Tuesday, May 14, 2024

సాయిబాబా తనను దర్శించేవారిని, భక్తులను చక్కగా, మంచిగా మాట్లాడమని చెప్పేవారు

 *సాయిబాబా తనను దర్శించేవారిని, భక్తులను చక్కగా, మంచిగా మాట్లాడమని చెప్పేవారు.*

*ఒకసారి రామదాసి అనే భక్తునితో " నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకొంటున్నావు ? " అని హితవు చెబుతారు.*


*గౌతమ బుద్దుని కాలములో భరద్వాజ గోత్రానికి చెందిన ఇద్దరు సోదరులు వుండేవారు. వారిని ఆక్రోసులు అని అనేవారు.వారికి కోపం వచ్చినపుడు ఒళ్ళు మరచి గట్టిగా అరచేవారు.*


*చిన్న భరద్వాజునికి వివాహమైనది. ఆయన భార్యకూడా భర్తలాంటిదే. పైగా ఆమెకు ఇతరులపై చాడీలు చెప్పే అలవాటు కూడా ఉండేది.*

*ఆమె అదృష్టం కొద్ది ఒకసారి బుద్ధుని ప్రసంగం విని తన వాక్కును, తన ప్రవర్తనను సంస్కరించుకొన్నది. కొపంతో మాటలు వశం తప్పినప్పుడల్లా బుద్ధ భగవానుని స్మరించి తన వాక్కుని నిగ్రహించుకొనేది.*

*ఇట్లా ఆమె సంస్కారవంతంగా ఉండటం, కోపాన్ని తెచ్చుకుపోవడం, ఆమె భర్త అయిన చిన్న భరద్వాజులకు చికాకు, కోపం వచ్చి, అతని దృష్టి బుద్దునిపై పడింది.*


*బుద్దునిపై కసి, పగ తీర్చుకోవాలని, ఆయన వద్దకు వెళ్లి " సుఖంగా, శాంతిగా జీవించాలంటే ఏ పశువుని చంపాలి ? అని ప్రశ్నించాడు.*

*బుద్ధుడు సంగతి గ్రహించి, పరమశాంతంతో  " ద్వేషము అను పశువును చంపాలి " అని అన్నారు.*

*చిన్న భరద్వాజునిపై బుద్దుని మాటలు ప్రభావం చూపాయి. అతడు, తన భార్య అనుమతితో భిక్షు సంఘములో చేరిపోయాడు.*


*ఇది గమనించిన పెద్ద భరద్వాజులకు ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నది.*

*అతడు బుద్దుని వద్దకు వెళ్లి దుర్భాషలాడాడు .*

*బుద్దుడు శాంతంగా విన్నాడు.*

*పెద్ద భరద్వాజులకు ఇక తిట్టే ఓపిక నశించింది.*


*అతడు బుద్దుడి వైపు చూశాడు. దుర్భాషలు విన్న బుద్దునిలో ఎటువంటి మార్పు కనిపించలేదు.*


*అప్పుడు బుద్దుడు పెద్ద భరద్వాజుల వంక చూసి " నీవు ఒక వస్తువును ఎవ్వరికైనా దానం ఇవ్వదలిచినప్పుడు, ఆ వ్యక్తి నీవిచ్చే వస్తువును గ్రహించని ఎడల, ఆ వస్తువు ఎవరికి చెందుతుంది ? " అని ప్రశ్నించాడు పెద్ద భరద్వాజులను బుద్ధుడు.*


*" ఆ వస్తువు తిరిగి నాకే చెందుతుంది " అని అన్నాడు భరద్వాజుడు* 

*" అయినా ఎందుకు ఈ ప్రశ్న వేశారు ? నేను ఆడిన మాటలకు దీనికి సంబంధం ఏమిటీ ?" చికాగుగా ప్రశ్నించాడు భరద్వాజుడు.*


*" ఇప్పుడు నీవు తిట్లను నాకు దానమిచ్చావు. నేను వాటిని స్వీకరించలేదు. తిరిగి ఆ తిట్లన్నీ నీకే చెందుతాయి కదా ! అదే నీకు నేను చెప్పదల్చుకొన్నది " అన్నాడు బుద్ధుడు శాంతముగా.*


*తాను బుద్ధునితో పలికిన దుర్భాషలు పరిణామాన్ని , భరద్వాజులు గుర్తించాడు.* *అతడుకూడా శాంతమూర్తిగా మారాడు.*


*మనకు కోపం రాబోయే సమయములో సాయినాథుని మాట, లేదా బుద్దుని బోధ పనిచేస్తాయి.*

No comments:

Post a Comment