Monday, May 13, 2024

1936లో బి.వి.నరసింహస్వామిగారితో జయకర్ పంచుకున్న అనుభవాలు::::;

 1936లో బి.వి.నరసింహస్వామిగారితో జయకర్ పంచుకున్న అనుభవాలు::::;


1916-17 లేదా అంతకుముందు నేను శిరిడీ వెళ్ళినప్పుడు ఇతర భక్తులతో కలిసి ఉండేవాడిని. వాళ్ళంతా శిరిడీ విడిచి వెళ్ళిపోయినప్పటికీ నేను అక్కడే ఉండేవాడిని. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వచ్చేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడుగుతుండేవారు, నేను సమర్పిస్తుండేవాడిని. ఇతర భక్తులు వెళ్లిపోయిన తరువాత నా వద్ద  డబ్బులుండేవి కావు, బాబా కూడా నన్ను దక్షిణను అడిగేవారు కాదు. నా పరిస్థితి గురించి నేను బాబాకు చెప్పకపోయినా ఆయనకు తెలుసు.


నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత ఒక సన్యాసి దానికి ఒక శక్తిమంత్రాన్ని జోడించి ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికే ఈ మంత్రోపదేశాలు జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరికీ వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ ఉండమని (జో కరీత్ ఆలే తోచ్ కరా) సలహా ఇస్తుండేవారు. బాబా తన భక్తులకు నైతిక విలువల గురించి బోధిస్తుండేవారు. ఉదాహరణకు, “పవిత్రంగా ఉండండి, సత్యాన్ని అంటిపెట్టుకోండి, నిజాయితీగా ఉండండి, అందరినీ సమదృష్టితో చూడండి" అని చెప్పేవారు.


నాకు శిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. నేను రాధాకృష్ణఆయీ వద్దకు ఎప్పుడూ వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం రాలేదు. నాకు నానావలి తెలుసు. అతనొక ప్రమాదకరమైన వ్యక్తి. అతనితో సహవాసం చేయవద్దని బాబా నాతో చెప్పారు. మొదట్లో నేను, డాక్టర్ పిళ్ళై నానావలితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావలి డాక్టర్ పిళ్ళైని కొట్టాడు. అప్పటినుండి మేమిరువురం అతని సహవాసాన్ని విడిచిపెట్టాము. నానావలి బాబాను ఆరాధించలేదు, కానీ మర్యాదపూర్వకంగా చూసేవాడు. బాబా అతన్ని కొట్టి, దుశ్చేష్టలు మానమని హెచ్చరించేవారు.


నేను శిరిడీలో గడిపిన ఎనిమిదినెలల కాలంలో బాబా నోటిగుండా చాలా గోష్ఠులు(చర్చలు), సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ, నాకు అవేవీ గుర్తులేదు. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి చెప్పలేదు. ఆరోగ్యం, సంపద మొదలైన ప్రాపంచిక విషయాలను ఆశించే ప్రజలు బాబా వద్దకు వచ్చేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు.


బాబా కృపాదృష్టి ఎప్పుడూ నామీద ఉన్నందువలన నేను సంతృప్తిగా ఉండేవాడిని. నేను నా సంతానంలో ఇద్దరిని కోల్పోయాను. అయినా బాబా మా కుటుంబాన్ని క్షేమంగా ఉండేలా చూశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బును ఇచ్చినప్పటికీ, మనం డబ్బుని మాత్రమే ఆశించి వారి వద్దకు వెళ్ళకూడదు. బాబా తరచూ తమ మసీదు గోడలు బంగారంతో చేసినవని, ప్రజలు వచ్చి ఆ సంపదనంతా బండ్లలో నింపుకొని తీసుకుపోవాలని అనేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని విచారాన్ని వ్యక్తపరిచేవారు.


బాబా నాపట్ల ఎంతో దయ చూపేవారు. కానీ, బాబాతోపాటు అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను విచిత్ర స్వభావం కలవాడిని, ఏ పనీ సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు.


ఒకసారి నేను వెండి పాదుకలు తయారుచేయించి, వాటిని బాబా హస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని ఆశపడ్డాను. చిన్న పాదుకల జతను తయారుచేయించి, బాబా వద్దకు తీసుకొని వెళ్ళాను. బాబా నన్ను, నా చేతిలో ఉన్న పాదుకలను చూశారు. ఆయన వాటిని అందుకొని తిరిగి ఇచ్చే సమయంలో తమ అరచేతులను కాస్త క్రిందికి వాలుగా వంచారు. అవి క్రింద పడిపోయాయి. నేను వాటిని పూజించదలచి తీసుకున్నాను. అదేరోజు సాయంత్రం నేను నా మాసిన బట్టలను చాకలికి వేస్తూ, వెండి పాదుకలు ఉన్న చొక్కాను కూడా వేశాను. ఇక అవి నా దగ్గరకు తిరిగి రాలేదు. నా నిర్లక్ష్య ధోరణివల్ల నేను పాదుకలను కోల్పోయాను. నేనెలాగూ పోగొట్టుకుంటానని బాబాకు తెలుసు గనుక పాదుకలను పూజించుకొనేందుకు నేరుగా నా చేతుల్లోకి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు.


ఒకసారి నేను సంతానంలేని చాలా ధనవంతురాలైన ఒక మహమ్మదీయ ఘోషాస్త్రీకి నాలుగువేల రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది ఎనిమిదిమంది కుమారులున్న పెద్ద కుటుంబమైనందున ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడం నాకు తప్పనిసరైంది. కానీ, ఆమె ఎంతకూ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఆ డబ్బు తిరిగి వసూలు చేసుకోవడంలో బాబా నాకు దయతో సహాయం చేస్తారన్న ఆశతో నేను బాబా వద్దకు వెళ్ళాను. కానీ బాబా నాతో, “ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే!(ఆపల్యాల తే హరా మాచే నకో)" అని అన్నారు. నేను నా డబ్బు తిరిగి పొందలేదు. రెండు, మూడు సంవత్సరాల తరువాత ఆ స్త్రీ తన సంపద మొత్తాన్ని కోల్పోయిందని నాకు తెలిసింది.


నేను బాబాను దర్శించినప్పటినుండి ఆయన ఫోటోను ఎల్లప్పుడూ నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా బాబా నా వెంటే వుంటూ నన్ను, నా కుటుంబాన్ని అనూహ్యరీతిన కాపాడుతుండేవారు. అందుకు సంబంధించిన కొన్ని సందర్భాలను చెప్తాను.

No comments:

Post a Comment