Tuesday, May 14, 2024

ఉపాసనీ బాబా యొక్క జన్మనామం "కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసని.

 *ఉపాసని మహారాజ్ గారి పుణ్య తిథి*



*ఉపాసనీ బాబా యొక్క జన్మనామం "కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసని.*

 

*ఆయన భారతదేశం లోని సకోరి లో నివసించారు. ఆయన షిర్డీ సాయిబాబా నుండి జీవన్ముక్తి పొందారని ప్రతీది. ఆయన షిర్డీ కి ఐదు కిలోమీటర్ల దూరంలో గల మహారాష్ట్ర రాష్ట్ర జిల్లా యిన అహ్మద్ నగర్ కు చెందినవారు.*


*ఉపాసని మహారాజ్*


*జననం మే 15, 1870 సత్నా, మహారాష్ట్ర, భారతదేశం. మరణం 1941 డిసెంబరు 24 (వయసు 71)*


*ఆయన పాండిత్యానికి, భక్తికీ ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 15, 1870 న సట్నాలో జన్మించాడు కాశీనాథ్.* 


*బడి చదువులు విడచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక గూడ అతనిలో మార్పేలేదు.*


*సరికదా ఒకనాడు ఇల్లు విడచి కాలినడకన నాసిక్ చేరాడు.*


*రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి, తిరిగివచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లీ మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి, ఎన్నో కష్టాలోర్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు.*

 *తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండమీద గుహ కన్పించింది.*


 *అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలచి ఒక పెద్దచెటు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపంచేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయాడు.*


 *ఒకనాడు మెలకువ వచ్చినపుడు ఒక దివ్యదర్శనమైంది. ప్రక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూలేరు.* *మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది. ప్రక్కనే వాననీరు చిన్న మడుగుకట్టివుంటే త్రాగి, వాటితో శరీరం తుడుచుకున్నాడు. నాల్గవరోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరకెడుతున్నాడు.*


*తనకొక వైపు ఒక ముస్లిం సాధువు, మరోవైపాక సన్యాసి వున్నారు.*

 *వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి, లోపల బంగారం వంటి దేహమతనికి చూపి, "ఎందుకు చావయత్నిస్తావ్? మేము నిన్నెన్నటికీ చావనివ్వము!" అన్నారు. అప్పుడతడు గుహ నుండి దిగి, జూలై 22, 1890న ఇల్లు చేరాడు.* *ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో వున్నట్లు తెలుసుకొన్నాడు.*


*ఒక సం. లోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు.*


 *కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆదుకున్నారు.*


 *తర్వాత అతడు వైద్యమభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. గాని వ్యాపారంలో అంతా నష్టపోయాడు.*


 *బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు.* 


*ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలోనుండగా భార్య భయపడి నీరుచల్లి మేల్కొలిపింది. అప్పటినుండి అతనికి గాలి పీల్చడమెంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది ఏ వైద్యానికీ ఆ బాధతగ్గలేదు.*


 *చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూరులే తొలగించగలరని తలచి, భార్యను ఇంట వదలి, 1911లో అట్టివారిని వెదుకుతూ బయలుదేరాడు కాశీనాథ్.*


 *అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, "నీవు మంచి స్థితిలో వున్నావు. నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు" అన్నారు. కాని, సాయి "ముస్లిమ్" అని తలచి, వారిని దర్శించలేదు కాశీనాథ్.*

 *తర్వాత దారిలో ఒక వృద్దుడు కన్పించి, "చన్నీరు త్రాగవద్దు, వేడినీరు మాత్రమే త్రాగు!" అని చెప్పాడు.* *అతడా మాట లెక్కపెట్టక, వేరొకచోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తూంటే ఆ వృదుడే మళ్ళీ ఎదురై మందలించి, ప్రక్క గ్రామంలో వేడినీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు!* *కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలావరకు తగ్గింది.* *తర్వాత అతడు ఖేడ్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహరాజ్ ను దర్శించాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, "నీవు లోపల, బయట బంగారం పూసినట్టు, మంచి యోగస్థితిలో వున్నావు. నీవు కోరదగినదేమీ లేదు" అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే యిచ్చాడు.* 


*గత్యంతరంలేక జూన్ 27, 1911 న శిరిడీ చేరాడు కాశినాథ్.*


*రెండు రోజులు సాయి సన్నిధిలో వుండడంతోనే అతని బాధ మటుమాయమైంది! అయినా అతనికి 'ఫకీరు' సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు.*

 *"నీవు వెళ్ళిద్దు, వెడితే 8వ రోజుకు రావాలి!" అన్నారు బాబా, ఆ మాట అతనికి నచ్చలేదు. అపుడు సాయి, "సరే, వెళ్ళు. నేను చేసేది చేస్తాను" అన్నారు.*


 *కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడచినా, 8వ రోజుకు 20 మైళ్ళలోనున్న కోపర్గాము చేరాడు! అక్కడ ప్రథమంగా శిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్ళారు.*


 *సాయి అతణ్ణి చూస్తూనే నవ్వి, "నీవు వెళ్ళి ఎన్ని రోజులయింది?" అన్నారు. ఎనిమిది రోజులయిందన్నాడు కాశీనాథ్.*

*అప్పుడతనిని వాడాలో వుండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు.*


*శిరిడీలో నిత్యమూ భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది.*

No comments:

Post a Comment