🍀ఎంతోమంది భక్తులు షిర్డీ వెళ్ళి సాయి సమాధి దర్శనం చేస్తున్నారు. *షిర్డీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారమని* బాబా తన ఏకాదశ సూత్రాలలో చెప్పారు. అక్కడ ఎంతో మనశ్శాంతిగా ఉంటుందని చాలా మంది భక్తుల భావన. అయితే, సాయిబాబా భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్ష సన్నిధి అనుభవించిన వారి అనుభవం ఇంకెంత గొప్పగా వుండి వుంటుంది? అలా ఆ రోజులలో ఆయన ప్రత్యక్ష సన్నిధి అనుభవించి వర్ణించిన భక్తుల అనుభవాల్ని వారి మాటలలోనే చూద్దాం:
సాయిభక్తురాలు శ్రీమతి తారాబాయి సదాశివ తర్ఖడ్ ఇలా చెప్పింది:
*“ఆయన సన్నిధికి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదమూ రాజాలదన్న స్థైర్యం అనుభవమయ్యేది. నేను వెళ్ళి వారి చెంతన కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. అంతేకాదు. ఈ శరీరము, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు ఏవీ గుర్తొచ్చేవి కావు. గంటలు గడుస్తున్నా అచ్చట ఆనంద పారవశ్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులెందరో ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. ఆయనయే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులన్న భావం ఆయనలో ఊహకైనా వుండేది కాదు. ఆయన సమాధి చెందాక, నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైనదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఇక వారి సన్నిధిలో ఆ దేహము, ప్రపంచాలను మరిపించగల ఆనందము ఇప్పుడు లభించదు కదా! సాక్షాత్తూ మా ప్రాణాలే పోయినట్లయింది. మాకు మా దేహాలు మాత్రమే మిగిలాయి.*
*వారి కన్నులలో ఎంత శక్తి చురుకుదనము ఉండేవంటే, వారి కళ్ళ కేసి చూస్తుండడం ఎవరికీ సాధ్యం కాదు. అణువణువునా నఖశిఖ పర్యంతమూ ఆయన మన గురించిన వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్లు అనిపించేది. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకొని వినమ్రులమవ్వవలసిందే. ఆయన మన హృదయంలోనే గాక, మన దేహంలోని ప్రతి అణువులోను వున్నారని తెలిసేది. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనే లేక ఒక్క భంగిమతోనో, వారికి మన భూత భవిష్య వర్తమానాలే గాక, సర్వమూ తెలుసునని స్పష్టమయ్యేది. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మ సమర్పణ చేసుకోవడం తప్ప చేయదగినది వేరేమి తోచేది కాదు. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ, క్లిష్ట పరిస్థితి లోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు.*
*ఆయన దైవం అనండి, సహజ స్థితి పొందిన సత్పురుషుడనండి, లేక మరేదైనా అనండి. ఆయన అంతర్యామి. మహా శక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే వుండేది కాదు. ఎవరైనా ఆత్మ సమర్పణ చేసుకోవలసిందే. అదే అన్నిటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తించ వలసిందే”*.
No comments:
Post a Comment