*" మంగళవేధలో దామాజీ, సజ్జనఘడ్ లో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాధుడు వెలిశారు అంటారు శ్రీసాయి సచ్చరిత్ర రచయిత శ్రీ హేమాడ్ పంత్.*
*( శ్రీ సాయిసచ్చరిత్ర నాల్గవ అధ్యాయము )*
*శ్రీ సాయిసచ్చరిత్రలో చోటుచేసుకున్న ఈ విశిష్ట పురుషుడు దామాజీ ఎవరు ?*
*బీదరు నవాబు కొలువులో శిస్తు వసూలుచేసే అధికారి దామాజీ.*
*అతడు పాండురంగ భక్తుడు. అతిధి సత్కారాలు చేసెడివాడు.*
*ఒకసారి పండరీపురంలో కరువు వచ్చింది. కొందరికి మంగళవేధలోని దామాజీ దాతృత్వం తెలిసింది. కొందరు ఆయన వద్దకి వెళ్లారు.*
*ఆకలితో నకనకలాడుతున్నవారి దుర్భర పరిస్థితి దామాజీకి కంటతడి పెట్టించింది వచ్చినవారిలో పాండురంగడే కనిపించాడు.*
*దామాజీ ధాన్యపు గిడ్డంగులకు అధికారి.*
*కానీ నవాబు ఆజ్ఞ లేకుండా ధాన్యాన్ని, బియ్యాన్నీ ఎవరికీ ఇవ్వలేడు.*
*రాజ శాసనమా ? మానవ, ధర్మమా ? దేనిని పాటించాలి ? రాజాజ్ఞ లేకుండా బియ్యాన్ని ఆకలిగొన్నవారికి ఇస్తే నవాబు శిరచ్ఛేదం చేయిస్తాడు.*
*కానీ జీవచ్ఛవాలుగా ఎందరో తన ఎదురుగా ఆకలితో ఉన్నారు. తన ప్రాణం కోసం వీరందరినీ ఆకలితో చంపాలి.*
*ఆకలిగొన్నవారికి ఆహారము ఇవ్వడమే ధర్మమని భావించిన దామాజీ, ఆయన భార్యా అయిన సావిత్రి, కలసి ఆహారపు గిడ్డంగులు తెరచి ధాన్యాన్ని, బియ్యాన్ని ఇచ్చివేశారు. అందరూ సంతోషముగా ధాన్యంతో, బియ్యంతో కదలి వెల్లిపోయారు.*
*అయితే అదే ఊర్లో ఉన్న కృష్ణ మజుందార్ అనే వ్యక్తి ఈ విషయాన్ని బీదరు నవాబుకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా రాజ భటులు వచ్చారు. దామాజీ వారివెంట నిస్సంకోచంగా వెళ్లాడు.*
*దామాజీ ఆ రాజభటులను ఒక కొరిక కోరాడు. తనను పండరీపురంలోని పాండురంగ మందిరానికి తీసుకుపొమ్మన్నాడు. వారు దానికి అంగీకరించారు.*
*దామాజీ పాండురంగని దర్శనం చేసుకున్నాడు. తనని కాపాడమని కోరలేదు.*
*లౌకిక నేరానికి శిక్ష అనుభవించడానికి నవాబు వద్దకి వెళ్లాడు.*
*దామాజీని చూసి బీదరు నవాబు ఆశ్చర్యపోయాడు.*
*అతడు దామాజీతో*
*" దామాజీ ! చాలా సంతోషం ! మన గిడ్డంగుల లోని ధాన్యాన్ని, బియ్యాన్ని ఎక్కువ ధరకు అమ్మి, మొత్తం, ధనాన్ని నీ సేవకుడైన విఠల్ కు ఇచ్చి పంపావు గదా ! మరలా నావద్దకు ఎందుకొచ్చావు ?" అని ప్రశ్నించాడు.*
*దామాజీ నవాబుతో "తనకు ఆ పేరుగల సేవకుఁడు ఎవ్వరూ లేరని, ఆ పండరీనాధుడే అలా విఠల్ పేరుతో వచ్చి, ధనాన్ని ఇచ్చి కాపాడారని దామాజీ చెప్పగా, తనకు ఫిర్యాదు చేసిన కృష్ణమజుందార్ ను శిక్షిస్తానని అంటాడు నవాబు కృష్ణమజుందార్ దుర్మార్గుడైనా అతనిలో కూడా పాండురంగడు ఉన్నాడనీ, ఆతనిని శిక్షించవద్దని దామాజీ నవాబును కోరుతాడు.*
*దామాజీ భక్తి తత్వాన్ని గుర్తించి నవాబు మంగళవేధ గ్రామాన్ని ఈనాముగా ఇస్తానని అంటాడు. తనకు పాండురంగని సేవలో జీవితము గడపాలని వుందని చెప్తాడు దామాజీ.*
*దామాజీ సావిత్రిబాయి దంపతులు పండరీనాధుణ్ణి తమ జీవితాంతం ఆనందంతో సేవించి, తరించి ఆ పాండురంగనిలో ఐక్యమయిపోయారు.*
*పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి*
*రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి.*
*
No comments:
Post a Comment