందరిబాయి (రాధాకృష్ణమాయి) . ఆ రోజుల్లోనే శిరిడీ రూపురేఖలు మార్చడంలో ఆమె ఎంతగా కృషి చేసిందో స్పష్టంగా తెలుస్తుంది. 


     ఆమె 1882లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి పేరు శకుంతలాబాయి క్షీరసాగర్. ఆమె తండ్రి గురించిన సమాచారం లేదు. 1899లో ఆమెకు వివాహమైంది. విధివశాత్తూ వివాహమైన 8 వ రోజున ఆమె భర్త మరణించాడు. వితంతువైన స్త్రీ పట్ల ఆనాటి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఎంతో కఠినంగా ఉంటాయో మనకి తెలియనిది కాదు. భర్త మరణంతో కుంగిపోయిన సుందరీబాయి తన శేష జీవితాన్ని తనకి ఇష్టమైన శ్రీకృష్ణుని సేవలో గడపాలని పండరీపురం చేరుకొని అక్కడ వకీలుగా పనిచేస్తున్న తన మామగారి ఇంట్లో ఉండ సాగింది. ప్రతిరోజు ప్రాతఃకాలం స్నానం ఆచరించి రాధాకృష్ణమూర్తిని తనివి తీరా పూజించి పండరీనాథని దర్శనానికి వచ్చి కనులారా ఆ స్వామిని దర్శించి.. ఈ దీనురాలికి అనన్యమైన భక్తిని ప్రసాదించు.. నీ దివ్యచరణాలాను సేవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆర్తితో వేడుకునేది. ఆమెకు పాండురంగని పాదాల యందు భక్తి.. సంకీర్తన.. పాండురంగని అర్చన తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది.  కీర్తనలు ఆలపిస్తే ఆమె గొంతులోని మాధుర్యానికి శ్రీకృష్ణుడు సైతం పరవశించి పోవాల్సిందే.. అంత మధురంగా తుకారాం అభంగాలను ఆలపించేది. అంతటి మహా భక్తురాలు నానా సాహెబ్ ఛాందోర్కర్ ద్వారా బాబా గురించి విని 1906 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షిరిడి చేరి బాబా పాదాలు ఆశ్రయించింది. షిరిడి గ్రామం చేరగానే ఆమెకు ఆ గ్రామం మధురానగరంలా, బృందావనంలా అడుగడుగునా శ్రీకృష్ణుని రూపమే కనిపించింది. శ్రీకృష్ణుడు నివసించినది ద్వారకానగరం. బాబా నివసించిన మసీదుకు ద్వారకామాయి అని పేరు. తన పాదాలను ఆశ్రయించిన సుందరీబాయికి బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మునిలా దర్శనమిచ్చారు. 

ఆమెను ఆశీర్వదించి ఎదురుగా కనిపిస్తున్న ఒక కుటీరాన్ని చూపించి "నీవు ఆ శాలలో నివాసం ఉండవచ్చు" అని చెప్పారు. షిరిడియే తన నివాసమని సాయిబాబాయే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని, సద్గురువు అని భావించి షిరిడిలోనే నివాసం ఉండాలని నిశ్చయించుకుంది.  అందుకే సుందరిబాయి కుటీరాన్ని అందరూ శాల అని పిలిచేవారు. షిరిడి చేరుకున్నాక సుందరిబాయి నిరంతరం రాధాకృష్ణ నామాన్ని జపిస్తూ రాధాకృష్ణుల విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించేది. అందుకే షిరిడి గ్రామస్తులు రాధాకృష్ణ ఆయి అని పిలిచేవారు. అప్పటినుండి సుందరీ బాయ్ క్షీరసాగర్ పేరు రాధాకృష్ణమాయిగా పేరు స్థిరపడిపోయింది. ఆయి అంటే తల్లి అని అర్థం. బాబా మాత్రం 'రామకృష్ణీ' అని పిలిచేవారు.


       ఆమె తన శాల నుంచి బయటకి వచ్చేది కాదు. ఎప్పుడైనా రావాల్సి వస్తే ముఖానికి ముసుకు ధరించేది. ఒకసారి బాబా నీమ్ గావ్ వెళుతుంటే బాబాకి నమస్కరించాలన్న తొందరలో ముసుగు వేసుకోకుండా బాబాకి నమస్కరించింది. ఎన్నో నెలలనుంచి షిరిడీలో ఉంటున్న ఖపర్థే మొదటిసారిగా రాధాకృష్ణమాయిని ముసుగు లేకుండా చూశాను అని తన డైరీలో రాసుకున్నారు. 

బాబా లెండితోటకి.. చావడికి.. మసీదుకి నడిచే దారిని బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండేవాడు. నేవాస్కర్ చేసే ఆ పనిలో రాధాకృష్ణమాయి సహాయం చేయడం ప్రారంభించి, అతను మరణించాక ఆ పనిని తానే పూర్తిగా చేయడం ప్రారంభించింది. బాబా ప్రతి రోజు లెండితోటకి వెళుతుండేవారు. ఆ సమయంలో బాబాకి ఎండ తగలకూడదని తోటి భక్తులతో కలసి దారి పొడవునా వంపుగా ఉండే ఇనుప స్తంభాలు పాతించి వాటికి ఇనుప తీగలు బిగించి వాటి మీదకి పూలచెట్ల తీగలు అల్లుకునేలా స్తంభాలకి ఇరువైపులా చెట్లు నాటించేది. ప్రతినిత్యం వాటికి నీరు పెట్టి వాటి నిర్వహణ బాధ్యత జాగ్రత్తగా చూసేది. తన చేసే పని యందు ఎంత శ్రద్ధ అంటే బాబా నడిచేదారులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి వాటి మీద తన అడుగులు కూడా పడకుండా జాగ్రత్త పడేది. 


    ఆమె నిత్యం బాబా సేవలో గడపడమే కాక సాటి భక్తులను కూడా సేవలో పాల్గొనేలా ప్రోత్సహించేది. ప్రతినిత్యం చేసే సేవే కాకుండా పర్వదినాల్లో  మసీదుని శుభ్రపరచడం.. రంగురంగుల కాగితాలలో పువ్వులు జెండాలు తయారు చేయడం... షిరిడీకి వచ్చే ఉత్సవ పతకాలను ఇది శుభ్రపరచడం.. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మసీదులో ఉయ్యాల ఏర్పాటు చేయడం... గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మ దినోత్సవ వేడుకకి ఏర్పాట్లు చేయడం.. హరిదాసుల భగవత్ సంకీర్తనకు అవసరమైన ఏర్పాట్లు.. ఆ సందర్భంగా తన ఇంటిలో విపరీతంగా మిఠాయిలు వండడం ఈ బాధ్యతలన్నీ ఆమె ఇతర భక్తులతో సాయంతో నెరవేర్చేది.



రాధాకృష్ణమాయి కొన్ని సేవలలో సాటి భక్తుల సహాయం తీసుకున్న.. కొన్ని పనులు మాత్రం తను ఒక్కతే నిర్వర్తించేది ఆ పనులలో ఎవరిని జోక్యం చేసుకోనిచ్చేది కాదు. మసీదులో రెండు మట్టి కుండలు ఉండేవి ఆ కుండలలో నీరు ఎప్పుడూ నిండుగా ఉండేది. వాటిని ఎవరు ఎప్పుడు నింపుతున్నారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. దీక్షిత్ వాడా వెనుక ఒక బావి ఉండేది. ఆ బావి నుండి అర్ధరాత్రి మూడు గంటలకు రాధాకృష్ణమాయి నీళ్లు తీసుకుని వచ్చి మసీదులో కుండలు నింపేది. ఈ సంఘటనని తాను స్వయంగా చూసినట్లుగా వామనరావు పటేల్ (సాయి శరణానంద) తన రచనలలో వ్రాసుకున్నారు.  షిరిడి గ్రామస్తులే కాక సాయిని దర్శించుకున్న భక్తులు.. బూటీ..రేగే.. ఖపర్థే మొదలగువారు ఆమెని ఎంతగానో గౌరవించేవారు. 

      1914వ సంవత్సరం గురుపౌర్ణమి వేడుకల కోసం రాధాకృష్ణమాయ ఇంటిలో వంట కార్యక్రమం జరుగుతున్నప్పుడు మసాలా దినుసులు నూరటం కోసం వంటవారు ఒక రోలుని అడిగారు. రోలుని వంట వారి దగ్గరకు చేర్చే ప్రయత్నంలో.. M.B.రేగేగారు, రాధాకృష్ణమాయి ఇద్దరూ కలిసి రోలుని కొంత దూరం కదిలించారు.  మధ్యలో పురందరే వచ్చి సాయం చేశారు.. రోలుని కదిలించే సమయంలో రోలు పొరపాటున ఒక ప్రక్కకి ఒరిగి పురందరేగారి వేలు నలిగే పరిస్థితి వచ్చింది. వెంటనే రాధాకృష్ణమాయి ఒడుపుగా దినిని తన వైపు త్రిప్పుకుంది. ఆమె కుడిచేతి చూపుడు వేలు రెండు ముక్కలయినట్లుగా నలిగిపోయింది. అంత బాధని ఓర్చుకుని రక్తం కారుతున్న వేలుకి నూనె తడిపిన ఒక వస్త్రం చుట్టి.. వంటలో సాయం చేయటానికి వెళ్లి.. వంట అంతా పూర్తయ్యాక రేగే గారిని పిలిచి.. "నొప్పి చాలా ఎక్కువగా ఉంది. తోటలోకి వెళ్లి ఏడవాలని ఉంది!" అని చెప్పింది. ఇద్దరి తోటలోకి వెళ్ళగా అరగంటపాటు కూర్చొని తనివి తీరా ఏడ్చింది. 


     షిరిడిలో నిత్యం జరిగే సేవలలోను పర్వదినాల్లో జరిగే విశేష కరమైన సేవలలోను.. ప్రతి కార్యక్రమంలోనూ రాధాకృష్ణమాయి యొక్క కృషి స్పష్టంగా  కనిపిస్తుంది..

      

      రాధాకృష్ణమాయి ఒక గంట ఒక రోజు వారం రోజులు కాదు దాదాపు తొమ్మిది సంవత్సరాలు (బ్రతికి ఉన్నంతవరకు) ప్రతినిత్యం రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు అనే ఊసే లేకుండా భక్తితో శ్రద్ధతో ప్రతి సేవ త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణా చేసే సేవ యందు లగ్నం చేసి ధన్యురాలయింది..


      రాధాకృష్ణమాయి 1916లో 35 సంవత్సరాల వయస్సులో మరణించింది..

    

    (శ్రీ బి.వి. నరసింహ స్వామిజీ గారి భక్తుల అనుభవాలు ఆధారంగా..)


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹