*సాయిభక్తుడు గణపతిరావు సహస్రబుద్దే.*
*అయననే దాసగణు గా పిలిచేవారు.*
*ఆయన సాయిబాబాకి ఇచ్చే కాకడ హారతిలో " షిర్డి మాఝే పండరి పుర - సాయిబాబా రమావర -బాబా రమావర - సాయిబాబా రమావర, శుద్ద భక్తి చంద్ర భాగా - భావ పుండలీక జాగా - పుండలీక జాగా " ఆంటూ సాయిబాబాకి హారతి ఇస్తారు.*
*దాసగణు పండరీపురాన్ని మరువలేడు.*
*పాండురంగన్ని మరువలేడు, చంద్రభాగా నదిని మరువలేదు.*
*శిర్డీయే నాకు పండరిపురం.*
*సాయిబాబా యే విఠలుడైన రమావరుడు.*
*పరమ పవిత్రమైన భక్తియే చంద్రభాగా నది.*
*మనోభావనామయుడైన పండరీకుని నివాసమిదే అని ఆ హరతి గీతంలో వివరిస్తాడు.*
*ఒకసారి శ్యామా అని పిలవబడే సాయిభక్తుణ్ణి పాము కరచింది.*
*ఇక అందరికీ శ్యామా బ్రతుకుతాడని ఆశ కూడా పోయింది.*
*షిర్డీ గ్రామ సాంప్రదాయం ప్రకారం పాము కాటువేస్తే విరోబా మందిరానికి వెళతారు.*
*కానీ శ్యామా అందుకు భిన్నముగా ద్వారకామాయి లో సాయిబాబా వద్దకి వచ్చి మెట్లు ఎక్కుతుండగా బాబా కోపముతో " భట్టు ! పైకి ఎక్కవద్దు. ఎక్కావంటే ఖబడ్ధార్ ! ఫో ! క్రిందికి దిగి ఫో !" అని శ్యామాను చూసి అతనిని పైకి రాకుండా తిట్టసాగాడు.*
*బాబా తిట్లకు శ్యామా గాభరాపడలేదు.*
*" మశీదు నా పుట్టిల్లు. సాయిబాబా కన్న కొడుకును.*
*మరి కన్న తల్లే బిడ్డను అంతగా కోపడుతుంది ఎందుకు ?*
*పాముకాటు ఆవేదనను తల్లి దగ్గర కాక మరి ఎక్కడ చెప్పుకొంటాం ? " అని బిక్క మొహం పెట్టుకున్నాడు శ్యామా.*
*తన తల్లి అయిన సాయిమాత మీద, పుట్టిల్లు అయిన ద్వారకామాయి మశీదు మీద అంత మక్కువ శ్యామాకు.*
*మనకు షిర్డిలోని ద్వారకామాయి మసీదే పుట్టిల్లు అని, సాయిబాబాయే మన తల్లి అని దాసగణు భావానికి వన్నె తెచ్చాడు శ్యామా.*
*ఆ విధముగా దాసగణు వందనీయుడైనాడు.*
No comments:
Post a Comment