Monday, May 13, 2024

JAYAKAR BABA LEELAS

 1916లో నేను నా కుటుంబంతో ముగాబత్(బొంబాయి)లోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాను. ఇంట్లోని ఒక గదిలో బాబా పటం ఉంది. ఒకరోజు రాత్రి తెల్లవారుఝామున 2 గంటల సమయంలో దొంగలు ఆ గది కిటికీకున్న రెండు ఊచలను వంచి తీసివేసి, ఆ సందుగుండా లోపలికి ప్రవేశించి, ఇల్లంతా దోచుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిరోజూ వేకువఝామున 4 గంటలకు లేచి, ఇంటి చుట్టూ తిరిగి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు. కానీ ఆరోజు ఎందుకో చాలా విచిత్రంగా ఎటువంటి కారణం లేకుండానే అతను తెల్లవారుఝామున 2 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగాడు. అతన్ని చూసిన దొంగలు పరుగుపెట్టారు. అతను వారిని చూసి 'దొంగలు, దొంగలు' అని పెద్దగా అరవడంతో మేమందరం లేచాము. దొంగలు ఇంటిలోకి దూరకుండా సరైన సమయానికి మమ్మల్ని లేపి, మా ఇల్లు దోచుకొనబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమంతా అనుకున్నాము.


1917లో నేను నా కుటుంబంతో పూనాలో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంట్లో నివసిస్తున్నాను. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. పైకప్పు నుండి దుమ్ము పడకుండా పైకప్పు క్రిందభాగంలో ఒక వస్త్రాన్ని అంటించిపెట్టాము. ఒకరోజు రాత్రి బాబా చిత్రపటం ఉన్న గదిలో, పటానికి ముందుగా ఒక కిరోసిన్ లాంతరు వెలుగుతోంది. అక్కడికి సమీపంలో సంవత్సరం వయస్సున్న నా బిడ్డ నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా "డబ్" మనే పెద్ద శబ్దం  వినిపించి, మాకు మెలకువ వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్లి చూస్తే, పైకప్పు వస్త్రం పడిపోయివుంది. శిథిలమైన గోడల తాలూకు ఇటుకలు వస్త్రంపై పడటంతో వస్త్రంతోపాటు అవి నేలమీదకు వచ్చి పడ్డాయి. నిజానికి పైకప్పు కింద ఉన్న వస్త్రం రాళ్లతోపాటు పడినందున బాబా ఫోటో ముందు కాకపోయినా బిడ్డమీద గాని, లాంతరుమీదగాని పడివుండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. వస్త్రంతో ఉన్న ఆ రాళ్లు పిల్లవాడికి, లాంతరుకు అడుగు దూరంలో పడ్డాయి. బిడ్డపై పడివుంటే, బిడ్డ నలిగిపోయి ఉండేవాడు. లాంతరు మీద పడినా అగ్ని ప్రమాదానికి  దారితీసేది. ఇవేమీ జరగకుండా బాబా మమ్మల్ని కాపాడారు.


1917లో నేను నా కుటుంబంతోపాటు శిరిడీ వెళ్లి, 10 నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు మేము బాలాభావ్(శారదాబాయి) ఇంట్లో ఉన్నాము. మేము ఉంటున్న ఆ చిన్నవాటాలోని ఒక రంధ్రంలో ఒక పాము ఉండేది. అందువలన మేము ప్రమాదంలో ఉన్నామనే భయం మమ్మల్ని వెంటాడుతుండేది. ఒక రాత్రి ఆ రంధ్రం నుండి పాము బయటకు రావడాన్ని నా కొడుకు, మరికొంతమంది చూసి దాన్ని చంపేశారు.


1923లో పదేళ్ల వయసున్న నా కొడుకు సురేంద్రకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. తను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా తన కడుపులోని వాయువు ఛాతీభాగానికి, గుండెవైపుకు ఎగదన్ని ఒత్తిడి చేసింది. పిల్లవాడు ఆ బాధను తట్టుకోలేక, "కాపాడండి, కాపాడండి" అని అరిచాడు. టైఫాయిడ్ కారణంగా తను చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ స్థితిలో తనని తాకడానికిగానీ, మర్దన చేయడానికిగానీ నాకు భయమేసి, వాడికెలాంటి సహాయం చేయలేక బిగ్గరగా 'బాబా' అని అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గింది.


ఆధ్యాత్మిక విషయంలో నేరుగా సలహాల రూపంలో, దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలో బాబా నాకు సహాయం అందించేవారు. ఒకసారి ఆయన, "నీవెంత నాటుతావో, అంతే ఫలితాన్ని పొందుతావు" అని చెప్పారు. మరో సందర్భంలో బాబా నావైపు చూస్తూ, "మనం గురువును సేవించాలి(గురూ సేవా కరావీ)" అన్నారు. ఆయన నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. కానీ నేను అంతకుముందే, అంటే నా ఇరవయ్యవ ఏట ఒక గురువు నుండి ఉపదేశం పొంది, వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాలపరిమితి కంటే ఎక్కువకాలమే ఆ మంత్రాన్ని జపించాను.


బాబా బోధనలు ఎక్కువగా నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి ఉండేవి. ఒకసారి బాబా భక్తులతో, "ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. వారిని, వీరిని ప్రశ్నించి, వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడం వలన ప్రయోజనమేముంది? (ఆప్ లా ఆపన్ హోఉన్ పహానా త్యాలావిచారణాయాత్ కాయ్ అర్థ్ ఆహే)" అన్నారు. ఆ సమయంలో భక్తులలో ఒకరు ఇతరులను, 'బాబా ఒక సిద్ధుడా? లేక అవతార పురుషుడా?' వంటి ప్రశ్నలు అడుగుతుండేవాడు. బాబాని స్వయంగా దర్శించి, వారితో సంబంధమేర్పరుచుకొని స్వయంగా తమంతట తామే నిర్ధారించుకునే అవకాశమున్నపుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవడాన్ని బాబా నిరసించేవారు.


ఒకసారి బాబాకు అత్యంత విధేయుడిగా ప్రసిద్ధి చెందిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒక వ్యాఖ్య చేశారు. ఒకరోజు బాబా దీక్షిత్‌ను పిలిచి 30 రూపాయల దక్షిణ అడిగారు. అతడు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అప్పుడు బాబా, 'బాపూసాహెబ్ జోగ్ వద్దకు వెళ్లి అతనినడిగి ఆ డబ్బు తీసుకొని రమ్మ'న్నారు. దీక్షిత్ ఇంకా మసీదు ప్రాంగణమైనా దాటకముందే, బాబా అతన్ని ఉద్దేశిస్తూ, "నిలకడలేని మనిషి" అని అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతివిషయంలోనూ నేరుగా బాబాను సంప్రదించి, ఆయన సలహామేరకు నడుచుకోవడానికి బదులుగా తన పాత అలవాటు ప్రకారం బాబా గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా సాయి సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది.

No comments:

Post a Comment