బాబా తన అంతర్యామిత్వం గురించి తెలియజేయడం ద్వారా నా విశ్వాసాన్ని బలపరిచిన సంఘటనలు:
ఒకసారి నేను బాబా ముందు కూర్చొని ఉన్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్‌కర్ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో నా జేబులో 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంటిఖర్చులకు నా వద్ద ఉన్న డబ్బు అదే. బాబా నాతో, "మాలా చార్ ద్యావే" అని అడిగారు. వారు అన్నది నాకు స్పష్టంగా అర్థంకాక, ఆయన 'రూపాయా' అన్నట్లు అనుమానపడ్డాను. దాంతో ఆయన నాలుగు రూపాయలు దక్షిణ ఇమ్మని అడుగుతున్నారని తలచి, నేను నా జేబులో ఉన్న మూడు రూపాయలు తీసి ఆయన ముందు ఉంచాను. దీక్షిత్, "నాలుగు అడిగితే, మూడు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు?" అన్న భావంతో నా వైపు సందేహంగా చూశాడు. వెంటనే బాబా, "నాలుగు ఎక్కడివి? ఉన్నవి మూడే" అని అన్నారు. దీనినిబట్టి నా జేబులో ఉన్న డబ్బు ఖచ్చితంగా మూడు రూపాయలు మాత్రమేనని ఆయనకు తెలుసని అనుకున్నాను. అంతేకాక నా పరిస్థితులన్నీ ఆయనకు తెలుసునని గ్రహించాను. బాబా నాలుగు రూపాయలు అడగడంలో ఉద్దేశ్యం, నేను విధికి తలవంచి, ఆయనపై విశ్వాసంతో డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారంవేసి అన్నీ ఆయనే చూసుకుంటారని, అవసరమైనప్పుడు మన పరిస్థితులను చక్కబరుస్తారని నమ్మకం మనకు కలిగితే, మన దగ్గరున్న డబ్బంతా చివరిపైసాతో సహా ఆయనకు సంతోషంగా సమర్పించగలుగుతాము.
ఒకసారి బాబా నా వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి, కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయస్థితిలో నిలబెట్టిన మరో సంఘటనను ఇప్పుడు వివరిస్తాను. 1917వ సంవత్సరం, ఆషాఢమాసంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్నచోటుకు 20 అడుగుల దూరంలో సభామంటపంలో నేను కూర్చొని ఉన్నాను. వర్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతడు మసీదులో "సత్యనారాయణ పూజ" చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతి ఇచ్చారు. అతడు తన వద్ద పూజ చేయడానికి అవసరమైన డబ్బులు లేవని చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు వేలు చూపిస్తూ వర్డేతో, "వెళ్లి అతనిని అడుగు" అని చెప్పారు. వర్డే నా వద్దకు వచ్చి, సత్యనారాయణ పూజకు అవసరమైన డబ్బులు నా నుండి తీసుకోమని బాబా చెప్పారని చెప్పాడు. నాకు వర్డే బాబా భక్తుడిగా మాత్రమే తెలుసుగానీ, మరేవిధమైన పరిచయం అతనితో నాకు లేదు. కానీ, అతడు బాబా నా నుండి డబ్బు తీసుకోమని చెప్పారని చెప్పినందువల్ల నేను డబ్బు ఇచ్చేందుకు అంగీకరించి, "ఎంత అవసరముంటుంద"ని అడిగాను. అతడు కేవలం 2 రూపాయల, 5 అణాలవుతుందని బదులిచ్చాడు. నా జేబులో ఉన్న మొత్తం డబ్భు కూడా సరిగ్గా అతను అడిగినంతే! అలా నా వద్ద ఉన్న డబ్బంతా అడగటం బాబా లీలగా నేను భావించి, అతనికి 2 రూపాయల, 5 అణాలు ఇచ్చాను.
వర్డే వెళ్లి పూజకు అవసరమైన సామాగ్రిని కొని తెచ్చి, అన్ని ఏర్పాట్లు చేశాడు. అతను బాబాను సత్యనారాణస్వామిగా భావించి, రెండువైపులా చిన్న అరటి పిలకలు పెట్టి, మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా అలా చేయడానికి అభ్యంతరం తెలిపి, "అరటి పిలకల మధ్య ఎప్పుడూ సాధారణంగా పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టుకొని వాటినే పూజించమ"ని ఆదేశించారు. కానీ వర్డే, మిగతా భక్తులు 'బాబానే సత్యనారాయణస్వామిగా ఉండమ'ని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అంగీకరించారు.
తరువాత సత్యనారాయణస్వామి కథా పఠనం క్రింది మంటపములో మొదలయింది. నేను మసీదులోనే ఒకరిద్దరితో కలిసి బాబా ప్రక్కనే కూర్చొని ఉన్నాను. కొన్ని క్షణాల్లో నా మనస్సులో ఆందోళన మొదలై, అది మానసిక సంఘర్షణగా మారింది. ఒకవైపు నాకు సత్యనారాయణ కథ వినాలని చాలా ఆసక్తిగా ఉంది. మరోవైపు బాబా ప్రత్యక్షసన్నిధి - ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారికన్నా ఎత్తులో కూర్చొని ఆ కథ వినడం భావ్యం కాదు. ఏమి చేయాలో అర్థంకాని సందిగ్ధంలో నేను చాలా మధనపడుతున్నాను. బాబా నా మనస్సులోని సంఘర్షణను పసిగట్టి అకస్మాత్తుగా నాతో, "దిగివెళ్లి అక్కడ కూర్చో!" అని ఆదేశించారు. బాబా చూపిన ఆ స్థలం పూజారికి సమీపంలోనూ, తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో బాబా నాకు పరిష్కారాన్ని చూపించారు.
అకారణంగా హింసింపబడే మూగజీవుల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకరమైన రుగ్మతలను తమ అద్భుతశక్తితో నివారించి, వాటికీ ఆశ్రయమిచ్చి రక్షిస్తారని నిర్ధారించే ఒక సంఘటనను నేనిప్పుడు చెప్తాను.
ఒకరోజు నేను దీక్షిత్‌వాడా వరండాలో ఉన్నాను. అప్పుడొక వింత దృశ్యాన్ని నేను చూశాను. ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల, పెద్ద కుక్కలను తరుముతోంది. చిన్న కుక్కపిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కొంతమంది గ్రామస్తులు చిన్న కుక్కపిల్లను చంపాలని చేత కర్రలు పట్టుకొని దాని వెంటపడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. అంతలో ఆ కుక్కను తరుముతున్నవాళ్ళు కూడా అక్కడికి వచ్చారు.
ఆ కుక్కపిల్ల పరుగెత్తుకుంటూ మసీదు మెట్లెక్కి బాబా వెనుకకు వెళ్లి దాగింది. బాబాను శరణుజొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు ఆయన వద్ద తనపై దాడి చేసే ధైర్యం చేయరని దానికి అనిపించినట్లుంది. అదే నిజమని నిరూపణ అయ్యింది. దానిని తరుముతున్న గ్రామస్థులు దూరంగా నిలబడి ఆ కుక్కపిల్ల బయటకు వస్తే దాన్ని చంపాలని వేచివున్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ వాళ్ళు, ఆ కుక్క పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని అన్నారు. బాబా వారిని మరింత తీవ్రంగా తిట్టి అక్కడనుండి దూరంగా వెళ్లిపొమ్మని అన్నారు. నేను, డాక్టర్ పిళ్ళై మసీదులో బాబా వద్దే ఉన్నాము. ఆ కుక్కవలన మాకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్థులు వెళ్లిపోవడంతో ఆ కుక్క బాబా చేత రక్షించబడింది. బాబా ఆ కుక్క పిచ్చిని నయం చేసి, దాని ప్రాణాలను కాపాడినట్లు నేను పిళ్లైతో అన్నాను. కుక్క పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు.
No comments:
Post a Comment